చాతకపక్షులు (భాగం-15)
(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల)
– నిడదవోలు మాలతి
తపతి అన్నవరంలో పుట్టింది. తాతలనాటి పాత పెంకుటిల్లూ, ఊరి శివార్ల పుట్టెడు వడ్లు పండే మడిచెక్కాతో బతుకు గడుపుకుంటున్న సంసారం. తపతికి పదిహేనేళ్లు రాగానే తల్లిదండ్రులు పూనుకుని చిన్నమేనమామ చెంగల్రాయుడికిచ్చి పెళ్లి చేశారు. 18ఏళ్లకి ఇద్దరు పిల్లల తల్లి. చెంగల్రాయుడికి పెళ్లాం సరదాయే కానీ పెళ్లిబాధ్యతలు ఒంట పట్టలేదు. పధ్నాలుగేళ్ల మరదలి మీద మనసు పడి, ఓ రాత్రికి రాత్రి ఆపిల్లని తీసుకుని మద్రాసు పారిపోయేడు. తపతి తల్లి నెత్తీ నోరూ మొత్తుకుంది. ఓపక్కన తోడబుట్టిన తమ్ముడూ మరోపక్కన కన్నకూతుళ్లు ఇద్దరూను. ఆ ప్రబుద్ధుడు నెలరోజులయ్యేక, కోపాలు చల్లారేయని నమ్మకం కుదిరేక అక్కగారికి కబురు చేసాడు తపతిని కూడా పంపిస్తే, అక్కచెల్లెళ్లు ఇద్దరూ ఎంచక్కా ఒక్క పంచన పడి వుంటారని. పైగా ఎంతో మంది కవి, గాయక, పండిత వరులు ఆ విధంగా ఎంతో సామరస్యంతో సంసారాలు చేసుకుంటున్నారని కూడా చెప్పేడు ఉదాహరణలతో సహా.
“నేను రాను. నన్నూ, నాపిల్లల్నీ నేనే పోషించుకుంటాను” అని తపతి వెళ్లడానికి ఒప్పుకోలేదు.
తపతి పెద్ద మామయ్య విశాఖపట్నంలో వున్నాడు. తమ్ముడు చేసిన పనికి ఆయన బాధ పడి, తపతినీ పిల్లల్నీ తనదగ్గర పెట్టుకుని సాయం చేస్తానని చెల్లెలికీ, బావగారికీ మాట ఇచ్చేడు. తపతికి తనే పాఠాలు చెప్పి మెట్రిక్ పరీక్షకి కట్టించేడు. పిల్లల్నిద్దర్నీ స్కూల్లో పెట్టేడు. తపతి నెమ్మదిగా ట్రైనింగు కూడా పూర్తిచేసి విశాఖపట్నంలో ఓ ఎలిమెంటరీ స్కూల్లో టీచరుగా చేరింది. అమ్మదగ్గర నేర్చుకున్న లాలిపాటలూ, మంగళహారతి పాటలూ పాడుకుంటుంటే విని, పెద్దత్తయ్య సంగీతం నేర్చుకోమని ప్రోత్సహించింది. నాలుగేళ్లు తిరిగేసరికి, స్కూల్లో టీచరుగానూ, సాయంత్రం సంగీతం పాఠాలు చెప్పుకుంటూనూ, తన కాళ్లమీద తాను నిలబడగల శక్తి సంపాదించుకుంది. స్కూలికి దగ్గరగా, ఓ వాటా అద్దెకి తీసుకుని పిల్లల్తో ఆయింట్లోకి మారిపోయింది. పెద్దమామయ్య, అత్తయ్యల ఆశీస్సులతో.
విశాఖపట్నం ఎంత పట్నం అయినా, పాతరాతియుగం తత్త్వాలకి తక్కువ లేదు. ఏ పేరంటానికో, గుడికో వెళ్లినప్పుడు వాళ్లూ వీళ్లూ అడిగే ప్రశ్నలు “అయితే మీ ఆయన ఎక్కడున్నాడిప్పుడూ?”, “మీ చెల్లెల్నయినా ఏలుకుంటున్నాడా?” అనో, “మీఆయన్ని ఇక్కడ చూశాం,” “అక్కడ చూశాం,” “ముగ్గురు పిల్లలుట” … అంటూ ఏదో వంక కెలుకుతూనే వుంటారు. వాళ్లబాధ పడలేక తపతి చాలావరకు తన పనే తనలోకంగా గడుపుకొస్తోంది.
***
తపతి వుంటున్న ఇంటియజమాని గురునాథంగారు వ్యాపారి. ఆయనకి నానారకాల జాతీయ, అంతర్జాతీయ వ్యాపారాలు వున్నాయి. ఆ సందర్భంగా వారింటికి విదేశీయులు వస్తూంటారు. అలాటివారిలో ఇమాన్యూల్ ఒకడు. అతను మూడువారాలకి అని వచ్చినా, మద్రాసూ, బొంబాయి, కలకత్తా తిరుగుతూ గురునాథంగారింట పట్టుమని వారం రోజులు కూడా వుండలేదు. అయినా అతనికి ఎందుకోగానీ తపతిని చూడగానే సదభిప్రాయం ఏర్పడింది. గురునాథంగారు కూడా తపతి ధీమంతురాలని చెప్పేరు. ఆ వారం రోజులూ సరిపోయేయి అతనికి తపతిమీద అభిమానం పెంచుకోడానికి. అవిడ సాయంత్రాలు పిల్లలకి సంగీతం పాఠాలు చెబుతున్నప్పుడు వచ్చి కూర్చున్నాడు నాలుగు రోజులపాటు అదే పనిగా. ఓరోజు మంచి పాట పాడమని అడిగి పాడించుకున్నాడు.
“మీకంఠం ఎంతో మధురంగా వుంది. కచేరీలు చేస్తారా?” అని అడిగేడు.
“కచేరీలు చేసే స్థాయి లేదు” అని చెప్పింది. అంతే వారి పరిచయం.
ఒకరోజు తపతి పంచలో కూర్చుని కొడుకు వాసుకి లెక్కలు చెప్తోంది. ఇమాన్యూల్ వచ్చి కొంచెం ఎడంగా, కూర్చున్నాడు. తపతి చిన్నగా నవ్వి, పాఠం పూర్తి చేసి, “బావున్నారా?” అంది మర్యాదకి. గత రెండు రోజుల్లోనూ ఇది నాలుగోసారి అతను ఇలా వచ్చి కూర్చోడం. తపతికి కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది కూడాను.
కానీ అతని నడవడిలో తప్పు పట్టవలసిందేమీ లేదు. పోకిరీ పోకడలు లేవు. అంచేత పొమ్మనలేక పోతోంది.
“బావున్నాను” అన్నాడతను తూచి మాటాడుతున్నట్టు.
తపతికి ఏం మాటాడాలో తోచలేదు. “మద్రాసులో మీపని అయిందా?” అంది ఏదో ఒకటి మాటాడాలన్నట్టు.
“అయింది.” అని ఇమాన్యూల్ ఒక నిముషం ఆగి, నిదానంగా, “ఆదివారం వెళ్లి పోతాను” అన్నాడు.
“అమెరికాకేనా?”
అవునన్నట్టు తలూపేడు. మళ్లీ రెండు నిముషాలు నిశ్శబ్దం. వాసు లెక్కలు చెయ్యడం పూర్తయింది. పుస్తకాలు తీసుకుని, ఆడుకోడానికి వెళ్తున్నానని తల్లికి చెప్పి వెళ్లిపోయాడు.
“మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చేను” అన్నాడు ఇమాన్యూల్.
“చెప్పండి” అంది తపతి చిన్నగా నవ్వి. తనకిది అలవాటే. తన ముఖవిశేషమేమో చాలామందే వస్తుంటారు తనదగ్గరికి, ‘మీతో మాటాడాలి’ అంటూ. తను నిశ్శబ్దంగా వింటూనో, వింటున్నట్టు మొహం పెట్టుకునో కూర్చుంటుంది. చాలామందికి తాము మాటాడడమే ముఖ్యం. ఎదుటివారు వింటున్నారా లేదా అన్న ధ్యాస వుండదు. ఆ విషయం తపతికి అనతి కాలంలోనే తెలిసిపోయింది.
