అనుసృజన

మీరా పదావళి

అనువాదం: ఆర్.శాంతసుందరి

          భక్తి అనే మాటకి ఆరాధన, విశ్వాసం, అంకిత భావం లాంటి అనేక అర్థాలు ఉన్నాయి. భారతీయ భాషల్లోని సాహిత్యంలో భక్తి విభిన్న రూపాల్లో వ్యక్తమయింది. హిందీ సాహిత్యంలో భక్తి సాహిత్యం 1375 నుంచి 1700 వరకు అని నిర్ణయించడమైంది. ఈ నాలుగు శతాబ్దాలలోనే తులసీదాస్, సూరదాస్, మీరాబాయి, కబీర్ వంటి కవులు
తమ కావ్యాలనీ , కవితలనీ, పదాలనీ రాశారు. తులసీదాస్ ది దాస్యభక్తి (తులసీదాస్ రచించిన ‘రామ్ చరిత్ మానస్’ ని ‘తులసీ రామాయణం’ గా పేర్కొంటారు. బనారస్ లో ‘తులసీ మానస్ మందిర్’ అనే ఒక దేవాలయం పూర్తి పాలరాతితో నిర్మించారు. ఆ ఆలయం లోపలి గోడల మీద రామ్ చరిత్ మానస్ ని దేవనాగరి(హిందీ) లిపిలో చెక్కారు.) సూరదాస్ ది సఖా భక్తి, మీరాబాయిది మధురభక్తి. కబీర్ ది విలక్షణమైన దృష్టి. ఆయన కవితల్లో దేవుడు నిరాకార నిర్గుణ రూపం. జీవితం లోని లోతైన అనుభవాల్లోంచి వచ్చిన కవితలవి.

          మీరా గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు :
1. మీరా ని రాజస్థానీ భాషలో మీరా((న్) అనాలి.
2.మీరా పుట్టిన సంవత్సరం గురించి ఏకాభిప్రాయం లేదు. వికిపీడియాలో 1504 అని ఉంది.
3.మీరా రచనలని హిందీ సాహిత్యకారులు ‘మీరా పదావళి’ అంటారే తప్ప మీరా భజనలు అనరు. అది వాటిని తర్వాత పాడేవాళ్ళు, ఆమెను భక్తురాలిగా చూపించేందుకు ప్రయత్నించే వాళ్ళు వాడిన మాట. మీరా నూటికి నూరు పాళ్ళు ప్రేమికురాలు, విరహిణి, తన ప్రియుణ్ణి ఆరాధిస్తూ లోకం ఏమనుకుంటుంది అని పట్టించుకోని తెగువ ఆమెది. ఒకరిద్దరు ఆమె ప్రియుడు లౌకికమైన మనిషని అన్నారు.లేకపోతే అంత తీవ్రమైన భావోద్రేకం ఎవరికీ కలగదని వారి నమ్మకం.
4.ఇటువంటి అభిప్రాయాలు వెలువడటానికి వాళ్ళు ఆధారాలు కూడా చూపారు. మీరా, ‘నేను నీ దాసీని, నువ్వు నా ప్రభువు ‘ అనడం నిజంగా ఆమె పాడిన పాటలు కావనీ, తర్వాత భక్త కవులు వాటికి అక్షరరూపం ఇచ్చేప్పుడు జోడించారనీ వాళ్ళు నిరూపించే ప్రయత్నం చేశారు. మీరా తన భర్తతో అసలు కాపురమే చేయలేదని, అతను చనిపోయాక మరిది ఆమెను భార్యగా కోరుకుంటే ఆమె తిరస్కరించే సరికి విషమిచ్చి ఆమెను హత్య చేయాలని చూశాడనీ కూడా ఒక కథ ఉంది. భర్త మరణించాక మీరా సతీ సహగమనం చెయ్యలేదు. స్వేచ్ఛ ప్రకటించి బృందావనానికి వెళ్ళింది. సాధు సన్యాసులు వెంట పాటలు పాడుతూ తిరిగింది.
5.మీరా ది స్వచ్ఛమైన ప్రేమ. అందుకే ఆమె రచనల్లో అంత ఉద్వేగం, ఆరాధన. ఆంగ్లంలో రెండు మాటలు ఉన్నాయి- పాషన్(passion), అబ్సెషన్(obsession)-మొదటి మాటకి ‘తీవ్రవాంఛ’ రెండో మాటకి ‘ మనసుని పూర్తిగా అక్రమించటం’ అని అర్థం. మీరా రచనల్లో ఎక్కువగా మనకి కనిపించే విరహవేదనకి కారణం ఈ రెండు భావాలే కదా?

