పేషంట్ చెప్పే కథలు – 4

ముళ్ళగులాబి

ఆలూరి విజయలక్ష్మి

          “హలో రేఖా!” చిరునవ్వు అధరాలపై అందంగా మెరుస్తూండగా లోపలికి అడుగు పెట్టింది శృతి. సోఫాలో పడుకున్న రేఖ కళ్ళ చుట్టూ నల్లని వలయాలు. పసిమిరంగు శరీరం వన్నె తరిగినట్లు వుంది. చురుగ్గా, ఉత్సాహంగా ఉండే చూపులు నిర్లిప్తంగా, స్తబ్దంగా ఉన్నాయి.

          “సారీ మేడం! మీ కసలే తీరికుండదని తెలిసీ అక్కడిదాకా రాలేక ఇంటికి రప్పించాను. పైకిలేస్తే కళ్ళు తిరుగుతున్నాయి.’

          “ఫర్వాలేదు” రేఖ పల్స్ గమనిస్తూ అంది శృతి. 

          “తీవ్రమైన అలసట, నీరసం తప్ప మరేం కనిపించడం లేదు – ఎనీ వె, రేపోసారి హాస్పిటల్ కి రా. బ్లడ్, యూరిన్ – అన్నీ టెస్ట్ చేయిద్దాం” రేఖకు ఇంజక్షన్ చేస్తూ చెప్పింది శృతి.   

          “అలాగే మేడం, అప్పుడే ఇరవై రోజుల నుంచి మీ దగ్గరకు రావాలని ప్రయత్నం. కానీ తీరడం లేదు.”

          షోకేస్ లో అందంగా అమర్చివున్న రకరకాల బొమ్మల్ని, ఆర్ట్ పీసెస్ ని ప్రశంసగా చూస్తూంది శృతి. మంచి గృహిణిగా, సమర్థురాలైన లెక్చరర్ గా బిజీగా వుంటూ కూడా యివన్నీ తయారుచేసి, కళాత్మకంగా అమర్చే అభిరుచిని నిలుపుకోవడం సంతోషం కలిగించింది.

          “అబ్బ! ఎంత ఓపిక నీకు?! ఇవన్నీ నువ్వు చేసినవే కదూ?!”

          “నేను చేసినవే. గత వైభవపు చిహ్నాలు. స్టూడెంట్ గా ఉన్నప్పుడూ, పెళ్ళైన కొత్తలో నూ చేసినవి” నిట్టూర్చింది రేఖ. 

          అంతలో రేఖ కూతురు మనోఙ్ఞ స్నానం చేసి, టవల్ చుట్టుకుని వచ్చి రేఖను బట్టలు తీసివ్వమని అడిగింది. రేఖ బలవంతాన లేచివెళ్ళి బట్టలు తీసిచ్చింది. తిరిగొస్తూ తూలిపడిపోబోయిన రేఖను చటుక్కున లేచి చెయ్యి ఆసరా యిచ్చి సోఫాలో పడుకోబెట్టింది శృతి. 

          “వాట్ హాపెండ్ మమ్మీ!” క్రికెట్ బాట్ పుచ్చుకుని పరిగెత్తుకుని వచ్చిన సందీప్ తల్లి దగ్గర ఓ క్షణం ఆగి చెస్ బోర్డు తీసి, మేనత్త కొడుకు సారధితో ఆడసాగాడు.  

          “మనోజ్ఞ! అమ్మకు కొంచం మంచినీళ్ళు తీసుకురామ్మా!” ఫ్రాక్ హుక్స్ కూడా పెట్టుకోకుండా సోఫాలో చేరగిలబడి కామిక్స్ చదువుకుంటున్న పదేళ్ళ మనోజ్ఞ, పన్నెండేళ్ళ సందీప్, దాదాపు అంతే వయసున్న సారధి, ముగ్గురూ శృతి చెప్పింది విన్నారు. రెండు నిమిషాలు గడిచినా ఎవరూ లేచే ప్రయత్నం చేయకపోవడంతో నర్స్ తో తెప్పించింది శృతి. 