“నేను నా సంగతి మాటాడ్డానికి రాలేదు,” అన్నాడు తపతి మనసులో మాట గ్రహించినట్టు.
తపతి తలూపింది సరేనన్నట్టు.
ఇమాన్యూల్ చెప్పదలుచుకున్న విషయానికి నాందిగా, “గురునాథంగారు మీ సంగతి చెప్పేరు,” అన్నాడు.
తపతి “ఏమని” అని అడగలేదు. సుమారుగా ఆయన ఏం చెప్పి వుంటారో తనకి అవగతమే.
ఇమాన్యూల్ కి కొంత సమయం పట్టింది ఎలా సంభాషణ పొడిగించాలో తెలీక. తపతి మౌనం అతనికి ఇబ్బందిగా వుంది. ఆమె మొహంలోకి పరీక్షగా చూస్తూ, “నాతో అమెరికా వచ్చేయండి,” అన్నాడు.
తపతి తృళ్లిపడి అతనివేపు చూసింది వేళాకోళానికి అంటున్నాడేమోనని.
లేదు. అతను చాలా సీరియస్‌గా అన్నాడని అతని మొహమే చెబుతోంది. మాటాడకుండా వూరుకుంది.
ఇమాన్యూలే మళ్లీ అన్నాడు, “మీకు ఇక్కడి పరిస్థితులు కంటకప్రాయంగా వున్నాయని గురునాథంగారు చెప్పేరు. మీ బతుకేదో మీరు బతుకుతున్నా చుట్టు పక్కలవాళ్లు వూరుకోరు. మిమ్మల్ని చేసుకున్న మామా, ఆయన తీసుకుపోయిన మీ చెల్లెలి మాటా పదే పదే తెచ్చి మిమ్మల్ని బాధిస్తున్నారు అని చెప్పేరు. ఆయనకి మీరంటే చాలా అభిమానం. మీరు సుఖపడాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకో చెప్పలేను కానీ నాక్కూడా మీరు ఇలా చిత్రవథకి గురి కావడం బాధగా వుంది. పైగా పిల్లలు ఎదిగి వస్తున్నారు. వాళ్లని కూడా స్కూల్లోనూ వీధిలోనూ ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారు. దాంతో వాళ్లకీ బాధే. అంచేత చెబుతున్నాను. మీరు ఈ రొంపిలోంచి బయట పడండి, నేను సాయం చేస్తాను.”
తపతి పెద్ద షాకు తిని, తేరుకుని అతని మాటలు వినసాగింది. పిల్లల విషయంలో అతనన్నమాట నిజమే. వాసు ఎదిగివస్తున్నాడు. ఆమధ్య ఒకసారి స్కూలికి వెళ్లనని మొరాయించేడు. వాడికి నచ్చచెప్పి పంపేసరికి తాతలు దిగొచ్చేరు.
కూతురు ఇంకా చిన్నదే కానీ మరో రెండేళ్లు పోయేసరికి ఆపిల్ల ఎన్నిదెబ్బలు తట్టుకోవలసి వస్తుందో చెప్పడం కష్టం. అవి ఇంకా పైస్థాయిలో వుంటాయి, సందేహంలేదు.
“మీకు ఇష్టమయితే మీరు అమెరికా వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. మరొకమాట. నేనేమీ మీ నుండి కోరడంలేదు. మీరు అక్కడికొచ్చి నిలదొక్కుకునే వరకే నాపూచీ. తరవాత మీ దారి మీదీ నాదారి నాదీ. అలా రాసిచ్చేస్తాను కూడా కావాలంటే.”
తపతి స్థాణువై కూర్చుండిపోయింది. తన హోల్ మొత్తం జీవితాన్ని ఒక్కసారిగా తల్లక్రిందులుగా మార్చేసే సలహా ఏదో పొరుగూరు వెళ్దాం రమ్మన్నంత తేలిగ్గా చెప్తున్నాడు అతను!
