క’వన’ కోకిలలు – 11 : 

స్కాటిష్ ఆధునిక కవి రాబర్ట్ క్రాఫోర్డ్  (Robert Crawford)

   – నాగరాజు రామస్వామి

          రాబర్ట్ క్రాఫోర్డ్ రచయిత, అధునిక కవి, సాహిత్య విమర్శకుడు, జాతీయవాది. ప్రస్తుతం సేంట్ ఆండ్రూస్ (St Andrews) యూనివర్సిటీ ప్రొఫెసర్. 1959 లో బెల్షిల్ (Bellshill) లో జన్మించాడు. బెల్షిల్ స్కాట్లాండ్ లోని నార్త్ లంకాషైర్ కౌంటీ లోని ఒక పట్టణం. గ్లాస్కో ఎడింబరో నగరాలకు సమీపంలో ఉంటుంది. సంగీత సాహిత్యాల నిలయం. 

          ఆలుస్ క్రాఫోర్డ్ అతని భార్య. వాళ్ళకు ఇద్దరు పిల్లలు.

          రాబర్ట్ క్రాఫోర్డ్ విద్యాభ్యాసం గ్లాస్కో సమీపంలోని కాంబస్లాంగ్ (Combuslang) పట్టణంలో జరిగింది. గ్లాస్కో, ఆక్స్ ఫర్డ్ ల M.A, D.Phil పట్టాలు పుచ్చుకున్నాడు. అతని తాత స్కాట్లాండ్ చర్చ్ లో ఉన్నతాధికారి. క్రాఫోర్డ్ ప్రొటెస్టెంట్ మత విశ్వాసి. సైన్స్ క్రిస్టియానిటీల పరస్పర సంబంధం గురించి వ్యాసాలు రాశాడు. మతసంబంధమైన కవిత్వం వెలువరించాడు. 

          కవిత్వంలో సైన్స్ సంబంధిత పరిజ్ఞానాన్ని, అనుభవాలను చొప్పించడం కవి విద్యుక్తధర్మం అని గట్టిగా నమ్ముతాడు. పాత కొత్తల మేలు కలయిక ఆతని విశ్వాసం. రాబర్ట్ బర్న్స్ ( Robert Burns), రాబర్ట్ ఫర్గూసన్ (Robert Fergusson) వంటి పోస్ట్ఎన్లైట్మెంట్ కవుల పైనే కాక, ఎడ్విన్ మోర్గన్ (Edwin Morgan), డగ్లాస్ డున్ (Douglas Dunn), లిజ్ లాక్ రెడ్ (Liz Lochhead) వంటి సమకాలీన నవీన కవులపై కూడా ఆసక్తి చూపాడు. అధునిక రచనా ప్రక్రియ పై, కళాత్మక సృజనాత్మక కావ్యసృష్టి పై ఎనలేని మోజు. అందుకే ఇలియట్ (T.S. Eliot) అంటే అతనికి అత్యంత ప్రీతి. యెంగ్ ఇలియెట్ (Young Eliot) ఆతడు రాసిన గొప్ప ఆత్మ కథ. రాబర్ట్ బన్స్ ఆత్మకథ కూడా రాసాడు. ఆధునికత ఆతని ధ్యేయం. అతని రచనలలో ఆతని దేశీయత, ప్రాంతీయత పుష్కలంగా ప్రతిఫలించింది. 

          అతనిది మాండలిక జాతీయాలు, అధునిక సాంకేతిక పదజాలం కలగలిసిన, గాన యోగ్యమైన భాష. 17వ శతాబ్దపు లాటిన్ కవి ఆర్థర్ జాన్స్ టన్ రచించిన సనాతన సాహిత్యాన్ని కొంత అనువదించాడు. అంతర్జాతీయ కవిత్వ పత్రిక (వర్స్) సంస్థాపకుడు. బ్రిటన్, ఐర్లాండ్ ల ప్రతిష్టాత్మకమైన పెంగ్విన్ కవిత్వ సంకలనం (The Penguin Book of Poetry from Britain and Ireland), స్కాటిష్ కవితలు (The New Penguin Book of Scottish Verse, 2000) గ్రంథాల సహాయ సంపాదకత్వం నిర్వహించాడు.  అనేక కవితలతో పాటు పలు విమర్శలు ప్రచురించాడు. రాబర్ట్ క్రాఫోర్డ్ కు ఇతర భాష లేవీ రావు గాని, చిన్న నాట హోమర్ ను చదివేందుకు గ్రీకు చదువు కున్నాడు. బైబిల్ తనకు కవిత్వ స్పృహను అందించిందని, దాని లోని ఆ సనాతన కళ ఇప్పటికీ తనను ఆకట్టు కుంటుందని చెబుతాడు. 

          ప్రతిష్టాత్మకమైన ఎరిక్ గ్రెగొరి ( Eric Gregory ) పురస్కారాన్ని స్వంతం చేసుకున్నాడు. T.S. ఇలియట్ అవార్డ్ ను పొందాడు. 

          ఈనాటి అధునిక టెక్నాలజీ పరిభాషను, స్కాటిష్ పాలిటిక్స్ ను, స్వకీయ భాషాపిపాసను పొందుపరచుకున్న నవసృజన అతని కవిత్వం. ఏకంగా, స్కాట్లాండ్ కు ప్రత్యేకమైన ఒక ఒక కొత్త ఆంగ్ల భాషనే అతడు సృష్టించు కున్నాడంటే అతిశయోక్తి కాదు. ఆతడు రాసిన ఆరు కవన సంపుటాలలో స్కాటిష్ కవిత్వం నవనవంగా వికసించింది. 

          క్రాఫోర్డ్ స్కాట్ భాషలోనూ(Scottish Gaelic) లోనూ దేశీయమైన కవిత్వం రాసాడు.

అతని Sharawaggi: Poems in Scots అందుకు అక్షర నిదర్శనం. అతని Rain అనే కవిత అధివాస్తవిక కవిత్వానికి (Surreal poetry) అద్దం పడుతుందంటారు. అతని A Scottish Assembly లో ప్రాంతీయ కంఠస్వర ముద్ర (Voice print) బహుముఖంగా గొంతు విప్పింది. 

          రాబర్ట్ క్రాఫోర్ కవితా కౌశలాన్ని ప్రతిబింబించే ఓ నాలుగు కవితలకు నా అనువాదాలు:

1.పక్షాలను తొడుక్కున్న పదాలు  (Winged Words)

ఎల్లెడలా 

మెత్తగా పరచుకున్నవి

పక్షాలను తొడుక్కున్న పదాలు.

మన హృత్ క్షేత్రాలలో ఏపుగా పెరిగిన ఆత్మపచ్చికల కేసరాలను  

దువ్వుతున్నవి కలల గాలులు;

అక్కడ, 

తలపులు సంవేదనలైన ఆ ఎదభూములలో విత్తిన ఏ ఒక్క బీజమూ కోల్పోదు జీవితాన్ని.

ఆ మంత్రమయ మాటలు గారడీ పిట్టలై 

వెలుగు నీడలలో దోబూచు లాడుతున్నవి;

వాటికి రంగులను రూపాలను అద్దింది 

నా హృదయమే!

దైవావాణువుల లోంచి 

ఆదిమ జీవకోటి ఆవిర్భవించినట్టు

ఆ మాంత్రిక తుహిన కాంతిలో 

అక్షర పక్షులు రెక్కలను విప్పుతున్నవి! 

2.సాగర గీతం (A Song Of The Sea)

రేబవళ్ళ నడిమి మసక వెలుగులు నిండిన 

సముద్రతీర సైకతాల మీద వాలిపోయాను;

లోన సుళ్ళు తిరుగుతున్న ఆలస ఆలోచనలు!

కలలో లా,

ఆడాల్సిన జీవన మరణాల ఆగామి ఆటలా

సాగర కెరటాల మీది గాలిలో పల్టీలు కొడుతున్నది పాలి పేలవమైన తెల్ల పిట్ట.

సంద్ర ఘోషను వింటున్నాను

కుదిపేస్తున్న నా గత జీవితాల స్మృతులను వింటున్నట్టు.

ఏదో ఒక మార్మిక శబ్దం 

మహా సముద్రం మీదుగా 

నా కేసి దూసుకొస్తున్నది

ఎగురుతున్న

పాలి పేలవమైన తెల్ల పిట్టలా.

ఎవరికి  తెలుసు 

నాలో ఓ పిశాచం ఉందని,

ఆ అనాది అస్పష్ట స్వరాన్ని 

అది మాత్రమే వినగలుగుతుందని?

అదుగో, నాలో, 

కలలా మసక జ్ఞాపకమేదో 

మెరసి మాయమౌతున్నది;

పారిపోతున్న

పాలి పేలవమైన తెల్ల పిట్ట లా.

3.ముగింపు దిశగా (Toward the Close)

కాలక్రమేణ,

మన జీవనకాలం పై 

మన మోజు పెరుగుతూనే వుంటుంది, 

అవకాశాలు సన్నగిల్లి అలసిపోయి మరణించేదాకా;

మనం అందరం దినదినం

కూడగట్టుకున్నదంతా హరించిపోయే దాకా

సర్వనాశనానికి సహాయపడుతూనే వుంటాం. 

ఎవరూ మిగలరు,

మృత్యు ఘాతానికి

ఆకులు రాల్చిన మ్రోడు లాంటి

తమ గత యవ్వనానందాన్ని

తిరిగి చిగిరించుకునేందుకు

ఇక్కడ ఎవ్వరూ ఉండరు.

మసక బారుతున్న జీవన సంధ్యలో 

మనలోని సహజ ధిక్కారం ఎదురుతిరిగి

మన రుజాగ్రస్త గతానికి పరమౌషదాన్ని అర్థిస్తున్నప్పుడు 

మరణం చకిత మంత్రమై 

అంతిమ సత్యాన్ని ఆవిష్కరిస్తుంది;

అప్పుడు 

ముదిమి చీకట్ల మీదుగా వీచిన 

మసక పవనాలు 

మధుర పరిమళాలై గుబాళిస్తవి.

4.వసంతానికి పిలుపు (Spring)

కొండగాలిలో,

మంచు నక్షత్రాల కింద,

చల్లని సానువుల మీద గొల్లకాపరి

ఆమనిని రమ్మని వేడుకుంటున్నాడు: 

“ప్రియ వసంతమా! 

కురువనీ ఆమె మీద కాంతి ధార;

వెచ్చని గాలిలో తేలుతున్న 

చిగురు రంగుల, పూల పూతల,

గొర్రె అరుపుల, పిట్ట కేకల 

లేలేత ఆనందం 

ఆమెను చుట్టుముట్టే దాకా.”

అరుణోదయాన్ని శీతలీకరిస్తున్న 

చలికారు పిల్లగాలిలో 

పాలు పితికే గొల్లకన్నె సైతం

ఆమనిని రారమ్మని పిలుస్తున్నది:

“ప్రియ వసంతమా! నేల గంధమా! 

నన్ను ఆవహించు 

నేను ప్రణయ ప్రసూనమై వికసించేదాకా,

నా కన్నుల చిరునవ్వై హాసించు

హిమగిరుల నుండి నా ప్రియతముడు  

ఈ తరుణ జవ్వన తారను చూచి

కౌగిలిలో వాలిపోయే దాకా.

నీ కోసం 

కొండ మీద పూల పందిరి వేస్తాను;

అక్కడ, ఆ వేసవి గాలిలో 

గండు తుమ్మెదలు, పాడే పక్షులు 

మా ప్రణయరసానందాన్ని గ్రోలుతుంటవి.”

అలా, వాళ్ళు పాడుకుంటున్న 

ఆ నులివెచ్చని అందాల జీవనానంద వేళ

కొండకోనల నుండి చలికాలం తప్పుకుంటుంది;

వాళ్ళ కోసం

వాళ్ళ దేహాలు వెచ్చని గులాబీలై వికసిస్తవి.  

          యురోపియన్ సాహిత్య చరిత్రలో స్కాట్ లాండ్ కవిత్వానికి సరికొత్త సముచిత స్థానాన్ని కల్పించి, స్కాట్ స్వరాన్ని సమకాలీనంగా పలికించి, స్కాటిష్ కవితకు నవీన అస్తిత్వాన్ని (Identity) కల్పించిన నవకవి క్రాఫోర్డ్.       

          స్కాటిష్ కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన అభినవ కవి రాబర్ట్ క్రాఫోర్డ్. 

*****                  

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.