          “ఏమిటి మేడం, అంత షాకయ్యారు – మా చిరంజీవుల్ని చూసా?” విచారంగా నవ్వింది రేఖ. మౌనంగా చూస్తూంది శృతి. మనోజ్ఞ పుస్తకం సోఫాలో విసిరేసి బయటకు పరిగెత్తింది. సందీప్, సారధి ప్రపంచం తల్లక్రిందులైన తెలియనంతటి సీరియస్ నెస్ తో ఆటలో నిమగ్నులయ్యారు. 

          “మేడం! నా అనారోగ్యానికి కారణం వీళ్ళే.” శృతి ఆశ్చర్యం రెట్టింపయింది. 

          “ఫన్నీ! పిల్లలు నీ అనారోగ్యానికి కారణమా?”

          “మేడం! నేను చెప్పేది వింటే మీకు సిల్లీగా కనిపిస్తుందేమో కూడా! నేను, ప్రసాద్ ఏం చెయ్యాలో తోచక సతమతమయిపోతున్నా” తనూ, ప్రసాద్ ఒకరి కోసం ఒకరు తపించి పోవడం, ఇద్దరికీ ఉద్యోగాలు దొరికి పెళ్ళితో తమ అనుబంధాన్ని మరీ సన్నిహితం చేసుకోవడం, కమ్మని కబుర్లతో, కలిసి పనిచేసుకోవడంతో, చిలిపి అల్లర్లతో రోజులు నిమిషాల్లా దొర్లిపోవడం, సాయం సమయాల్లో స్కూటర్ మీద ప్రసాద్ వెనుక కూర్చుని పలకరిస్తున్న చల్లగాలిని కుసలమడుగుతూ రివ్వున దూసుకుపోవడం – పెళ్ళైన రెండేళ్లకు తన ఒడిలో సందీప్, మరో రెండేళ్ళలో మనోజ్ఞ. ఎంత థ్రిల్లింగ్ గా, ఎంత సంతోషంగా గడిచిపోయేవి రోజులు!  

          “మా మామగారు పోయి ఆరేళ్ళయింది. అప్పటినుంచి అత్తగారు మా దగ్గరే వుంటున్నారు. ఆవిడ వచ్చిన దగ్గర్నుంచి మా రొటీన్ మారిపోయింది… మా ఆడబడుచు- పల్లెట్టూల్లో సరిగ్గా చదువబ్బడం లేదని సారధిని ఇక్కడకు పంపింది. ముగ్గురు పిల్లలు, ఇంటెడు పని, కాలేజి… నేను సంతోషంగా ఉంటే బహుశా ఇవన్నీ చురుగ్గా చక్కబెట్టుకునే దాన్నేమో!” రేఖ మాటలు వింటూ శృతి ఆలోచిస్తూంది. ఏమిటీ అమ్మాయి సమస్య? ప్రసాద్ సరిగ్గా చూసుకోవడం లేదా?!

          “మా అత్తగారికి వీరమడి. అంచేత పని మనుషులతో చేయించుకునే ప్రస్నేలేదు. పెద్ద పనుల్ని పిల్లల కెలాగూ అప్పచెప్పం కదా! చిన్న చిన్న పనులు కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకపొతే ఎలా చెప్పండి? ఇందాక చూసారుగా మీరు? స్నానంచేసి బట్టలు కూడా తీసుకోదు మనోజ్ఞ. వాడూ అంతే. ప్రతీదీ నేను అమర్చి పెట్టాలి. బూట్లు పాలీష్ చేయడం దగ్గర్నుంచి హోంవర్క్ దాకా నేనే చూడాలి. ఇదంతా మా అత్తగారి గారాబం ఫలితం. వాల్లకేదైనా పనిచెప్తే చాలు – చిన్నపిల్లలు వాల్లేందుకు పనులు చేసి కంది పోవాలని వాళ్ళను వెనకేసుకొస్తూ మాట్లాడుతుంది…” తన హృదయంలోని బాధను విని, అర్ధం చేసుకోగల శ్రోత దొరికిందే చాలనుకుని చెప్తూంది రేఖ. 

