కథా మధురం
డా.లక్ష్మీ రాఘవ
స్త్రీ శాంతమూర్తి మాత్రమే కాదు, ఉగ్రరూపిణి కూడా! అని నిరూపించిన కథ- ‘ఆమె ఒక శక్తి !’
-ఆర్.దమయంతి
‘స్త్రీలకు కుటుంబపరంగా దక్కే న్యాయం ఎంత గొప్పదంటే.. ఏ చట్టాలూ, న్యాయ స్థానాలూ చేయలేని మేలు కంటే కూడా మిన్నయినది.’
***
జీవితం లో ఆడది – మగాడి వల్లే మోసపోతుంది. అతని కారణంగానే కష్ట పడుతుంది. అన్నివిధాలా నష్టపోతుంది. అయితే అతను భర్తే కానవసరం లేదు.
అతను అన్న కావొచ్చు. తమ్ముడూ అవొచ్చు.
తండ్రి కావొచ్చు తాతయ్య వుండొచ్చు.
మామ, బాబాయి, బావ, అల్లుడు..అంతెందుకు! చివరికి ఆమెని పీక్కుని తింటానికి కడుపున పుట్టిన కొడుకూ మినహాయింపు కాదు. అనిచెప్పే కథ ఇది!
***
అసలు కథేమిటంటే :
కూలి పని చేసుకుని బ్రతికే నాగమ్మ భర్త మరణిస్తాడు. ఒక్కగానొక్క కొడుకు గోవిందుని ప్రేమతో పెంచుతుంది. వాడు పెరిగి పెద్దై, ఇంత పని చేసి నాలుగు రాళ్ళు సంపాదిస్తాడని.. తననీ, ఇంటినీ సాకుతాడన్న ఆమె చిన్న ఆశ కాస్తా ఆరిపోతుంది. అతనొక పెద్ద తాగుబోతు. పొగరుబోతు. పని దొంగ. ఆ మాట అటుంచి, తనని కొట్టి మరీ, కూలి డబ్బులు లాక్కుపోతున్న కొడుకుని చూసి నోటమాటరాని జీవచ్చవమౌతుంది.
అలాటి అప్రయోజకుడైన కొడుకు ఒక రోజున – ఓ ఏడేళ్ళ పిల్ల తల్లిని ఇంటికి తెచ్చి, ఆమెతో తనకు పెళ్ళైపోయిందంటాడు. ముందు నాగమ్మ చివాట్లేసినా, చివరికి ఆమెని కోడలిగా అంగీకరిస్తుంది.
కొడుకు ఓ దారిలో పడ్డాడనుకుంటుంది. వాడు తాగుతూనే వున్నాడు. ఈ అత్తా కోడళ్ళు వొళ్ళు విరుచుకుని పని చేసుకుని బ్రతుకుని ఈడుస్తూనే వున్నారు. ఇప్పుడతనికి ఇటు పెళ్ళాం అటు తల్లి ఇద్దరు జీవులు దొరికారు రోజూ బలి చేయడానికి. ఇతని హింసాకాండలకు. ఆ ఆడవాళ్ళూ అలవాటు పడిపోయారు.
కాలం అలా సాగితే.. కథ అక్కడితో ఆగిపోయేది! కాని.. వాని అకృత్యాలు అక్కడితో ఆగలేదు.
నాగమ్మ తానొక శక్తి స్వరూపిణిగా మారుతానని ఆ రౌద్రక్షణం ఎదురయ్యే వరకు ఆమెకి తెలీదు.
ఇంతకీ అప్పుడేం జరిగిందీ.. అంటే కథ చదివి తెలుసుకోవాల్సిందే!
***
నాగమ్మ పాత్రలో దాగిన సుగుణాలు :
అధిక శాతం – భర్త పోయిన స్త్రీ మూర్తులు అందునా సంతానం గలవారు.. రెండో వివాహం వైపుకి మళ్ళరు. ఎందుకంటే -పోయిన మనిషి మీద ప్రేమ కన్నా, కన్న పిల్లల మీద పాశం ఎక్కువ. ‘ తన సంతానాన్ని ఒక దారికి చేర్చి, ప్రయోజకుల్ని చేస్తే చాలు. ఈ జన్మకి అదే సార్ధకత.’ అనే అంకిత భావంతో బ్రతికే స్త్రీలెందరో మనకీ సమాజంలో కనిపిస్తుంటారు. అందులో ఒకరు – నాగమ్మ!
నిరక్ష్యరాసి అయిన నాగమ్మ కి చదువంటే ఇష్టం :
తను కూలి చేసుకుని బ్రతుకుతున్నా, తనతో బాటు కొడుకుని కూలీ పనుల్లోకి దింపదు. వాణ్ణి స్కూల్ లో వేస్తుంది. వాడు బాగా చదువుకోవాలనీ ఆశపడుతుంది. కానీ దురదృష్టవంతుణ్ణి బాగుచేయగల భాగ్యవంతుడెవరని?
సర్వ దుర్లక్షణాలు, వాడికి స్కూల్ టైంలోనే అలవడిపోతాయి. తెలిసీ ఏంచేస్తుంది? పాపం! నిస్సహాయం గా ఏడుస్తుంది.
కొడుకు దుర్మార్గాన్ని కడుపులో పెట్టుకుని కాచిన తల్లి నాగమ్మ:
గోవిందు చదువు చచ్చుబండలైంది. పోనీ కూలో నాలో చేసి, నాలుగు రాళ్లు తెస్తాడన్న ఆశా అడుగంటిపోయింది. వాని పైసల్తో వాడు తాగనీ, చావనీ అని అనుకుని, ఊరుకునే అవకాశం ఆ తల్లి కివ్వలేదు గోవిందు. పైపెచ్చు – ఆమె పగలంతా కష్టపడి సంపాదించుకున్న కష్టార్జితాన్ని బలవంతంగా లాక్కెళ్ళి, తాగి తందనాలాడుతున్నాడు.
తల్లి ఎదురుతిరిగితే ఆమె మీద దాడి చేసి మరీ లాక్కుపోతున్నాడు.
కొడుకు ప్రయోజకుడు కాకపోయినా ఫర్వాలేదు కానీ, కాలయముడై పీక్కు తింటుంటే భరించడం, ఏ తల్లికైనా ఎంత కష్టం?- అయినా నాగమ్మ భరించింది.
