కొత్త అడుగులు – 33
తెలంగాణా లో బలమైన స్వరం –‘అనామిక’
– శిలాలోలిత
‘అనామిక’ పేరుతో సాహిత్య లోకానికి పరిచయమైన వ్యక్తి సోన్నాయిలి కృష్ణవేణి. తెలంగాణా భూమి కన్న మరో జాతి విత్తనం. ఆ అక్షరాల్లో ఎంత పదునో, ఎంతధిక్కారమో, ఎంత ఆవేశమో, ఎంత తిరుగుబాటు తనమో ఆమె కవిత్వమే చెల్లుతుంటుంది.
అనామిక ను మొదటిసారి గా ‘లోమవాన్’ లో జరుగుతున్న ‘కవిసంగమం’ సీరీస్ లో చూసాను. అప్పటికి ఆరోగ్యం గా ఉంది. అసమానతల గరళాన్ని గొంతులో అదిమి పట్టి పీల్చినట్లు అద్భుతమైన కవిత్వాన్ని వినిపించింది.
ఆ తర్వాత తెల్సింది ‘నరేష్ కుమార్’ హఫీ ‘అక్క’ అని. ఇద్దరూ ఇద్దరే. ఆ యింటి నుండి వెలువడిన, కవిత్వ గాఢత ఉన్న కవులే.
అనామిక ను ఇలా స్పృశించీ స్పృశించగానే గాజు పలకలా భళ్ళుమంది. తనతో మాట్లాడిన ప్రతీ మాటా ఒక వేదనా కెరటమే.
భావజాలానికి దగ్గరగా ఇక్కడెవరూ కనిపించలేదు. చేసే ప్రతి పనిలోనూ లోపాలు వెతకడం, ప్రతి సందర్భంలోనూ అమ్మా నాన్నల ప్రస్తావన తెచ్చి మాటలనడం, ఇట్లా మెల్ల మెల్లగా మనుషుల్ని వదిలేసి పెన్ను, పేపర్లతో స్నేహం చేయడం మొదలు పెట్టాను. శవరం, మనసు గాయపడ్డ పతీసారీ నన్ను ఓదార్చింది నా అక్షరాలే. అదేంటో ఏడుపొచ్చిన ప్రతీసారీ అమ్మ కన్నా ఎక్కువగా నాన్న గుర్తొచ్చేవాడు. బాధ కదిలినప్పుడు మనసారా ఏడ్చే స్వేచ్చకూడా లేని జీవితం. ఆ జీవితంలో నా ఆనందం నా కవిత్వం”. చాలా ధైర్యంగా తనకు తాను పరిస్థితుల్లో ఎదురుపడి యుద్ధం చేస్తున్న, వ్యక్తీకరించ గలుగుతున్న ధైర్యం మెచ్చుకో దగ్గది. సాహిత్యం తనను తాను ఓదార్చిన తీరు, చెమరిస్తున్న అక్షరాలే చెబుతున్నాయి.
అలాగే కుటుంబం గురించి చెప్పాలంటే, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఇప్పటికీ నన్ను, పిల్లలను బాధపెడుతున్న ఆ మనిషి గురించి చెప్పడం నా కిష్టం లేదు. నా ముగ్గురు పిల్లలూ బంగారాలు. పెదబాబు, పాప ఇద్దరూ డిగ్రీ, చిన్నాడు ఐటిఐ చదువుతున్నారు అంది.
ఇక కవిత్వం గురించి చెప్పాలంటే కవి మనసులో కదిలే సంఘర్షణ, భావోద్వేగాల అక్షర రూపమే కవిత్వం అనే మాట కవిత్వానికి నిర్వచనం అని చెప్పొచ్చు. కొంతమంది కవుల కవిత్వాన్ని చూస్తుంటే, కవిత్వం అంటే కేవలం అక్షరాలను అందం గా రాస్తే, ప్రాసలు కూర్చితే చాలు అనుకుంటున్నారేమో అన్పిస్తోంది. కానీ ‘శ్రీశ్రీ’ అన్నట్టు కదిలేది, కదిలించేది,పెనునిద్దర వదిలించేది అయినా అయిఉండాలి లేదా ‘కాళోజీ’ అన్నట్టుగా లక్షల మెదళ్ళని కాకపోయినా కనీసం ఒక్కరినైనా ఆలోచింపచేసే విధంగా వుండాలి. ఇది నా కవిత్వం పైనా అభినయం”. అన్నది.
అనామిక పుట్టింది, పెరిగింది కరీంనగర్ (పెద్దపల్లి) జిల్లా లోని మంగలిపల్లె అనే గ్రామంలో. పదోతరగతితోనే తెగిన చదువుని పన్నెండేళ్ళ తర్వాత కొనసాగించి, తెలుగు పి.జి., యెమ్.ఇడి వరకూ వచ్చింది స్వశక్తి తో. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పి.జి. టీచర్. శిల లాంటి తనను శిల్పంగా మార్చి ఆమె ఆలోచనలను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి పరిచయం చేసిన ఉలి కవిత్వం. సాహిత్య లోకానికి పరిచయం అయిన సందర్భం ఒక ఉద్యమకారుడికి (జీతాక్ మరాండి) మద్దతుగా నిలిచి రాసిన కవిత. సమాజాన్ని చదవడం కూడా సాహిత్యం ద్వారానే నేర్చుకుంది. అంగున్ కవిత్వమంటే అంతిష్టం.
