వ్యాధితో పోరాటం-4

కనకదుర్గ

          ఒక కొబ్బరి బొండాం తీసుకుని ఆటోలో వెళ్తుండగా కొద్ది కొద్దిగా సిప్ చేయసాగాను. చైతుని ఎపుడూ వదిలి పెట్టి ఎక్కడికి వెళ్ళలేదు మేము, సినిమాలకి వెళ్ళడం మానేసాము వాడు పుట్టినప్పట్నుండి. వాడిని తీసుకుని పార్క్ లకు వెళ్ళడం, అత్తగారింటికి, అమ్మ వాళ్ళింటికి వెళ్ళినా, అక్క, అన్నయ్య వాళ్ళింటికి ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కల్సి వెళ్ళడమే అలవాటు. 

          చాలా మంది అనేవారు, ‘సినిమాలు మానేయడం ఎందుకు? వాడికి ఏ బొమ్మొ, లేకపోతే తినడానికి ఏ చాక్లెట్టో ఇస్తే తింటూ పడుకుంటాడు. సెకెండ్ షోకి వెళితే పడుకునే టైం కాబట్టి ఆ టైం కి వెళ్ళొచ్చు.’ అని. 

          ఒకసారి ఒక సినిమా చాలా బావుంది అంటే వెళ్ళాం. సినిమా మొదలవ్వగానే వాడు ఓ ఏడుపు లంకించుకున్నాడు. శ్రీని వాడిని ఎత్తుకుని తలుపు దగ్గర, నేను సీట్లో … ఆ తర్వాత సినిమాలకి వెళ్ళలేదు. 

          వాడు కడుపులో వుండగా భారతీయ విధ్యాభవన్ నుండి జర్నలిజం కోర్స్ చేసాను.  వాడు పుట్టినపుడు జాబ్ చేయాలంటే ఎవరన్నా చూసుకునే వారు కావాలి. 

          అత్తగారింట్లో నానమ్మ దగ్గర వదిలిపెడ్దామంటే ఆమె కూతురిని, తల్లిని చూసుకోవడంలో బిజీగా వుండేవారు. శ్రీని తర్వాత ఒక చెల్లెలు శైలజ, నేను ఒకటే వయసు వారం. కానీ తన మానసిక ఎదుగుదల 6 ఏళ్ళ వయసు దగ్గరే ఆగిపోయింది. అమ్మమ్మ గారు, మనవరాలు ఇద్దరికీ ఒక్క నిమిషం పడేది కాదు. ప్రతీ దానికి పోటీ పడేవారు. మా అత్తగారు వారిద్దరి తగవులు తీర్చడంలోనే బిజీగా వుండేవారు. 

          అమ్మ చూసుకుంటానంది. వాడు పుట్టినపుడు 5 నెలలు అమ్మ దగ్గరే వున్నాము. అమ్మ దగ్గర అలవాటే. కానీ శ్రీని అమ్మమ్మ గారికిది నచ్చలేదు. మా మునిమనవడిని వారం అంతా  అక్కడ వుంచి, శని, ఆదివారాలు మా దగ్గరకు తీసుకొస్తారా? మా కళ్ళ ముందు పెరగాల్సిన పిల్లాడు. అక్కడ వుంటే అమ్మమ్మ మాటే వింటాడు. మా మాటేం పట్టించుకుంటాడు,” అని దీర్ఘాలు తీసింది. 

          దాంతో ఫుల్ టైం జాబ్ మాట మర్చిపోయి ఫ్రీలాన్సింగ్ చేయడం మొదలు పెట్టి బాబు కొంచెం పెద్దయ్యాక జాబ్ చూసుకోవచ్చు అనుకున్నాము. 

          డెక్కన్ క్రానికల్ కి వెళ్ళి సండే క్రానికల్ ఎడిషన్, ఎడిటర్ ని కలిసి ’91 లో మొట్టమొదటి ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్ చేసాను. అపుడు సెట్విన్ వారు మోటర్ సైకిల్ టాక్సీలు మొదలుపెట్టారు. అవి ఎలా నడుస్తున్నాయి, డ్రైవర్స్ ఏమనుకుంటున్నారు? పాసింజర్లు ఏమనుకుంటున్నారు. సెట్విన్ వారు ఏమంటున్నారు లాంటి విషయాలన్నీ సేకరించి రాయాలి. 

          చైతు ఏడాది పిల్లాడు.  కైనెటిక్ హోండా పై సెట్విన్ ఆఫీస్ కి ముగ్గురం వెళ్ళి, తండ్రి, కొడుకు బయట తిరుగుతుంటే నేను లోపలికి వెళ్ళి సెట్విన్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేసి అక్కడ నుండి ఓల్డ్ సిటీలో వుండే మా అమ్మా వాళ్ళింటికెళ్ళాం. 