కని, పెంచి పెద్ద చేసిన కొడుకు – తల్లిని కొడతాడా ? అని అంటాం కానీ, ఆడదైతే చాలు వయసూ, వావివరసలూ ఏవీ కళ్ళకు కనిపించవు మగాడికి. ‘ఏం చేస్తుంది?’ అనే అలుసెక్కువ? ఆ చులకనాభావమే, తల్లి పై హింసాత్మక దాడులకు దారితీస్తున్నాయి
‘ఈ దెబ్బలేమిటీ?” అని అడిగిన వారికి గోడకొట్టుకుందనో, బండ మీద తూలి పడ్డాననో.. ఏవో కథలు చెప్పి వినిపిస్తుంది.
పసి గట్టిన డాక్టర్ నిలేస్తే..నిలువునా కన్నీరౌతుంది.
గృహ హింసల బారినించి స్త్రీలని రక్షించడానికి నిజానికి ఏ చట్టాలూ, పోలీసులూ అవసరం లేదు. తమని తాము కాపాడుకోగలరు ఆడవాళ్ళు. కానీ, పనికిమాలిన ప్రేమ, జాలి దయ, క్షమ, కరుణలు వల్ల చస్తూ బ్రతుకుతుంటారు. నాగమ్మ కూడా అంతే. ‘పంచాయితీలు పెట్టి, వాణ్ణి ఇంట్లోంచి గెంటించలేను..ఎంతైనా తల్లిని..వాడు నన్నేగా హింసింస్తోంది హింసించనీండి సామీ..’ అని అంటుంది బాధగా.
ఆమె స్థితిని చూస్తున్న లోకం అనొచ్చు. నీస్థానంలో నేనుంటే గనక వాణ్ణి ఇంట్లోంచి తరిమేద్దును..ఆ నా కొడుకుని కాలికిందేసి తొక్కేద్దును..నరికి పోగులు పెట్టేద్దును..’ ఇంకా ఇంకా ఎవేవో అనేస్తారు ఆవేశంతో.
ఆ పని నాగమ్మ కూడా చేయగలదు. గోవిందు – పక్కింటామె కొడుకైతే!
దుర్మార్గపు కొడుకుల్ని చంపడం అంత సులువైన పనే గనక ఐతే, ఎన్ని లక్షల మంది తేలుతారో!
కానీ కన్న తల్లి కడుపు తీపి ఆ పని చేయనీదు.
పిల్ల తల్లి అయిన స్త్రీని కోడలిగా ఆహ్వానించిన విశాల హృదయిని నాగమ్మ :
నాగమ్మ – తన కొడుకు వల్ల ఎదురైన దుర్బాధలన్నీ ఒక ఎత్తైతే, హఠాత్తుగా, ఓ పిల్ల తల్లీని ఇంటికి తీసుకొచ్చి, ‘ఈమెని పెళ్ళాడినా..’ అంటూ ఇంట్లోకి అడుగుపెట్టిన ..ఆ సన్నివేశాన్ని ఎదుర్కోవడం ఆమెకి ఓ మింగుడుపడని సంఘటన! అయినా మనసుని నెమ్మది చేసుకుని, నిభాయించుకుంటుంది.
చూపులతోనే మనిషిని చదివేయగల నేర్పరురాలు నాగమ్మ :
అతని కంటే పదేళ్ళ పెద్దదైన రంగిని పెళ్ళాడటం, పైగా ఆమె ఓ పిల్ల తల్లికూడా కావడం.. రెండూ అభ్యంతరాలే! అలాటి ఆ స్త్రీ తనకి కోడలా? చుట్టుపక్కలోళ్ళు నవ్వరూ? నాగమ్మకిది తలవొంపులుగా వుంది. మనసు ససేమిరా ఒప్పనంటుంది. ప్రతి తల్లికి – పిల్లల కారణం గా ఓ చేదైన అనుభవాన్ని రుచి చూడక తప్పదనడానికి నిదర్శనం – ఇదిగో ఇలాటి సంఘటనలే!
ఇలాటి సమయాలలోనే మనసుని నెమ్మది చేసుకోవాలి..అనే పాఠం నేర్పుతుంది నాగమ్మ పాత్ర.
పరిస్థితుల పట్ల అవగాహన గల స్త్రీ :
ఆమె రంగిని చూసి ఓ నిజాన్ని గ్రహిస్తుంది. చాలా పనిమంతురాలని! గోవిందు పని కెళ్ళి కూలి తెచ్చినా తేకపోయినా, కోడలు పనిచేసి పైసలు తెచ్చి ఇల్లు నడుపుతుంది. పైగా, తన కొడుకుని తను చూసుకున్నట్టే ఇంత కూడు పెట్టి, నిలువ నీడనిస్తుంది. అది చాలు. అని ఒక అంచనాకి వస్తుంది. ఆ ఊహ ఆమెకెంతో ధైర్యాన్నిస్తుంది.
తాను చావుబతుకుల మధ్య వుంటూ కూడా, పిల్లల రేపటి బ్రతుకేమిటని ఆలోచించి, ఆవేదన పడే స్త్రీ పేరే – అమ్మ! నాగమ్మ కూడా కొడుకు భవిష్యత్తు భద్రత కోసం రంగిని కోడలిగా అంగీకరిస్తుంది.
అంతే కాదు. తన ముసలితనంలో ఈ చిన్న పిల్లా, కోడలు పిల్లా, తనకు ఆసరాగా వుంటారని ఆశపడుతుంది.
ఏ స్థాయీ మనుషికైనా..అంత్య కాలంలో తోడెవరా అని వెతుక్కోవడం ఎంత అవసరమో చెబుతుంది – నాగమ్మ పాత్ర.
నాగమ్మ పాత్రలో దాగిన మరో ఔన్నత్యం :
తన సొంత మనవరాలు కాకపోయినా, శాంత తనని ‘అవ్వా’ అని పిలుస్తుంటే పులకించిపోతుంది. ఆ తల్లీ కూతుళ్ళు తనని ‘అమ్మా’ అనీ, ‘అవ్వా’ అనీ పిలుస్తుంటే మోడు వారిన చెట్టు మీద వాన జల్లు కురిసి, చివుర్లు మొలకెత్తుకున్నట్టు..ఆమెలో మమతాను రాగాలు వెల్లువౌతాయి.
