రుద్రమదేవి-6 (పెద్దకథ)
-ఆదూరి హైమావతి
” ఏంచెప్పమంటవు రుద్రా! ఆమె అత్తే ఆమెకు స్వయంగా మృత్యుదేవతైంది. పాపం కల్లాక పటం తెలీని అమాయకురాలు ,నిలువునా బలైపోయింది ,అంత చిన్నపిల్లను కోరిచేసుకున్న కోడల్నిఅలా చంపను ఆరాక్షసికి ఎలాగా మనసొ ప్పిందో తెలీదమ్మా ” గద్గదస్వరంతో చెప్పి తిరిగి ఏడవసాగింది అరుంధతి.
” అత్తా! మీరిలా ఎంతసేపు ఏడ్చినా లాభంలేదు ముందు విషయం చెప్పండి, ఆ తర్వాత ఏంచేయాలో ఆలోచిద్దాం “అని రుద్ర మెల్లిగా వారికిచెప్పి లేవదీసి లోనికి తీసుకెళ్ళి కాస్త కుండ లోని చల్లని నీరు కలిపిన మజ్జిగ బలవంతాన తాగించి , కూర్చోబెట్టింది.
” ఇప్పుడు మామా! మీరుచెప్పండి విషయమంతా, అసలా టెలిగ్రాం ఎవరిచ్చారు? ఎప్పుడిచ్చా రు ? దాన్లో ఏముందో చెప్పండి,ఏదీ ఇలా ఇవ్వండి నేనూ చూస్తాను ” అంటూ టెలిగ్రాం తీసు కుని చదివి ,
” ఇదేంటి మామా! చనిపోయి వారమైమ్నట్లు దీన్లో ఉన్నది ,ఈ టెలిగ్రాం ఇచ్చి మూడురోజు లైంది ! మీ కెపుడు చేరింది?” అని అడిగింది రుద్ర. .
” రుద్రా ! ఈటెలిగ్రాం మా అన్నగారు మల్లేశ్వరయ్య అదే ముత్యాలు తండ్రిగారికి వచ్చింది నిన్ననేట! ఆయన తన స్నేహితునిద్వారా నాకు పంపారు. ఇందాకే అతడువచ్చి ఇచ్చి వెంట నే’ ఆయన టెలిగ్రాం చూడగానే బయల్దేరారు ఆపిల్లల్ని చూసి ఓదార్చను ఎవరున్నారు, నేను వెళతాను, మీరు నేరుగా రైలుకు రాజమండ్రి రండి. ‘అనిచెప్పి వెళ్ళాడమ్మా!’ అసలా పిల గాడికి వరాల్నివ్వవలసింది, వాడేమో అంత చదవలేదు. అందుకే ముత్యాలునిచ్చాం , అదే దాని మృత్యుగుహై యమలో కానికి పంపింది.”
” సరే మామా ! ఏంజరిగిందో వివరంగా మీకు తెల్సినంతవరకు చెప్పండి.” అడి గింది రుద్ర…
” రుద్రా! ముత్యాలు భర్త లక్ష్మీనరసు మంచివాడే కానీ ,తల్లికొంగుచాటుబిడ్డ, ఆ ఇంటి ఆడ పడుచు భర్త దగ్గరకెళ్ళదు, ఇద్దరూకల్సి ముత్యాల్ని కాల్చుకుతి న్నారు .ఆవిషయం లక్ష్మీ నరసు స్వయంగా మా అన్నగారైన మల్లేశ్వరయ్యకు ఉత్తరం వ్రాశాడు, పైగా ఆవిషయం గుప్తంగా ఉంచమనీ ,మీఅమ్మాయిని ఇంటికి తీసు కెళ్ళండనీ కూడా వ్రాశాట్ట! మా అన్నగారు సఖినేటిపల్లికి వెళ్ళేప్రయత్నంలో ఉండగానే ఈ ఘోరం జరిగిపోయిందిట!. నిన్నవచ్చిన అన్నగారి స్వేహితుని ద్వారా ఇవన్నీతెలిశాయి.” చెన్నకేశ్వరయ్య దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పాడు.