          “ప్రసాద్ హెల్ప్ చేయరా!”

          “ప్రసాద్ ఆవిడ రాకముందు నా వెంట వెంట వుండి అన్నిటికి హెల్ప్ చేసేవాడు. ఇద్దరం కలిసి చేసుకుంటూంటే పని చేస్తున్నట్లనిపించేదే కాదు. ఇప్పుడు ప్రసాద్ వంటింటి ఛాయలకు వాచ్చాడంటే చాలు, చెట్టంత మగాడు ఆడంగి పనులు చేయడమేమిటంటూ మూడో ప్రపంచ  యుద్ధం వచ్చినంత హడావిడి చేస్తుందావిడ.”

          “బావుంది. కనీసం ఆవిడయినా చేస్తుందా పని?” రేఖ ముందే, తన అత్తగారు ఉరికెళ్ళిందని చెప్పడంవల్ల దైర్యంగా అడిగింది శృతి.  

          “ఆవిడ చెయ్యడం ప్రసాద్ కి ఇష్టం ఉండదు. ఇంకా గొడవెందుకని నేనేచేసుకుంటాను. అసలు పనులు చేసుకోవడం కాదు నాప్రాబ్లమ్… పిల్లలు ఏపనీ రాకుండా, ఏ పనీ చేసే అలవాటు లేక, సోమరులుగా, అసమర్థులుగా ఉండిపోతారేమోనని నా భయం… తల్లిగా నా పిల్లల మీద నేను పెట్టుకున్న ఆశలు వేరు, వ్యక్తిగా నేను కోరుకున్న జీవితం వేరు. నా పిల్లలు ఇటు పనిలోనూ, అటు చదువులోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ నెంబర్ వన్ గా ఉండాలి. చురుగ్గా, బలంగా, కొండలనైనా పిండిచేస్తాం అన్నంత దీమాగా ఉండాలి… నా భర్త, నేను సన్నిహితంగా కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకోవడం నాకానందాన్ని కలిగిస్తుంది. నాకంటూ కొంత టైంని మిగుల్చుకుని, కొత్త రకం బొమ్మలు చేయడం, ఎంబ్రాయిడరీ చెయ్యడం, నచ్చిన పుస్తకాలు చదవడం… ఇంకా ఈ అందమైన కల కలగానే మిగిలిపోతుందా అన్న నిస్పృహ… నా పరిధి కేవలం ఈ చిన్ని కుటుంబం మాత్రమే కాదు, లెక్షరర్ గా నాకో పవిత్రమైన బాద్యతుంది. అనుక్షణం అబిఫ్రుద్ది చెందుతున్న సైన్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుని, క్లాసులో చెప్పవలసిన నేను, ఆ అవకాశం లేక యాంత్రికంగా మొక్కుబడి తీర్చుకుంటున్నట్లుగా చెప్పేయడం – నా వృత్తికి ద్రోహం చేస్తున్నట్లుగా, నా బాధ్యతను నిర్వర్తించడంలో నేను ఫెయిలవుతున్నట్లుగా… అసంతృప్తి. ఈ స్థితిని మార్చాలన్న తపన, నేను కోరుకున్న జీవితాన్ని సాధించాలన్న తహతహ, అత్తగారికి గట్టిగా చెప్పలేని అసమర్థత, దారి తప్పుతున్న పిల్లల్ని మార్చలేని అసహాయత, ఈ సంఘర్షణవల్ల ప్రసాద్ కీ, నాకు మధ్య పలుచని తెర జారుతుందేమో నాన్న భయం…” చెప్పుకుపోతూంది రేఖ. 

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.