          మీరాబాయి రాజస్థానీ భాషలో రాసింది. లతా మంగేష్కర్ ఆ పాటలని రాజస్థానీ భాషలోనే పాడింది. ఆమె తమ్ముడు, హృదయనాథ్ మంగేష్కర్ ఆ పాటలకి అద్భుతమైన సంగీతాన్ని కూర్చాడు.మనందరికీ బాగా తెలిసిన మీరా భజన్- మేరే తో గిరిధర్ గోపాల్- దీనిని మీరా రాసిన భాషలో వినిపిస్తున్నాను. కవి రాసిన మూల భాషలో వింటే ఆ ఆనందమే వేరని మీకు కూడా అనిపిస్తుందన్న నమ్మకం నాకుంది. హిందీ చదవలేని వారి కోసం, తెలుగు లిపి లో ఇస్తూ, భావాన్ని రాసాను. కేవలం మీరా పాటలు విని తన్మయులైన వారు ఎందఱో నాకు తెలుసు, పాటలలోని భావం, అర్థం తెలిసాక వారి ఆనందం ద్విగుణీకృతం అవుతుందని తెలుసు.

***

మ్హారా రీ గిరిధర్ గోపాల్ దూసరా న కూయా
సాధా సకల్ లోక్ జోయా దూసరా న కూయా
( నాకు గిరిధర గోపాలుడు తప్ప ఇంకెవరూ లేరు
ఈ లోకమంతా గాలించి చూసినా ఎవరూ లేరనే అనిపిస్తోంది)

భాయా ఛాడ్యా బంధా ఛాడ్యా ఛాడ్యా సగా బూయా
సాధు సంగ్ బైఠ్ బైఠ్ లోక్ లాజ్ ఖూయా
(బంధువులనీ, బంధాలనీ వదిలేశాను, సొంతమంటూ ఎవరూ లేరు
సన్యాసుల సాంగత్యంలో ఉంటున్నందుకు లోకంలో మర్యాద కోల్పోయాను)

భగత్ దేఖ్యా రాజి హ్యా లగత్ దేఖ్యా రూయా
దూధ్ మథ్ ఘృత్ కాఢ్ లయా డార్ దియా ఛూయా
(భక్తులను చూస్తే ఆనందం నాకు లౌకిక జీవితం చూస్తే దుఃఖం
పాలు చిలికి వెన్న తీసుకున్నాను, పనికిమాలినది పారవేశాను)

రాణా విషరో ప్యాలా భేజ్యా పీయ్ మగణ్ హూయా
మీరా రీ లగణ్ లగ్యా హోణా హో జో హూయా
(రాణా విషం నింపిన పాత్ర పంపాడు దాన్ని ఆనందంగా తాగాను
మీరా ! నా మనసు (గిరిధరుడిలో) లగ్నమైపోయింది ఇక ఏమైతే అదే అవుతుంది)

***

          లతా కంఠం, పాటకి కూర్చిన సంగీతం ఒక ఎత్తయితే, ఈ పాటలో వినిపించే వేణు నాదం మరో ఎత్తు.

కిను సంగ్ ఖేలూం హోలీ
పియా త్యజ్ గయే అకేలీ
(నేను హోలీ ఎవరితో ఆడను?
ప్రియుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడే!)

మాణిక్ మోతీ సబ్ హమ్ ఛోడే
గల్ మే పహనీ సేలీ
భోజన్ భవన్ భలో నహీం లాగై
పియా కారన్ భయీ రే గేలీ
ముఝే దూరీ క్యో మ్హేలీ
( మాణిక్యాలూ ముత్యాలూ అన్నీ వదిలేశాను
మెడలో తులసి మాల వేసుకున్నాను
భోజనం , ఇంత పెద్ద భవనం నాకు నచ్చటం లేదు
ప్రియుడి వల్లే ఈ స్థితికి వచ్చాను
అయినా మరి నన్నెందుకు దూరం పెట్టాడు !)

అబ్ తుమ ప్రీత్ అవరసూ జోడీ
హమసే కరీ క్యో పహేలీ
బహు దిన్ బీతే అజహునా ఆయే
లగ్ రహీ తాలా బేలీ
కిను బిలమా యే హేలీ
( ఇప్పుడు నువ్వు ఇంకొకరితో ప్రేమ సంబంధం పెట్టుకున్నావు
మరి నన్నెందుకిలా ఇరకాటంలో పెట్టావు?
ఎన్ని రోజులైంది, ఇప్పటికీ నువ్వు రాలేదు
నాకు ఎటూ తోచకుండా కలవరంగా ఉంది
నా దగ్గరకు రాకుండా నిన్ను ఇలా కట్టిపడేసిందెవతె?)

