వైదేహి వేదనాశ్రువు చెప్పిన కథ
(డా. లక్ష్మీపార్వతి గారి నవలపై ప్రత్యేక వ్యాసం)
-డా.సిహెచ్.సుశీల
| “ప్రకృతి నుంచి ఆవిర్భవించిన పంచభూతాలు తిరిగి మాతృ వ్యవస్థ మీదికే దాడి చేసినట్టు – స్త్రీ గర్భంలో జన్మించిన పురుషుడు స్త్రీల మీదనే పెత్తనం సాగిస్తున్నాడు. తరాలు గడిచినా స్త్రీ అశ్రు వేదనలోని అంతరార్థం ఒక్కటే. నాటి వైదేహి నుంచి నేటి నిర్భయ వరకు జరుగుతున్న చరిత్ర ఇదే…” అంటూ శ్రీమద్రామాయణం లోని “సీత” పాత్రలో ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని ” వైదేహి” అన్న వైవిధ్యమైన నవలలో డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు అద్భుతంగా ఆవిష్కరించారు. |
సీత…. జానకి…. మైధిలి… వైదేహి… ఏ పేరుతో పిలిచినా భారతదేశంలో ఒకానొక పవిత్రమూర్తి వారి వారి మనసుల్లో మెదులుతుంది. అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా సీతారాములను చెబుతారు కానీ, సీత రాముని సాన్నిధ్యంలో సుఖాలననుభవించిన కాలం ఎంతని!
ఈ నవలకి సీత అనో, జానకి అనో శీర్షిక ఉంచకుండా “వైదేహి” అని ఉంచడం లోనే రచయిత్రి మనోభావం గొప్పగా వ్యక్తమౌతోంది.
అసలు ఆమె ఉద్భవించినదే “విదేహ” నగరంలో. దేహం కూడా తనదని భావింపనంతటి వైరాగ్యమున్న విదేహలో జన్మించి “వైదేహి” అయింది.
పవిత్ర యజ్ఞం కోసం జనక మహారాజు భూమిని దున్నుతుండగా “అయోనిజ”గా ఆయనను అనుగ్రహించింది. కూతురు గా అల్లారుముద్దుగా పెరిగింది. శివధనస్సు ను విరిచిన రామునికి ఆమెను జనకుడు ఎంతో నమ్మకంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసం తో “ఇయం సీతా మమ పుత్రీ సహధర్మచరీ తవ..” అని అప్పగించాడు. కానీ అతి కొద్ది రోజుల లోనే – రామునితో పాటు సింహాసన మధిష్టించి అనంత భోగాలు అనుభవించాల్సిన తరుణంలో అతని వెన్నంటి అరణ్యాల కేగవలసి వచ్చింది.
“దీర్ఘమైన అతని బాహువుల మధ్య తన సంరక్షణ కోట పటిష్టంగా వున్నట్లు అన్పించేది..” అందుకే , ఆయన సాన్నిధ్యంలో అరణ్యమైనా అయోధ్య కోటలా భావించి అడవుల కేగింది వైదేహి. కానీ ఆ ఆనందాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తూ రావణాసురుడు తనను అపహరించుకు పోయి లంక లో ఉంచాడు. శ్రీరామ వియోగం తో దగ్ధమౌతూ కూడా తాను ధైర్యంగానే ఆయన రాక కోసం ఎదురు చూసింది. ఆశించినట్లే తన మనోభిరాముడు రావడం, రావణ సంహారం జరగడం పూర్తయింది.
కానీ, తాను ఊహించని సంఘటన… తన శీలాన్ని తాను నిరూపించుకొనే దౌర్భాగ్య సంఘటన ఎదురైంది. అయితే, అగ్నిపునీత గా నిరూపితయై, రాముని చేయందుకొని, అయోధ్యకు చేరింది. ఆ ఆనంద తరంగాలలో మునిగితేలుతూ, ‘రఘువంశాకురం’ తన గర్భాన మొలకెత్తిన తరుణంలో రాముడు ఆర్తిగా తనను హృదయానికి హత్తుకుని “ఇక మనల్నెవరూ విడదీయలేరు. ఒక్క దైవం తప్ప. నువ్వు ఆందోళన పడక మనస్సును ప్రశాంతంగా ఆనందంగా ఉంచుకో ” అన్నాడు లాలనగా. కానీ.. ఏమైంది ఆ హామీ!