“ఆలోచించుకుని చెప్పండి. మీరు ఒప్పుకుంటే రేపే పెళ్లి.”
“పెళ్లా?” అంది తపతి కెవ్వుమని కేకేయడం తరువాయిగా.
“అపార్థం చేసుకోకండి. వీసా కోసం మాత్రమే అది. నేను మిమ్మల్ని ఏవిధంగానూ ఇబ్బంది పెట్టను. గురునాథంగారితో కూడా మాట్లాడేను,” అతను కూడా ఎవరో తరుముకొస్తున్నట్టు, గుక్క తిప్పుకోకుండా చెప్పేడు,
తపతి అతను చెప్తున్న ప్రతి వాక్యానికి అదిరిపడుతోంది. “గురునాథంగారికి తెలుసా?”
“మరి పెళ్లికి పెద్దలు ఎవరో ఒకరు వుండాలి కదా.”
అప్పటికి తపతికి కొంచెం తెలివొచ్చింది. “మా పెద్దమామయ్యతో మాటాడాలి,” అంది.
“అవును. గురునాథంగారు ఆమాట కూడా చెప్పేరు. మీరు మీ పెద్దమామయ్యగారితో కూడా మాటాడే చెప్పండి. నేను ఎల్లుండి వెళ్లిపోవాలి. అంచేత పెళ్లి జరిగితే రేపే జరగాలి,” అనేసి వెళ్లిపోయాడు ఇమాన్యూల్.
తపతి అక్కడే కూర్చుంది ఆలోచిస్తూ. ఎవరితోనైనా మాటాడాలి అనిపిస్తోంది. ఎవరితో మాట్లాడడం? ఎవరైనా ఏం చెప్తారు? అయితే “బాగుంది వెళ్లిపో,” అంటారు. లేకపోతే, “బుద్ధి గడ్డి తిందేమిటి? అతను రారమ్మనడమూ, నువ్వు జంయ్యిమని లేచిపోవడమూనా? దేశం కాని దేశం. తీరా అక్కడికెళ్లిం తరవాత అతను నిన్ను నట్టేట్లో ముంచేస్తే ఏం చేస్తావు?” అంటూ చీవాట్లేస్తారు మొహం వాచేలా. అవన్నీ విన్న తరవాతయినా అటో ఇటో తేల్చుకోవలసింది తనే!
తపతికి చిన్ననవ్వు కూడా వచ్చింది. అమెరికా వెళ్లాలని తపించిపోతున్నవారు బోలెడుమంది వున్నారు. తన స్నేహితులలోనే నలుగురున్నారు. వాళ్లకి ఈమాట చెప్తే “నువ్వు వెళ్లకపోతే చెప్పు, నేను వెళ్తాను” అని ఎగిరి గెంతేస్తారు. తనేమో కలలో కూడా అనుకోలేదు. కానీ ఆ అవకాశం తనని వెతుక్కుంటూ వచ్చింది. ఇది తనకి అవకాశమా కాదా అన్న మాట అటుంచి. ప్రాణం తెరిపిన పడుతుందన్న ఇమాన్యూల్ మాటలో చాలా నిజం వుంది. అంతకంటె ముఖ్యం ఇది పిల్లలకి మంచి అవకాశమే. మరి అమ్మా, నాన్నా ఒప్పుకుంటారా? అసలు నిజంగా అతన్ని నమ్మవచ్చునా? గురునాథంగారినే అడిగితే మంచిది అనుకుని లేచింది తపతి. నీట ములిగిపోతున్నవాడు గరికపోచని అంది పుచ్చుకున్నట్టు. రెండడుగులు వేసిందో లేదో ఇమాన్యూల్ ఎదురయేడు.
“ఏమంటారు?”
