చిత్రం-37

-గణేశ్వరరావు 

          19 వ శతాబ్దానికి చెందిన జేమ్స్ మెక్నీల్ విజ్లర్ వేసిన ఈ సమస్యాత్మక తైలవర్ణ (నలుపు-బూడిద రంగు) చిత్రం ‘చిత్రకారుడి తల్లి’ మోనాలిసా లాంటి చిత్రాల్లా ప్రపంచ ప్రసిద్ధి గాంచిoది..
 
          సీదా సాదాగా కనిపిస్తున్న ఈ చిత్రం విలువ 700 కోట్ల రూపాయలు. అమెరికా అధ్యక్షుడు ఈ చిత్రం చూడడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రదర్శనకు వెళ్ళాడు, అమెరికా ప్రభుత్వం దీన్ని సంస్కృతి సంపద గా భావించి ఒక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది.
 
ఈ చిత్రం అంతగా ఆకర్షించడానికి కారణాలు ఏమిటో చూద్దాం:
 
          ఈ వాస్తవ చిత్రణ లోని గొప్పతనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమే. ఆ చిత్రం విజ్లర్ వేసినప్పుడు గొప్ప ఆర్థిక మాంద్యo నెలకొని వుంది. విజ్లర్ బొమ్మను ఆ కాలం లోని అమ్మలందరి ప్రతీకగా గుర్తించారు, ఆమెను ఒక విరాగిగా కష్టాల పాలైన వ్యక్తిగా చూసారు. చిత్రంలో వేరే కథనం లేదు, కేవలం వ్యక్తి అధ్యయనం వుంది.
 
          చిత్రంలో ఒక వృద్ధురాలు చేతులు ఒళ్ళో పెట్టుకొని కుర్చీలో ముందుకు వంగి కూర్చునుంది, శూన్యంలోకి చూస్తోంది, ఆమె మన వైపు చూడటంలేదు, మనమే ఆమె కేసి చూస్తున్నాం. లేసుతో అల్లిన తెల్లని టోపీ పెట్టుకుంది. తెల్లని రుమాలు చేతిలో వుంది. జాగ్రత్తగా చూస్తే, ఆమె వేలికున్న ఉంగరo కూడా కనిపిస్తుంది. కాళ్ళకి ఆధారంగా ఒక పీట. ఆమె వేసుకున్న దుస్తులు ముదురు నలుపు . చేతులు, మొఖం – గులాబీ, పసుపచ్చ కలిసిన లేత రంగు. ఎడమవైపున పూల డిజైన్ ఉన్న పెద్ద తెర. కాంతి వంతంగా కనిపిస్తున్న ఈ రంగులు వస్తువు కి జీవం పోస్తున్నాయి. అంతే కాక దట్టమైన రంగులో వేయబడ్డ దుస్తులకు, వాటికి మధ్యనున్న వ్యత్యాసాన్ని చూపుతున్నాయి. కేవలం grey – black సంవిధానంతో చిత్ర రచన జరిగింది . అవి ఆమె అస్తిత్వాన్నీ మరుగుపరుస్తున్నాయి, తొంగి చూసే జనాన్ని దూరంగా ఉంచడానికా అన్నట్లు ఆమె తన ఒళ్ళంతా అలా కప్పుకుంది. ఆమె ముందున్న దీర్ఘచతురస్రాకారం తెర, గోడమీదున్న చిన్నచిత్రం (విజ్లర్ వేసిన థేమ్స్ నది చిత్రమే!) – ఆమె కూర్చున్న భంగిమకు సమతౌల్యం కలిగిస్తున్నాయి.
 
          విజ్లర్ బొమ్మని నిరాడంబరంగానే వేసాడు. కానీ దాన్ని బిగించిన చట్రాన్ని తానే స్వయంగా రూపకల్పన చేస్తూ, అందులో భేషజం కనబరిచాడు. . లేకపోతే దానికి బంగారు రంగు, ఆ డిజైన్ నప్పుతాయా? చాందస మతస్తురాలైన తల్లిని అంతగా అలంకరించిన గదిలో చూపడం కూడా అసమంజసమే.
 
          దీనికి సంబంధించిన కొన్ని విశేషాలు; మొదట విజ్లర్ తన చిత్రం కోసం ఒకామెని మోడల్ గా ఉండమన్నాడు. అయితే సమయానికి ఆమె రాకపోవడం వలన, విజ్లర్ తల్లే ముందుకొచ్చింది. మొదట తల్లిని కూర్చొనే భంగిమ లో కాక నిలుచున్న భంగిమలో చిత్రం గీయాలనుకున్నాడు. కానీ తల్లి అంతసేపు నిల్చో లేకపోవడం చూసి , ఆమె భంగిమను మార్చవలసి వచ్చింది.
 
          ‘బీన్’ అనే సినిమాలో హీరో ఈ బొమ్మ అసహ్యంగా ఉందని అంటాడు. నిజానికి విజ్లర్ తల్లికి కూడా అలాగే అనిపించి కొడుకుని తన పేరు బయట పెట్ట వద్దని కోరింది.
విజ్లర్ అమెరికన్, కానీ తాను వలసపోయిన దేశం ఇంగ్లాండ్ లో ఈ చిత్రాన్ని రూపొందించాడు. అందుకే ఇది అటు అమెరికా అమ్మతనానికి ప్రతీకగానూ , ఇటు విక్టోరియా మోనాలిసా గానూ పేరు పొందింది.
 
          మహత్తరమైన మాతృత్వంలో దాగిన మర్మాలను ఈ చిత్రం విశదీకరించడానికి ప్రయత్నిస్తుంది. ఆకాశంలో సగం అమ్మలే! అందరికీ అమ్మలు ఉంటారు. కొంత మంది వస్తువూ, ఇతివృత్తమూ ఒకటే అనుకుంటారు. కాదు. ఉదాహరణకి ఈ చిత్రాన్ని తీసుకోండి. ఇందులోని వస్తువు – అమ్మని అధ్యయనం చేయడం. ఇతివృత్తం: ఒంటరితనం, ఏదో కోల్పోయానన్న భావన, మనసును శూన్యం ఆవరించడం, జీవితంలో నిరాసక్తత వగైరా.. వగైరా.. వస్తువును గుర్తించడం సులభం. ఇతివృత్తాన్ని ఒక్కొక్కరూ ఒక్కొక్కలా అర్థం చేసుకుంటారు, అది వాళ్ళ వాళ్ళ దృక్పథాల మీద ఆధార పడి ఉంటుంది.
         
          కొడుకుని కోల్పోయిన ఒక తల్లి ఆవేదన లేదా మరణం కోసం ఎదురు చూస్తున్న ఒక ముసలామె, ఆమె అని అనుకోలేమా? విశ్లేషణ ఊహాత్మకంగానే వుంటుంది. నైరూప్య చిత్రాలే కాదు, వాస్తవ చిత్రాలను కూడా విజ్ఞుల విశ్లేషణ సాయం లేకుండా అర్థం చేసుకోవడం కష్టం!
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.