వెనుతిరగని వెన్నెల(భాగం-35)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళిజరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. కష్టమ్మీద తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసవుతుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. తన్మయి స్థానిక రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగానికి కుదురుకుని జే.ఆర్.ఎఫ్ కూడా సాధిస్తుంది.
***
తిరిగి విశాఖపట్నానికి వస్తున్న తన్మయికి శేఖర్ తల్లి దేవి మాటలు చెవుల్లో మారుమ్రోగ సాగేయి.
“ఆడు మగాడే. ఎంత మందితోనైనా తిరుగుతాడు. ఎంత మందితోనైనా కలిసుంటాడు. ఆడదానివి నువ్వు మొగుడేం చెప్తే అది విని పడి ఉండాల్సిందే. కాదూ కూడదని నువ్వు ఊరేగుతానంటే నా కొడుకు గాజులు తొడుక్కుని ఊరికే కూచోలేదు. ఈ పిల్లోడికి తండ్రి వాడు. వాడి మీద హక్కులన్నీ మాకే ఉన్నాయి. మా మనవడు వాడు. వాణ్ణి నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కనివ్వను. గుర్తుంచుకో.”
తన్మయి గుండెల్లో కొత్త బెదురు, భయం మొదలయ్యింది.
కలిసి ఉన్నంతసేపూ దుర్భర జీవితాన్ని చవి చూసింది. అతనికి దూరంగా, ఏదో తన మానాన తాను బతుకుని చక్క దిద్దుకుంటుంటే మళ్లీ ఈ ఉపద్రవాలేంటి? ఈ బెదిరింపులేవిటి?
“ఆవిడ అన్నవన్నీ నిజం కాకూడదు. ఎప్పటికీ నిజం కాకూడదు. లేదు, అలా జరగడానికి వీలు లేదు.” మనసు ప్రార్థిస్తూ ఉంది.
తెల్లారగట్ల బస్సు కిటీకీ లోంచి అతి చల్లని గాలి ముఖానికి తగుల్తూన్నా తన్మయికి ధారాపాతంగా చెమట్లు పట్టసాగేయి.
ముందు వెంటనే లాయర్ ని కనుక్కోవాలి.
“బాబు నించి ఎప్పటికీ దూరం కావడం” అనే ఆలోచనకే కడుపులో నుంచి మెలి తిప్పినట్లు బాధ కలగసాగింది.
“భార్యా భర్తలు విడాకులు తీసుకున్నపుడు పిల్లలు ఏమవుతారో అనేది ఊహకు కూడా అందకుండా, ఏ విషయాలూ తెలుసుకోకుండా పెరిగిన సామాన్యురాలు తను. అసలు ఇవన్నీ తెలుసుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.”
ఆలోచనలకు అంతూ పొంతూ కనబడడం లేదు.
బస్సు వేగాన్ని అందుకోలేక కిటికీ బయట వెనకబడుతున్న దృశ్యాలను కలుపుతూ, విడదీస్తూ కొనసాగుతున్న గతపు చిత్రాలు ఏవేవో తన్మయి తలలో గింగిరాలు కొడుతున్నాయి.
“అసలే తప్పనిసరి పరిస్థితుల్లో బాబుని తిరిగి తల్లిదండ్రుల దగ్గరే వదిలేసి వచ్చింది.
వాడు నిద్ర లేస్తే ఏడుస్తాడని తెల్లారగట్లే బస్సెక్కింది. పాపం లేవగానే ఎంత బెంగ పడ్తాడో ఏమో!”
గొంతులోకి గరగర మంటూ దు:ఖం తన్నుకు వచ్చింది తన్మయికి.
తన్మయి బలమూ, బలహీనతా ఈ పసివాడే.
“వాడిని చూడగానే, హత్తుకోగానే జీవితాన్ని వాడి కోసమే గెలిచి తీరాలన్న గొప్ప పట్టుదల కలుగుతుంది. అడుగడుగునా సవాళ్ళే ఎదురవుతున్న జీవనంలో ఎక్కడా వాణ్ణి ఒక్క క్షణం వదిలి ఉండలేని బాధ, దుఃఖం.
ఎన్నో కలలతో, ఆశలతో, నిరంతరం శ్రమతో, పట్టుదలతో గెల్చుకున్న జే ఆర్.ఎఫ్ వల్ల మంచి స్కాలర్ షిప్పుతో పీ.ఎచ్.డీ చేసే అవకాశం వచ్చింది.