          మోటర్ సైకిల్ డ్రైవర్స్ ని కల్సుకోవడం, పాసెంజర్స్ ని కల్సి వాళ్ళ అనుభవాలు నేనే కలెక్ట్ చేసాను.  చైతుని శ్రీని ఆదివారం చూసుకునేవాడు.  ఆ ఆర్టికల్ తర్వాత మరి కొన్ని ఆర్టికల్స్ రాసినపుడు కూడా కొంతమందిని కలవడానికి ముగ్గురం కల్సి వెళ్ళే వాళ్ళం. వాళ్ళిద్దరూ బయట వెయిట్ చేస్తుంటే నేను లోపలికి వెళ్ళీ ఇంటర్వ్యూ లు చేసి వచ్చే దాన్ని. కొన్ని సార్లు నేనొక్కదాన్నే బస్సుల్లో కానీ, ఆటోలో కానీ వెళ్ళొచ్చేదాన్ని. 

          ఎక్కడకు వెళ్ళినా ముగ్గురం వెళ్ళడం లేకపోతే నేను కానీ, శ్రీని కానీ చైతుతో వుండడం అలవాటు. ఈ రోజు ఎపుడెపుడు వెళ్ళి వాడ్ని చూద్దామా అని వుంది. 

          ఆటోలో ప్యారడైజ్ దగ్గర జవహర్ నగర్ వెళ్ళి మా అత్తగారింట్లో పెట్టిన స్కూటర్ తీసుకోవడానికి వెళ్ళాము. శైలు ఒకతే కూర్చుని వుంది. ఇంట్లో అద్దెకున్న ఆవిడ ఏదో కుట్టుకుంటూ శైలుకి తోడుగా కూర్చొని వుంది. “అమ్మేది శైలు?” అడిగాడు శ్రీని. 

          “అమ్మ మీ ఇంటికి వెళ్ళింది. మీరు లెటర్ పెట్టారు కదా! అది చూసి చైతు ఒక్కడే ఉంటాడని వెళ్ళింది.” అన్నది. శైలు చాలా మెల్లిగా మాటలు కూడతీసుకుంటూ మాట్లాడుతుంది. 

          అక్కడ కూర్చొని కుట్టుకుంటున్న కమలమ్మ గారు,” అవును నాయనా! మీరొచ్చినపుడు వాళ్ళు శైలుని ఆయుర్వేదం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. మీరు తలుపు దగ్గర పెట్టి వెళ్ళిన లెటర్ చూసుకొని శైలుకి భోజనం తినిపించి, తనూ తినేసి వెళ్ళింది మీ అమ్మ.” అని చెప్పారు.

          “బాబీ ఏమైంది నీకు? కడుపు నొప్పి వచ్చిందా? నీ కడుపులో బుజ్జి పాప వుందేమో?” అని గట్టిగా నవ్వింది. నన్ను బాబీ అని పిలవడం అలవాటు శైలుకి. 

          “పాప లేదు ఏమి లేదు. చాలా కడుపు నొప్పి వచ్చింది శైలూ, అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్ళాము. నన్ను ఇంట్లో దింపి అన్న అమ్మని తీసుకొని వస్తాడు సరేనా? అప్పటిదాక గొడవ చేయకుండా బుద్దిగా వుండు.” అన్నాను. 

          “సరే, నేను టీ.వి చూస్తానన్నా.” అంది.

          శ్రీని టీ.వి పెట్టి స్కూటర్ తీసి బయల్దేరాము. 

          ఇంటికి వెళ్ళేసరికి చైతు గొంతు వినిపిస్తుంది. ఏవో గల గలా కబుర్లు చెపుతున్నాడు. స్కూటర్ చప్పుడు విని, ‘అమ్మా, నాన్న,’ అంటూ క్రిందకి పరిగెత్తుకొచ్చాడు. 

          ‘ఏమైందమ్మా! డాక్టర్ మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చాడా?” అని నన్ను గట్టిగా పట్టుకుని అడిగాడు. 

‘లేదు నాన్న! ఇంజెక్షన్ ఇవ్వలేదు. రేపు మళ్ళీ వెళ్ళాలి. అపుడు మందులిస్తాడు.”

          శ్రీని పైకి వెళ్ళి ఇంటి తాళం తీసాడు. అమ్మా, నాన్న, అత్తగారు అందరూ ఎదురింట్లో వున్నవాళ్ళు లేచి వచ్చారు. 

          నేను ఎదురింటి ఆంటీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను. 

          “అయ్యో పర్వాలేదమ్మా! చైతు పరాయివాడా? ఈ నాలుగిళ్ళు వాడివే! డాక్టర్ ఏమన్నారు?”

          “రక్త పరీక్ష చేసారు. రేపు మళ్ళీ వెళ్ళాలి.” 

          బాగా కళ్ళు తిరగ సాగాయి. ఇంట్లోకెళ్ళగానే అమ్మ ఒక చిన్న గ్లాసులో పాలు తెచ్చి ఇచ్చింది. తాగేసాను, మరో గ్లాస్, మరో గ్లాసు మూడు గ్లాసులు త్రాగేసాను. 

          కాసేపు కడుపులో చల్లబడినట్టయ్యింది.  అమ్మ టీ చేసింది. అందరూ టీ త్రాగారు. శ్రీని అత్తగారిని ఇంట్లో దింపడానికి బయల్దేరుతుంటే నేను దగ్గరకి వెళ్ళి, ’ థ్యాంక్సండి, పాపం శైలుని వదిలి పెట్టి రావాల్సి వచ్చింది.” అన్నాను.

