వెనుకటి వెండితెర-7

కన్యాశుల్కం

-ఇంద్రగంటి జానకీబాల

          ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘కన్యాశుల్కం’ నాటకానికి ప్రత్యేక స్థానముంది.  అది ఒక నాటకమే అయినా సాహిత్యం లోవున్న అన్ని ప్రక్రియల్ని తలదన్ని నిలబడటం అంటే సామాన్య విషయం  కాదు. 

          ఒకానొక సమయంలో ఆడ పిల్లల్ని కన్యాశుల్కం పేరు తో డబ్బులు తీసుకొని, పెళ్లి కొడుకు ముసలి వాడైనా మూర్ఖుడైనా ఆడ పిల్లల్ని అమ్మేయడం అనే దుష్టసంప్రదాయం వుండేది.  అది కూడా ఆంధ్ర దేశానికి తూర్పున వెళ్తుంటే ఇలాంటి దుర్మార్గం – బ్రాహ్మణ  కొంపల్లో ఎక్కువగా వుండేది.  తండ్రులు చిన్నారి కూతుళ్ళని డబ్బుకు ఆశపడి, ముసలి వాడికిచ్చి పెళ్ళి చేసేయడం – వాడు త్వరలో గుటుక్కుమంటే ఆ ఆస్తిని, డబ్బుని, వెధవ కూతురితో సహ తమ ఆధీనంలో పెట్టుకుని పరమ లోభులై బతుకుతూ డబ్బు పోగేసే వారు.  ఆ పిల్లల తల్లి ఎంత మొత్తుకున్నా,  ఏడ్చినా, చివరికి ప్రాణాలు తీసుకునే స్థితి కి వచ్చినా, పట్టించుకోకుండా, మూర్ఖులై ప్రవర్తించేవారు.  ఇంట్లో సిరి సంపదలున్నా , ఆడ పిల్లలు ముండమోసి, ముసుగులతో ఇంట్లో దీనంగా తిరుగుతూ,ఇంటి చాకిరీ చేస్తూ, సోదరుల పిల్లల్ని సాకుతూ కాలం వెళ్ళ మార్చేవారు. – ఇలాంటి పాత్రల సమాహారమే శ్రీ గురజాడ అపారావు గారు వ్రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం –

          ఈ నాటకాన్ని ఆధారంగా చేసుకుని పి.పుల్లయ్య గారు దర్శకత్వం వహించి సినిమా రూపొందించారు.. దేవదాసు సినిమా (నాగేశ్వరరావు , సావిత్రి) తీసిన వినోదా వారు ఈ కన్యాశుల్కం సినిమా గా రూపొందించారు. 

          ఇందులో ఆనాటి సాటిలేని మేటి నటీ నటులందరు అన్ని పాత్రలూ పోషించారు. 

          సి.ఎస్.ఆర్ ఆంజనేయులు, గోవిందరాజుల సుబ్బారావు , ఎన్.టి.రామారావు, విన్నకోట రామన్న పంతులు; గుమ్మడి, సావిత్రి, షావుకారు జానకి, ఛాయాదేవి, సూర్యకాంతం, హేమలత మొదలైన గొప్పనటీ వర్గం ఇందులో ఉన్నారు. 

          ఇందులో కోతల రాయుడు, అవకాశవాది గా ఎన్.టి.ఆర్ – లిటికెంట్ గా సి.ఎస్.ఆర్ – ఆశాపాతకంగా గోవిందరాజుల సుబ్బారావు – బాల వితంతువు గా జానకి వేశ్యాకన్యాగా సావిత్రి – రకరకాల పాత్రలలో మిగిలిన వారు కనిపిస్తారు.  నిజంగా ఇది వెనుకటి వెండి తెరకి అమరిన అమూల్యరత్నం.

          ఆనాటి సమాజాన్ని గ్రంధస్తం చేసింది శ్రీ గురజాడవారైతే- దాని తెరకి అనువదించి ధన్యులయిన వారు పుల్లయ్య గారు. 

          సంగీతం ఘంటసాల వారు నిర్వహించారు.  రచన, సహాయకులు సదాశివ బ్రహ్మం గారు – కెమెరా మెన్ ప్రకాష్ గారు – అదే విధంగా అందరూ తలోకటి అద్భుతంగా నిర్వహించి ఆణిముత్యాన్ని ఆంధ్రదేశానికి అందించారు.  ఆనాటిమేటి కళాకారులందరూ ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. 

          బాల్య వివాహాలు – వేశ్యాలంపటం లాంటి సాంఘిక దురాచారాలను అప్పారావు గారు బలంగా ప్రస్తావించారు. 

          మన తెలుగు వారికున్న అతి తక్కువ గొప్ప చిత్రాల్లో కన్యాశుల్కం చెప్పు కోవాల్సిందే. 

          చివరగా ఒక మాట – ఎంత గొప్ప ప్రయత్నానికైనా వంకలు పెట్టే వారు – విమర్శలు ఘాటుగా చేసేవారూ వుండనే వుంటారు.  – అవన్నీ తెలిస్తేనే అసలైన అందం.  – దేనికైనా ఈ కన్యాశుల్కం నాటకానికి సినిమాకి కూడా అదే వర్తిస్తుంది. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.