హాస్టల్లో పిల్లాడితో కలిసుండకూడదనే నిబంధన వల్ల మళ్లీ బాబుని దూరం పెట్టాల్సి వస్తూంది.
బయటెక్కడైనా ఇల్లు చూసుకోవాలంటే ధైర్యం చిక్కబట్టుకోవడమే కాదు. కాస్త నిలదొక్కుకోవాలి కూడా. ఇంటికి అడ్వాన్సు ఇవ్వాలన్నా, ఎక్కడయినా స్కూలులో బాబుని చేర్పించాలన్నా తగినన్ని డబ్బులు లేవు.
అసలు స్కాలర్ షిప్పు చేతికి వస్తూ రెణ్ణెల్లు గడిస్తే గానీ ఏవీ చెయ్యలేని పరిస్థితి.
కొన్నాళ్లు ఓపిక పట్టాలి తప్పదు.”
కిటికీ లో నుంచి బయటికి చూస్తూ కళ్ళు తుడుచుకుంది తన్మయి.
వివేకానందా పాఠశాలలో కిండర్ గార్టెన్ కి వెళ్తూనే అన్ని అక్షరాలూ నేర్చేసుకున్న చురుకైన వాడు బాబు. ఇప్పటి వరకు చక్కగా చదువుతున్న పిల్లాణ్ణి ఇలా అర్థాంతరంగా మళ్లీ మానిపించాల్సి వచ్చింది.
“అందాకా వీథి చివర ఎవరో అమ్మాయి ప్రైవేటు చెప్తూంది, ఊరికే కాస్సేపు పంపుదాంలే” అంది తల్లి వచ్చేటపుడు. గట్టిగా నిట్టూర్చింది తన్మయి.
***
హాస్టలుకి వస్తూనే తనతో తెచ్చుకున్న కాసిన్ని బట్టలు, పుస్తకాలు గదిలో ఒక మూలగా ఉన్న చిన్న అలమారా లో సర్దుకుంది.
టేబుల్ మీద బాబు ఫోటో పెట్టింది. చిన్న అద్దం తీసి కిటికీ ఊచల మీద తగిలించింది.
మంచమ్మీద దుప్పటి పరిచి నడుం వాల్చగానే ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది.
మేరీ తట్టి లేపేంత వరకూ బయట చీకటి పడిందని కూడా తెలియలేదు తన్మయికి.
“బాగా అలిసిపోయేవా?” అంది మేరీ.
తనను మేరీ అలా ఏక వచనంలో సంబోధించడం తన్మయికి ఎంతో నచ్చింది. పైగా తన గొంతులో ఉట్టి పడ్తున్న ఆప్యాయతకి కలిగిన సంతోషంతో చిన్న చిరునవ్వుతో తలూపింది తన్మయి.
భోజనాల వేళ అయ్యింది. “రా, డైనింగు హాలుకి వెళ్దాం” అంది మేరీ.
బయటికి రాగానే రాత్రి పూట ఆ భవంతి లో అక్కడక్కడా వెలుగుతున్న చిన్నలైట్ల వల్లనో ఏమో భవంతి చుట్టూ ఉన్న కీచురాళ్ల రొద జీబురుమని వినిపించసాగింది.
అన్ని గదులకి చివరన ఎత్తున ఉన్న డైనింగు హాలులో అడుగు పెట్టగానే అదేదో పిల్లుల దీర్ఘ నివాసంలా దుర్గంధం వచ్చింది. చప్పున చీర చెంగుతో ముక్కు మూసుకుంది తన్మయి.
పెద్ద గది మధ్య పొడవైన పెద్ద చెక్క భోజనాల బల్ల, అటూ ఇటూ కూచునేందుకు పొట్టి బల్లలు. భోజనాల బల్ల నల్లగా చివికిపోయి, మురికి పట్టి, మాసికలు పడి ఉంది.
తమని చూస్తూనే బల్ల మీద ఒక వారగా ముడుచుకుని పడుకున్న పిల్లులు రెండు చటుక్కున మెట్ల మీంచి దూకి చీకట్లోకి మాయమయ్యేయి.
ఒక మూల కూచున్న వయసు మీద పడ్డట్లున్న ఆడామె తమని చూసి లేచి వచ్చింది.