” మామా! అలాంటివారిని విడువరాదు , మన ‘స్పందన’ సంస్థలో ఉన్న వకీళ్ళ నిద్దరిని తీసుకుని వెళదాం ,నేనూ మీతో వస్తాను పదండి , ప్రయాణంకండి మనం వెళ్ళి నిజం నిగ్గు తేల్చి, వాళ్ళపని పట్టి వద్దాం. పెద్ద మామ మల్లేశ్వరయ్య ఒక్కడే వెళ్ళి ఏమీ చేయలేడు. నేనిం టికి వెళ్ళి అమ్మకు,నాన్న, తాత గార్లకు చెప్పి బట్టలు సర్దుకువస్తాను. పిల్లలిక్కడ వంటరిగా ఉండలేరు , వీళ్ళను తీసుకురండి, మా ఇంట్లో వదలి మనం వెళదాం ” అనిచెప్పి వాళ్ళ మాటకు ఎదుర్చూడ కండా సైకిలెక్కింది రుద్ర..
రుద్రపట్టుదలచూసి ,తండ్రి భానుచంద్ర- తాత హనుమంతప్ప అన్నిఏర్పాట్లూ చేశారు. వకీళ్ళను వెంటపెట్టుకుని అంతా బయల్దేరారు రాజమండ్రి రైలుకు.
***
సఖినేటిపల్లి మంచి సారవంతమైన పొలాలున్న ఊరు.అంతా చాలామంచి వారు. రైతులు. రఘురామయ్య భార్య భానుమతమ్మ మాత్రం పరమగయ్యాళి. ఎందుకో ఆమెకు తోటిస్త్రీలపట్ల,కూతురు ఈడు న్న అమ్మాయిల పట్ల భయంకర మైన కక్ష ! ఎవ్వరూ ఆమెతో మాట్లాడరు. ఆమె కుమారుడే లక్ష్మీనరసు. తల్లంటే భయం,ఆమె ముందు అన్నం తిననే భయపడతాడు. ఏదో ఉండూర్లో వున్నస్కూల్లో చదవనూ రాయనూ నేర్చాడు. తండ్రితో కలసి వ్యవసాయం చూసుకుంటూ బ్రతు కుతున్నాడు.అలాంటి వాడికి పెళ్ళి చేయటమే అనవసరం. రఘురామయ్యకూ భార్య నోరంటే మహాభయం.
ఎవ్వరూ ఎరిగిన వారు పిల్ల నివ్వలేదు.తన రాకాసి తనానికిబలికాను ఎవరోఒకరు అమాయకు రాలు కావాలిగదా ఆభానుమతికి, దూరంగాఉన్న అంబాజీపేటలోని మల్లేశ్వరయ్యకు ఆ ఆడ రాక్షసి విషయం తెలీక వారిఇల్లు,ఆస్థిపాస్థులూ చూసి భ్రమించి ఎవ్వరివద్దా మంచీ చెడూ విచారించు కోకుండానే తన మొదటి పుత్రిక ముత్యాలునిచ్చి చేశాడు లక్ష్మీనరసుకు.
కట్నండబ్బు ఐదొందలు వెంటనే వివాహ ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళి సమయంలో ఇవ్వ లేనని అందువల్ల మరికొంత సమయ మయ్యాకపెళ్ళి ముహూర్తం పెట్టుకుందామనీ మల్లేశ్వ రయ్యకోరగా, కొంతకాలం ఆగితే తన విషయం తెల్సి పోయి కొడుక్కు ఈ సంబంధమూ తప్పి పోతుందనే భయంతో భానుమతమ్మ ” కట్నం డబ్బుల దేముంది లెండి అన్నయ్యగారూ! పంటడబ్బు చేతికందాకే ఇవ్వచ్చు, ఈలోగా మన పిల్లల అచ్చటా ముచ్చటా ఎందుకు బదలా ఇంచడం”అని చెప్పిలేని తన మంచి తనాన్ని ప్రదర్శించింది. పెళ్ళిపీటల మీదే పద్దెనిమి దేళ్ళ ఆ పిలగాడు అన్నింటికీ తల్లిని చూడ్డం ఆమె తలూపాకే పురోహితు డు చేయమన్న క్రతువులు చేయటం అందర్నీ ఆశ్చర్యపరచినా, ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు పెళ్ళి సందట్లో.