“ఆశ్రమాలు దర్శించాలని ఉంది” అని అనాలోచితంగా తాను కోరడమేమిటి? ఎవరో ఒక అజ్ఞాని, మూర్ఖుడు ఏదో అన్నాడని…. తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా లక్ష్మణుడితో పంపి అరణ్యంలో వదిలేయడమేమిటి??
ఇక్కడ డా. లక్ష్మీపార్వతి గారు వైదేహి హృదయాంతర్గత ఆక్రోశాన్ని ప్రతిబింబిస్తూ, ప్రశ్నలు సంధిస్తూ పాఠకులలో దీర్ఘాలోచనను రేకెత్తిస్తారు…
“పైకి ప్రశాంతంగా కనిపించే సరోవరంలో భయంకరమైన మొసలి ఉన్నట్టు మౌనంగా కనిపించే ఆమె హృదయంలో ‘అపవాదం’ అనే మకరి వేధిస్తూనే ఉంది. ఈ అపవాదు మోయటానికే జన్మించిందా! జన్మ వచ్చింది కనుక అపవాదు తనను ఆశ్రయించిందా! ఇది ఎప్పటికీ తేలని సమస్య. తల్లి ఒడిలో గారాబంగా పెరిగిన తన బాల్యం ఇప్పుడు కష్టాల కొలిమిలో కరిగిపోయింది. స్త్రీకి రెండు జన్మలు అంటే బహుశా బిడ్డలకు జన్మనిచ్చే మాతృత్వం ఏమో అనుకుంది. కానీ వివాహం తోనే మరో జీవితం ప్రారంభమవుతుందని, అది ఎన్నో శాసనాలకు లోనై తన ఉనికిని తాను కోల్పోయేంతగా, తనకు తాను ఏమీ మిగలనంతగా, మౌనంగా అన్నీ భరించేంతగా రెండో జీవితం ఉంటుంది అనేది ఇప్పుడు తనకు అర్థమైంది. ఈ కన్నీళ్ళని కాలం సృష్టించిందనే అపవాదును దాని కంటగట్టి కళ్ళు తుడుచుకొంది నారీ లోకం. ఒక వైపు శరీరం మిధ్య, బంధాలు మిధ్య, అంతా మిధ్య అనే శూన్య వాదం మాట్లాడుతూనే ఉంటారు. మరోవైపు ఎన్నో కట్టుబాట్ల మధ్య జీవితాన్ని బంధించి నడిపిస్తారు.'”
రచయిత్రి డా. లక్ష్మీపార్వతి తన ఏ రచనలో నైనా ” ఇదే నా తుది నిర్ణయం” అని కథ మధ్యలో కానీ, పాత్రలపై కానీ, ముగింపు లో కానీ చెప్పరు. తన రచనా విధానంలో, పాత్రల స్వరూప స్వభావాల వర్ణన మాత్రమే తన బాధ్యత గా భావిస్తారు కానీ, అంతిమ నిర్ణయం పాఠకులకే వదిలేసినట్టు అనిపిస్తుంది.
ముఖ్యంగా వైదేహి నవలలో – వైదేహి ఆవేదన స్త్రీవాద ధోరణిలో సాగినట్లు కనిపిస్తుంది కానీ, ఆసాంతం శ్రీరాముని పాత్ర చిత్రణ ఆయన తన “రాజధర్మానికే” కట్టుబడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే విభీషణుడు , సుగ్రీవుడు, హనుమంతుడు, వాల్మీకాది ఋషి పుంగవుల పాత్రల ఔచిత్యాన్ని ప్రతిబింబించ బడ్డాయి కానీ, ఎక్కడా రచయిత్రి ప్రవేశించి తన అభిప్రాయాన్ని, తన నిర్ణయాన్ని ప్రకటించరు. ఇది ఉత్తమ రచనా పద్ధతి.