“కొత్త అమ్మాయా?” అంది మేరీతో.
“అవును” అని ఆవిడతో అని, తన్మయీ, “కొండమ్మ” అని పరిచయం చేసింది మేరీ.
పలకరింపుగా నవ్వింది తన్మయి.
హాలులో ఒక పక్కగా సత్తులు పడిన పొడవాటి అల్యూమినియం గిన్నెల కారియర్లు పెద్దవి రెండు ఉన్నాయి.
ఆ పక్కనే నీళ్ల కుండ, కాసిన్ని స్టీలు గ్లాసులు, పళ్లేలు.
తమతో తెచ్చుకున్న గ్లాసుల్ని టేబుల్ మీద పెట్టేరు మేరీ, తన్మయి.
“రండమ్మా” అంది కొండమ్మ ముందుకు దారి తీసి.
అప్పటికే టేబులు మీద సర్ది ఉన్న నాలుగైదు పళ్ళేలలో రెండిటి మూతలు తీసి, నిశ్శబ్దంగా మంచినీళ్లు గ్లాసుల్లో పోసింది.
ఆ హాలులో వాసనకి కడుపులో తిప్ప సాగింది తన్మయికి.
ఉదయం నించీ ఏవీ సరిగా తినక పోయినా ఆకలి వెయ్యనట్లు అనిపించసాగింది.
తెలారగట్ల ప్రయాణం చెయ్యడం వల్లనే కాక, దారి పొడవునా తల పగిలిపోయే ఆలోచనల వల్ల మన్ససంతా బాధ అలుముకుంది.
తప్పని సరిగా తినక తప్పదన్నట్లు పళ్లెంలో చెయ్యి పెట్టింది.
చల్లని అన్నం, రుచీ పచీ లేని కూర, ఉప్పు లేని పచ్చడి, నీళ్ల లాంటి పప్పు, పుల్లని మజ్జిగ.
తన్మయికి అసలు ఒక్క ముద్ద కూడా లోపలికి పోవడం లేదు.
మేరీ మాత్రం అలవాటు పడిపోయినట్లు అతి మామూలుగా తినసాగింది.
తన భోజనం పూర్తి కావస్తూన్నా తన్మయి పళ్లెం లో అన్నం కొంచెం కూడా కదలక పోవడం చూసి “ఏమైంది తన్మయీ, రేపట్నించి రూముకే తెప్పించుకుందామా?” అంది మేరీ.
తన్మయి ఆశ్చర్యంగా చూసింది. ఈ హాస్టల్లో ఈ సౌకర్యం కూడా ఉందా?
***
మర్నాడు మధ్యాహ్నం తలుపు దగ్గిర చప్పుడైతే “రండి” అంది తన్మయి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి.
“అమ్మా, మేరమ్మగారు మీ భోజనం గదికి తెచ్చి ఇమ్మన్నారమ్మా” అంది కొండమ్మ.
“మరి మేరీ భోజనం?” అంది పళ్లెం అందుకుంటూ తన్మయి.
“అమ్మ గారు రేత్రి ఒకటే పూట హాస్టల్లో తింటారమ్మా. మీకు ఒప్పుడేం కావాలన్నా పిలవండి. అదుగో ఆ మూలన సిన్న గది నాదేనమ్మా.” అంది కొండమ్మ.
సన్నగా పూచిక పుల్లలా ఉండి, వయసు మీద పడిన మీదట భుజాలు వొంచి నడుస్తూంది కొండమ్మ.
“పాపం తను గది గదికీ తిరిగి భోజనం అందివ్వడం ఏవిటి?” అనిపించి “ఫరవాలేదులే. నేనే వచ్చి తెచ్చుకుంటాను.” అంది తన్మయి వెళ్తున్న కొండమ్మకి వినిపించేలా.
“పర్లేదమ్మా. ఇది నాకు అలవాటే. సివాచలం ఉన్నాడుగా సాయం సేత్తానికి. రెండ్రోలు ఆళ్ల ఊరెళ్ళేడు ఎల్లుండి వచ్చేత్తాడు.” అంది.
కొండమ్మ ని చూస్తుంటే తన్మయికి అమ్మమ్మ నరసమ్మ జ్ఞాపకం వచ్చింది.
