కాళరాత్రి-10
ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్”
అనువాదం : వెనిగళ్ళ కోమల
ఒక వేర్హవుస్ ముందు ఆపారు మమ్మల్ని. ఒక జర్మన్ ఉద్యోగి వచ్చి కలిశాడు మమ్మల్ని. మా పట్ల శ్రద్ధ చూపలేదు.
పని కష్టమయింది కాదు. నేలమీద కూర్చొని బోల్టులూ, బల్బులూ, ఇతర చిన్న కరెంటు సామాను వేరు చేయటం. ఆపని ప్రాముఖ్యత గురించి కపో లెక్చరిచ్చాడు. బద్ధకస్తులకు శిక్ష పడుతుందన్నాడు. జర్మన్ ఉద్యోగి ముందు కపో అట్లా మాట్లాడాలి గనుక అలా అంటున్నాడన్నారు సహచరులు.
చాలా మంది పోలండ్ పౌరులు, కొందరు ఫ్రెంచి స్త్రీలు ఉన్నారక్కడ. ఆడవాళ్ళు కళ్ళతోనే పలకరించారు వాద్యకారుల్ని. ఫ్రానెక్ నాకు ఒక మూల పని అప్పజెప్పాడు. పడీ పడీ పని చేయనవసరం లేదు, తొందరేమీ లేదు. ఎస్.ఎస్. దృష్టిలో పడబోకు అన్నాడు. ‘‘సర్ దయచేసి నన్ను మా నాన్న దగ్గరగా ఉండనీయండి’’ అని అడిగాను. నాన్నను నా పక్కనే పనికి కుదిర్చాడు. ఇద్దరు అబ్బాయిలు మా బ్యాచ్లో వచ్చి చేరారు. యోసి, టీబి. ఇద్దరూ చకోస్లోవేకియా సోదరులు. వాళ్ళ తల్లిదండ్రులను బెర్కినాలో చంపేశారు. వీళ్ళిద్దరూ ఒకరికోసం ఒకరు బ్రతుకుతున్నారు.
వాళ్ళిద్దరూ నాకు స్నేహితులయ్యారు. ఒకప్పుడు జాయినిస్ట్ యువ సంఘంవారు గనుక ఎన్నో హిబ్రూ పాటలు వారికి తెలుసు. అప్పుడప్పుడు ఆ పాటలను హమ్ చేస్తుండే వాళ్ళం. జోర్డాన్ నది జ్ఞాపకాలనూ, పవిత్ర జెరూసలెమ్ జ్ఞాపకాలనూ నెమరవేస్తూ, పాలస్తీనా గురించి మాట్లాడుకునే వాళ్ళం. అవకాశమున్నా నా తల్లి ` తండ్రుల మాదిరిగానే వీళ్ళ తల్లి ` తండ్రులు అంతా తెగనమ్మి పాలస్తీనాకు పారిపోలేక పోయారు. యుద్ధం ముగిసి, మాకు స్వేచ్ఛ లభిస్తే యూరపులో ఒక్క క్షణం ఉండకూడ దనుకున్నాము. హైపాకి మొదటి ఓడలోనే బయలుదేరుదాం అని నిర్ణయించుకున్నాం.
అకీ బాడ్రమర్ బైబిలు నుండి ఒక సువార్త చదువుతూ ‘‘త్వరలో విముక్తి ఉంది’’ అని చెప్పసాగాడు.
గుడారాల నుండి మేము సంగీతకారుల బ్లాక్లోనికి మారాము. మాకు ఒక కంబళి, వాష్ బేసిన్, ఒక సబ్బు యిచ్చారు. అక్కడ లీడర్ ఒక జర్మన్ యూదు.
యూదు లీడరుండటం బాగా అనిపించింది. అతని పేరు అల్ఫోన్జె, యువకుడు. బ్లాక్ పరిరక్షణ అతని ధ్యేయం. వీలైనప్పుడల్లా పిల్లలకూ, బలహీనులకూ సూపు తెప్పించి యిచ్చే వాడు. ప్రస్తుతం స్వేచ్ఛ కంటే కడుపు నింపుకో గలిగితే బాగుండునని కొందరు చూసేవారు.