ఈ నవలలో మరొక ప్రత్యేకత ” మిత్” ని పరిహరించడం లో ఏమాత్రం సంకోచించ లేదు రచయిత్రి. నిజానికి చాలా విషయాలు “అవాల్మీకాలు”.
ఇక రచనా శైలి విషయానికి వస్తే – ఇది నవల (వచనం) అయినప్పటికీ వాక్యాలకు వాక్యాలు కవిత్వ ధోరణి లో సాగుతాయి. ఆ కవిత్వ లక్షణమే పాఠకుల గుండెల్ని ఆర్ద్రంగా తాకింది. రేఖా మాత్రంగా ” సీతా పరిత్యాగం” సంఘటన తీసుకొని, వరుసగా తన కవితా ధోరణిలో, హృద్యమైన సన్నివేశాల్ని పేర్చుకొంటూ, సృజనాత్మక రచన చేసారు డా.లక్ష్మీపార్వతి.
వాల్మీకి ఆశ్రమంలో వైదేహి ఉన్నదని, ఆమెకు కవలలు జన్మించారని, వారు రామకథను ఆలపిస్తున్నారని శత్రుఘ్నుడు అనుమానించాడు. మరి రామునిచే విడువబడిన అశ్వమేధ యాగాన్ని బంధించగల ఆ చిరు బాలకులు సూర్యవంశ సంజాతులు కాకుండా ఉంటారా!
తన ఊహను రామునికీ, ప్రధానాంతఃపుర స్వజనులకు తెలియజేసాడు. వాల్మీకి మహర్షి ని ప్రార్ధించి లవకుశులు ఆలపించే రామకథను ప్రజల ముందర, అంతఃపుర వాసుల ముందర వినిపించే ఏర్పాటు చేసాడు.
లవకుశులను నగరానికి పంపే సందర్భంలో వారితో వైదేహి పలికే పలుకులు ఆమెలోని బాధావీచికలు.. ఆవేదనా తరంగాలు. వైదేహి కంటి నుండి జారనా… వద్దా… అనుకొనే అశ్రువొకటి అప్రయత్నంగా జారి, లక్ష్మీపార్వతి కలంలో సిరా గా మారి అక్షర రూపం దాల్చింది.
“మీరు రేపటి నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి పోతున్నారు. ఇప్పటివరకు మీరు చూసిన సమాజం వేరు. ఇది స్వచ్ఛమైన ముని వాటికలు. మాత్సర్యం ఎరుగని మహా ముని సత్తములు, కల్లాకపటం తెలియని ఈ ముని బాలకులు, తల్లి కంటే గొప్పదైన ఈ అడవి సెలయేళ్ళు మాత్రమే. రేపు మీరు చూడబోయేది దీనికి పూర్తి భిన్నమైన లోకం. వారు చూడటానికి చాలా గొప్పగా ఉంటారు. విలువైన బట్టలు ధరిస్తారు. ఎంతో ఖరీదైన నగలు సువాసనలు వెదజల్లే సుగంధద్రవ్యాలు వారి వేషాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దానిని వారు ” నాగరికత” అని పిలుచుకుంటారు. వారి భాష లో మాటల్లో వినబడేదంతా నిజం కాదు. చూపించే ప్రేమ అంతా వాస్తవం అనుకోకూడదు. వారు పొగిడినా లోతుగా తీసుకోవాల్సిన పనిలేదు. తేలిక పరచినా బాధపడవద్దు. ముఖ్యంగా మీ తల్లి గురించి వారు ఏమైనా అడగొచ్చు. సాధ్యమైనంత వరకు వారి మాటల్లో మాటలు కలవకపోవడం ఉత్తమం. మంచిని మంచిగా చూడలేని వ్యక్తులు అక్కడ కనిపిస్తారు. ఊరికే ఇతరులను నిందించే వాళ్ళు కూడా కనిపిస్తారు. వీరిని కనిపెట్టి దూరంగా ఉండాలి. మీ తండ్రిగారి గురించి అడిగినా మాట్లాడొద్దు. మనం అనుకున్న విధంగా ఎప్పుడు కాలం ఒకేరీతిగా ఉండదు. అది కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. మనం ఊహించని సంఘటనల్ని, బంధాల్ని హఠాత్తుగా మన కళ్ళ ముందుకు తీసుకు వస్తుంది. దాని విన్యాసాలు తల పండిన మహర్షుల కే అర్థం కావు. జీవితం తొలిమెట్టు లో ఉన్న మీకెలా అర్థమవుతుంది! అమ్మ ప్రేమను ఎంత పొందాలని అనుకుంటారో అంతా ఈ రోజే పొందండి. రేపనేది మన మధ్య ఒక తెరను కప్పబోతున్నది. ఇక అమ్మ మీ స్మృతిలో ఒక ఛాయగా మాత్రమే మిగిలిపోతుంది…. మీరు గొప్ప క్షత్రియ వంశంలో జన్మించారు. మీ తండ్రి ఒక మహారాజు. ఒకవేళ ఆయన మిమ్మల్ని స్వీకరిస్తే, మీ జీవితం ఆ నాగరికత పంధా లో అడుగు పెడుతుంది. కొత్త బంధాలు ఎన్నో మీ చుట్టూ అల్లుకుంటాయి. అప్పుడు మీ అమ్మను గురించి మీరేం మాట్లాడొద్దు. గడిచిపోయిన రాత్రుల స్మృతిని విడిచిపెట్టండి…”
ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె గొంతు గద్గదికమైంది. చదువుతున్న పాఠకులకు కూడా ఎంత ఆపు కొందామన్నా దుఃఖం ప్రవాహంలా తన్నుకొస్తోంది.
బిడ్డలు తమ తండ్రిని కలుసుకొన్నారని దండనాథుడైన ప్రసేనుడు వచ్చి చెప్పగనే ఆనందించింది. కానీ “రెండు రోజుల్లో జరగబోయే అగస్త్య, అత్రి, వశిష్టాది ఋషి సమూహంతో కూడిన ధర్మమండలి సమావేశానికి రాముడు రమ్మ”న్న ఆహ్వానాన్ని మాత్రం అంగీకరించలేక పోయింది. శత్రుఘ్నుడు, లక్ష్మణుడు వచ్చి వేడినా ఆమె మనసు అంగీకరించలేదు. అయోధ్య అధికారం వల్ల ఆమె “గడ్డకట్టిన కన్నీటి కొలనులా, మంచు కప్పిన మౌన పర్వతంలా” అంటారు డా. లక్ష్మీపార్వతి.
జనకరాజు పుత్రికయై, దశరథమహారాజు పెద్ద కోడలై, ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని పేరుగాంచిన శ్రీరాముని అర్థాంగి యై కూడా పెద్ద నిందను మోస్తూ పన్నెండేళ్ళు నిస్సారమైన జీవితాన్ని గడిపిన ‘వైదేహి’ భూమిని మించిన సహనశీల, అగ్నిని మించిన పవిత్రురాలు. కానీ ప్రజలు రాముని లోని ‘ భర్త’ ను పక్కకు జరిపి, ‘రాజు’ మాత్రమే ప్రతిష్టించారు. పౌరవాక్యమే రాజపాలన యైంది. మరోసారి మరో నిందకు గురి అయ్యే అవకాశం ఇవ్వకూడదనే మళ్ళీ అయోధ్యలో అడుగు పెట్టకూడదని నిర్ణయించుకొంది.