“అదే యాసలో మాట్లాడేది అమ్మమ్మ. ఇప్పుడు తను లేకపోవడమే మంచిదయ్యింది. లేకపోతే తన కష్టాలు చూడలేక తండ్రిలా తను కూడా మంచాన పడేది.” పెద్దగా నిట్టూర్చింది తన్మయి.
మరో అరగంటలో మేరీ వచ్చింది.
వస్తూనే గదిలోని కుండలో నీళ్లు తీసుకుని గడగడా తాగుతూ “అబ్బో, ఇవేళ ఎండ చాలా ఎక్కువగా ఉంది” అంది.
తన్మయి పుస్తకం పక్కన పెట్టి “భోజనం చేసేవా మేరీ?” అంది.
బదులుగా మూత పెట్టి ఉన్న పళ్లెం వైపు చూస్తూ “అదేవిటి, నువ్వు భోజనం చెయ్యలేదా?” అంది మేరీ.
“ఉహూ. తినాలని అనిపించడం లేదు. నువ్వింకా చేసి ఉండకపోతే, చెరి సగం తిందాం. ఇంత అన్నం నేనొక్కదాన్నీ తినలేను.” అంది తన్మయి.
“ఫర్వాలేదులే నువ్వు తిను. నేను మధ్యాహ్నం భోజనం చెయ్యను.” అంది మేరీ.
“ఏవిటి డైటింగా?” అంది నవ్వుతూ తన్మయి.
“లేదు తన్మయీ. నాకు వచ్చే ‘లో ఇన్ కమ్ స్కాలర్ షిప్పు‘ రెండు పూటలా తినడానికి చాలదు. మరీ బాగా ఆకలేస్తే కాస్త అన్నం స్టవ్వు మీద వండుకుంటాను. లేదా ఏ బిస్కట్లో తింటాను.” అంది.
తన్మయికి ఒక్కసారిగా మనసంతా బాధ కలిగింది.
చప్పున దగ్గరికి వెళ్లి, “నేను తీసుకునే భోజనం మనిద్దరికీ సరిపోతుంది మేరీ. ఇక మీదట రాత్రి పూట కూడా నువ్వు కొనుక్కోనవసరం లేదు. దా, ఇద్దరం తిందాం.” అంది తన్మయి.
ఇంకా మేరీ కదలక పోయే సరికి “నువ్వు తినకపోతే నేనూ తినను మరి” అంది బుంగమూతి పెడుతూ.
నవ్వుతూ వచ్చి పళ్లెం దగ్గర కూచుని “ఆ ప్రభువు నా కోసమే నిన్ను ఇక్కడికి పంపేడు. ఇది నా అదృష్టం.” అంది మేరీ.
***
మర్నాడు ఉదయం డిపార్టుమెంటుకి వెళ్లడానికి సిద్ధం కాసాగింది తన్మయి.
పెట్టె లో నుంచి తనకి ఇష్టమైన తెల్లని బెంగాల్ కాటన్ చీర తీసింది. చిన్న ముదురు ఊదా రంగు అంచుతో హుందాగా ఉంటుందా చీర.
తెల్లచీర పైకి తీయగానే వివేకానందా పాఠాశాల, వెనువెంటనే మురళి, వెంకట్ జ్ఞాపకం వచ్చారు.
“ఎలా ఉన్నారో ఏవిటో, ఒక ఉత్తరమైనా రాయాలి” అనుకుంది.
పక్కనే రెండో కిటికీ ఊచలమీది చిన్న అద్దంలో చూసుకుంటూ తయారవుతున్న మేరీ “ఎవరికి ఉత్తరం రాయాలి?” అంది.
తన్మయి “తనలో తను అనుకున్నాను” అని అనుకుంది కానీ, పైకి అన్నదన్న సత్యాన్ని అప్పుడు గ్రహించింది.
“ఊహూ” అని తల అడ్డంగా ఆడించి, అదో పెద్ద కథ సాయంత్రం చెప్తాను. అంది తన్మయి.
“సాయంత్రం వరకూ ఎందుకు, నడిచి వెళ్దాం యూనివర్శిటీకి. ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ వెళ్లొచ్చు. మా సోషియాలజీ డిపార్టుమెంటు మీ పక్కనేగా.” అంటూ
నుదుటిన బొట్టు దిద్దుకుంటూన్న తన్మయి వైపే చూస్తూ “నా దిష్టే తగిలేలా ఉన్నావు.” అంది చిరునవ్వు నవ్వుతూ మేరీ.
