కొత్త అడుగులు – 31

కొంగలు గూటికి చేరిన వేళ-కాళ్లకూరి శైలజ

– శిలాలోలిత

          అమూర్తమైన భావన అక్షరంగా మారడం, అది పాఠకుని మదిలో మళ్ళీ  ఒక అపురూపమైన స్పందన గా రూపాంతరం చెందడం సాహిత్యం మాత్రమే చేయగలదని కాళ్లకూరి శైలజ నమ్మకం. ఏ కళారూపమైనా కళా రూపానికైనా సాహిత్యం మూలం, అదే మనిషిని మనిషి గా చేసే ఏకైక మాధ్యమమని ఆమె నమ్మకం.

          శైలజ డాక్టరు  కూడా కావడం వల్ల, తత్వ వేత్త గానే కాక, వివిధ రకాల అనుభవాలు , విస్తృతమైన అధ్యయనం, బతుకు కొట్టిన సునామీల దాడులు, తన చుట్టూ ఉన్న ప్రకృతి తో తాను పొందే స్వాంతన కలగలిపిన బతుకు నేపద్యమే  ఆమె కవిత్వ అంశాలైనాయి.

          చాలా సున్నితమైన మనిషి. ఆమె అక్షరాలు ముఖ్ మల్  క్లాతంత మెత్తనివి.  ఆమె భావాలు ఆరుద్ర పురుగుల్లా, పట్టుకుంటే మెత్తదనంతో, బంగారు వర్షంతో మెరిసిపోతుంటాయి.  కవిత్వానికంత శక్తి వుందా? సమాజాన్ని మార్చగలిగే వాహికనా అనిపించకమానదు. 

          తన తల్లి,తండ్రులైన హరినాధ బాబు, శేషమ్మల ద్వారా పుస్తకాభిలాషను, తద్వారా సాహిత్య సాంగత్యాన్ని అలవర్చుకుంది.  పలక మీద అక్షరాలు దిద్దిన క్షణం నుంచి ఆమె వాటి ప్రేమ లో పడి పోయింది.  రోజులో చాలా భాగం చదువుకుంటూ గడపడం ఆమె కు ఇష్టమైన పని.  విద్యార్ధులు, రోగులుఇద్దరికీ జవాబుదారీగా ఉండేందుకు మెడికల్ పుస్తకాలు చదివితే, భావోద్వేగం తో సంయమనం మేళవించుకుని , మనిషి లా జీవించడం కోసం సాహిత్యం చదవడం ఆమె కిష్టం. కవిత్వం లోని భావ సాంధ్రత, భాషా నైపుణ్యం ఆమె ను ఆకర్షించే అందాలు. 

          ఈమె పై దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ , జంధ్యాల పాపయ్య శాస్త్రి, తిలక్, సినారె, త్రిపురనేని శ్రీనివాస్ ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 

          ఆమె సహచరుడు డా. శేషగిరి రావు, కుమారుడు వివేక్ ల ప్రోత్సాహం ఎక్కువగానే వుంది. చదువు సంధ్యలన్నీ శ్రీకాకుళం, హైదారాబాద్, కమ్మం, కర్నూలు లో జరిగాయి.  ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్ గా రంగరాయ మెడికల్ కాలేజ్ లో పనిచేస్తున్నారు.

          శైలజ తొలి రచన కథ. వివిధ పత్రికల్లో, వెబ్ మెగ్ జైన్ లో కథలు వచ్చాయి.  సైన్స్ వ్యాసాలు, కరోనా పై జన జీవనం పై , విశ్లేషణాత్మక వ్యాసాలు చాలా రాశారు.   

          ఆ తర్వాత ‘కవి సంగమం’– పరిచయం తో కవిత్వం వైపు దృష్టి మరల్చారు.  ఎందరో కవులు, రచయతల్ని అంతర్జాల మాధ్యమం లో తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చిందని భావించారు.  నా లోని దుఃఖపు చెలిమ కు ఊరట ను కలిగించింది కవిత్వమే.  ఉదారంగు నైరాశ్యం తో కొట్టుకుపోతున్న ఆమెకు, పెద్ద కొడుకు ప్రమాదం లో వెళ్ళి పోయిన దగ్గర నుంచి, జీవన సాఫల్యాన్ని తెగిన పావురం లా పోగొట్టుకున్న స్థితి నుంచి కవిత్వమే నన్ను ఆ దు:ఖపు నది నుంచి పైకి లాక్కొని వచ్చిందని ప్రకటించారు. 