కానీ….నిండు గర్భిణి యై నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలివేయబడి, ఆత్మహత్య తప్ప మరో దారి లేదు అనుకొంటున్న సమయంలో ఆదుకొన్న మహర్షి… లవకుశుల జననానంతరం వారి బాగోగులు చూస్తూ, సకల విద్యలూ నేర్పుతూ, తాను రచించిన రామకథను వారికి నేర్పి, ప్రదర్శనలు ఇప్పిస్తూ, అంతఃపురం లో గానం చేసే అవకాశం కల్పించి, బిడ్డలను తండ్రి సముఖానికి చేర్చిన మహానుభావుడు వాల్మీకి మహర్షి వ్రాసిన లేఖ వల్ల బయలుదేరింది చిత్రకూటానికి.
డా. లక్ష్మీపార్వతి తన రచనల్లో ” ముగింపు” మాత్రం తనదైన ఒకానొక ముద్ర వేస్తారు. ఒక ఉత్కంఠ, ఒక ఉత్సుకత, ఒక “స్పార్క్” ప్రవేశపెడతారు. ఆ ప్రత్యేకత కోసం గతానుగతికంగా వస్తున్న కథను మార్చడమో, ఒక కల్పనను చేర్చడమో చేస్తారు. పైగా అసహజమైన, నమ్మతగ్గవి కాని వాటిని, ఊహాజనితమైన, దైవాంశ సంభూతమైన వాటిని, అశాస్త్రీయమైన వాటిని పరిహరించి, చాలా క్లుప్తంగా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు.
“లవకుశ” వంటి చాలా సినిమాల్లో చూపినట్టు – భూమిని చీల్చుకొని భూదేవి వచ్చి తన సింహాసనంపై సీతను కూర్చుండబెట్టుకొని వెళ్ళిపోవడం ఈ ” వైదేహి” నవలలో కనబడదు.
చిత్రకూటంలో ఏర్పాటు చేయబడిన ధర్మమండలి సభలోకి ప్రవేశించింది వైదేహి. దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చిన లవకుశులను ఆనందంగా ఆలింగనం చేసుకొంది. రాముని గాని, అత్తలను, మరుదులను, చెల్లెండ్రను, సుగ్రీవ విభీషణలను, హనుమంతుని, మహర్షులను, ప్రజా ప్రముఖులను, చివరికి వయోవృద్ధుడు జ్ఞాన వృద్ధుడు అయిన తండ్రి జనక మహర్షి వంక కూడ చూడలేదామె.
తన ప్రమేయం లేకుండానే తన గురించి సభలో సుదీర్ఘమైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తనకేం సంబంధంలేనట్టు వింటూ ఉండిపోయింది.
చివరికి వైదేహి గొంతు విప్పింది. ఆ ఆవేదన ఆనాటి సీతదే కాదు, సాంకేతికంగా, వైజ్ఞానపరంగా, ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఉన్న నేటి సాధారణ స్త్రీది కూడా. ( ఢిల్లీ లో మానవమృగాల దౌష్ట్యానికి బలైన నిర్భయ కు జరిగిన దారుణానికి చలించిపోయిన లక్ష్మీపార్వతి ఈ నవలను నిర్భయకు అంకితమిచ్చారు.)
“మనిషి ఎలా మరణించినా ఇబ్బంది లేదు కానీ అవమానం తో మరణించకూడదు. ఎందుకంటే వారి శరీరం లేకపోయినా అవమానం మాత్రం భూమ్మీద బ్రతికే ఉంటుంది. ఆభిమానవతి యైన స్త్రీ నిండు సభలో శీల పరీక్షను ఎదుర్కోవడం కంటే దురదృష్టం మరొకటి లేదు. నా బిడ్డలపై కళంకిత పుత్రులనే ముద్ర ఉండకూడదని ఇక్కడ కు వచ్చాను.
