కాళరాత్రి-9
ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్”
అనువాదం : వెనిగళ్ళ కోమల
నాన్న ‘నేనే వీజల్‌ని’ అన్నాడు. అతడు నాన్నను చాలా సేపు చూశాడు. ‘‘నన్ను ఎరగవా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ బంధువు స్టెయిన్ని. రేజల్ భర్త స్టెయిన్ని. నీ భార్య రేజల్‌కు పిన్ని తను తరుచు మాకు ఉత్తరాలు రాస్తూ ఉండేది’’ అన్నాడు.
నాన్న అతడిని గుర్తు పట్టలేదు. నాన్న కమ్యూనిటీ సంగతులు పట్టించుకున్నంతగా కుటుంబ సభ్యులను పట్టించుకునే వాడుకాదు. ఒకసారి మా కజిన్ ఒకామె మా యింటికి వచ్చి రెండు వారా లున్నది. అందరం కలిసే భోజనం చేసేవాళ్ళం. రెండు వారాల తరువాతే నాన్న ఆమెను గమనించాడు. నేను స్టెయిన్ని వెంటనే గుర్తు పట్టాను. అతని భార్య రేజల్ బెల్జియం వెళ్ళక ముందు నుంచి నాకు తెలుసు.
1942లో తనని యిక్కడికి తెచ్చారని చెప్పాడు. ‘‘మీ ఊరి నుండి జనాన్ని తీసుకువచ్చారని విని చూడటానికి వచ్చాను. నా భార్య, నా యిద్దరు కొడుకులూ ఏంట్‌వెర్ప్‌లో ఉన్నారు. వారి గురించిన సమాచారం మీకేమైనా తెలిసి ఉంటుందని ఆశతో వచ్చాను’’ అన్నాడు స్టెయిన్.
వాళ్ళ గురించి నాకేమి సమాచారం లేదు. 1940 నుండి వాళ్ళ దగ్గరనుండి మాకేమీ జాబులు రాలేదు.
అయినా ‘‘మా అమ్మకు రేజల్, అబ్బాయిలూ క్షేమంగా ఉన్నారని తెలుసు’’ అన్నాను తడుముకోకుండా.
అతడు సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చాడు. అతను యింకా వాళ్ళ గురించి అడగాలనుకుంటుండగా ఎస్.ఎస్. రావటం గమనించి రేపు కలుస్తా అంటూ వెళ్ళి పోయాడు.
బెల్ మోగింది. మేము మా సాయంత్రం భోజనం రొట్టె, మార్జరిన్ తెచ్చుకోవటానికి వెళ్ళాము. నాకు ఆకలిగా ఉండటాన అక్కడే తినేశాను. నాన్న అంతా ఒకసారి తినొద్దు, రేపటి రోజు గుర్తుంచుకోవాలి అన్నాడు.
తను ఆకలిగా లేదు అంటూ తినలేదు. నాకోసం దాస్తున్నాడన్నమాట.
ఆష్‌విట్స్‌లో మూడు వారాలున్నాం. పనులేమీ చెప్పలేదు. సాధ్యమైనంత సేపు నిద్రపోయాం.
ఇక్కడి నుండి తరలించకుండా వీలైనంత వరకూ చూసు కోవాలనుకున్నాం. ఏ పనుల్లోనూ నిపుణులం కాము. అది తేలితే యిక్కడ మమ్మల్ని చివరి దాకా ఉండనిస్తారు.
మూడు వారాల తరువాత మా ఇన్‌ఛార్జిని తీసివేశారు. అతను చాలా దయగా ప్రవర్తిస్తున్నాడని. కొత్తవాడు, వాడి సహాయకులు పరమ క్రూరులు. మాకు మంచి రోజులు గతించాయి. మమ్మల్ని ఇక్కడ నుండి తరలిస్తేనే మంచిదనిపించింది.
స్టెయిన్ మమ్మల్ని అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాడు. కొంచెం రొట్టె తెచ్చి ` ఇది నీకూ అంటూ నాకిచ్చేవాడు. వచ్చినప్పుడంతా కన్నీళ్ళు పెట్టుకునేవాడు. ‘‘నీ కొడుకు బలహీనంగా ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకో అని నాన్నతో చెప్పేవాడు. బలహీనులు యిక్కడ బతకటం కష్టం. దొరికినంత తినమని ఇక్కడ నుండి పంపించి వేయకుండా (సెలెక్ట్ అంటారు) కాపాడుకోండి’’ అంటాడు.
అతనెంతో బలహీనంగా వాడిపోయినట్లు ఉండేవాడు. తన భార్య రేజల్, పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలిసి బ్రతక గలుగుతున్నాను అనేవాడు. లేకుంటే ఎప్పుడో హరీ అనేవాడిని అంటుండేవాడు.
ఒకనాడు సంతోషంగా వచ్చి చెప్పాడు. ఏంట్ వెర్ప్ నుండి కొత్తగా జనాన్ని తెచ్చారు. వారిని కలుస్తాను. నా కుటుంబం గురించి తెలుసుకుంటాను అని ఆశపడ్డాను. అదే ఆఖరు అతన్ని చూడటం. కుటుంబం గురించి నిజం తెలిసిపోయి ఉంటుంది పాపం అతనికి.