          ‘జీవన యానం లో మార్గం ఎంత ముఖ్యమో విరామ సమయం లో  మనతో మనం మాట్లాడుకునే సమయం అంత ముఖ్యం. ఈ అంత: సంభాషణ జరిగే గూడు అందరిలో ఉంది.  ఆ  పై కవిత్వ విహంగమై రెక్కలు చాచి ఎగురు రా’, అని తన తోటి కవులకు పిలుపునిచ్చారు.

          వాడ్రేవు వరలక్ష్మి దేవి, సుగుణ శుభశ్రీల స్నేహం తో సజీవ సాహిత్య ప్రపంచం లోకి అడుగిడింది.  అనారోగ్యం, మరణం అనే రెండు చక్రాల మధ్య ఊగిసలాడే ఎందరో రోగుల జీవితపుటెడ్ల బండి సాగిన దారి నన్ను కలచి వేసింది. ఆ వృత్తిపరమైన అనుభూతుల్ని కలబోసుకుని వ్రాసిన కవితలున్నాయి.  ఫేస్ బుక్ లో కవి సంగమం, అనంత సాహితీ వేదిక సమూహం లో, వర్తమాన కవిత్వ పోకడలు, ధోరణిల గురించి నచ్చిన అమూల్య వ్యాసాలు, విశ్లేషణలు స్పూర్తి నిచ్చాయి.  కవితరాసే పద్దతి తెలియజేసాయి.  ‘పడాల ఛారిటబుల్ ట్రస్ట్’ చాలా తృప్తిని కలిగిస్తుందట. శైలజ మాటల్లోనే చెప్పాలంటే ‘ సాహిత్యం మానవ సంబంధాల సంక్లిష్టత ను పరిష్కరించి, సహానుభూతి పెంచేందుకు కృషి చేయాలి.  సాంకేతికత మనిషిని మరమనిషిగా చేసి, రాబోయే రోజుల్లో మానసిక క్రుంగుబాటుకు దారి తీసే ప్రమాదముంది.  ఇందుకు సాహిత్యం షాక్ అబ్జార్బర్ లా పని చేయాలి.  అనే నిర్భయ ప్రకటన చేస్తుంది.’

ఈమె రాసిన పుస్తకాలు:

1.Interludes –A novelette Patridge Publications (అమేజాన్ లో దొరుకుతుంది)

  1. నవతరానికి రోల్ మోడల్ గాంధీజీ
  2. నేను చూసిన బాపు
  3. కొంగలు గూటికి చేరే వేళ

ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ‘కొంగలు గూటికి చేరే వేళ’ కవితా సంకలనం గురించి.  ఇందులో 38 కవితలున్నాయి. 

‘నువ్వోచ్చి వెళ్ళిన సాయంత్రం’ కవిత

 అలా కొన్ని సంధ్యా సమీరాలు,

ధూళి యుగ ఆకురాలు క్షణాలను మెల్లిగా మింగుతూంటే

నేనూ, అనురాగం, ఘనీభవించాం

బాధ పరిమళం పరచి,

ఏకతార మీటానో లేదో

తీపి చేదు కలిపిన

అద్భుతం చిలికి తీసావు

ఇందుకే గదా, నిన్ను హత్తు కునేది

శాంతి నిండి నెమ్మదించిన ఎద

రెప్పలు మూసిన పారవశ్యంలో

జీవన మాధుర్యం తోణికిసలాడిన

నా అనురాగ ప్రాంగణం నువ్వు,

-తనూ కవిత్వం వేరు,వేరు కాదు, తనే కవిత్వం, కవిత్వమే తనూ అన్పించింది.  చిక్కటి వేదన, ఘర్షణ,అంతర్మదనం, కష్టపు చీకటి తర్వాత తొంగి చూసే ఓదార్చి , ఒడిని చేర్చుకునే వేకువ ఒక్కసారి కనిపించాయి. 