ఊరివారంతా ఆఇంట అడుగుపెట్టిన అమాయకురాల్ని తల్చుకుని బాధపడ సాగారు.
” పాపం ఈపిల్ల ఇక్కడెన్ని నాళ్ళుంటుందో!”
” అసలీ అమాయకప్పిల్లను ఈ రాకాసి బ్రతకనిస్తుందా?”
” నోట్లో నాలికలేని ఈ పిలగాడికి పెళ్ళొకటా!”
” నిజం తెలిసి చెప్పని పాపంఫలం మనకు వస్తుందేమోనని నాకు భయంగా ఉంది అక్కా!
” పాపం పిల్లనెంత గారంగా పెంచుకున్నారో తెలీక ఈ ఊబిలో వేసి వెళుతున్నారు “అని ఊరి ఆడవారు మాట్లాడుకున్నారు.
పాపం తెలీకుండానే ముత్యాల్ని అగ్ని గుండంలోకి తోశాడు అమాయకంగా మల్లేశ్వరయ్య.
పిల్లను అత్తింట గృహప్రవేశానికి తీసుకెళ్ళినపుడే ముత్యాలు తల్లి మంగమ్మకు ఆఇంటి వ్యవ హారం , ఇంటి ఆడపడుచు చెంచులక్ష్మి వింతవైఖరీ ,ఊరివారి నెవ్వ ర్నీపిలవక పోడం ,గ్రామం లో వారికి పసుపు కుంకుమలు సారెపంచను సైతం ఇష్టపడని భానుమతమ్మ ప్రవర్తనా ,ఇరుగు పొరుగు ఎవ్వరూ ఆఇంటికి రాకపోడం ,చిత్రంగా అనిపించినా ఏమీఅడగలేక పోయారు. పిల్లా డిని మనుగుడుపులకు కూడా పంపలేదు భానుమతమ్మ.
“దాందే ముందిలే వదినా! అనవసరపు ఖర్చు.అసలే పెళ్ళికి బోల్డంత ఖర్చు చేసు కున్నారు, మంచి రోజు చూసి పిల్లనుతెచ్చి దింపండిచాలు” అని చెప్పడంతో అంతా భానుమతమ్మ మంచి తనానికి నివ్వెరపోయారు .’ఇంత మంచివారూ ఉంటారా!’ అని ఆశ్చర్యపోయారు. పిల్ల సుఖ పడుతుందని మురిసి పోయారు.
మంచిరోజుచూసి ముత్యాలును తీసుకెళ్ళి అత్తింటదించను సఖినేటిపల్లికి వెళ్ళారు మంగ మ్మ ,అరుంధతి, తమ పిల్లలతో పాటుగా .మూడు రోజులున్నారు .ఆ మూడు రోజులూ భానుమ తమ్మ ఎవ్వర్నీ ఏపనీ ముట్టనివ్వలేదు. ముత్యాల్నైతే మంచందిగి గది దాటి బయటికి రానివ్వ లేదు.
