మనసు అలలు 

-సుమన జయంతి 

నిశీధి! అర చేతితో మూసిన మనసు అల
రంగు రంగుల సీతాకోక చిలుకల
కాంతి కలలా వేకువలో దృగ్గోచరమవుతుంది
ఆ లేలేత ఉదయాల నీరెండల్లో
తూనీగ రెక్కలా సముద్రం అల 
ఆశల తీరాన్ని నుదిటిపై ముద్దాడుతుంది
ఆకాశం ఎరుపెక్కిన ముద్దమందారంలా
అలల నురగలపై తన చెక్కిలిని వాల్చి 
హృదయ రాగమాలపిస్తుంది… 
కరగని కాంతి సంవత్సరాల దూరాలలో
కదిలే జీవనది అలలా ఈ విశ్వ ప్రేమ 
భావనెంత బాగుంది…!
 
ఆకాశం ఎందుకో ఉన్నట్టుండి మేఘావృతమవుతుంది
ఓదార్పుకై  కడలిని హత్తుకొంటూ
చినుకులా రాలుతుంది
ఆ అలజడిని గుండె పైకెత్తుకొని అల
తీరంపై కెంపులనారబోస్తుంది
చుక్కపుట్టే మసక సాయంత్రం వేళ
కోసుకు పోయిన ఎద ఇసుక తిన్నెలపై 
రాతిరిలో ఆకాశం వెన్నెల దీపపు వత్తేసి 
జోలగా నీలాంబరి రాగమాలపిస్తుంది… 
కాలంతో మారని ఈ ప్రేమ దృశ్యం 
కరుణ కనుదోయిపై నక్షత్రాల 
కాంతి జావళిలా ఎంత బాగుంది….!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.