లంకలో ఒకసారి నా సత్శీల నిరూపణ అయింది. ఆనాడది ఆయన పూర్తిగా విశ్వసించి వుంటే… ఇప్పుడు ఈ నింద వచ్చినప్పుడు – ప్రస్తుతం జరుగుతున్న విధంగా ఈ సాక్షులందరినీ పిలిచి తన భార్య నిర్దోషిత్వం నిరూపించి ఉండేవారు. లేదా నిరపరాధి అయిన తన పత్నితో కలిసి అడవులకు వెళ్ళి వుండేవారు.ఈ రెండూ చేయకుండా గూఢచారి మాటలు విని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారు. ఏం చేద్దామని నన్ను అడిగివుంటే నా శరీరాన్ని భస్మం చేసి, అతడికి నింద బారి నుండి రక్షించి వుండేదాన్ని. కానీ స్త్రీలు ప్రేమకు, త్యాగాలకు విలువలేదని నా జీవితం నాకు నేర్పింది. హృదయానికి ఏర్పడ్డ గాయాన్ని మాన్పడానికి ఔషద లేపనాలు లేనిదాన్ని. బాహ్య యవనిక మీద నా పాత్ర ముగియబోతున్నది…” అలా మాటలాడుతుండగనే బలహీనమై పోయిన శరీరం నేల మీదకు జారిపోతున్నది. వాల్మీకి మహర్షి పడిపోతున్న ఆమెను పట్టుకొని మెల్లగా తన ఒడిలో పడుకోబెట్టుకొన్నాడు.
“తండ్రీ! మీ రామాయణ కావ్యంలో మరో అధ్యాయాన్ని చేర్చి రాయండి. సౌశీల్యం తో కూడిన ఆత్మగౌరవమే స్త్రీకి కవచంలా ఆమె గౌరవాన్ని కాపాడుతుందని చెప్పండి. నా కన్నీటి హారంలోని చివరి అశ్రు మౌక్తికం కూడా రాలిపోయింది…! నేను ఒక మహా యోగం లోకి నిష్క్రమిస్తున్నాను… !వెన్నెల కోనల్లో నక్షత్రాల దారుల్లో నా రూపం దివ్యమై నారీలోకానికి ఆనందాన్నిస్తుంది….! నాకు నేను శూన్యమయ్యేంతగా..ఈ మహా చేతనలో…
లయిస్తున్నాను…! శబ్దం నిశ్శబ్దం లోకి ల.. యి..స్తు..న్న..ది..”
నాటకం ముగియగానే తెర పడినట్లు ఆమె కన్నులు శాశ్వతంగా మూతలు పడిపోయాయి. మహర్షి ఒడిలో నుండి మెల్లగా జారి భూమ్మీదకు ఒరిగిపోయింది ప్రీతిగా.
ఎందరో మహానుభావులు ఉత్తర రామాయణాన్ని రాసారు. అపవాదు మోసి, భర్తృ పరిత్యాగి యై, జన్మించిన లవకుశులను వాల్మీకి మహర్షి అండదండలతో పెంచి, పిల్లలను తండ్రి కప్పగించి, తన ధర్మాన్ని నెరవేర్చుకొని, భూమాత ఒడిలోకి వెళ్ళిపోయిన సీత గాధ కు కన్నీరు కార్చని వారుండరు. కాని డా. లక్ష్మీపార్వతి రచించిన ఈ ” వైదేహి” నవల కేవలం రామాయణ కథకు మాత్రమే పరిమితం కాక, నేటి నిస్సహాయ వనితల మనోవేదనను కూడా సందర్భానుసారంగా ప్రతిబింబిస్తూ, స్త్రీల జీవితం లోని ఆటుపోట్లను, ఎదుర్కొంటున్న అనుమానాలను, అవమానాలను, అవహేళనలను వివరిస్తూ… సూటిగా ప్రశ్నలు సంధిస్తూ… ముగింపు వాక్యాలు చదవగనే మౌనంగా… భారమైన గుండెతో… చెప్పలేనంత మనోవేదన తో ఉండిపోతాం. ఎందరో స్త్రీల కన్నీటి గాధ ఇది.
మొదట వైదేహి కంటి లో నుండి జారిన అశ్రు బిందువు డా. లక్ష్మీపార్వతి గారి కలంలో సిరాగా మారి, అక్షర రూపం దాల్చి, చదివిన చదువరుల కంటి నుండి ధారాపాతంగా కన్నీటి వర్షంలా జాలువారుతుందని చెప్పక తప్పదు.