మరో కవిత –

‘నీరసించిన నిరసన’

రైతుల నిరసన, వేల మైళ్ళు నడిచినా,ఉవ్వెత్తున ఎగిసినా మారని బతుకులురోడ్డెక్కిన చిత్రాలు, రాజకీయాల కుట్రలు, స్వలాభాపేక్షలు, మారని తీరని కన్నీటి కధలు, చేలోవుండే రైతు,పేదరికంలో మగ్గే రైతు, శ్రమకు తగిన ఫలితం లేక కొల్ల గొట్టబడుతున్న జీవితాలు, ఊరి కాపలా దారులు గానే మిగులుతున్న వైనాలు, కులము, మతము, రాజ్యము, మార్కెట్, దోపిడీల చక్రంలో నలుగుతున్న ప్రజలు అందరూ ఒక్క కవితలో కళ్ల ముందుకొచ్చారు.  లోతైన అవగాహన,  జీవితానుభవము, రాజకీయ స్పృహ నిండుగా వున్న కవయిత్రి.

నేలకు కుంకుమ దిద్దుతాయి, గాయం చూస్తే రెండు గాట్లు, స్వార్ధం మోసం కోరల ఆనవాళ్లు, ఇలాంటి చాలా పదాలతో నిండి వుంటుంది కవిత.

      నిజం తెలిసే లోపు

తోటి మనిషిని శత్రువును చేస్తుంది పోరాటం అణిగిపోతుంది

మరో దశాబ్దానికి సరిపడా చీకటి పరుస్తుంది. – అని వాస్తవ ప్రకటన చేస్తుంది.

          పోరాటం ఆగి పోవడం కాదు.  అణగి పోవడం, దీనికి కారణాలు సుస్పష్టం.’ దివ్యలోకం’ కవితలో బతుకు బొమ్మల నెన్నింటినో కళ్ల ముందుంచింది. ‘స్త్రీల జీవితాన్ని గురించి రాసిన అద్భుతమైన కవిత ‘మచ్చల’– నిజానికి కనబడని గాయాల నడుమ, మచ్చల నడుమ స్త్రీల నరకయాతన ఎంతుంటుందో, శరీరాన్ని మనసు తో కాక శరీరంగానే, సుఖ వస్తువుగానే ఇంకా పరిగణిస్తున్న వ్యక్తుల మీద తిరుగుబాటు జెండాయిది. రండి. మనుషులుగా మారండి. ఆమెకు ఒక ప్రాణముందని, కొరికలున్నాయని, మరబొమ్మ కాదని తెలుసుకోండి అంటుంది. నిజానికి ఈ కవితలో ప్రతి పదానికి అంటిన నెత్తుటి జాడలు చూసి చదవలేం, ముందుకు అడుగేయలేం. అడుగు వేయకుండా వుండలేం.  మన కళ్ళకు చూపుంటే ఇలాంటి, ఇలాంటి మచ్చలెన్నెన్నో, కవిత పూర్తయిన క్షణం గాయం రంపంతో కోయడం మొదలయింది.

   సౌమ్యవాది, కవితలో కూడా ఆకర్షించే కవిత

చివరలో –

వాడుకవి, వాడే రవి!

తూర్పున కాదు,

మార్పున ఉదయిస్తాడు.

ఒక స్టేట్ మెంట్ అనిపించినా వాస్తవాన్ని విడమర్చింది. ‘కొంగలు గూటికి చేరిన వేళ’ పేరు పెట్టడమే బాగుంది.  ఒక భద్రమైన గూడు, భద్రమైన స్థితి, నీ గూడు కాదని వెళ్లగొడుతున్న ఈ రోజుల్లో,అటువంటి ఆహ్లాదకరమైన సాయం సమయాన అందరం ఒకే రీతిగా, స్వేచ్చగా, హాయిగా బతకాలన్న కాంక్ష ఈ కవి నరనరాన వుంది. ఇది మంచి పుస్తకం. ‘అనల్ప’ వాళ్ళు వెయ్యగ మండేన్ ఇది ప్రత్యేకతను నింపుకున్నట్లే లెక్క. రెండో పుస్తకాన్ని అతి త్వరలోనే వేయాలనే స్వార్ధం నాది.  జయహో కవిత్వం.

*****

Please follow and like us:

One thought on “కొత్త అడుగులు-31 కాళ్లకూరి శైలజ”

  1. అమ్మా! నమస్తే.ఎంతో తియ్యగా వ్రాసారు.మీ వాక్యాల ఆత్మీయతకు వెనువెంటనే కళ్ళు చెమర్చాయి. కృతజ్ఞతలు మీకు.

Leave a Reply

Your email address will not be published.