తపతికి క్షణకాలం ప్రపంచం గిర్రున తిరిగింది కళ్లముందు. గురునాథంగారు కానీ పెద్దమామయ్య కానీ ఏం అంటారు అనిపించింది. పెద్దలంతా పంచాంగాలు చూసీ, పురోహితులని సంప్రదించీ పెట్టిన సుముహూర్తం, చిన్నమామయ్య పెళ్లిపీటలమీద చేసిన ప్రమాణాలూ ఏమయేయి? హఠాత్తుగా ఎక్కళ్లేని మొండిధైర్యం ఉప్పెనగా ముంచుకొచ్చి మనసునిండా ముసురుకుంది. “సరే” అంది తపతి.
“మంచిది. నేను ఇప్పుడే వెళ్లి గురునాథంగారితో చెప్తాను పెళ్లి ఏర్పాట్లు చెయ్యమని. మీరు వెళ్లి మీ మామయ్యగారికి చెప్పండి. మీరు అనుమానం ఏమీ పెట్టుకోవద్దు. నేను మిమ్మల్ని ఏవిధంగానూ ఇబ్బంది పెట్టను. మీనుంచి నేను ఆశించేదేమీ లేదు,” అన్నాడు మరొకసారి ప్రమాణం చేస్తున్నట్టు.
అతని ఆతురత చూస్తే తను ఎక్కడ మనసు మార్చుకుంటుందో అని భయ పడుతున్నట్టుంది. తపతి మళ్లీ నవ్వుకుంది. నిజానికి భయపడవలసింది తను!
ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇమాన్యూల్ గురునాథంగారితో మాటాడడం చాలా తృప్తినిచ్చింది. ఆయన మంచీ చెడ్డా తెలిసినవారు.
అనుకున్నట్టుగానే సింహాద్రి అప్పన్న సమక్షంలో, గురునాథంగారి ఆధ్వర్యంలో, మామయ్య, అత్తయ్య చేతులమీదుగా తపతిపెళ్లి ఇమాన్యూల్తో అయిపోయింది మర్నాడు.
తపతి తండ్రీ, బామ్మా ఆడదానికి రెండోపెళ్లి ఏమిటని రాద్ధాంతం చేసి పెళ్లికి రాలేదు. మామయ్మనీ, గురునాథంగారినీ తిట్టిపోశారు తనకూతురి జీవితం నాశనం చేసేరనీ, తనని తలెత్తుకు తిరగనియ్యకుండా చేశారనీ. “నీ అన్నదమ్ములిద్దరూ నా కూతురి బతుకు మంటగలిపేరని” తల్లిని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టేరు.
తల్లి మాత్రం “నువ్వూ, నీపిల్లలూ ఎక్కడో అక్కడ చల్లగా వుంటే చాలమ్మా” అంటూ వచ్చి దీవించింది మనసారా.
పెళ్లయిన తరవాత, ఇమాన్యూల్ వీసాకి కావలసిన సమాచారం అంతా తీసుకుని, అమెరికా వెళ్లగానే స్పాన్సార్ కాయితాలు పంపిస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆతరవాత రెండువారాలూ తపతి జరిగింది “కలయో, వైష్ణవమాయయో, నే తపతిని గానో” అనుకుంటూ గడిపింది.
ఇమాన్యూల్ ఇచ్చిన మాటప్రకారం అమెరికాలో దిగగానే ఏర్పాట్లు మొదలుపెట్టి కావలసిన కాయితాలు పంపించేడు. ఆకాయితాలు చూసాక, తపతికి ఇది కల కాదని నమ్మకం కుదిరింది. రెండు నెలల రెండు రోజులకి తపతి అమెరికా వాసిని అయిపోయింది ఇద్దరు పిల్లలతో.
ఆలస్యం చెయ్యకుండా, ఆమెని టెక్నికల్ కాలేజీలో కంప్యూటర్ బేసిక్స్ కోర్సులో చేర్పించేడు. రెండేళ్లపాటు ఆర్థిక సహాయం చేస్తాననీ, ఆతరవాత తనదారి తనదేనని చెప్పేడు. అన్నమాట నిలబెట్టుకున్నాడు. పిల్లల్ని కూడా స్కూల్లో చేర్పించేడు. తపతి కంప్యూటర్ బేసిక్స్ పూర్తి చేసి ఓ బాంకులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరింది.