కోడల్ని తనతో కూలీ పనులకు తీసుకుపోతుంది. మనవరాలిని స్కూల్ లో వేసి, చదివిస్తుంది.
నాగమ్మ కి పనే దైవం :
కూలికెళ్లందే కూడు లేదన్న సత్యం ఆమెకి బాగా తెలుసు. పై పెచ్చు, తన మీద కొడుకు ఆధారపడి వుంటాడనీ, వాడి భారం తన జీవిత కాలం అనీ అర్ధమైపోయింది.
ఎందరి తల్లులో! తమ పెన్షన్స్, ప్రభుత్వం వారిచ్చే డబ్బులు, బాంక్ వడ్డీ పైసలు అన్నీ కొడుకులకి సమర్పించి, ఖాళీ కడుపుతో మాడుతుంటారో!
ఆమె ఆదిపరాశక్తి లా మారిన క్షణం :
తన ఆశల్ని వొమ్ము చేసినా, అతని వ్యసనాలతో విసిగి వేసారినా, తన కష్టార్జితం దోచుకెళ్ళినా, అడ్డుపడితే తల పగలకొట్టినా, తనకు చెప్పకుండా, పెళ్ళి చేసుకున్నా, కోడలి పై దాడి చేస్తుంటే సహించుకోక మధ్యలో వెళ్లి అడ్డుకున్నందుకు, వొళ్ళు హూనమైనా.. ఎప్పుడూ ఆగ్రహించని నాగమ్మ..ఆ రోజు మాత్రం ఆదిపరాశక్తి అవతారమెత్తింది. హఠాత్తుగా చూడకూడని దృశ్యం చూసిన మరుక్షణాన ఆమె లో ఆవేశం కట్టలు తెంచుకుంది. తెలీని శక్తి సునామీ లా ఆవహించింది.. ఫలితం గా..కొడుకుని మట్టుపెట్టింది.
ఏ ఘోరదృశ్యం ఆమెని ఇలా మార్చిందో..ఈ కథ వివరిస్తుంది.
****
రంగి పాత్ర :
కొంతమంది స్త్రీలకి తమ శక్తిసామర్ధ్యాలు ఏమిటో తెలీవు. వాళ్ళు అన్నివిధాలా సమర్ధవంతులైనా సరే, ఓ మగ తోడుంటే జీవితం నిర్భయంగా సాగిపోతుందన్న గుడ్డినమ్మకంతో ఓ అసమర్ధుని వివాహం చేసుకుని ఇక జీవితమంతా అతన్ని భరిస్తూ, ప్రతి రోజూ నరకాన్ని అనుభవిస్తుంటారు. ఇదిగో సరిగ్గా అలాటి కోవలోకి చెందిన స్త్రీ నే నాగమ్మ కోడలు – రంగి.
భర్త పోయాక మారు పెళ్ళి జోలికిపోని అత్త నాగమ్మలా కాదు ఈమె. గోవిందుని ముందు నిరాకరించినా, పెళ్ళి అనే మాట చెవికి నాదస్వరంలా వినిపించడంతో సరే అంటుంది. తన కన్నా పదేళ్ళ చిన్నవాడు అయిన గోవుందుని పెళ్ళాడి అత్త గారింటికొస్తుంది. నాగమ్మ తన రాకని వ్యతిరేకిస్తున్నప్పుడు మౌనాన్ని ఆశ్రయించి నిలబడుతుంది.
తన శాంతమే తనకు రక్ష అని చెప్పిన కారెక్టర్ :
లోనికి ఆహ్వానం అందగానే.. చీమంత సందు దొరికినట్టు.. చటుక్కున దూకి, కలుపుగోలుగా మాట్లాడుతూ, కల్పించుకుని పనులు చేస్తూ..’అమ్మా’ అనే పిలుపుతో అత్తమ్మ మనసు చూరగొని ఆ ఇంట్లో తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది రంగి.
తాళి కట్టి, నానా బాధలు పెడుతున్న మొగుడి కంటేనూ, అత్తగారి ప్రేమాదరణలే తనకు దొరికిన పెన్నిధిలా బ్రతికేస్తుంది.
తను సంపాదించిన కూలీ డబ్బులు కూడా అత్తమ్మకే ఇచ్చే విశ్వాసపాత్రురాలు రంగి.
కష్ట సమయంలో కూడా ఆ ఇంటినీ, నాగమ్మని, కూలీ పనిని విడవని ధైర్యవంతురాలు – రంగి.
***
రచయిత్రి గురించి :
వాస్తవికతకి దగ్గరగా వుండే కథాంశాలను ఎంచుకుని పాఠకుల మెప్పు పొందే కథలను అందించే ప్రఖ్యాత రచయిత్రి డా.లక్ష్మీ రాఘవ గారు తెలుగు పాఠకులందరకీ సుపరిచితురాలు. ‘కథా మధురం ‘ కోసం కథ కావాలని అడగంగానే మంచి కథని అందచేసి నందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..మరెన్నో గొప్ప గొప్ప కథలను నెచ్చెలితో పంచుకోవాలని కోరుకుంటున్నాను.
***
ప్రియ పాఠకుల్లారా!
కథామధురంలో కథని, కథపై సమీక్షని చదివి మీ మీ హృదయస్పందనలను నెచ్చెలితో పంచుకోవాల్సిందిగా మనవి.
అందరకీ, నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలతో..
ఆర్.దమయంతి.
*****
ఆమె ఒక శక్తి !
– డా. లక్ష్మీ రాఘవ
RMP డాక్టర్ కృష్ణ, ఎదురుగా వున్నపేషంట్ కు మందులు రాసిస్తూ బయట బెంచ్ మీద ఇంకా ఎవరైనా వున్నారా అని గ్రీన్ కర్టన్ పక్కకు చూసాడు.
నాగమ్మ నుదిటి మీద చెయ్యి పెట్ట్టుకుని కనిపించింది. వున్న పేషంటు వెళ్ళగానే లోపలకు వచ్చిన నాగమ్మ నుదిటి మీద కణత పక్కగా చీరచెంగు పట్టుకుని వుండటం చూసి “ఏమైంది నాగమ్మా ? తలనొప్పా ???” అన్నాడు.
డాక్టర్ ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ “లేదు డాక్టరు బాబూ అని చెయ్యి తీసింది. కొంగు తీయగానే సన్నగా కారుతున్న రక్తం!