లక్ష్మీనరసు , అతడి తండ్రీ భానుమతమ్మలో వచ్చినమార్పుకు ఆశ్చర్యపోయారు. చావిడి మధ్యలో ఉన్నచెక్క బల్లమీద ఒక గిన్నె నిండా కారప్పూస పెట్టింది భాను మతమ్మ. ఆమె ఉదయాన్నే కొంగులో కారప్పూస పోసుకుని నముల్తూ వాకిలి ఊడ్చి ముగ్గేసి వచ్చి చావిట్లోని కారప్పూస గిన్నెచూట్టం, గిన్నెలు తోమి వచ్చి కారప్పూస గిన్నెచూట్టం, అలా ప్రతిపనీ చేసి వచ్చి ఆమండువాలోని గిన్నె కేసి చూట్టం గమ నించి రెండు రోజులయ్యాక దానికి చీమలు పట్టగా ఉండలేక ” వదినగారూ! ఎందు కండీ ఆగిన్నెనిండా కారప్పూసపోసి అలాఉంచారు ! చీమలు పట్టాయి కూడానూ?” అని అడిగింది అరుంధతి, భానుమతమ్మని .
” ఏం లేదువదినా!మీపిల్లలు కానీ,ముత్యాలు కానీ దాన్నితీసుకు తింటారేమోని పరీక్షించనే! మీపిల్లలు మంచివారే !తాకనేలేదు.” అంది. మంగమ్మ ,అరుంధతి, ఇదేం పరీక్ష అని ఆశ్చర్య పోయారు.
అరుంధతి చాటుగా ముత్యాలుతో “తల్లీ !ముత్యాలూ !జాగ్రత్తమ్మా!నీఅత్త తత్వం నాకు కాస్త అనుమానం గాఉంది.ఏమైనా ఆమె వేరేగా ప్రవర్తిస్తే వెంటనే మాకు ఉత్తరం ముక్క రాయి. ఏమాత్రం సంకోచించకు “అని చెప్పింది.
మూడోనాడు ముత్యాల్ని భానుమతికి అప్పగించి అంతా వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఇక భాను మతమ్మ అసలు రూపం బయల్పడింది. ముఖానికున్న మంచి తన మనే ముసుగు తొలగింది.
” ఏమే! ముత్యం ! తీసుకున్న విశ్రాంతి ఇహచాలుగానీ, అంట్లుతోమి గోదారికెళ్ళి నీళ్ళు తీసు కురా ! ఈ బావినీరు తాగను బావుండవు ” అని ఆఙ్ఞాపించింది. పెద్దబానంత ఇత్తడి బిందె చేతి కిచ్చింది. అదిమకిలి పట్టిఉంది.” చూడూ బిందెను గోదారి వద్ద తళతళా ఇసుకతోతోమి నీళ్ళు పట్టుకురా! అలాగే తెచ్చేవు..” అని చెప్పింది.
ముత్యాలు నిజంగా ముత్యమే!మంచి తెల్లనిరంగుతో సన్నగా నాజూగ్గా పెద్దవాలు జడతో మెరిసి పోతుం టుంది. ఆఖాళీ బిందె బరువు నెత్తనే ఆపదమూడేళ్ళ చిన్నా రికి కష్టమని పించింది. ఇహనిండా నీళ్ళతో ఎలా ఎత్తగలనా అని భయ పడింది. పైగా కనీసం మూడు మైళ్ళ దూరంలో ఉంది గోదా వరి నీటిపాయ. ఎలాగో బయట బావివద్ద వేసిన గిన్నెలన్నీతోమి , పరకడుపుతోనే బిందెపట్టు కుని గోదారికెళ్ళింది, ఆసరికే అక్కడ ఊరిజనమంతా నీళ్ళకోసం గుడ్దలుతుక్కోను చేరి ఉన్నారు. వారంతా ” ఏమ్మా! కాళ్ళపారాణి ఆరక ముందే నీఅత్త గోదారి నీళ్లకంపిందా?! ” అని ఆశ్చర్యంగా అడిగారు .
ముత్యాలు ఓనవ్వు నవ్వి ఊరుకుంది , ఎవరితో ఏమంటే ఏమవుతుందోని ఆమె భయం, అసలే మెతక పిల్ల, ఊరా కొత్త. అత్తాకొత్త .బిందెను తళతళ లాడేలా ఇసు కేసి తోమేసరికి పల్చటి ఆమె అరచేతుల చర్మం లేచిపోయి మంటరేగింది. ఎలాగో బిందె నింపుకుని బయల్దేరింది అడుగులో అడుగేసు కుంటూ మెల్లిగా నడిచి వచ్చే సరికి సూర్యుడు పైకొచ్చేశాడు .ఇంట్లో కాలు పెట్టిన ముత్యాల్ని చూసి, భానుమతి ” ఏమే పిల్లా! గోదారి చెంత ఎవరితో మాట్లాడుతున్నావింత సేపూనూ?” అని గద్దించింది.
” లేదు అత్తయ్యగారూ !నాకు నీళ్ళు మోయటం కొత్త , అందువల్ల బిందె తోముకుని మెల్లిగా నడుస్తూ వచ్చే సరికి ఆలస్య మైంది ” అని జవాబివ్వగానే ” ఏంకూర్చుని తిందా మనుకున్నా వా ఇక్కడ ఒళ్ళొంచి పనిచేస్తేనే ముద్ద, తల్లింటిగారాలు ఇక్క డ కుదరవ్ !” అని హెచ్చరించిం ది. ఆమె మాటలూ ప్రవర్తనా గతమూడు రోజుల కన్నా భిన్నంగా ఉండటం కసురుకోటం వింత గా అనిపించింది ముత్యాలుకు.
మధ్యాహ్న మవుతున్నా బట్టలుతకమనీ , ఇళ్ళు మళ్ళీ మళ్ళీ చిమ్మమనీ చెప్తూనే ఉంది కానీ , ఫలహారంకానీ , పాలుకానీ ఇవ్వనేలేదు ముత్యాలుకు భాను మతి. పనులన్నీ చేసి స్నానం చేసేసరికి మధ్యాహ్నం మూడైంది, ఆకలితో కడుపు నకనక లాడసాగింది. అప్పుడు అంతా భోజ నాలు చేశాక రాత్రి మిగిలి పోయిన ఎండిన మెతుకులూ ,చారూ ఒక కంచంలో పెట్టి కొత్త కోడలికి ఇచ్చింది భానుమతమ్మ.
*****
(ఇంకా ఉంది)
నేను 40 సం. [యం.ఏ. బియెడ్] ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యా యినిగా పనిచేసి 2004 లో వృత్తి విరమణపొందినాను.
ఆరోజుల్లో ఆకాశవాణి విజయ వాడ కేంద్రం నుండి వ్యాసాలు, నాటకాలు, టాక్స్ ప్రసారమయ్యాయి. ఎక్కువగా బాలవిహార్లో వచ్చాయి.
4 మార్లు జిల్లా స్థాయిలోనూ , 1992లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా య అవార్డు , 1994 లో జాతీయస్థాయిలో ఉత్తమ జాతీయ స్థాయి ప్రధానోపాధ్యాయినిఅవార్డు, 2003లో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీచే జాతీయ స్థాయి అవార్డు [ ఇన్నో వేటివ్ టెక్నిక్స్ ఇన్ క్లాస్ రూం టీచింగ్ అనే రిసెర్ఛ్ అంశానికి] గోల్డ్ మెడల్ భగవంతుని కృపతో అందాయి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మానవతా విలువలను . భారతీయ సంస్కృతినీ లేతవయస్సులో పిల్లల మమనస్సుల్లో నింపాలనే ప్రయత్నంతో, 1969లో స్థాపించిన బాలవికాస్ అనే ఉచిత మానవతా విలువల బోధనా తరగతులు నిర్వహిస్తూ ,ఒక సేవకురాలిగా 1978 నుండీ వుంటూ, స్టేట్ రిసోర్స్ పర్సెన్గా 1985నుండి రాష్ట్రస్థాయి పర్యటనలు సంస్థ తరఫున సాగిస్తూ ఈ రోజువరకూ జీవిస్తున్నాను. ప్రస్తుతం పుట్టపర్తి ఆశ్రమ ఐఛ్ఛిక సేవలో జీవనం కొనసాగుతున్నది.