ఇమాన్యూల్ తన వ్యాపారం చూసుకుంటూ, దేశాలంట తిరుగుతున్నాడు. మధ్య మధ్యలో వచ్చి తపతి యోగక్షేమాలు కనుక్కుంటున్నాడు.
ఓ రోజు తపతిని కూర్చోబెట్టి, “నేను నీకు ఇచ్చిన మాటప్రకారం చేశాను. నీకు ఒక మార్గం ఏర్పడింది. నాపని అయిపోయింది. నేను కూడా తిరగడం మానేసి ఒకచోట స్థిరపడదాం అనుకుంటున్నాను,” అన్నాడు.
తపతి మాటాడకుండా వింటూ కూర్చుంది.
“నాకు జర్మనీలో మంచి అవకాశం వచ్చింది. నేను అక్కడే వుండిపోదాం అనుకుంటున్నాను. మీరూ, పిల్లలూ ఈ ఇంట్లోనే వుండొచ్చు మీకు ఇష్టమయినన్నాళ్లు. ఇల్లు చూసుకోండి. రిపేర్లూ, టాక్సులూ, అవీ మీదే బాధ్యత. అదే అద్దె కింద జమకట్టు కుంటాను.” అన్నాడు.
అకస్మాత్తుగా తన మొత్తం జీవితానికి ఆధారమయిన పట్టుకొమ్మ టుప్పున విరిగిపోయినట్టు అనిపించింది. మరోపక్క ఆశ్చర్యంకూడా. మళ్లీ మరొకసారి కలయో వైష్ణవమాయయో అనుకోవాల్సొచ్చింది. ప్రతిఫలం అడక్కుండా ఓ రైడివ్వొచ్చు. ఓపూట భోజనం పెట్టొచ్చు. ఇంత ఇల్లు వదిలేస్తారా ఎవరైనా?!
ఇమాన్యూల్ వదిలేశాడు. అతను వెళ్లిపోయేక, తపతే ఇంటిపన్ను కట్టడం, రిపేర్లు చేయించడం చూసుకుంటోంది. మరేవిధమయిన లెక్కలూ, పత్రాలూ లేవు. పిల్లలు వాళ్ల బతుకులు వాళ్లు బతుకుతున్నారు. కొడుకు ఆర్.ఓ.టీ.సీలో చేరి, మెకానికల్ ఇంజినీరు అయి, మినియాపొలిస్ లో స్థిరపడ్డాడు. కోడలు కూడా ఇంజినీరే. కూతురు సుధ బి.కాం. చేసింది. అల్లుడు బాంక్ మేనేజరు. వాళ్లిద్దరూ హూస్టనులో వుంటున్నారు.
* * * * *
(ఇంకా ఉంది)
చిత్రకారుడు: ఆర్లె రాంబాబు
నిడదవోలు మాలతి ఏడు దశాబ్దాలుగా కథలు రాస్తున్నారు. 2001లో తూలిక.నెట్ ప్రారంభించి, మంచి కథలు ఇంగ్లీషులోకి అనువాదాలు చేసేరు.. ప్రధానంగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులకి కథలద్వారా తెలియజేయాలన్న ఆశయంతో మొదలుపెట్టిన సైట్ అది. 2009లో తెలుగు తూలిక బ్లాగు ప్రారంభించి తమ కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు ప్రచురిస్తున్నారు. ఆమెసాహిత్యం ఆమెబ్లాగు www.tethulika.wordpress.comలో చూడవచ్చు. కథాసంకలనాలు, వ్యాససంకలనాలు అన్నీ తెలుగు తూలిక బ్లాగులో e-Book formatలో ఉచితంగా లభ్యం. స్వాతంత్ర్యానంతరం, తెలుగు రచయిత్రులు అసామాన్యమైన ప్రాముఖ్యం సంపాదించుకున్నారు. ఆ ప్రాముఖ్యతకి వెనుక గల సాహిత్య, సామాజిక, ఆర్థిక, కౌటుంబిక పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన పుస్తకం Women writers, 1950-1975. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.