“ఏమైంది? పడినావా??” అన్నాడు.
“అవును బాబూ, కాలు తొందురుకుని రాయి మీద పడినా…” అంది నెమ్మదిగా
ఆమెను బెంచీ మీద పడుకోమని చెప్పి గాయం క్లీన్ చేసినాడు. అది కిందపడి అయిన గాయంలా అనిపించలేదు.
“మళ్ళీ నా దగ్గర దాస్తున్నావా? ఈ సారి దేనితో కొట్టినాడు నీ కొడుకు ? చూడు ఎంత సూటిగా తగిలిందో! నాతో అబద్దాలు చెప్ప వద్దు అని చెప్పినా గదా??” అన్నాడు మందు పెట్టి డ్రెస్సింగ్ చేస్తూ. మాట్లాడలేదు నాగమ్మ.
“నీవు ఎంత నీ కోడుకును వెనక వేసుకుని వచ్చినా వాడు తాగుడు మానడు. తాగడానికి దుడ్ల కోసం నిన్ను కొట్టకా మానడు. ప్రతిసారి దెబ్బ బాగా తగిలితే నాదగ్గరికి వస్తావు. వాడికి బుద్ది చెప్పమని ఎవరికైనా చెప్పకూడదా…ఈ వూరి పెద్దాయన దగ్గర పంచాయితీ పెట్టించు..’ఇట్లా చేస్తే నీ ఇల్లు ఎవరికైనా దానం చేసేస్తా’ అని కొడుకుని బెదిరించు..ఏం మాట్లాడవు??” అన్నాడు డాక్టర్.
ఆ చిన్న పల్లెలో ఏ సమస్యకైనా వూరి పెద్ద దగ్గర పంచాయితీ పెట్టి పరిష్కారం చూసుకుంటారు
“ఎంతైనా కన్నా కొడుకు కదయ్యా. తాగినప్పుడు ఏం చేస్తాడో తెలియదు. కొంచెం దెబ్బకి పంచాయితీకి పోదునా?
పోయినా వాళ్ళు నా కొడుకుని ‘తన్ని తరుము కుంటాము మాకు వదులు’ అంటే తల్లినైన నేనేమి చెయ్యాలి? కన్న కడుపు బాబు… ఏమైనా వాడు నన్నే కదా కొట్టేది” అనింది.
”నీ ఇష్టం…అట్ల మాట్లాడితే నేనేం చేసేది” అంటూ తనదగ్గర వున్న కొన్ని మాత్రలు ఇచ్చాడు. తీసుకుని ఇంటికి వెళ్ళింది. గాయం బాగా నొప్పిగా వుంది.
పదేళ్ళక్రితం మొగుడు పోయాక కొడుకు గోవిందు ఒక్కడే తనకు దిక్కు అని బాగా చూసుకుంది. కానీ వాడు స్కూలు ఎగ్గొట్టి పెకాడ్డం నేర్చుకున్నాడు. జత అయిన స్నేహితు లెవ్వరూ మంచి నడవడి కాకపోవడంతో తాగుడుకు అలవాటు పడినాడు. చదువు అబ్బ లేదు కూలికి పంపుదామంటే కూలి డబ్బులతో రెండు రోజులు తాగి పడివుండటంతో కూలికి పిలవడం మానేశారు అందరూ. అయినా ఎట్లనో దుడ్లు సంపాదించి తాగుతున్నాడు. అట్లా పూర్తిగా లేనిరోజున అమ్మను కొట్టడం, ఇంట్లో దాచిపెట్టిన డబ్బు ఎత్తుకొని పోవడం ఎక్కువైంది.
ఒక రోజు వీళ్ళ వీధి లోనే వున్న రామయ్య చెప్పినాడు. “నాగాక్కా…నీ కొడుకు స్కూల్ గ్రౌండులో గాంబ్లింగ్ చేస్తావున్నాడు. వాళ్ళు క్రికెట్ మాచ్ బెట్టింగులు చేస్తా ఉన్నాడంట. ఈ మధ్య పోలీసులు ఇలాటి వాళ్ళమీద నిఘా పెట్టి అరెస్టు చేస్తావున్నారంట. నిన్న పక్క పల్లెలో ఇట్లా చేసే పదిమంది పిల్లకాయల్ని పోలీసు స్టేషనుకు పట్టక పోయినారంట… కొంచెం చెప్పి చూడు. పోలీసు కేసు అయితే ఇడిపించుకునేదానికి శానా దుడ్లు కర్చవుతాయి” అని చెప్పినాడు.
ఆరోజు రాత్రి తాగి వచ్చిన గోవిందును నిలదీసింది… తప్పుడు పనులు చేసి పోలీసోల్లు పట్టకపోతే నేను నిన్ను చూడటానికి కూడా రాను..” అని కూడా చెప్పింది.
“నువ్వేమైనా దుడ్లు ఇస్తావున్నావా? కంటే సరిపాయనా??” అంటూన్న కొడుకు చెయ్యిపట్టి లాగి ముఖం మీద నొక్కుతూ “ఏందిరా…కనినందుకు సాకలేదా? సంపాదించే వయసు వచ్చినా ఇంకా నా దుడ్లు పీక్కొని పోతా ఉండావు..నీ తాగుడు సూత్తా వుంటే నాకంటే ముందు నీవే పోయేటట్లు వున్నావు…ఈ వయసులో తల్లిని చూసుకుందామని లేదు కానీ ఎందుకు కన్నావు?” అని అంటావా ?? అని రెండు చేతులతో తోసింది.
బాగా తాగివున్నాడేమో దబ్బున కూలబడ్డాడు గోవిందు.
“చాలులే లేయ్యి …సంగటి వుంది తిందూ కానీ …” అని తట్టలో సంగటీ, గోజ్జూ వేసి పెట్టింది ముందర.
“నాకు ఆకలి లేదులే నీవే తిను..ఎప్పుడూ తిడతావుంటావు కదా ..రేపు మేము అందరం టౌను కు పోతావుండాము. ఆడ పనులు వున్నాయి చెయ్యడానికి అని చెప్పినారంట. పది మంది కావాలంట…ఈ సారి దుడ్లు తెచ్చి ఇవ్వకపోతే నాపేరు గోవిందు కాదు. నేనేల్లిపోతే నీ కళ్ళు చల్ల బడతాయి“ అని చాపమీద ముడుక్కు పడుకున్నాడు.