బయట చిరు వెచ్చగా ఉంది ఉదయం.
హాస్టలుకి ఎదురుగా బాట పక్కన నడిచే దారి మీదికి కట్టిన చిన్న వినాయకుడి గుడి దగ్గర అటూ, ఇటూ నడిచే వాళ్లు ఆగి బొట్లు, దణ్ణాలు పెట్టుకుంటూ, గుంజీలు తీస్తూ, ఆత్మ ప్రదక్షిణలు చేస్తూ హడావిడి చేస్తున్నారు.
ఆ పక్కనే పూల దండలు, కొబ్బరి కాయలు రోడ్డు మీదే గోనెలు పరిచి అమ్ముతున్నారు.
హోరున పక్క నించి వాహనాలు దూసుకు వెళ్తున్నాయి.
అంత రణగొణ ధ్వనుల్లోనూ మేరీతో కలిసి మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే హాయిగా అనిపించసాగింది తన్మయికి. వనజ, అనంత గుర్తుకు వచ్చేరు .
“వాళ్లిద్దరూ కలిసి ఒక్కరే అయిన నెచ్చెలి మేరీ. అనంత అప్పుడప్పుడూ తనతోనే ఉన్నా, వనజ, తను ఎప్పుడూ ఒక ఇంట్లో కలిసి లేరు. వనజ తమ ఇంట్లోనే ఉంటే ఎంతో బావుణ్ణని తన్మయి చిన్నప్పుడెప్పుడూ అనుకునేది. అది తీరని కోరికగానే మిగిలి పోయింది. కానీ మేరీ ద్వారా ఇప్పుడా లోటు తీరింది.”
తన్మయి చెప్పిన వివేకానందా పాఠశాల గాథ విని, “అబ్బా, నువ్వు చెప్తూంటే నాకు ఒక సారి వెళ్లి చూసి రావాలని అనిపిస్తూంది. ఓ సారెళ్లొద్దామా” అంది మేరీ.
“అవునూ, నా కథలు వినడమేనా? నీ గురించేమైనా చెప్పేదుందా?” అంది తన్మయి.
అడగగానే మేరీ ముఖంలో దిగులు కమ్ముకోవడం చూసి, “నీకిష్టమైతేనే” అంది సందేహంగా తన్మయి.
“ఇందులో ఇష్టం లేకపోవడం ఏవీలేదు తన్మయీ, గుర్తు తెచ్చుకుని బాధ పడడం మానేసి చాలా రోజులయింది. అంతే.” అంది.
“అయ్యో సారీ” అంది తన్మయి.
“ఫర్వాలేదు తన్మయీ. నువ్వు సారీ చెప్పనవసరం లేదు. నీతో పంచుకోవడం వల్లనయినా నా బాధ ఉపశమిస్తుందేమో. కారణాంతరాలు ఏవైతేనేం నేనూ నీలాగే మోసపోయాను. అతనితో విడాకుల పర్వంలో పాపని కోర్టు అతనికే ఇచ్చింది. అదొక్కటే నాలో నిరంతరం సలిపే బాధ.” అంది.
చివరి మాట చెప్పేటప్పుడు మేరీ గొంతు బొంగురుపోవడం స్పష్టంగా గమనించింది తన్మయి.
నిశ్శబ్దంగా మేరీ చెయ్యి పట్టుకుని నిమిరింది. నిరంతరం మేరీ ప్రార్థనలో మునిగి తేలడం వెనుక కారణభూతమైన విషాదం ఇదన్న మాట .
ఒక్కసారిగా కాళ్లలో సత్తువ పోయినట్లైయింది తన్మయికి.
“పిల్లల మీద తల్లికి హక్కులు లేవా?” మళ్లీ బాధ మొదలయింది.
మేరీని వివరాలు అడిగి మరింత బాధ పెట్టడం ఇష్టం లేదు తన్మయికి.
“మధ్యాహ్నం లాయరు విశ్వతో అప్పాయింటుమెంటు ఉంది. కాస్త ఓపిక పడితే అన్ని వివరాలూ తెలుస్తాయి. అయినా తనని, బాబుని ఎవరూ విడదీయలేరు” అని తనకి తను ధైర్యం చెప్పుకుంది.