స్యామ్ బినా జివడో మురఝావై
జైసే జల్ బిన్ బేలీ
మీరా కూ ప్రభు దరసన్ దీజ్యో
మై తో జనమ్ జనమ్ కీ చేలీ
దరస్ బినా ఖడీ దుహేలీ
( శ్యామసుందరుణ్ణి చూడకపోతే నా మనసు (దిగులుతో)వాడిపోతుంది
నీళ్ళు లేని పూలతీవలా
మీరా హృదయవల్లభా , ఒకసారి దర్శనమీయవా
నేను జన్మ జన్మలకీ నీ చెలినే కదా !)

***

నంద నందన్ దిఠ్ పడయా మాయి సాంవరో
డార్యా సబ్ లోక్ లాజ్ సుధ్ బుధ్ బిసరాయీ
(నంద నందనుడు , నా ప్రియుడు కనిపించాడమ్మా 
లోకం నిందిస్తుందన్న భయం వదిలేసి మైమరచిపోయాను)

మోర్ చంద్ర్ కా కిరీట్ ముగుట్ జబ్ సోహాయీ
కేసర్ రో తిలక్ భాల్ లోచన్ సుఖదాయీ
( నెమలి పింఛం కిరీటం పైన అందంగా అమరింది
నుదుట కస్తూరీ తిలకం(చూసేవారి) కళ్ళకి ఆహ్లాదం చేకూరుస్తోంది)

కుండల్ ఝలకా కపోల్ అలకా లహరాయీ
మీణా తజ్ సరవర్ జ్యో మకర్ మిలణ్ ధాయీ
( కుండలాల మెరుపు బుగ్గలమీద తళుక్కుమంటూంటే కురులు (గాలికి) ఎగురుతుంటే
చేపలు (కళ్ళు) సరోవరాన్ని వదిలి మకరాన్ని(మకర కుండలాలని) కలిసేందుకు పరిగెత్తుతున్నట్టుంది)

నటవర్ ప్రభు కేశ్ ధరయా రూప్ జగ్ లోభాయీ
గిరిధర్ ప్రభు అంగ్ అంగ్ మీరా బలి జాయీ
( నాట్యకళా ప్రవీణుడు నా ప్రభువు దట్టమైన కేశములు కలవాడు ఈ లోకాన్నే సమ్మోహనపరిచే రూపం అతనిది
అటువంటి గిరిధరుడి అంగాంగాలకీ మీరా తనని తాను సమర్పించుకుంటుంది) ***

థాణీ కాయీ కాయీ బోల్ సుణావా
మ్హారా సాంవరా గిరిధారీ
(ఎన్ని సార్లు చెప్పమంటావు
నల్లనివాడు నా ప్రియుడు గిరిధరుడే అని)

పూరబ్ జణమ్ రీ ప్రీత్ పురాణీ
జావణా గిరిధారీ
(పూర్వ జన్మలో మా ఇద్దరి మధ్య ఏర్పడిన పురాతనమైన ప్రేమ అది
ఆ సంగతి గిరిధరుడికి కూడా తెలుసు)

సుందర్ బదన్ జోవతా సాజన్
థారీ ఛబి బలిహారీ
మ్హారే ఆంగణ్ మా స్యామ్ పధారో
మంగల్ గావా నారీ
( అందమైన నా ప్రియుడి రూపాన్ని చూస్తూ ఉంటే
ఆ మొహన రూపానికి నా సర్వస్వం ధారపోయాలనిపిస్తుంది
నా వాకిట్లోకి శ్యామసుందరుడు వేంచేశాడు
స్త్రీలందరూ అతనికి స్వాగత గీతాలు పాడుతున్నారు)

మోతీ చౌక్ పురావా ణీణా
తన్ మన్ డారా వారీ
చరణ్ సరణ్ రీ దాసీ మీరా రీ
జనమ్ జనమ్ కీ క్వారీ
( ముత్యాలూ, పూజా ద్రవ్యాలూ, సుగంధ ద్రవ్యాలూ అన్నిటితోబాటు
నా తనువునీ మనసునీ అతనికే సమర్పించుకుంటాను
అతని చరణ కమలాల శరణు కోరే దాసి ఈ మీరా
జన్మ జన్మలకీ (అతనికోసం) ఇలా కన్యగానే ఉండిపోతాను)