నిద్రపోతున్న కొడుకు తలమీద చెయ్యి వేసి నిమురుతూ…’అట్లనే పోయిరా నాయనా..బయట ప్రపంచం ఎట్లా ఉంటాదో తెలుస్తుంది…నాలుగు రాళ్ళు సంపాదించి వెనక్కి వస్తే నేను గాదా సంతోషపడేది?’ అని వాడి పక్కనే పడుకుంటూ మీద చెయ్యి వేసింది. వాడు చెప్పిన కబురు మనసుకు హాయిగా వుంది…పోనీ బాగుపడతాడు అనుకుంటూ నిద్రపోయింది నాగమ్మ.
పొద్దున్న లేవగానే గోవిందు జతగాళ్ళు వీరేసు, లచ్చన్న, మల్లేషు వచ్చినారు.
అందరూ కలుసుకుని పోతావున్నారంట. ఉతికి పెట్టిన రెండు షర్ట్లు, పాంట్లు, లుంగీ, టవల్ అన్నీ ఒక చిన్న బ్యాగ్గులో సర్ది ఇచ్చింది. పక్కకు పిలిచి “ఇంద..”అని నూరు రోపాయలు చేతిలో పెట్టింది.
“అందరూ బాగా పని చేసి సంపాదించుకొండి నాయనా …అప్పుడప్పుడూ వస్తావుండండి…’అనింది వాళ్ళతో . బయలుదేరిన వాళ్ళను కనిపించేంత దూరం చూసి కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ లోపలకు నడిచింది. ఇన్నాళ్ళకు దేవుడు నాకష్టాలను చూసినాడా? అనుకుంది.
******
ఒక పదిరోజులు గడిచినాయి. గోవిందు టౌనుకు పోవడం అందరికీ చెప్పింది. ఇంకా కష్టాలు తీరినట్టే అని సంతోషపడింది.
కూలికి పోయి తనకు తగ్గ పనులు చేస్తా వుంది. ఇప్పుడు కొడుకు ప్రయోజకుడు అయ్యి వస్తాడు కాబట్టి వాడికి పెళ్లి చెయ్యాల…తను ఎన్నాళ్ళు వుంటుంది? పెళ్లి చేస్తే వాడికి ఒక తోడు వుంటుంది…అని యోచన చేసింది.
పదైదు రోజులు గడిచినాక పొద్దున్న ఇంటిలోకి వచ్చినాడు గోవిందు..బట్టలు అంతా మాసిపోయి వున్నాయి…
“ఏమిరా గోవిందు? అక్కడ పనులు అయిపోయినాయా??” అని అడిగింది..
“అమ్మా, పనులు సరిగ్గా లేవు అక్కడ..అందుకే వచ్చేసినా…అని బయటకు చూస్తూ “రాయే “ అన్నాడు.
“లోపలకు వస్తోన్న ఒక ముప్పైఏళ్ల వయసు ఆమె, వెంట ఏడేళ్ళ బిడ్డ లోపలకు వచ్చినారు.
“ఎవర్రా?” అర్థం కాక వాళ్ళను అయోమయంగా చూసింది.
“దీని పేరు రంగి, అది కూతురు శాంత..దీనికాడే ఇంత బువ్వ దొరికేది ఆడ… టౌనుకు తీసకపోయిన వాళ్ళు మాచేత తప్పుడు పనులు చేయించినారు. ఆల్లకు మత్తు సామాను, ఇసక లాంటివి మేము బార్డర్ దాటించాల… అట్లా చేస్తావుంటే పోలీసోల్లు పట్టుకుని జైలులో వేసినారు.. మాకు అన్నం కోసం ఈ రంగిని పెట్టుకున్నారు. నన్ను పోలీసోల్ల నుండీ ఇడిపించింది ఈమె.. అందుకే పెళ్లి చేసుకుంటా నా తోనే వుండు’ అని బొట్టు కట్టినా… నీకు తోడుగా వుంటుంది. బాగా కష్టపడి పని చేస్తుంది..”అంటూ అమ్మను చూసినాడు గోవిందు.
“మరి ఈ పిల్ల ??” అర్థం కాలా నాగమ్మకు.
“రంగి మొగుడు ఆక్సిడెంట్ లో చచ్చి రెండేళ్ళు అయినదంట. వాళ్ళ కూతురే ఈ శాంత.” అప్పుడు తేరు కుంది నాగమ్మ. బాగా కోపం వచ్చింది.
“ఏందిరా..నీవు చెప్పేది అంతా నేను ఇంటాను అనుకున్నావా? నీకంటే పదేళ్ళు పెద్దగుంది ఈ యమ్మ ను తోడుకొని వచ్చి నా పెళ్ళాం అంటావా? పైగా ఏడేళ్ళ కూతురు ను కూడా నీ కూతురుగా చూస్తావా? వూర్లో వాళ్ళు ముఖాన ఉమ్ముతారు…థూ” అని కేకరించింది.
తలవంచుకుని నిలబడ్డ రంగిని చూసి ఇంకా మండింది నాగమ్మకు.
“ఏందమ్మా మొగుడు చచ్చిన దానివి.. ఇంతపెద్ద కూతుర్ని ఉంచుకుని ఇప్పుడు నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? దానికి నీకు నా కోడుకే దొరికి నాడా? నీకైనా సిగ్గు లేదా… బొట్టు కట్టించుకుని నేరుగా కాపురానికి వస్తావా? థూ థూ”ఈసడించుకుంది నాగమ్మ.
రంగి తల ఎత్తలేదు..శాంత మాత్రం వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుని “అమ్మా ఎల్లి పోదామే… అవ్వా మేము ఎల్లిపోతాము..” అనింది నాగమ్మతో
“నువ్వేమైనా అను అమ్మా. నేనే రంగిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకున్నా. ఇందులో దాని తప్పులేదు.. నీకిష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే ఎల్లిపోతాము…” అని కోపంగా అంటూన్న కొడుకును కాకుండా “అవ్వా” అన్న శాంతను చూసింది నాగమ్మ. ఏమనుకుందో కానీ దగ్గరగా వెళ్లి శాంత చెయ్యి పట్టుకుని “పద లోపలికి అన్నం బేడతా…” అనింది.