          “మన వాళ్ళకి అవసరం పడినపుడు రాకపోతే మరెపుడు వస్తాము చెప్పు. నీ ఆరోగ్యం జాగ్రత్త. రిపోర్ట్ వచ్చాక చెప్పండి డాక్టర్ ఏం చెప్పారో?” 

          “రేపు వెళ్తాము కదా! వచ్చేపుడు ఆగి చెబుతాము. శైలు ఎదురు చూస్తుంటుంది వెళ్ళండి.” అన్నాను. 

          అమ్మా, నాన్నను చూస్తే చాలా ధైర్యంగా అనిపించింది. సన్నగా కడుపులో నొప్పి మొదలయ్యింది. 

          పొద్దున్నుండి జరిగినదంతా వాళ్ళిద్దరికీ చెప్పసాగాను. 

          అమ్మా, నాన్నని కొన్నాళ్ళు ఉండమన్నాను.  “నీకు నొప్పి పూర్తిగా తగ్గేదాక వెళ్ళమమ్మా!” అన్నారు నాన్న. 

          అమ్మా, నాన్న వాళ్ళు 20 నిమిషాల దూరంలో మారేడ్ పల్లిలో వుంటారు. మా చిన్నపుడు ఓల్డ్ సిటీ చందూలాల్ బారాదరి లో వుండేవాళ్ళం. హౌసింగ్ బోర్డ్ ఇళ్ళు. పెరట్లో పెద్ద స్థలం, ఇంటి ముందర చాలా స్థలం విశాలంగా వుండేది. వెనక నాన్న చాలా చెట్లు పెట్టారు. ఇంటి ముందర పూల చెట్లు, క్రోటన్ మొక్కలుండేవి. ముందు కూడా ఒక కొబ్బరి చెట్టు, వేప చెట్టు, ఒక గానుగ చెట్టు పెద్దవి వుండేవి. గానుగ చెట్టు కొన్నాళ్ళయ్యాక కొట్టేసారు. మేము పెద్దయ్యి, పెళ్ళిళ్ళయి పోయాక అక్కడ వాళ్ళు వుండలేకపోయారు. ఆ ఇల్లు అమ్మేసి మారేడ్ పల్లిలో ఒక బెడ్ రూమ్ అపార్ట్మ్ంట్ తీసుకొని వుంటున్నారు. మాకు చాలా దగ్గర. 

          మర్నాడు చైతుని స్కూల్ కి పంపించి డా. రమేష్ ని  ఒకసారి కలిసి అక్కడ్నుంచి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరకు వెళ్దామనుకున్నాము. 

          ఆయన మమ్మల్ని చూడగానే, ‘నిన్న అర్ధరాత్రి ఆయన ఫోన్ చేసారు.’ ఏరి నువ్వు పంపించిన పేషంట్స్? నేను బ్లడ్ రిపోర్ట్ వచ్చేవరకుండమన్నాను, నాకు వాళ్ళు కనిపించనే లేదు. అవసరమైతే హాస్పిటల్ లో చేర్చుకునేవాడిని.’ అన్నారు. ఎందుకు వెయిట్ చేయకుండా వచ్చేసారు?” అని అడిగారు. 

“మేము అక్కడున్నపి.ఏ ని అడిగితే పొద్దునే రండి, అన్నాడు. అందుకే వచ్చేసాము.”

“ఆయన ఈ రోజు రాత్రికి అమెరికా కాన్ఫరెన్స్ కి వెళ్తున్నారు. వెళ్ళండి ఏం చెబ్తారో చూడండి!” అన్నారు.

“ఆయనకు కోపం వచ్చిందంటారా?”

“అదేం లేదు. ఒకోసారి ఈ ప్రాబ్లెం ఎమర్జన్సీ కూడా కావొచ్చు. అందుకని కొంచెం కంగారు పడి వుంటారు, అంతే! వెళ్ళి రండి. నాకోసారి ఫోన్ చేసి చెప్పండి ఆయన ఏమన్నారో?”

          ఇంకా నీరసంగా ఉండడంతో స్కూటర్ అత్తగారింట్లో పెట్టేసి ఆటోలో మెడినోవాలో పని చేస్తున్న డా. నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. మేము ఆటో దిగుతుంటే ఆయన కార్లో నుంచి దిగి మమ్మల్ని చూసి ఆగి,”నేను మిమ్మల్ని ఉండమంటే అలా వెళ్ళిపోయారేమిటి?” అని అడిగారు.

          “మీ పిఏ ని అడిగాము, రేప్రొద్దున రండి అంటేనే వెళ్ళామండి.” అన్నాను.

          “మీరెళ్ళి నా రూంలో కూర్చోండి. నేనొస్తాను.” అని తన రూం తలుపు తీసి పట్టుకున్నారు. మేము లోపలికి వెళ్ళగానే ఆయన పి.ఏ ని పిలుస్తూ అటు వైపు వెళ్ళారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.