సాయంత్రం మా మంచాల మీద పడుకొని హసిడిక్ పాటలు పాడేవాళ్ళం. అకీ బాడ్రయర్ పాడుతుంటే మాకు ప్రాణాలు లేచి వచ్చినట్లుండేది.
కొందరు దేవుని గురించి అంతుపట్టని ఆయన పద్ధతుల గురించి, మోక్షం గురించి మాట్లాడేవారు. నేను మాత్రం ప్రార్థన చేయటం మానేసాను. నేను దేవుడు లేడనటం లేదు. కాని ఆయన న్యాయం విధానాన్ని శంకిస్తున్నాను.
అకీబాడ్రయర్ అనేవాడు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మనలోని లోప భూయిష్టమైన ఆలోచనలను పారద్రోలగలమేమో అని పరీక్షిస్తున్నాడు. నిరుత్సాహ పడగూడదు. మనల్ని శిక్షిస్తూన్నాడంటే మనమంటే దేవునికి ప్రేమ అని అర్థం.
హెర్ష్‌గెనుడ్ కబాలా పద్యాలన్నీ బాగా తెలిసినవాడు. ‘‘ప్రపంచం ముగియ బోతున్నది యేసయ్య వస్తాడు’’ అనేవాడు.
ఆ సంభాషణల మధ్య నాకు అమ్మ, జిపోరా గుర్తుకు వచ్చేవారు. ఎక్కడున్నారో వాళ్ళు అని పదే పదే తలుచుకునే వాడిని.
నాన్న ఒకనాడన్నాడు ‘‘మీ అమ్మ వయసులో చిన్నది. ఏదో లేబర్ క్యాంపులో ఉంచి ఉంటారు. జిపోరా ఇప్పుడు పెరిగి ఉంటుంది. తనూ ఏదో క్యాంపులో ఉండి ఉంటుంది.’’
ఆ మాటలు నమ్మినట్లు ప్రవర్తించే వాళ్ళం. పనితనం గలవారిని వేరే క్యాంపులకు పంపారు. మేము వందమంది కూలీలం మిగిలాము. మా బ్లాక్ సెక్రటరీ వచ్చి ‘‘మీరీ రోజు నుండి తరలింపబడతారు’’ అన్నాడు.
పదిగంటలకు రొట్టెలు యిచ్చారు. ఎస్.ఎస్. మమ్మల్ని లెక్కించాడు. రోడ్డున పడ్డాం.
గార్డులు తొందరగా నడవమని అనటం లేదు. పల్లెల గుండా పోతున్నాం. చాలా మంది జర్మన్లు మమ్మల్ని చూస్తున్నారు. ఇలా ఎంతో మందిని తోలుకు పోవటం చూచిన వాళ్ళు గనక ఏమీ ఆశ్చర్య పడలేదు.
త్రోవలో కొందరు జర్మన్ అమ్మాయిలు కనిపించారు. గార్డులు వారితో సరసాలాడారు. గార్డులు వారిని ముద్దులు పెట్టుకుంటూ, హాస్యాలాడుతూ, నవ్వుతూ నడిచారు. అవి జరిగినంత వరకు గార్డులు మమ్మల్ని కొట్టలేదు. తొందర పెట్టలేదు.
నాలుగు గంటల నడక తరువాత బ్యూనా అనే క్యాంపు చేరాం. మేము లోనికి పోగానే ఇనుపగేటు మూసుకున్నది.
ఈ క్యాంపు అంటురోగాలొచ్చి తుడుచుకు పోయినట్లు ఖాళీగా ఉన్నది. అక్కడవారు కొందరు కాస్త మంచి బట్టలు ధరించి పచార్లు చేస్తున్నారు.
ముందు షవర్ చేయాలి మేము. అక్కడ అధికారి వచ్చాడు.ధృఢంగా ఉన్నాడతను. దయాళువు అన్న అభిప్రాయం కలిగింది మాకు. మా వైపు చూసి నవ్వుతున్నాడు. మా గ్రూపులో 10, 12 ఏళ్ళ వయసు పిల్లలు కొందరున్నారు. ఆఫీసరు వాళ్ళకోసం ఆహారం తెమ్మన్నాడు.
మాకు కొత్త బట్టలిచ్చారు. రెండు గుడారాలలో సర్దు కున్నాము అందరం. పని కమాండోలు వచ్చి మాకు బ్లాక్ నిర్ణయించాలి.
సాయంత్రం పనుల నుండి తిరిగి వచ్చిన వారిని అడిగాము. కమాండోలలో కొంచెం మంచి వారెవరని, ఏ బ్లాక్‌లో ఉంచితే మంచిది అని.
బ్యూనా మంచి క్యాంపు. కట్టడాల పని చేయించే కమాండోల కిందకు రాకుంటే మంచిది అన్నారు. కాని మా చేతుల్లో ఏముంది?