అద్భుతమైన రచనకు అత్యద్భుతంగా సమీక్ష చేసి ఎందరో స్త్రీల మనో వేదనకు వైదేహి రూపంలో దర్పణం పట్టి,ఒకానొక సంవేదనను, స్త్రీ కన్నీటి వ్యధల్ని అత్యంత శక్తి వంతమైన రీతిలో.ఆవిష్కరించి స్త్రీ హృదయంలో ని సున్నితత్వం ను ఆర్ద్రమైన వాక్యాల్లో వ్యక్తీకరించి చదివి తీరాలనే ఉద్వేగాన్ని కలిగించేలా సమీక్ష చేసిన సుశీలమ్మ గారికి ,అద్భుతంగా రాసిన లక్ష్మీ పార్వతి గారికి హృదయపూర్వక నమస్కారాలు.నెచ్చెలి ఎప్పుడూ అద్భుత ఆవిష్కరణలకు చోటిస్తుందని మరోసారి నిరూపించారు.అభినందనలు
స్త్రీ మనో వేదనని అద్భుతంగా ఆవిష్కరించిన వైదేహికి అత్యద్భుతంగా సమీక్ష చేసి ప్రతి స్త్రీ హృదయాన్నీ ఒక అలౌకిక భావనకు గురిచేసి ఎందరో అబలల కన్నీటి వ్యధల్ని గుర్తుకు తెచ్చేలా చేసిన ఒకానొక ఉద్వేగ వ్యాసం రచించిన సుశీల మేడం గారికి ఆ సంవేదనకు అక్షర రూపం ఇచ్చిన లక్ష్మీ పార్వతి గారికి నమస్సులు
సుశీల,
చక్కటి సమీక్ష.కధ అంతా చెప్పి ఇంకనావెల్ చదవక్కర లేదు అనిపించే లా కాకుండా గొప్ప తనాన్ని మాత్రం చెప్పి ఎప్పుడు చదువుదామ అనిపించేలా వుంది మీసమీక్ష.
లక్ష్మీ పార్వతి గారికీ, మీకు ,నా మనః పూర్వకమైన
అభినందనలు
“తండ్రీ! మీ రామాయణ కావ్యంలో మరో అధ్యాయాన్ని చేర్చి రాయండి. సౌశీల్యం తో కూడిన ఆత్మగౌరవమే స్త్రీకి కవచంలా ఆమె గౌరవాన్ని కాపాడుతుందని చెప్పండి. నా కన్నీటి హారంలోని చివరి అశ్రు మౌక్తికం కూడా రాలిపోయింది…! నేను ఒక మహా యోగం లోకి నిష్క్రమిస్తున్నాను… !వెన్నెల కోనల్లో నక్షత్రాల దారుల్లో నా రూపం దివ్యమై నారీలోకానికి ఆనందాన్నిస్తుంది….! నాకు నేను శూన్యమయ్యేంతగా..ఈ మహా చేతనలో…
లయిస్తున్నాను…! శబ్దం నిశ్శబ్దం లోకి ల.. యి..స్తు..న్న..ది..”👌
అద్భుతమైన ముగింపు…
శ్రీమతి లక్ష్మీ పార్వతి గారి “వైదేహి “ నవలను చదవమని పురిగొల్పింది మీ విశ్లేషణ సుశీలగారు.
మీ విశ్లేషణ మనసును తాకింది సుశీలగారా
మేడమ్! మీ సమీక్ష చదువుతుంటేనే కన్నీళ్లు ఆగలేదు..ఎక్కువమంది స్త్రీలు సీత వంటి బాధాతప్తహృదయులే! ఆ అవమానం, నింద అనుభవిస్తేనే అర్ధమవుతుంది..పిల్లలకు మునివాటికలక..నగరజీవితానికీ తేడాలు ఎంత అద్భుతంగా చెప్పారు..ప్రతి అక్షరమూ నేటి సమాజానికీ దర్పణం.. మీకు, నెచ్చెలి వారికీ అభినందనలు మరియు ధన్యవాదాలు🙏🙏🏻🙏🏻
ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ!