కనక నారాయణీయం -32

పుట్టపర్తి నాగపద్మిని

          వాట్కిన్స్ ముఖంలో ఆనందం తాండవిస్తూంది.

          ‘అంతకంటేనా సార్?? గొప్ప పని కదా?? పుస్తకంతో పాటూ, నా పేరు, పుట్టపర్తి వారి పేరు, మన స్కూల్ పేరు నిలిచిపోతుంది, జాగ్రత్తగా భద్రపరచ గల్గితే!! నాకు కావలసిన సరంజామా, ఆయా కవుల వివరాలూ, చిత్రాలూ ఇస్తే, నా శక్తికి మించి యీ గొప్ప పనిలో పాలు పంచుకుంటాను తప్పక!!’ అన్నాడు.

          అలా ఒక గొప్ప చారిత్రాత్మక కార్యక్రమానికి పునాది పడింది, కడప రామకృష్ణా హైస్కూల్ లో ఆ రోజు!!

***

          కొన్ని రోజుల తరువాత, మర్రి చెట్టుకింద పాఠాలు చెబుతున్న పుట్టపర్తి పిల్లలతో అన్నారు., ‘ ఒరే పిల్లలూ!!వాట్కిన్స్ సర్ తయారు చేసిన ఆ పెద్ద గ్రంథం చూశినారారా ఎవరైనా??’

          అంతవరకూ పాఠాన్ని శ్రద్ధగా అల్లరి చేయకుండా వింటున్న పిల్లలకు ఉత్సాహం ముంచుకొచ్చింది.

          ‘చూసినాము సర్!! అబ్బబ్బ..ఎంతమంది ఫోటోలో!! వాళ్ళల్లో మీ ఫోటో గూడా ఉంది సార్!!’

          ‘నా ఫోటో సంగతి సరే..ఇంకా చాలామంది వివరాలూ, చిత్రాలూ మన వాట్కిన్స్ సార్ ఎంతో శ్రద్ధగా వేసి, మంచి వ్రాతలో వాళ్ళ గురించి రాసినాడు కదా!! మీరు కూడా బాగా చదువుకోని, మీ అవ్వా తాతలూ, మీ అమ్మా నాయనలూ మిమ్మల్ని మెచ్చుకుని ఆశీర్వదించే విధంగా మంచి పనులు చేయాలర్రా!!’ పుట్టపర్తి మోములో సంతోషం.

          ‘సార్!! మీకు కూడా అవ్వా తాతా ఉన్నారా సార్??’ ఒక కొంటె పిల్లాడి ప్రశ్న.

          పిల్లలంతా ఘొల్లున నవ్వేశారు. పుట్టపర్తికి కూడా నవ్వొచ్చింది. ‘ఆఆ..ఎందుకు లేరు?? నాకూ ఉండేవారు. కానీ మా తాత, అంటే, మా తండ్రిగారి తండ్రిగారు, నేను చూడక ముందే ఎప్పుడో కాలం చేసినారు. మా అవ్వ, అంటే నాయనమ్మ ఇంట్లోనే ఉండేది. ఆమెకు నేనంటే ప్రాణం రా!!’

          ‘ఇప్పుడు మీరింత పెద్దోళ్ళైనారు గదా!! ఆమె మిమ్మల్ని చూసి ఏమంటాది సార్?’

          పుట్టపర్తికి పిల్లల ప్రశ్నలకు సమాధానం ఏమి చెప్పాలో తోచలేదు. కన్నుల్లో నీరు నిండి, మనసంతా ఆర్ద్రమైపోయింది, తన నాయనమ్మను తలచుకోగానే!! కానీ ఎలాగో నియంత్రించుకుని అన్నారు, ‘పాపం, ఆమె నా 16, 17 వ ఏట కన్ను మూసింది. నా చదువును చూసి నన్ని0కా బాగా చదువుకోమని చెప్పేది లెండి.’ ఇంతలో బెల్ మ్రోగింది. పిల్లలు పొలోమంటూ, పక్షుల్లా ఎగిరి వెళ్ళిపోయారు, తదుపరి క్లాస్ కోసం!!

          పిల్లలు వెళ్ళిపోయినా పుట్టపర్తి మనసు తన నాయనమ్మ స్మృతుల్లోంచీ బయటికి రానని మొరాయిస్తున్నది.

          ‘నన్ను అల్లరి నారాయణుడిగా చూసిందే గానీ, నేను బుద్ధిగా చదువుకోవడం, పదుగురూ మెచ్చుకోవడం చూడనేలేదు పాపం!! ఎన్ని పాటలు పాడేదో ఆవిడ ఎప్పుడూ!! పనీ పాటా చేసుకుంటూ, పాటలు!! రాత్రి నిద్ర పట్టక పోతే పాటలు!! అన్నీ రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించిన పాటలు!! అస్సలు మర్చిపోకుండా ఎలా గుర్తు పెట్టుకునేదో ఆవిడ!! ఆమె బొంగురు గొంతులో తెల్లవార్లూ పాడుతూ ఉంటే, ఇంట్లో వాళ్ళంతా కసురుకునే వాళ్ళూ, నిద్ర పట్టకపోతే రామా కృష్ణా అని మౌనంగా పారాయణం చేసుకోవలె గానీ, ఇట్లా మమ్మల్నీ నిద్ర పోనీకుండా చేస్తావెందుకమ్మా తల్లీ!!” అని!! కానీ అప్పుడప్పుడు తాను కూడా శ్రద్ధగా ఆమె దగ్గర కూర్చుని వినేవాడే!! భారతంలో పండు కథ, ధర్మరాజుతో మొదలై అన్నదమ్ములందరూ తమ మనసులో దాచుకున్న నిజాలు చెప్పాలన్న నియమం!! కథా భాగం తెలుగులోనే!! కానీ వాళ్ళ మాటలు సంస్కృతంలో ఉండేవి. ద్రౌపది మనసులోని మాట చెప్పటం, పండు స్థితిలో మార్పు లేక పోవటం, కర్ణునిపై మనసుంది అనగానే, పండు పైకి వెళ్ళటం!! కథలో నీతి, స్త్రీలకు తృప్తి అనేది ఉండదు..’ అని!! ఇటువంటి కథలు ఎన్నెన్నో!! ఇప్పుడనిపిస్తుంది,’అయ్యో, ఆమె పాడే పాటలన్నీ భద్ర పరచి ఉంటే బాగుండేది కదా అని!! ఏం చేస్తాం? గత జల సేతు బంధనం!! అసలు ఇంట్లో ఉండి ఏడిస్తే గదా తాను!! ఎప్పుడూ అల్లరే!! కానీ, అప్పుడప్పుడు, తాను వ్రాసిన పద్యాలు వినిపిస్తూ ఉండేవాడు. అందుకే ఆమెకు తన యీ మనవడంటే, అంతులేని ప్రేమ!! ‘ నీవు బాగా చదువుకోని, వంశానికి పేరు తేవలె గానీ చిల్లర మల్లరగా తిరగడమేమిటి?? నాకు తెలుసు రా!! నీది మీ తాత పేరే!! ఆయన కూడా మంచి పండితుడు. నీవూ గొప్పవాడివి కావాల!! మీ అయ్యను చూడు!! ఊళ్ళో ఎంత పేరు ప్రతిష్ట!! రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ చూడు మైసూరులో పేద్ద ఉద్యోగం!! నీవూ అట్లా మంచి పేరు తెచ్చుకోవలె!!అల్లరి మానుకోరా నాయనా!! మీ అయ్య మాట విని బాగా చదువుకో!!’ అని బుద్ధులు గరపేది. ఆమె ప్రేమ కురిపిస్తున్నా తనకు అస్సలు అర్థమయ్యేదే కాదు!! వయసు ప్రభావమేమో!! పైగా ఆమెకు బాధ కలిగించే పనులే చేశాడు కదా తాను!! అవన్నీ గుర్తుకు వస్తే, మనసు చివుక్కుమంటుంది. పెనుగొండలో కోతులెక్కువ అప్పట్లో!! వంటింట్లో కోతి !! పిన్నమ్మ ఎక్కడో వుంది. కోతిని తరమాలి. సూటిగా విసరాలనుకుని ధాటీగా వేసిన రూలు కర్ర కాస్తా దారి తప్పి, సరాసరి పక్కనే కూర్చుని వున్న ఆమె కంటికి వెళ్ళి తగిలింది. ఇంకేముంది?? ఏడుపులూ పెడబొబ్బలూ!! తొంగి చూస్తే, పాపం, అవ్వ కన్ను పట్టుకుని ఏడుపు, రక్తం కూడా వస్తున్నట్టుంది.అయ్య ఇంట్లో లేడు. పిన్నమ్మ వచ్చేలోపల..భయంతో పరుగే పరుగు!! మధ్యాహ్నం బైటికి వెళ్ళిన తాను రాత్రెప్పుడో ఇంట్లోకి వచ్చాడు. ఐనా ఆ రాత్రప్పుడు కూడా కాచుకుని కూర్చుని మరీ అయ్య తనను ఉతికి పారేశాడు. వాళ్ళ అమ్మ కన్నుపోయేలా కొట్టాను కదా!! చాలా రోజులు ఆమెకు వైద్యం జరిగింది. కన్ను పోవలసిందేనట!! పసర్లు వంటివి వాడితే, కాస్త చూపు తిరిగి వచ్చింది. ఒక రోజు, అవ్వ దగ్గరికి పిల్చి నా దెబ్బలు చూసి నొచ్చుకుని చెప్పింది,’ఒరే!! నిన్ను కొట్టవద్దని వాడి దగ్గర ఒట్టు వేయించుకున్నా కదా!! నేనే అడ్డొచ్చానని చెప్పినా, నిన్ను కొట్టినాడా?? రానీ వాణ్ణి ఇంటికి!!’ అనింది కోపంగా!! అంత ప్రేమ తనంటే ఆమెకు!! ఇంకోసారి, బైటినుంచీ ఇంట్లోకి పరిగెత్తుకుని వస్తూ, దొడ్లోనుంచీ ఇంట్లోకి వస్తున్న ఆమెకు ఢీకొడితే, పాపం, ఒక కాలు బాగా దెబ్బ తిన్నది.

          తండ్రి శ్రీనివాసాచార్యుల మందలింపుతో విసిగి, ఒకసారి ఇంట్లోనుంచీ చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయి నెల రోజులపాటు ఇంటికి రాలేదు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే, ఎవరి ద్వారానో తెలిసింది, ఆరోగ్యం బాగా లేకున్నా,ఆమె నా పేరే కలవరిస్తూ, ఏడుస్తున్నదని!! అప్పుడు తెలిసింది, నా మీద ఆమెకు ఎంత ప్రేమో!! ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసరికి పాపం కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని నాకోసం ఎదురు చూస్తూ, ‘వచ్చినావా అయ్యా!! నీ అంతకు నీవే వచ్చినావా?? నిన్ను వెదికించమని వాడికి చెప్పి చెప్పీ నోరు పడిపోయింది నాకు!! పోనీలే!! ఈ అవ్వను చూసేకి ఇప్పుడైనా వచ్చినావురా మనవడా!!’ అని ప్రేమగా ఒళ్ళంతా నిమిరింది తృప్తిగా!! ఆ రాత్రే పాపం చనిపోయింది. ఇప్పుడు ఒకసారి గతమంతా తలచుకుంటే, పశ్చాత్తాపం!! ‘ ఇదీ నా బాల్యం అని ఎవరికైనా చెప్పుకుందామన్నా మనసు ఒప్పుకోదు. బాల్యంలో ఎవరైనా ఇట్లాగే ఉంటారని అది సహజమే అని అనుకున్నా, ఇంట్లో పెద్దవాళ్ళ ప్రేమను పొందటం, వాళ్ళకు సాయం అందించటం కూడా పుణ్యమే కదా!! అది నాకు దక్కలేదు. ఇప్పుడు మా అవ్వా, అయ్యా ఉండి ఉంటే నా పేరూ, ప్రతిష్టా చూసి సంతోషించేవారేమో!!’ పుట్టపర్తి పెదవులపై చిన్న నవ్వు, కళ్ళల్లో తడి!! …………………..

          వాట్కిన్స్ చేతిలో పాత న్యూస్ పేపర్లో ఏదో చుట్టి ఉన్నట్టుగా కనిపిస్తున్నదాన్ని పక్కన పెట్టి కూర్చున్నాడు.

          ఏమిరా అది?? అడిగారు పుట్టపర్తి.

          అతనన్నాడు,’ స్వామీ!! ఈ బొమ్మ చాలా విలువైనదంట!! వాళ్ళ ఇంట్లో పూజలో ఉందంట!! దీని బాగా పాతబడి పోతుంది, కొత్తది కొందామంటే దొరకడం లేదంట!! నిన్న ఎవరో దీన్ని ఇచ్చి, దీని లాగే ఇంకో పేయింటింగ్  వేసి ఇమ్మన్నారు. ఇంతకూ ఎవరు స్వామీ యీ దేవత?? కొంచెం చూడండి.’

          వార్తా పత్రికలో చుట్టివున్న పాత బొమ్మ తీసి చూస్తే, తెలిసింది ఆ బొమ్మ వారాహీ దేవిది!! శాక్త పూజలలో వారాహీ ఉపాసన, శత్రు భయాన్ని బాపుతుంది. విష్ణువు వరాహ మూర్తివలె యీ అమ్మవారికి కూడా వరాహ ముఖం ఉంటుంది. పరిశీలనగా చూస్తున్న పుట్టపర్తిని వాట్కిన్స్ అడిగాడు.’ నేను వేయవచ్చా స్వామీ యీ బొమ్మను??

          ‘ఒరే వాట్కిన్స్!! బొమ్మ వేయడానికేముంది!! చక్కగా శ్రద్ధగా వేసి ఇవ్వు.’

          ‘ ఇంతకూ ఎవరీ దేవత స్వామీ??

          ‘ఈమె వారాహీ దేవి. అమ్మవారి సప్త మాత్రుకలలో ఒకరు. దశ మహా విద్యలలో ఒకరిగా కూడా యీమెను కొలుస్తారు. ఐనా నీవు క్రిస్టియన్ కదా!! నీకెందుకురా ఇవన్నీ?? ‘ నవ్వారాయన!!

          ‘మరి నా దగ్గరికి పేయింటింగ్  చేయమని పట్టుకుని వచ్చారెందుకు వాళ్ళూ?? అది చెప్పండి. ‘నవ్వుతూ అన్నాడు వాట్కిన్స్ కూడా!!

          ‘నీ వృత్తి పేయింటింగ్ కదా!! నీవు బొమ్మలు బాగా వేస్తావు. నీ పాలిటికి నీ కళే నీకు దేవుడు. అంతే!!’

          ‘ఆ..అందుకే అంటున్నా, యీమె గురించి ఎవరు ఏమిటి అని తెలిస్తే మరింత శ్రద్ధగా సరిగ్గా వేస్తాను. మీరన్నట్టు, బొమ్మ వేసేటప్పుడు ఏకాగ్రతే, నా వరకు నాకు దేవుడు స్వామీ.’

          ‘భలే చెప్పినావురా!! నిజమే!! ఐతే విను!! శత్రువులనుండీ రక్షణ, అన్నిటా విజయం కావాలనుకునే వాళ్ళు , ఇంట్లో వంశ పారంపర్యంగా యీ దేవి పూజ ఉంటే కూడా చేసుకుంటారు. నేను తెలిసీ తెలియని వయస్సులో వారాహీ అమ్మవారి మంత్రోపాసన చేసినాను రా!!.’

          ఇప్పుడు ఆశ్చర్యపోవటం వాట్కిన్స్ వంతైంది. ‘అమ్మో స్వామీ!! మీరు అసాధ్యులు. ఏదో కావ్యాలు వ్రాసుకుంటూ, జపం చేసుకుంటూ కూర్చుంటారనుకోకూడదు. మిమ్మల్ని కదిలిస్తే ఎన్నో సంగతులు తెలుస్తాయి. అన్నిట్లోనూ ప్రయోగాలు చేసి, ఇక్కడికొచ్చి, యీ మర్రి చెట్టుకింద సుఖంగా కూర్చున్నారన్న మాట!!’గలగలా నవ్వుతూ అన్నాడు. ‘చెప్పండి స్వామీ, వారాహీదేవి పూజ మీరెప్పుడు చేశారు?? అసలు అప్పుడు మీ వయసెంత??’

          ‘అప్పుడు నాకు పద్నాలుగేళ్ళు ఉంటాయేమో!! మా అయ్యగారు శ్రీనివాసాచార్యుల దగ్గరి బంధువు కృష్ణమాచార్యులు అనే అతను పెనుగొండ దగ్గర మరిమాకుల పల్లె అనే చోట ఉండేవాడు. ఆయనకు కాళ్ళూ నడవటానికి అనుకూలంగా లేక సొట్టగా (వంకర టింకరగా) ఉండేవి.!! నడవటం చాలా కష్టం. వొళ్ళంతా నామాలు, వెంట్రుకలు జడలు కట్టిన తల, పెద్ద గడ్డం – ఇదీ అతని రూపం. కానీ మంత్ర శాస్త్రం లో ఉద్దండుడు. ఉత్తర భారతంలో కొంత కాలం ఉండి మంత్ర శాస్త్రం బాగా నేర్చుకుని వచ్చాడంటారు. ఎలాగో నాకు ఆయనంటే ఆకర్షణ ఏర్పడింది. ఆయనను చూస్తే చాలామందికి అప్పట్లో భయమట!! పెద్ద చిగుళ్ళరేవులో ఉండే రెడ్ల కుటుంబాల వాళ్ళకు ఏదో సందర్భంలో ఈయనతో విరోధం ఏర్పడి, నానా అగచాట్ల పాలయ్యారని, అందుకే ఆయన జోలికి పోవటమెందుకని ఆయనకు దూరంగానే ఉండేవారు. కానీ అదేమి చిత్రమో కానీ, నాతో ఆయన చాలా చనువుగా వుండేవాడు అప్పట్లో ఆయన వద్దనుంచీ ‘వనదుర్గ ‘ ‘ వారాహి ‘ వంటి ఉపదేశాలు పొంది బాగా సాధన చేసినాను కూడా!! ఇక్కడొక ముఖ్యమైన విషయం. మంత్ర శాస్త్రంలో, ఒక్కొక్క సాంప్రదాయానికి కల్ప గ్రంధాలని కొన్ని వివరణ గ్రంధాలుంటాయి. ఆ మంత్రం జపించేవారు చేయవలసిన సంధ్యావందన సంఖ్య, కూర్చోవలసిన దిక్కు, విడువవలసిన అర్ఘ్యము, వీటి వివరాలు ఆ గ్రంధంలో ఉంటాయి. ఆ రెండు కల్ప గ్రంధాలు కూడా కృష్ణమాచార్యులు, నాతో కంఠస్తం చేయించాడు. ప్రతి మంత్రానికీ ఆరు విధాలైన ప్రయోగాలు ఉంటాయి. వాటిని షట్ ప్రయోగాలు అంటారు. చాలా మంత్రాలకు కొన్ని బీజాక్షరాలు కలిపి జపిస్తారు. ఈ బీజాక్షరాలు మంత్రానికి ముందు చేరిస్తే పల్లవము అని పేరు. ముందు వెనుకల చేరిస్తే సంపుటి అంటారు. ఈ విధంగా ఈ కల్ప గ్రంధాలలో చాలా వివరాలు ఉంటాయి. కృష్ణమాచార్యులు ఉపదేశించిన యీ రెండు మంత్రాలూ విపరీతంగా చేసేవాణ్ణి అప్పట్లో!! కానీ ఎవరో అన్నారు,,’ఉపనయనం (వడుగు) కాకుండా, గాయత్రీ తోడు లేకుండా ఇటువంటివి శాక్తేయ మంత్రాలు చేయకూడదు. ప్రమాదం. నీవు మా మాట వినకపోతే, మీ అయ్యగారికి చెప్పేస్తాం, అని కూడా బెదిరించినారు. (నవ్వు).’ దీనితో భయపడి మానుకున్నా!! 

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.