మా గుడారపు లీడరు జర్మన్. అప్పుడే ఖూనీ చేసివచ్చిన వాడులా ఉంది అతని వాలకం. క్యాంపు తిండి వాడికి వంటబట్టినట్లున్నది. చాలా లావుగా ఉన్నాడు. పిల్లలంటే వీడికీ యిష్టంలా ఉన్నది. వాళ్ళకోసం, రొట్టె సూపు తెప్పించాడు. ఇక్కడ హోమో సెక్సువల్స్ ఉన్నారు. వాళ్ళకి పిల్లలు అవసరమేమొ! నాకా విషయం తరువాత తెలిసింది.
‘‘ఇక్కడ మీరు మూడు రోజులుంటారు క్వారన్ టైన్‌లో. రేపు ఆరోగ్య పరీక్ష’’ అన్నారు.
అతని సహాయకుడు ఒకడు నా దగ్గరకు వచ్చి ‘‘నీవు మంచి కమాండో ఆధీనంలో ఉండాలనుకుంటున్నావా’’ అని అడిగాడు.
‘‘అవును. కాని నేను మా నాన్నతో పాటే ఉండాలి’’ అన్నాను.
‘‘నీ బూట్లు నాకివ్వు, నీకు నేను అలాగే ఏర్పాటు చేస్తాను’’ అన్నాడు.
నా బూట్లు ఇవ్వనన్నాను.’’ నాదంటూ ఉన్నది అదే.
నీకింకా ఎక్కువ రేషన్ యిప్పిస్తాను అన్నాడు.
అతనికి నా బూట్లు కావాలి. నేను ఇవ్వనన్నా తీసేసు కున్నాడు. బదులుగా నాకేమీ ఇవ్వలేదు.
ముగ్గురు డాక్టర్లు బయట కూర్చుని పొద్దున్న ఆరోగ్య పరీక్షలు జరిపారు.
‘‘మొదటివాడు ` నీవు ఆరోగ్యంగా ఉన్నావా?’’ అని అడిగాడు. లేనని ఎలా చెప్పగలను?
పంటి డాక్టరు నన్ను నోరు తెరవమన్నాడు. అతను పంటి పరీక్ష చేయటం లేదు. నోట్లో బంగారపు పన్ను ఉన్నదా అని చూస్తున్నాడు. అలా ఉన్నవారి నంబరు రాసు కుంటున్నాడు. నా నోట్లో బంగారపు పన్ను ఉన్నది.
నాల్గవరోజు కపోస్ వచ్చి, మమ్మల్ని ఎన్నుకుంటున్నారు. నువ్వు నువ్వు అంటూ ఏదో వస్తువునో, జంతువునో ఎన్ను కుంటున్నట్లు మా కపో మమ్మల్ని ఆర్కెస్ట్రా బ్లాక్‌లోకి తీసుకెళ్ళాడు. మాకు సంగీతంలో ఏమి పని అని అనుకున్నాం.
ఎప్పుడూ వాయించే మిలిటరీ మార్చింగ్ పాటే వాయిస్తు న్నారు. కమాండోలు పని ప్రాంతాలకు మార్చింగ్ చేస్తున్నారు. కపోలు లెప్ట్, రైట్ అంటున్నారు.
ఎస్. ఎస్.లు వెళుతున్న వారి నంబరు రాసుకుంటున్నారు. చివరి కమాండో వెళ్ళిన దాకా, అదే కవాతు పాట వాయించారు. పాట ఆగింది. కపో అరిచాడు ` ‘లైను కట్టండి’ అని.
5 మంది చొప్పున నిలబడ్డాం వరుసగా. కవాతు పాట లేకపోయినా కవాతు చేశాం.
సంగీతం వారందరూ యూదులే. జూలియక్ పోలెండు వాడు, కళ్ళద్దాలు, పాలిపోయిన ముఖంలో నిర్వేదపు నవ్వు. లూయీ పోలండు వాడు. మంచి వయోలనిస్టు. వాళ్ళు బిధోవన్ వాయించనివ్వరని వాపోయాడు. యూదులు జర్మన్ సంగీతం వాయించటం నిషేధం. యువకుడు హాన్స్, బెర్లిన్ వాడు. మంచి హాస్యగాడు, ఫ్రానెక్ (ఫోర్‌మన్) పోలండ్ వాడు. ఒకప్పటి వార్సాలో విద్యార్థి.
జూలియక్ దగ్గరలో ఉన్న కరెంటు సామాన్ల భాగంలో పనిచేస్తున్నట్లు చెప్పాడు. ‘‘ఆ పని కష్టమయింది గాని, అపాయ కరమైందిగానీ కాద’’న్నాడు.
‘‘ఇడెక్ అనే కపోకి అప్పుడప్పుడు వెర్రి కోపం వస్తుంది. అలాంటప్పుడు వాడి నుండి తప్పించుకోవాలి’’ అన్నాడు.
‘‘నీవు అదృష్టవంతుడివి, మంచి కమాండో కిందికి వచ్చావు’’ అన్నాడు హాన్స్.
*****
వెనిగళ్ళ కోమల మూల్పూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారి సతీమణి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.