జ్ఞాపకాల సందడి-35
-డి.కామేశ్వరి
కావమ్మ కబుర్లు -4
ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు అన్ని ఊళ్ళల్లో. .పెద్ద పట్టణాల్లో తప్ప. కిరసనాయిలు, దీపం లాంతరు పెట్టుకుని పిల్లలు అందరూ చుట్టూ కూర్చుని చదువుకునే వారం. అందుకే ఎక్కువగా ఉదయం పూట ఎక్కువ చదువుకునే వారం . ఆరు గంటలకల్లా లేపేసేవారు. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి ఏడు నించి తొమ్మిది వరకు చదువుకుని, చద్దన్నాలు తినేసి స్కూలూకి వెళ్లి, మల్లి ఓంటి గంటకి లంచ్ పీరియడ్, గంటలో ఇంటికొచ్చి వేడి వేడిగా భోజనం చేసి మల్లి నడిచి వెళ్లి, నాలుగున్నరకి వచ్చి, ఆటలాడుకునేవారం. చిరుతిళ్ళు తిని, అరువరకు ఆడుకుని మల్లి చదువులకి కూర్చుని హోమ్ వర్క్ లు చేసుకునేవారం. మాకు అన్నిటికి టైంలు వుండి, క్రమశిక్షణలో పెరిగాం. తల్లితండ్రులు, టీచరు అంటే భయభక్తులు ఉండేవి. సాయంత్రం చీకటి పడగానే ఇల్లు చేరకపోతే కేకలు వేసేవారు. ఏదోచెప్తూ ఏటో వెళ్ళాను .
ఆ రోజుల్లో దీపాలకి గతిలేని వారు అంటే లాంతరు కూడా లేని వాళ్ళు బుడ్డి దీపాలతో చదువుకోలేక వీధీ దీపాల దగ్గర చదువుకునిపైకి వచ్చాం అని చెప్పేవారు. అసలు ఆ రోజుల్లో ఉన్నత వర్గాలలోనివారు, ముఖ్యంగా బ్రాహ్మణ పిల్లలే చదువు కునేవారు . 70,80 ఏళ్ళక్రితం స్కూల్స్ అన్ని ఊళ్లలో ఉండేవి కావు. తాలూకాలో హైస్కూల్, పట్టణాల్లో కాలేజీలు ఉండేవి. ప్రతి వీధికి నాలుగు స్కూల్స్, పల్లెటూరిలో సైతం డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఈ నాడు వచ్చాయి. ఇదివరకు హైస్కూల్ లో చదవాలంటే మూడు నాలుగు మైళ్ళు నడిచి పల్లెలనించి వచ్చి చదువుకునేవారు. లేదంటే బంధువుల ఇంట్లో వుండి చదువుకునేవారు .పెద్ద పట్టణాలలో తప్ప హాస్టల్ ఉండేదిగాదు. హాస్టల్లో చదువుకోలేని బీద పిల్లలు వారాలు చెప్పుకుని, ఏ దయగల వారో వీధి అరుగు మీద పడుకోనిస్తే, పడుకుని తెల్లారి పెరట్లో కాలకృత్యాలు తీర్చుకుని, నూతి దగ్గర స్నానం చేసి, వారానికి ఒకరోజు భోజనం పెట్టె వాల్లింట్లో భోంచేసి స్కూల్ కి వెళ్లి చదువు కుంటూ కష్టపడి పైకి వచ్చిన బ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో ఉండేవి . ఈనాడు అమ్మ నాన్న అన్ని సమకూర్చి అడుగు వేయకుండా ఆటోల్లో పంపితే చదువుకోడానికి ఆపసోపాలు పడుతున్నారు . ఎవరి దాకానో ఎందుకు మేము అయినింట పుట్టినా, మైలు దూరం లో వుండే స్కూలికి నాలుగు సార్లు నడిచేవారం. ఆరోజుల్లో చెప్పుల్లేకుండా ఎండల్లో కూడా ఎలా నడిచామో అంటే నమ్మక పోవచ్చు. ఇప్పటి వాళ్ళు ఇంట్లో కూడా చెప్పులు ఉంటే గాని నడవని వాళ్ళు. అలాటి రోజులనించి వచ్చిన నేను ఇంకా ఎన్నో చెప్పాలి కానీ ఇంత కంటే టైపు చేసే ఓపిక లేదు …
*****
కామేశ్వరిగారు చెప్పింది ఎంతో నిజం. మా కోనసీమ అంతకీ ఒక్క అమలాపురంలోనే కాలేజి ఉండేది. మేము కూడ స్కూల్‌లో చదువుకున్నప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేసి మరల వెళ్లేవారం. మా ఇంటికి ప్రతి గురువారం ‘వారాలబ్బాయి’ భోజనానికి వచ్చేవాడు. ఆవిడ ‘జ్ఞాపకాల సందడి’ చదువుతుంటే మా చిన్నతనపు విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి.
కామేశ్వరి గారి జ్ఞాపకాల సందడి చాలా బాగుందండి.గతం ఒక స్వర్ణయుగం అన్నది ఎప్పటికీ నిజం.