ఒకరోజు వేర్హవుస్ నుండి వచ్చాము. బ్లాక్ సెక్రటరీని కలవమని కబురు వచ్చింది. ఒ7713 నీవు తిన్న తరువాత పంటి డాక్టర్ని కలువు అన్నాడు. నాకు పంటి నొప్పి లేదే అన్నాను. తిన్న తరువాత తప్పక కలువు అంటే నేను వెళ్ళాను. 20 మంది దాకా ఖైదీలు వరుసగా నిలబడి ఉన్నారు. నా కాట్టే సేపు పట్టలా మా బంగారు పళ్ళు పీక్కుంటున్నారని తెలియటానికి.
పంటి డాక్టరు చెకోస్లోవేకియా యూదు. నోరు తెరిస్తే ఆయన పళ్ళన్నీ వంకర టింకరగా పుచ్చిపోయి ఉన్నాయి. ఏమి చేయబోతున్నారు సర్. అని నెమ్మదిగా అడిగాను. ‘‘నీ నోట్లో బంగారు కవరింగ్ తీసేయబోతున్నా’’ అన్నాడు.
‘‘నాకు జ్వరంగా ఉన్నది, కొన్ని రోజులు ఆగండి సర్’’ అన్నాను.
‘‘సరే అని నా నాడి పట్టి చూసి బాగయ్యాక రా, మళ్ళీ నా చేత పిలిపించుకోగూడదు’’ అన్నాడు.
ఒక వారం తరువాత వెళ్ళాను అతని దగ్గరకు. అదే ట్రిక్ చేశాను. ఇంకా సరిగా కోలుకోలేదని. అతడు నన్ను నమ్మాడోలేదో గాని నా అంతట నేను వచ్చినందుకు సంతోషించాడు, కొంత వ్యవధి యిచ్చాడు.
కొద్ది రోజులకే పంటి డాక్టరు ఆఫీసు మూసివేశారు. అతన్ని జైలులో వేశారు. ఉరి శిక్ష పడబోతుందన్నారు. తీసిన బంగారం తన సొంతానికి వాడుకుంటున్నాడట. అతని పట్ల నాకేమీ జాలి అనిపించలా. నా బంగారు కవరింగు మిగిలిందని సంతోషించాను. ఇక ముందెప్పుడయినా నా బంగారం నాకు ఉపయోగపడవచ్చు. కొంచెం రొట్టె కొను క్కోవటానికో, లేక బ్రతుకు ఇంకా పొడుగించు కోవటానికో పనికి రావచ్చు. నాకా రోజుల్లో గిన్నెడు సూపు, పాతబడిన స్టేల్ రొట్టె ముఖ్యం. రొట్టె, సూపు జీవితమన్నట్లున్న కాలమది. ఆకలిగొన్న పొట్ట గురించే ఆలోచన.
వేర్ హవుస్లో నేను ఒక ఫ్రెంచి స్త్రీ పక్కన పని చేస్తుండేవాడిని. మేము మాట్లాడు కోలేదు. తనకు జర్మన్ రాదు. నాకు ఫ్రెంచి అర్థం కాదు. ఆమె యూదు అని నాకనిపిస్తుండేది. కాని ‘ఆర్యన్’ గానే చలామణి అవుతున్నది.
ఒకరోజు ఇడెక్ పిచ్చి కోపంలో ఉన్నప్పుడు నేను ఎదురుపడ్డాను. నన్ను చితక బాదాడు. శరీరమంతా రక్తం కారుతూ ఉన్నది. బాధతో అరవకుండా పళ్ళతో బిగబట్టాను. అలా అరవకుండా ఉంటే అతడిని లెక్కచేయనట్లు భావించి యింకా కొట్టాడు.
ఎందుకో సడెన్గా ఆపి నన్ను పనిలోకి పొమ్మన్నాడు. ఏమీ జరగనట్టే. ఏదో ఆట ముగిసినట్లు, గెలవటం, ఓడటం అంతా తనదేనన్నట్లు చేశాడు.
నా వళ్ళంతా బాధతో సలుపుతో ఉన్నా నా మూలకు నేను నెమ్మదిగా దేకాను. ఒక చల్లని చెయ్యి నా నుదుటి మీద రక్తం తుడవటం తెలిసింది. ఏడవలేక నవ్వుతూ ఉన్న ఆమె ఫ్రెంచి స్త్రీయే. ఎవరూ చూడకుండా యింత రొట్టె నాకిచ్చింది. నా కళ్ళలోకి చూస్తూ నాతో మాట్లాడాలని అనిపించినా భయంతో బిగుసుకుపోయింది. అలా కొంతసేపయ్యాక ఆమెలో చలనం కలిగింది. చక్కని జర్మన్ భాషలో నన్ను ఓదార్చింది. ` పెదాలు బిగ బట్టుకో తమ్ముడూ, ఏడవబోకు. నీ కోపాన్ని, నీ అసహ్యాన్నీ మరొకనాటికి దాచి ఉంచు. అది వాడే రోజు వస్తుంది. వేచి చూడు. ప్రస్తుతం పళ్ళు బిగబట్టు అన్నది.
ఎన్నో ఏళ్ళ తరువాత పారిస్ నగరంలో మెట్రోలో ప్రయాణం చేస్తూ, వార్తాపత్రిక చదువుతున్నాను. నా ఎదురుగా చక్కని స్త్రీ నల్లని జుట్టు, కలలు కంటోన్నట్లున్న కళ్ళుగలామె కూర్చుని ఉన్నది. ‘‘మేడమ్ నన్ను గుర్తు పట్టలేదా. మీరూ?’’ అన్నాను ‘‘మీరెవరో నాకు తెలియదు’’ అన్నది ఆమె. ‘‘1944లో మీరు పోలండ్లోని బ్యూనాలో ఉన్నారు కదా!’’ అని అడిగాను.
‘‘అవును, అయినా….’’ అర్థోక్తిలో ఆగింది. ‘‘మీరు కరెంట్ సామాను వేర్హవుస్లో పనిచేశారు కదా?’’ అన్నాను. అవును. అంటూ ఒక్కక్షణ కాలం సందిగ్ధం తరువాత ` ‘‘అవును ఇప్పుడు గుర్తువచ్చారు’’ అన్నది.
‘‘ఇడెక్కపో, ఒక యూదు అబ్బాయి, మీ తీయని ఓదార్పు’’ ` అని గుర్తు చేశాను.
‘‘ఇద్దరం మెట్రో దిగి ఒక కేఫ్ టెరస్ మీదకెళ్ళి కూర్చున్నాం. చాలాసేపు మాటల్లో గతాన్ని గుర్తు చేసుకున్నాం. `‘మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా?’’ అన్నాను.
‘‘ఏమడుగుతావో తెలుసు నాకు, నేను యూదును అవునా, కాదా?’’ అని. యూదునే, ‘‘యూదు పద్ధతులు పాటించే కుటుంబం మాది. అప్పుడు నా దగ్గర దొంగ సర్టిఫికెట్ ఉంటాన ఆర్యన్గా భావించారు’. అట్లా బలవంతపు చాకిరీ చేయించారు. వాళ్ళు నన్ను జర్మనీ పంపినప్పుడు కాన్సంట్రేషన్ క్యాంపుకు వెళ్ళకుండా తప్పించుకున్నాను. నాకు జర్మన్ వచ్చునని వాళ్ళకు తెలియదు. అయినా నీవు నన్ను పట్టించవనే నమ్మకం నాకు కలిగింది’’ అన్నది ఆమె.
ఒకనాడు డీసెల్ మోటర్లను రైలులో లోడ్ చేస్తున్నాం. ఇడెక్ భయంకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు. ఈసారి అతని చూపు మా నాన్న మీద పడింది.
అరెఫూల్, ఇలాగేనా నీవు పనిచేసేది. అంటూ ఇనుపకడ్డీ పట్టి నాన్నను బాదాడు. నాన్న మొదలు లుంగ చుట్టుకుపోయాడు, పడిపోయాడు.
నేను చూస్తూనే ఉన్నాను. ఏమీ చేయలేక అటు నుండి జారుకుందా మనుకున్నాను. దెబ్బలు తప్పించుకోవటానికి. నా కోపం నాన్న మీదకు మరలింది ` ఇడెక్ బారిన ఎందుకు పడ్డాడు అనీ. కాన్సంట్రేషన్ క్యాంపు జీవితం నన్నలా మార్చివేసింది. ఫోర్మన్ ఫ్రెనెక్ నా నోటిలో బంగారం చూశాడు. తనకివ్వ మన్నాడు.
ఇవ్వలేను, అది లేనిదే నమలలేను అన్నాను. ‘‘నీవు నవల లేని ఆహారం ఏమి పెడుతున్నారబ్బా?’’ అన్నాడు.
నేను మరో ఎత్తు వేశాను. ఆరోగ్య పరీక్ష సమయంలో నా బంగారు పంటి తొడుగు గురించి రిజస్టురులో రాశారు. ‘‘నీకు యిస్తే యిద్దరం కష్టాలు పాలవుతాం’’ అన్నాను.
‘‘నీవు ఇవ్వకపోతే కష్టాలుకొని తెచ్చుకుంటునట్లే’’ అన్నాడు. మంచివాడనుకున్న వ్యక్తి అకస్మాత్తుగా అలా మారాడేమిటి? ఆశగా నా పంటి వైపు చూస్తున్నాడు. మా నాన్న నడిగి చెపుతానన్నాను.
‘‘మంచిదే రేపటికి నాకు సమాధానం కావాలి’’ అన్నాడు.
నాన్నకు చెపితే, ఎంతో సందేహించి ‘‘అలా చేయలేము’’ అన్నాడు. ‘‘అతను బదులు తీర్చుకుంటాడ’’ని చెప్పాను.
ఫ్రెనెక్కి నా బలహీనత తెలుసు. మా నాన్న ఎప్పుడూ మిలిటరీలో పని చేయలేదు. కవాతు రాదు. కాని ఒకచోటు నుండి మరో చోటుకు కవాతుతోనే వెళ్ళాలి. నాన్నకు స్టెప్ వేయటం వచ్చేది కాదు. అందుకని ఫ్రెనెక్ నాన్నను హింసించటం మొదలు పెట్టాడు.
లెఫ్ట్, రైట్ అంటూ నాన్నను కొట్టేవాడు. నాన్నకు మార్చింగ్ పద్ధతి నేర్పాలను కున్నాను. మా బ్లాక్ ముందు నేను లెఫ్ట్ రైట్ అంటుంటే నాన్న ప్రయత్నించేవాడు. మిగతా వారు చూసి నవ్వుకునేవారు. చిన్న ఆఫీసరును చూడండి పెద్దాయనకు కవాతు నేర్పిస్తున్నాడనేవారు. మీ నాన్న నీకెంత రేషన్ యిస్తున్నాడు అంటూ ఎగతాళి చేసేవారు.
నాన్న సరిగా నేర్చుకోలేదు. దెబ్బలు తప్పలేదు. ‘‘ముసలోడా, నీకింకా మార్చింగ్ చేత గావటంలేదు’’ అంటూ ఫ్రెనెక్ కొట్టేవాడు. అలా రెండు వారాలు గడిచాయి.
‘‘నేను పన్ను తీసుకోమన్నాను. ఫ్రెనెక్ ` నాకు తెలుసు, నేను గెలుస్తానని, నన్ను ఆపి ఉంచి నందుకు నీకు శిక్ష నీ రొట్టె, సూపు, నీ పన్ను పీకే వార్సా డాక్టరుకిస్తున్నాను’’ అన్నాడు.
‘‘నా పన్ను తీసుకుంటూ, నా రేషన్ గూడా తీసుకుంటావా?’’ అన్నాను.
‘‘ఫ్రెనెక్ నీ పన్ను నన్నే విరగగొట్టమన్నావా’’ అంటూ నవ్వాడు.
ఆ సాయంత్రం పంటి డాక్టరు ఒక తుప్పు పట్టిన చెంచాతో నా బంగారు పన్ను విరగగొట్టాడు.
ఫ్రెనెక్ మరల మంచి వాడయ్యాడు. అప్పుడప్పుడూ నాకు కొంచెం ఎక్కువ సూపు యిచ్చాడు. కాని అది ఎక్కువ కాలం సాగలేదు. రెండు వారాల తరువాత పోలండ్ వాళ్ళనందరినీ వేరే క్యాంపుకు మార్చారు. అలా నా పన్ను ప్రతిఫలం లేకుండా పోగొట్టు కున్నాను.
పోలండ్ వాళ్ళు ఇంకా కొద్ది రోజుల్లోనే వెళ్ళిపోతారనగా నాకు ఒక వింత అనుభవమయింది.
*****
వెనిగళ్ళ కోమల మూల్పూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారి సతీమణి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.