***
డిపార్టుమెంటులో స్కాలర్సు రిజిస్టరులో మొదటి సంతకం చేసింది తన్మయి.
సంతకం చేస్తుంటే కన్నీటి పొర కమ్మి, రూళ్ళ పుస్తకంలో గీతలన్నీ అలుక్కు పోయినట్లు కనిపించసాగేయి.
తన పేరు పక్కన “డాక్టర్” అని కనిపించబోయే చిర కాలపు ఆశయానికి తొలి సంతకం అది.
చప్పున మేరీ మాటలు గుర్తుకొచ్చాయి.
“గత అయిదారేళ్లుగా రీసెర్చి స్కాలర్ గా ఇదే హాస్టల్లో ఉంటున్నాను. నా పరిశోధన ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. మంచి గైడు లేకపోతే ఇదే ఇబ్బంది.”
“పరిశోధనాంశం ఏవిటో, గైడుగా అభ్యర్థన ఎవరికి పంపాలో ఏవీ ఇంకా తెలియదు తనకి.” అని ఆలోచనలో పడింది తన్మయి.
నిజానికి తన్మయి జె. ఆర్. ఎఫ్ కి సెలక్టు అయింది కాబట్టి తెలివైన విద్యార్థిని అని డిపార్టు మెంటులో అందరికీ అర్థం అయింది.
తన్మయి ఆరోజు ఏ ప్రొఫెసర్ని కలిసినా, ఎవరికి వారు తమ దగ్గరే చేరమని ప్రతిపాదనలు చేసేరు.
ఎమ్మే తెలుగు చదివి ఏం సాధిస్తారన్న ప్రొఫెసరు కూడా తనకి ప్రతిపాదన చేయడం చాలా హాస్యాస్పదంగా అనిపించింది తన్మయికి.
ఎవరి దగ్గర చేరినా మరొకరికి కోపం వస్తుందన్న విషయమూ గ్రహించింది.
డిపార్టుమెంటులో ప్రత్యేక గౌరవాదరాభిమానాల వల్ల చిక్కులు కూడా ఉంటాయని అప్పుడు అర్థం అయింది తన్మయికి.
తన కాలేజీ జీవితంలో వెన్ను తట్టి ప్రోత్సహించిన హెడ్డు చిదంబరం గారి దగ్గరే చేరాలని తన్మయి ఆకాంక్ష.
అదే చెప్పింది ఆయనతో.
“శుభం భూయాత్, నిన్ను చూసి గర్వ పడే వాళ్లలో మొదటి వాణ్ణి నేను. సంతోషంగా చేరమ్మా.” అన్నారు చిదంబరం గారు.
అన్నీ అనుకున్నట్టు సజావుగా జరిగేయి ఆ రోజు.
బయటకు రాగానే మనసుకి హాయిగా అనిపించింది.
డిపార్టుమెంటు బయట బెంచీ దగ్గరకు వచ్చి కూచుంది తన్మయి.
ఎమ్మే రెండు సంత్సరాలూ చదువుకి అడ్డం తగిలిన అనేకానేక గడ్డు రోజులు, తనకి అడుగడుగునా అండగా నిలబడ్డ మిత్రులు కరుణ, అనంత, రాజు, దివాకర్ లతో కలిసి గడిపిన క్షణాలు కళ్ల ముందు అప్పుడే జరుగుతున్నట్లు కదలాడేయి.
దీర్ఘంగా నిట్టూర్చింది తన్మయి.
“ఇవేళ తను ఇలా జె .ఆర్. ఫ్ కి సెలక్టు అయ్యి, ఇంత సంతోషంగా ఉంటుందని అప్పుడే తనకి తెలిసి ఉంటే ఎంత బావుణ్ణు. బాధలు, దుఃఖాలు, ఆందోళనలు ఉండేవి కావు కదా!” తన ఆలోచనలకి తనకే నవ్వు వచ్చింది.
“ఏవిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు!” ఎక్కడో పరిచయమైనట్లున్న గొంతుకి చప్పున తలతిప్పి చూసింది తన్మయి.
చూడగానే గుర్తు పట్టింది అతన్ని. తనతో ఎం.పీ.సీ గ్రూపుతో ఇంటర్మీడియెట్ చదివిన తన క్లాస్ మేట్. ముఖంలో మీసాలు తప్ప ఏవీ తేడా లేదు.