నాన్న మీద మనసుకు హత్తుకునేలా రెండు మూడు కవితలకు సైదిన్ రాసిన ‘ఎదిరి హస్తాన’ కవిత చదువరులను కూడా కన్నీటిలో ముంచెత్తుతుంది.
‘ఎట్ల మరుకాలే నాన్నా
ఎలుగుపూల చెట్టాలె
మా బతుకుల్ల
ఎన్నీల గురికిచ్చిన నుట్లే
మా మనసుల్ని సీకటిజేసి
ఎల్లిపోయిన రోజును – ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలను కలగలిపి రాసిన పెద్ద కవితా ఇది.
మరో కవితలో –
ఆ వలస కూలీలు అనవసర
బరువెందుకనుకున్నారేమో
ప్రాణాలను దారిలోనే వదిలేసి
పోయారు…
–మరో కవిత
ఆ గదిని నిర్మించినదెవరో
గోడలు పై కప్పు మాత్రమే కట్టి
వదిలేశారు
గోడలకు రెండు వైపులా
రెండు రెక్కలనూ కట్టి వుంటే బావుండేది.
-రెక్కలు కోల్పోయిన , మొండి గొడలే స్త్రీ జీవితాన్ని వివరించింది.
కవిత్వమవ్వాలనుంది
…ఎదుగుతున్న బాల్యానికి
తేనె పూసిన కత్తుల
నిజస్వరూపాన్ని
గ్రహించండం నేర్పాలనుంది.
సీతాకొక చిలకలను
పడగెత్తిన తాచుపాముల
పడగొట్టే ధైర్యాన్ని
కానుకివ్వాలనుంది….
నిరంతర చైతన్య ప్రవాహాన్నై
రేపటి తరంలోకి
ప్రవహించాలనుంది…
అందుకే నాకు కవిత్వంలా మారాలనుంది”…
అంటూ తాను ఏం కావాలనుకుందో, కోరుకున్న సమాజపు రీతి మార్చాలనే తపనతో, నిజాయితీతో రాసిన కవిత ఇది.
‘అప్పుడప్పుడు- కవిత భావగాఢతను నింపుకుంది.
లోకపు టన్యాలను చూసి
కవిత్వమయ్యే నేను
అప్పుడప్పుడు నా ప్రాణమే
ఆవిరవుతున్న కనీసం
అక్షరమైనా కాలేదు.
కవులందరూ అనుభవించే స్థితే ఇది. స్తబ్దత ఎక్కువైపోయినప్పుడు అక్షరం రాయిలా మారిపోతుంది.
–“అత్తలు” అనే మరో కవిత.
“అ అంటే అణుకువ
ఆ అంటే ఆడపిల్ల అని
అణుకువ ఆడపిల్ల లక్షణమని
చెప్పిన పెద్దోళ్ళలో
మరి, మగపిల్లల లక్షణమేమిటని అడగలేకపోయినా
పెళ్ళిచూపుల్లో
నా అందాన్ని, నాన్న ఆస్తినే ఆరా తియ్య నట్టె మరి
గాయాల వర్షంలో తడిసాక,‘అ’– అంటే అబల అని,‘ఆ’-అంటే ఆవేదన అని తెలిసొచ్చిందట.
రక్షణ లేని సమాజాన్ని చూసి –‘అ’ అంటే అవయవాలని,‘ఆ’ అంటే ఆడతనమని అర్ధమైందట.
ఇప్పుడు కొత్తర్ధం నేనే
‘అ’ అంటే అక్షరమని
‘ఆ’ అంటే ఆయుధమని
విద్యలో విలువల్ని జోడించి
ముందు తరంలోనైనా
మృగాలుగా మారని మగాళ్ళని చూడాలి.
మరో కవిత “నేను కవిత్వాన్ని” ఈ కవితలో చివర్లో ఇలా అంటుంది.
‘అవమానింపబడ్డ చోట
ఎగిసే అగ్గి మంటను నేను
తిరస్కరింప బడ్డ చోట
ఆత్మాభిమానపు పతాక నేను
నేను కవిత్వాన్ని….
ఉదయించే ప్రశ్నను నేను
దారి చూపే సమాధాన్నినేను
ఎత్తిన పిడికిలి నై నినదించే
పోరాట పటిమను నేను
నేను కవిత్వాన్ని….
‘నిన్న బొమ్మ’ కూడా ఆర్ధ్రతను నింపుకున్న కవిత. ఎన్నో మంచి కవితల్ని రాసింది ‘అనామిక’ . ఐనా తన గురించి ఇంకా తానెన్నడూ ఆలోచించని అనామిక పుస్తకం ఇంత వరకూ తేలేదు. ఇప్పటికైనా వేస్తుందనే చిరుకోరికే ఈ పరిచయం ఈ నాలుగువాక్యాలన్నా ఆమెలో కదలిక తెచ్చి అక్షరాల పొగును పుస్తకంలా పేర్చుతుంది. ఎదురుచూస్తుంటాను.
*****