వాతావరణం కొంచెం చల్లబడగానే తన చేతిలో బ్యాగ్గు ఒక మూలగా పెట్టి నాగమ్మ వెంట నడిచింది రంగి.
అమ్మ సరే అన్నట్టుగా అనిపించి తేలికగా గాలిపీల్చుకున్నాడు గోవిందు.
పొయ్యి మీద ఎసరు పెట్టి , ఇంట్లో వున్న అన్నం ముందుగా శాంతకు పెట్టింది నాగమ్మ. రంగి ఊరకనే ఉండకుండా బియ్యం ఎక్కడ వున్నాయని అడుగుతూ తనకు తోచిన పని చేయడానికి సిద్దపడటం చూసి, ఆమె పనిమంతురాలని గ్రహించింది నాగమ్మ. బియ్యం కడిగి ఇవ్వమని ఇచ్చింది. ఎసరు కాగగానే బియ్యం అందులో వేసి కలియబెడుతూ పొయ్యి ముందే కూర్చుని యోచన చెయ్య సాగింది.
ఈ రోజు జరిగినదంతా ఒక కల లాగా వుంది. తనకంటే పెద్దదైనదే కాకుండా బిడ్డ తల్లిని కొడుకు చెప్పా చెయ్యకుండా పెళ్ళిచేసుకుని మరీ తీసుకు రావటం మనసుకు కష్టం వేసింది.. కానీ ఏ సంపాదన లేకుండా తాగుబోతుగా వున్న గోవిందుకు పిల్లనిచ్చే వాళ్ళు ఎవరు? ఈ పిల్ల కష్టం చేసుకు బతికే పిల్ల లాగా వుంది..నేను పోయినా వాడిని చూసుకుంటుందేమో… దిక్కులేనిది, పైగా ఎదుగుతున్న పిల్ల వున్న పిల్ల వుందనైనా వాడిని బాగా చూసుకుంటుందేమో… ఆ చిన్నపిల్ల కూడా “అవ్వా” అని ఎంత ఆప్యాయంగా పిలిచింది… అవ్వ కు ఇష్టం లేదుకదా వెళ్ళిపోదామని ఎంత తొందరగా గ్రహించింది. శాంత ఎవరికీ పుట్టినదైనా ‘అవ్వా’ అనడం తోనే తన మనసు దోచుకుంది. ఆపిల్ల స్పర్శ తన లోని తల్లిని తట్టి లేపింది. తండ్రి పోయినాడు ఇప్పుడు అమ్మ చేసుకున్నవాడే తండ్రి అన్న భావం ఆ పిల్లకు వస్తుంది… వూర్లో వాళ్లకు ఏదోవిధంగా చెప్పచ్చు. వీళ్ళు ఇక్కడ వుండటం తనకు కూడా ముసలి వయసులో ఆసరానే కదా? రంగి కూడా తన మంచితనంతో గోవిందును సరిచేసుకుంటుందేమో.. ఈ పిల్ల కోసమే గోవిందు టౌనుకు వెళ్లి నాడేమో…అదే దేవుడు తనకు చేస్తున్న సహాయమేమో…అలాటి ఆలోచనతో మనసు భారం తగ్గింది…అన్నం రెడీ అయ్యింది.
“అమ్మా నీవు పక్కకు జరుగు నేను పొయ్యి ఆర్పి క్లీన్ చేస్తా అని కొంగు దోపి ముందుకు వచ్చింది రంగి. మారు మాట్లాడకుండా లేచింది నాగమ్మ.
ఆపని పూర్తి అయినాక “కొంచెం పచ్చిపులుసు చేస్తా. చింత పండు ఎక్కడ వుంది చెప్పు అమ్మా“ అన్న రంగి ఈ సారి కొత్తగా అనిపించలేదు నాగమ్మకు. ఆప్యాయంగా “అమ్మా’ అన్న పిలుపు మనసును కదిలించింది. పోనీ అంతా మన మంచికే అనిపించి చింత పండు చేతిలో పెట్టింది.
చింతపండు పిసికి పచ్చిమిరప,ఎర్రగడ్డ అక్కడే వున్నరోటి లో దంచుకుని కలిపింది రంగి.
అంతవరకూ సందులో వున్న వేపచెట్టు దగ్గర కూర్చ్చున్న గోవిందు లోపలికి వచ్చినాడు. గోవిందుకు అన్నం, గొజ్జు వేసి.. ”అమ్మా నీవుకూడా రా బొంచేద్దాము.” అని అన్నం కిందపెట్టింది. రెండు ఆకులు వేసి నీళ్ళు పెట్టింది.
గోవిందు బొంచేసి వెళ్ళినాక మెల్లిగా తన సంగతులు చెప్పింది.
చిన్నప్పుడే తల్లి పోతే మేనమామ ఇంట్లో చాల కష్టాలు పడి చివరకు ఒక పెద్దవయసు వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యడం, శాంత పుట్టడం, తరువాత కూలిపనులకు వెళ్ళుతూ మొగుడు ఆక్సిడెంట్ లో పోవటంతో కొన్నాళ్ళకు కూలోల్లకు రాత్రి పూట వండి పెట్టి కూతుర్ని పెంచడం, గోవిందు పరిచయం… పొలీసుల నుండీ గోవిందును ఇడిపించినాక పెళ్లి చేసుకుంటా అంటే కూడా మొదట ఒప్పుకోక తరువాత తను, కూతురూ బతకడానికి ఒక ఆసరా అవసరం అనిపించి పెళ్లి చేసుకుని ఇక్కడకు రావటం అన్నీ చెప్పింది.
మారు మాట్లాడ కుండా వినింది నాగమ్మ, “అమ్మా, నీకు కొడుకంటే శానా ఇష్టం అనీ, మా అమ్మ నిన్నేమీ అనదు …”అనీ చెప్పినాడు. నేను నిన్ను అత్తమ్మ అనే కంటే అమ్మా అంటే బాగుందనిపించింది” అని నాగమ్మ కాళ్ళు పట్టుకుంది రంగి.
రంగి తలమీద చెయ్యి వేసి , ఒక మూలగా కూర్చున్న శాంతను “ఇక్కడ స్కూల్లో చేరు పాపా …నేను చదివిపిస్తా “అంటే శాంత సంతోషంగా అట్టాగే అవ్వా”అనింది మనసారా నవ్వుతూ.
