డైరీలో ఒక పేజీని…
-సుభాషిణి తోట
కొన్ని సమాధుల గురించి మాత్రమే మాట్లాడే మనం
చావులు వాటికి కారాణాల గురించి ఏ ధారావాహికను ప్రసారం చేయలేం చేసినా ప్రాణం మన నుండి వీడినాక మొదలెడతాం.
ఒక బిడ్డ బతుకు కోసం
నీ కలం వేల కన్నీళ్ల ఆర్తనాదమై గర్జించాలి లేదంటే
శవమో
ఆ అంతర్భాగమో
నదులై పారుతాయి
కుండపోతగా కురుస్తాయి
కాలం కాని కాలంలో
భూమి మీద పాపాలై మొలుస్తాయి కూడా….
విషపూరితమైన గాలులు వీస్తాయి
అడవుల్లోకి దట్టమైన మంటలై పారుతాయి…
ప్రతి చెట్టు కొమ్మా పామై
మళ్ళీ మళ్ళీ నిన్ను విషపూరితం చేస్తుంది….
మొక్కలు బ్రతకవు
గాలి పలకదు
నది సాగదు
నీరు పారదు
ఆకాశంలో ఒక్క పక్షీ తన రెక్కలతో ఎగిరేందుకు స్వేచ్చని తీసుకోదు
ప్రకృతి అంతా శూన్యంతో నిండిపోతుంది….
అందుకని
నీ జీవిత డైరీలో ఒక్క పేజీని
ఆ పసికందుల అన్యాయాన్ని ఎదిరిస్తూనో
ఏడుస్తూనో
కనీసం
కొవ్వొత్తి వెలుగులో నీ ప్రేమ తెలుపుతూ ఉండు
కాదంతే కుదరదంటే
సమాధుల గురించి తప్ప ఇంక దేనిగురించైనా మాట్లాడే అర్హత కోల్పోతావ్..
*****