***

మాయీ మాణో సుపణా మా పరణాయే రే దీనానాథ్
(అమ్మా కలలో నేను ఆ దీనబాంధవుణ్ణి(కృష్ణుణ్ణి)పరిణయమాడాను)

ఛప్పన్ కోటా జణా పధార్యా దూల్హో శ్రీ బ్రజనాథ్
సుపణా మా తోరణ్ బంధ్యా రీ సుపణా మా గహ్యా హాథ్
(యాభై ఆరు కోట్లమంది జనం వెంట పెళ్లి కుమారుడు వ్రజ నాథుడు ఏతెంచాడు
కలలో తోరణాలు కట్టారు, కలలోనే అతను నా చెయ్యి పట్టుకున్నాడు-పాణిగ్రహణం జరిగింది)

సుపణా మా మ్హారే పరణ్ గయా పాయా అచల్ సుహాగ్
మీరా రో గిరిధర్ మిలియా రీ పూరబ్ జనమ్ రో భాగ్
(నేను వితంతువు నైనప్పటికీ కలలో నేను నిత్యసుమంగళిగా కనిపించాను
మీరాకి పూర్వజన్మ సుకృతం వల్లే గిరిధరుడు లభించాడు)

***

సావరా రే మ్హారీ ప్రీత్ నిభాజో జీ
( ఓ ప్రియా ! నా ప్రేమకు బదులుగా నువ్వు కూడా నీ ప్రేమని అందించవా ?)

హే ఛో మ్హారో గుణరో సాగర్
అవగుణ మ్హా బిసరాజో జీ
(నువ్వు సద్గుణాల సాగరంలాంటి వాడివని నాకు తెలుసు
అందుకే అడుగుతున్నాను నా అవగుణాలని విస్మరించవా?)

లోక్ న సిజయా మనన పతీజా
ముఖడా సబద్ సునాజో జీ
(ఈ లోకం నాలాంటి నిస్సహాయురాలి మాట వినిపించుకోదు
నువ్వైనా నేను చెప్పే మాట కాస్త వినిపించుకోవా?)

దాసీ థారీ జనమ్ జనమ్ రీ
మ్హారే ఆంగణ్ ఆజో జీ
( ఈ మీరా ఎన్నో జన్మలుగా నీ దాసీయే
నా ఇంటికి ఒకసారి రావా ప్రియా?)

మీరా రే ప్రభూ గిరిధర్ నాగర్
బేడా పార్ లగాజో కీ
(ఓ గిరిధర్ నాగర్! మీరా హృదయవల్లభుడా!
ఈ భవసాగరం దాటించి నా నావని తీరం చేర్చవా?)

***

సాంవరే రంగ్ రాచీ రాణా జీ హూ తో
బాంధ్ ఘూంఘరా ప్రేమ్ కా హూ తో
హరి కే ఆగే నాచీ
(రాణా జీ నేను ఆ నల్లని వాడితో మమేకమై పోయాను
కాళ్ళకి అనురాగపు అందెలు కట్టుకుని నేను
ఆ హరి ఎదుట నాట్యం చేశాను)

ఏక్ నిరఖత్ ఏక్ పరఖత్ హై
ఏక్ కరత్ మోరీ హాంసీ
ఔర్ లోగ్ మ్హారీ కాయీ కర సీ
హూ తో హరి జీ ప్రభు జీ కీ దాసీ
( ఒకరు నన్నే చూస్తారు ఇంకొకరు ఏవేవో ప్రశ్నలు వేస్తారు
మరొకరు నన్ను ఎగతాళి చేస్తారు
కానీ నన్ను జనం ఏం చెయ్యగలరు?
నేను ప్రభువు హరికి దాసురాలిని కదా!)

రాణో విష్ కో ప్యాలో భేజో
హూం తో హిమ్మత్ కీ కాంచీ
మీరా చరణా లాగై ఛే సాంచీ
(రాణా విషం నింపిన పాత్ర నావద్దకి పంపాడు
నాకు దాన్ని తాగే ధైర్యం చాలలేదు
అందుకే ఆ ప్రభువు పాదాలనే నమ్ముకున్నాను)

***

గఢ్ సే తో మీరాబాయీ ఉతరీ కరవా లీనో సాథ్
రావ తో ఛోడ్యో మీరా మేఢ్ కో పుష్కర్ న్హావా జాయే
(కొమ్ము చెంబు పట్టుకుని మీరాబాయి కోట దిగింది
రాజ్యాన్ని వదిలి మీరా పుష్కర స్నానాలకి బయలుదేరింది)