రోజులు గడుస్తున్నాయి…” నాకొడుకు రంగిని మెచ్చి చేసుకున్నాడు”అని వూర్లో అందరితో దైర్యంగా చెప్పింది నాగమ్మ.
శాంతను స్కూల్ లో వేసింది. రంగిని తనతో బాటు కూలికి తీసుకుని పోసాగింది.. గోవిందు దంపతులు గుడిసెలో పడుకుంటే తనూ, శాంతా ఇంటి ముందు వున్నవసారాలో పడుకుంటూ వున్నారు. రంగి కూలిపని బాగా చేస్తుంది అని కూలి ఎక్కువ వచ్చేది. అంతా అత్తకు ఇచ్చేది. గోవిందు చిన్న చిన్న పనులకు వెళ్ళినా ఎక్కడా కుదురు కోవడం లేదు.. దానితో తాగుడు ఎక్కువైంది..ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు వుండనిచ్చేవాడు కాదు. ఒకపక్కన తల్లి, ఇంకో పక్కన పెండ్లామూ తిడతా వుంటే తాగుడు ఇంకా ఎక్కువైంది.
తిరగబడి రంగిని కొట్టడం చేస్తున్నాడు. అడ్డం పడిన తల్లిని కూడా కొడతాడు. ఆ దెబ్బలకి అప్పుడప్పుడూ వూర్లో డాక్టర్ దగ్గరికి పోతూ వున్నారు.
“వాడిని మళ్ళీ టౌనుకు పంపించేయ్యి నాగమ్మా…తన సంసారం కోసమైనా ఎక్కడినా పనికి కుదురు కుంటాడేమో “అని సలహా చెప్పినాడు డాక్టర్ బాబు.
దానితో టౌనుకు పోమ్మని బలవంతం చేసినారు గోవిందును.
గోవిందుకు కూడా అదే మేలనిపించిందేమో ఒకరోజు చెప్పా చెయ్యకుండా టౌను కు వెళ్ళినాడు. వాడు టౌన్ బస్సు ఎక్కినాడని కొంతమంది చెప్పడం తో ‘పోనీ మంచిదే’ అనుకున్నారు.
ఒక నెల రోజులకు వచ్చినాడు..డబ్బులు తెచ్చి “చూడు..సంపాదించ లేనను కున్నావా?” అని అమ్మతో అన్నాడు.
ఒక వారం లోనే తెచ్చిన దుడ్లు తాగుడుకే సరిపోతా వుంటే బాగా తిట్టింది నాగమ్మ.
మళ్ళీ టౌన్ కి వెళ్ళినాడు. గోవిందు డబ్బులు తెస్తాడని ఎదురు చూడక రంగి, నాగమ్మా కూలికి వెళ్ళు తావున్నారు. శాంత స్కూలుకి పోతావుంది. మధ్యాహ్న బోజన పథకం వుంది కాబట్టి అక్కడే బొంచేసి సాయంకాలం ఇంటికి వస్తుంది.
ఒక రోజు శాంతకు జ్వరం అని ఇంట్లోనే వుండి పోయింది. తలుపు దగ్గరగా వేసికొని నాగమ్మా రంగీ కూలికి వెళ్ళినారు. నాగామ్మకు కొంచం నడుము నొప్పిగా వుంటే రంగితో “నేను ఇంటికి ఎల్లి పోతా,.పాప కూడా ఇంట్లో వుంది కదా తోడుగా ఉంటాలే ‘అని ఇంటికి బయలుదేరింది.
ఇంటికి రాగానే తలుపు వారగా తెరిచి వుంటే శాంత బయటకు గానీ వచ్చిందా అనుకుంటూ తలుపుతోసింది..లోపల దృశ్యం చూసి మతిపోయింది. గోవిందు శాంత నోరు మూసి మీద పడుతున్నాడు!
అతన్ని చేతులతో కోడతావుంది శాంత మూల్గుతూ..
మతి పోయింది నాగమ్మకు.
వెంటనే తేరుకుని పక్కన వున్న రోకలి తీసుకుని బలంగా గోవిందు తలపైన ఒక్క వేటు వేసింది నాగమ్మ.
“అబ్బా…” అంటూ వెల్లికిలా పడ్డాడు గోవిందు. తలలో నుండీ రక్తం కారుతా వుంది…గిలగిలా కొట్టుకుంటున్న నాగమ్మ ఆ పక్క చూడకుండా “పెళ్ళామేవరో, బిడ్డ ఎవరో తెలీలేదా దొంగ సచ్చినోడా “ అని ఉరిమి చూస్తూ శాంతను పైకి లేపి గుండెలకు హత్తుక్కుంది..,ఆ పిల్ల మాట్లాడలేక వెక్కుతూ వుంది. శాంత ను వొళ్ళో కూర్చోబెట్టుకుని అప్పుడు చూసింది గోవిందుని. స్పృహ తప్పినట్టు వున్నాడు.
కామం తో కళ్ళు మూసుకు పోయిన కొడుకుని చూసి ఆమెకు జాలి కలగలేదు. అసహ్యం వేసింది.
మెల్లిగా లేచింది. శాంతను అడిగింది గోవిందు ఎప్పుడు వచ్చినాడు’ అని? అప్పుడే వచ్చినాడు అని కష్టంగా చెప్పింది శాంత.
వెంటనే లేచి గోవిందు మీద నీళ్ళు చల్లింది. చలనం లేదు. అనుమానం వేసింది. ఒక క్షణం లో ఏమి చెయ్యాలో నిర్ణయించు కుంది. రోకలితీసి తన చేతి మీద కొట్టుకుంది. దెబ్బకు చర్మం కమిలి పోయి ఒకచోట రక్తం కారింది.
ఆశ్చర్యంగా చూస్తున్న శాంతను “దేనికీ మాట్లాడవద్దు’ అని చెప్పి సైగ చేసింది.
తలుపు తెరిచి గట్టిగా కేకలు పెట్టింది..’నా కొడుకు పడిపోయినాడు..రండి ..రండి..”అని
చుట్టుపక్కల వాళ్ళు వచ్చినారు
తాగి వచ్చి దుడ్డ్లకోసం తనను రోకలితో కొట్టినాడనీ. తను కోపం తో తోస్తే వెళ్లి రోలు మీద పడినాడనీ, ఎప్పుడూ దెబ్బలు తినే తాను ఈ సారి కోపం తో తోసిందని చెబుతూ బోరు బోరున ఏడ్చింది నాగమ్మ.