“మీరు ప్రభు కదూ!” అంది.
“బానే గుర్తు పట్టారు. మిమ్మల్ని నేను గుర్తుపట్టినట్లే” అని,
“భలే కనిపించారు ఇన్నాళ్లకి. మీరేవిటి ఇక్కడ?” అన్నాడు.
“ఆ ప్రశ్న నేనడగాలి, మీరేవిటి మా యూనివర్సిటీ లో, మా డిపార్టుమెంటు దగ్గర” అంది తన్మయి చిన్నగా నవ్వుతూ.
“నేనూ మీ యూనివర్సిటీ లోనే మొన్నే ఎమ్. సి. ఏ పూర్తి చేసానండీ. హైదరాబాదులో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. మీ డిపార్టుమెంటుకి మిత్రునితో చుట్టపు చూపుగా వచ్చేను.” అన్నాడు బదులుగా నవ్వుతూ.
కుశల ప్రశ్నలయ్యేక, “అలా నడుస్తూ , కేంటీన్ లో కాస్త కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి.” అంది తన్మయి.
“మొత్తానికి మీరు చిన్నప్పటి నించి అనుకున్నది సాధించేరన్న మాట. మీ పరిశోధన విజయవంతం కావాలని ఆశిస్తున్నాను” అన్నాడు ప్రభు.
కాఫీ కప్పులు తెచ్చుకుని బయట బెంచీ దగ్గరికి రాగానే మిత్రులతో కలిసి జె. ఆర్. ఎఫ్ కి చదువుకున్న చెట్టు కింద కరుణ కనిపించేడు.
అతని కళ్లలో స్పష్టంగా అసూయా, ద్వేషాలు రగులుతూ కనబడ్డాయి.
తన్మయి చప్పున మొహం తిప్పుకుంది.
“ఏమైంది!” అన్నాడు ప్రభు మ్లానమైన తన్మయి ముఖం వైపు చూస్తూ.
బదులుగా “ఏవీ లేదన్నట్లు” తల అడ్డంగా ఆడించింది.
తిరిగి డిపార్టుమెంటుకి వస్తూనే “అడుగో మా వాడు వస్తున్నాడు. అన్నట్లు మిమ్మల్ని మళ్లీ కలవాలంటే…” సాలోచనగా అన్నాడు.
“నా కేరాఫ్ ఇదే. మరో ఐదేళ్లు ఇదే డిపార్టుమెంటు లో ఉంటాను” అంది సెలవు తీసుకుంటూ తన్మయి.
***
లాయరు విశ్వ ఆఫీసు నించి బయటకు వచ్చే సరికి భోజనాల వేళ దాటిపోయినా ఆకలి వెయ్యడం లేదు తన్మయికి.
మనసులో బాగా అస్థిమితం అలుముకుంది. లాయరు మాటలు చెవిలో గింగుర్లు కొడుతున్నాయి.
“చట్టం ప్రకారం పిల్లలకి తండ్రి సహజ సంరక్షకుడు. అయిదేళ్లలోపు పిల్లలు మాత్రం తల్లి సంరక్షణలో ఉండచ్చు. అయిదేళ్లు నిండిన పిల్లలు తండ్రికే చెందుతారు. అయితే తొమ్మిదేళ్లు నిండిన తర్వాత పిల్లలకి తమ సంరక్షకుల్ని స్వయంగా ఎంచుకునే హక్కు ఉంటుంది.”
“అసలు ఇదెక్కడి న్యాయం?! తండ్రి సహజ సంరక్షకుడా? మరి కడుపున మోసిన తల్లి?
అయిదేళ్ల వయసయినా, పదేళ్ల వయసయినా పిల్లలకి తల్లి ఎంతో అవసరం. తండ్రి ఒక్కడూ పెంచగలడా? తప్పకుండా అతని రెండో భార్య చేతుల్లో పెరగాల్సి వస్తుంది.
అయినా అయిదేళ్లు నిండిన పిల్లలు తండ్రి దగ్గిర నాలుగేళ్లు పెరిగేక, తల్లిని కావాలనుకుని వస్తారా?”
సమాధానాలు లేని ప్రశ్నలతో తలపోటు ప్రారంభమైయింది తన్మయికి.
బాబు దూరం అవుతాడేమో అన్న ఆందోళనకి కడుపులో దేవడం మొదలు పెట్టింది.
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.