రామ్ కృష్ణ హరీ జయ్ జయ్ రామ్ కృష్ణ హరీ
మేరో మన్ లాగ్యో హరి కే నామ్
హరి కే నామ్ రహస్యా సాధా కే సాథ్
రాణా జీ ఊఠీ భేజా దీజో మీరాబాయీ రే హాథ్
( నా మనసు హరినామం మీదే లగ్నమయింది
హరినామ రహస్యం తెలుసుకోవటమే నా లక్ష్హ్యం
మీరా చేతికిమ్మని రాణా జీ సందేశం పంపాడు)

ఘర్ కీ మాలన్ అస్తరీ ముళర్ చలీ రాఠోడ్
లాజ్ పీహర్ సాసరో తజ్ తేరో తో పరివార్
– ఆ సందేశం ఇదీ –
(ఇంటి యజమానురాలైన స్త్రీ రాఠోడ్ ని వదిలి వెళ్ళిపోయింది
పుట్టింటి గౌరవం, మెట్టినింటి మర్యాదా , కుటుంబం అన్నీ వదిలేసింది)

లాజ్యె మీరా జి థారా మాయ డ బాప్
మాయ డ బాప్ చౌథో వమ్శ్ రాఠోడ్
మీరాబాయీ కాగద్ భేజా దీజో రాణా జీ రే హాథ్
(మీరా జీ మీ తల్లీ తండ్రీ గౌరవం కాపాడాలి
అంతే కాదు రాఠోడ్ వంశంలో నాలుగో తరం మాది –
మీరా రాణా పంపిన సందేశానికి జవాబు రాసి ఆయనకు పంపింది)

***

కరమ్ కీ గతి న్యారీ సంతో
( విధి లీలలు విచిత్రమైనవి సాధువుల్లారా !)

బడే బడే నయన్ దియే మిరగన్ కో
బన్ బన్ ఫిరత్ ఉఘారీ
( జింకలకి పెద్దపెద్ద కళ్ళుంటాయి కానీ
అడవుల్లో రక్షణ లేకుండా తిరుగుతూ ఉంటాయి)

ఉజ్వల్ బరన్ దీన్హీ బగలన్ కో
కోయల్ కర్ దీన్హీ కారీ)
(కొంగలకేమో తెల్లని తెలుపునిచ్చి
కమ్మగా పాడే కోయిలకి నల్లరంగు ఇచ్చింది)

ఔర్ నదీపన్ జల్ నిరమల్ కీన్హీ
సముందర్ కర్ దీన్హీ ఖారీ
( చిన్న నదుల్లో స్వచ్ఛమైన జలాలూ
పెద్ద సముద్రాలలో మాత్రం ఉప్పునీరూ!)

మూరఖ్ కో తుమ్ రాజ్ దీయత్ హో
పండిత్ ఫిరత్ భిఖారీ)
(మూర్ఖుడికి రాజ్యం కట్టబెడుతుంది
పండితుడు వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు!)

మీరా కే ప్రభు గిరిధర్ నాగుణ్
రాజా జీ కో కౌన్ బిచారీ
(మీరా ప్రభువు గిరిధరుడే అని తెలియని
రాజు అతను మరెవరో అనుకుంటున్నాడు)

***

ఉడ్ జారే కాగా బన్ కా
మేరా స్యామ్ గయా బహు దిన్ కారే
( అడవిలో నుంచి వచ్చిన ఓ కాకమ్మా ఎగిరిపో
నా శ్యామసుందరుడు వెళ్ళిపోయి చాలా కాలమైంది)

తేరే ఉడ్యా సూ రామ్ మిలేగా దో కా భా గయే మన్ కా
ఇత గోకుల్ ఉత్ మథురా నగరీ హరి హై గాఢే బన్ కా
(నువ్వు ఎగిరితే నా దేవుణ్ణి కలుసుకోవచ్చు అనే భావన మనసుకు ఊరట
కలిగి స్తుందేమో
కానీ ఇటు గోకులమూ అటు మధురా నగరి హరి మాత్రం దట్టమైన అడవిలో ఉంటాడు
ఎవరికీ అంతుపట్టడు)

ఆప్ తో జాయే బిదేసా ఛాయే హమ్ వాసీ మధుబన్ కా
మీరా కే ప్రభు హరి అవినాసీ చరణ్ కైవల్ హరి జన్ కా
( తను వెళ్ళి పరదేశంలో హాయిగా ఉన్నాడు మేమేమో మధుబన్ వాసులం
మీరా ప్రభువు హరి నిత్యదైవం భక్తులకి కైవల్యం దొరికేది
ఆయన పాదాలచెంతనే)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.