రంగి కి తెలిసి ఇంటికి వచ్చేసరికి ఇంతపని జరిగిందా అని ఏడ్చింది…
వూరి వాళ్ళు 108 కి ఫోను చేసినా వాళ్ళు వచ్చి శ్వాస లేదని చెప్పినారు.
గోవిందు ఎప్పుడూ తల్లిని కొట్టి హింసించే వాడని అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ అనుమాన పడలేదు.
నాగమ్మ దెబ్బకు కట్టుకట్టిన డాక్టర్ బాబు కు మాత్రం కొద్దిగా అర్థం అయినట్టు అనిపించింది.
“స్త్రీ ప్రేమ తో తల్లి గా అపరిమితమైన ఇష్టం చూపి అన్నపూర్ణ గా వున్నా, చెడుని శిక్షించే దుర్గ లాగా మహిషాసుర మర్ధిని కూడా కాగలదని నిరూపించే ఆమె ఒక శక్తి! ” అని నాగమ్మ ను గూర్చి అనుకున్నాడు డాక్టర్ బాబు.
***
డా. లక్ష్మీ రాఘవ పరిచయం :
డా. లక్ష్మీ రాఘవగారు M.Sc. PhD. చేసి, హైదరాబాద్ లోని ‘వనిత మహావిద్యాలయ’ లో జంతుశాస్త్రం విభాగంలో 30 ఏళ్ళు పదవీ బాధ్యతలు చేపట్టి, రీడర్ గా రిటైర్మెంట్ తీసుకున్నారు.
బాధ్యతలు తీరి ఉద్యోగ విరమణ తరువాత సొంతవూరు చేరటం సాహిత్యపు జీవితంలో గొప్ప మలుపు.
మొదటి కథ 1966 లో ఆంద్ర సచిత్ర వార పత్రికలో ప్రచురణ అయ్యింది. సాహితీ ప్రయాణం యాభై ఏళ్లకు పైబడినా ప్రయత్నమూ, ఫలితమూ వచ్చింది రిటైర్మెంట్ తరువాతనే. ఆరు కథాసంపుటులు, ‘నా వాళ్ళు’ ‘అనుభ౦ధాల టెక్నాలజీ’ అన్న కథా సంపుటులు, మరి కొన్నికథలు కన్నడ భాషలోకి అనువదించబడ్డాయి.
ఒక స్మారక సంచిక, ఒక దేవాలయ చరిత్ర ప్రచురణ. రెండు కథా సంపుటులకు అవార్డ్లులు, ప్రపంచ తెలుగు మహాసభలు లో గుర్తింపు, కొన్ని కథలకు బహుమతులు, కొన్ని కథలకు సంకలనాలలో స్థానం సంపాదించుకున్నాయి.
వాస్తవికతకు పెద్దపీట వేస్తూ, సామాజిక స్పృహ కలిగేలా, పరిష్కార దిశగా సాగిపోయే నా కథలను ఆదరించి గుర్తింపు నిచ్చిన పత్రికలు, అలనాటి ఆంధ్ర సచిత్ర వార పత్రిక, ఆంధ్ర ప్రభ మొదలు – నేటి స్వాతి, నవ్య పత్రికల దాకా సాగి, ఇప్పుడు అంతర్జాల పత్రికలూ ఆదరిస్తున్నాయి.
కథల పోటీ నిర్వహణ, పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సాహిత్యపు అనుభవాన్ని పెంచింది.
నా కవితలను పబ్లిష్ చేసి, కవయిత్రి గా గుర్తింపునిచ్చిన పత్రికలవారికి నా ధన్యవాదాలు.
రచనలే కాకుండా కళల పై ఆసక్తి! ‘wealth out of waste’ అని వ్యర్థ పదార్ధాలతో ఆకృతులు చేసి ఎక్సిబిషన్స్ నిర్వహించడంతో ‘హస్తకళల విదుషీమణి ‘ అని అభివర్ణించడం అత్యంత స్ఫూర్తి దాయకం!
***
ఆర్.దమయంతి
పలు వార మాస పక్ష దిన పత్రికలలో సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం వుంది. వంద పైని కథలు, అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేయడం అంటే తెగని మక్కువ. ఘాటైన విమర్శలతో సాహితీ వేత్తలని బెంబేలెత్తించడం కంటే, రచనల్లోని మంచిని గుర్తించి ప్రశంసించడం మంచిదంటారు. పొరబాట్లుంటే, సద్విమర్శతో సూచించడమూ మేలైన రచనలు అందుతాయనీ, తద్వారా ఉత్తమసాహిత్యాన్ని చదవగల అవకాశంవుంటుందనీ, అదే తను చేయగల సాహితీ సేవ అని అభిప్రాయపడతారు.
కథ కాని కథ, ఈ కథ ఎందుకు నచ్చిందంటే, నేను చదివిన కథ వంటి అనేక శీర్షికలను వివిధ ఆన్లైన్ మాగజైన్స్ – సారంగ, వాకిలి, సాహిత్యం (గ్రూప్) లో నిర్వహించారు.
ప్రస్తుతం ‘సంచిక’ ఆన్లైన్ మాస పత్రికలో ‘ట్విన్ సిటీస్ సింగర్స్ ‘ ఫీచర్ ని, ‘ తెలుగు తల్లి కెనడా ‘ మాస పత్రికలో ‘సిరిమల్లె చెట్టుకింద ..’ అనే శీర్షికలని నిర్వహిస్తున్నారు.
వీక్షణం (బే ఏరియా సాహిత్య సాంస్కృతిక సంస్థ0, తెలుగు జ్యోతి (న్యూజెర్సీ ) వార్షికోత్సవ పత్రికలలో ఆర్.దమయంతి గారి కథలు ప్రచురితమయ్యాయి. ఆంధ్ర భూమి వారపత్రిక, స్వాతి (వీక్లీ, మంత్లీ) నవ్య వీక్లీ, మయూరి పత్రికలలో తో బాటు ఈమాట, కినిగె, వాకిలి, పొద్దు, సారంగ, లలో కూడా అనేక కథలు పబ్లిష్ అయ్యాయి.
రచయిత్రి ప్రస్తుతం – నార్త్ కరొలినా (అమెరికా) లో నివసిస్తున్నారు.