నా జీవన యానంలో- రెండవభాగం- 20
-కె.వరలక్ష్మి
అక్టోబర్ 20 ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని గద్వాల్ మొదలుకుని జమ్మూ కాశ్మీర్,హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీఘర్, హర్యానా, ఢిల్లీ, నేపాల్, టిబెట్ మొదలైన ప్రాంతమంతా తీవ్రమైన భూకంపం సంభవించింది. ఒక్క ఉత్తర్ ప్రదేశ్ లోనే 500 మంది మరణించారు. సరిగ్గా నెల తర్వాత నవంబర్ 20న ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లో గొప్ప తుఫాన్ సంభవించి పంటలూ, ప్రాణాలూ నష్టమయ్యాయి. తుఫాన్ కి ఓషన్ స్కై షిప్ కాకినాడ తీరానికి కొట్టుకొచ్చి ఒడ్డున ఇసుకలో కూరుకు పోయింది. నవంబర్ 23న మా స్కూలు పిల్లలకి దానిని చూపించడానికి విహారయాత్రకి తీసుకెళ్లాం. మొదట పెద్దాపురం మెట్ట మీది సూర్యదేవాలయం, సామర్లకోట ప్రారంభంలో ఉన్న అతిపెద్ద ఆంజనేయ విగ్రహం, రైల్వే స్టేషన్ చూపించి, కాలవ అవతలున్న ప్రాచీన భీమేశ్వరాలయం చూసి అక్కడి ప్రాంగణంలో పట్టుకెళ్ళిన బాక్సులు విప్పి భోజనాలు చేసాం. మధ్యాహ్నం 1:30 కి వేన్లు కాకినాడ చేరుకున్నాయి. సర్పవరం ఆలయం, గోదావరి ఫెర్టిలైజర్స్, వేల జనంతో క్రిక్కిరిసిన ఫిష్ మార్కెట్టు, సముద్రం లోపలికి వేసిన కాంక్రీటు రోడ్ల మీద కుప్పతెప్పలుగా ఆరబెట్టిన సముద్రపు చేపలు, వాకలపూడి బీచ్ ఒడ్డున సరుగుడు చెట్ల వరసలు, కదల్చడానికి వీలుకాక పార్టులుగా విడదీస్తున్న ఓషన్ స్కై ఓడ భాగాలు అన్నీ పిల్లలకూ మాకూ గొప్ప ఆహ్లాదాన్ని కలిగించాయి. మిగతా ప్రదేశాల్లో లాగ కాకినాడ సముద్రానికి పెద్ద పెద్ద కెరటాలు వొడ్డుకొచ్చి విరుచుకు పడవు. సముద్రానికి అవతల భూమ్యాకాశాలు ఏకమయ్యేక్షితిజ రేఖ మీద నిలిచినట్టున్న ఓడలు, ఆకాశంతో కలిసి పోయినట్టన్పించే నీలి సముద్రం. ఓహ్! మనిషి ఎంత అల్ప ప్రాణో గుర్తు చేస్తుంటాయి. ఆ తీరాన్ని వదిలి రాలేక, రాలేక, తీరం పొడవునా విరిసిన వైలెట్ కలర్ పూల అందాల్ని కళ్ళలో నింపుకొని వెనక్కి తిరిగాం. ఇంటికి వచ్చేక ఆ రాత్రి ‘కాకినాడ కడలి తీరం’ కవిత రాశాను. 91 మే 16 న మా అమ్మను కోల్పోయిన సందర్భంగా జూన్ 16 న ‘అదృశ్యమేఘం’ కవిత రాశాను. రాజీవ్ గాంధీ గుర్తు గా ‘21591’ కవిత రాశాను. అమ్మ వాళ్ల ఇంటిని ఖాళీ చేయాలని తెలిసిన ఆవేదన లో ‘ఆ ఇంట్లోనే ‘ కవిత రాసాను.
9.1.91 ఆంధ్రప్రభ వీక్లీ లో ‘ అన్ ప్లాన్డ్ లైఫ్’
30.6.91 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ‘ అసలురంగు’
23.8.91 ఆంధ్రజ్యోతి వీక్లీ లో ‘ సువాసినీ పూజ’ కథలు
8.3.91 ఆంధ్రభూమి ఆమెలో ‘ నేను’
5.7.91 ఆంధ్ర జ్యోతి వీక్లీ ఈ వారం కవిత ‘ నీకోసం’
3.9. ఫిభ్రవరి 91 ఆంధ్రప్రభ వీక్లీ లో ‘ ఆ ఇంట్లోనే ‘ కవితలు ప్రచురింపబడ్డాయి.
-సంఘంలో వర్గాల మధ్య ఉండే గోడలను పోలినవి తరాల మధ్య కూడా ఉంటాయి. పై తరం వాళ్ళు కింది తరం వాళ్ళను అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తారు గాని ఆ ప్రయత్నం ఫలించదు. కింది తరం వాళ్ళు పై తరాలను అర్ధం చేసుకునేందుకు చెప్పుకోదగ్గ ప్రయత్నం చెయ్యరు. అది వాళ్ళకు చాలా అనవసరం గా కన్పిస్తుంది. కాలం ఎప్పుడూ ముందుకే పోవడం అందుకు కారణం కావచ్చు. – ఏ జాతి విజ్ఞాన రహితమై అర్ధం లేని నమ్మకాల ఆధారం తో కాలక్షేపం చేస్తుందో ఆ జాతిలో అన్నిరకాల అజ్ఞానాన్నీ అందరూ ప్రదర్శిస్తారు. – అంటారు కొడవగంటి ‘అనుభవం’ లో.
1992 నాటికి మా అబ్బాయి ఆంధ్రాయూనివర్శిటీ లో MBA చేస్తున్నాడు. గీత డిగ్రీ పూర్తి చేసింది. మా చిన్నమ్మాయి ఇంటర్ తర్వాత ‘ఇక చదవను’ అని భీష్మించుకు కూర్చుంది. ఓ పక్క మోహన్ తో చికాకు భరించలేనిదై పోయింది. అయినవాళ్లనుకున్న రక్త సంబంధీకుల్తో చికాకుకులు. ఇంకో వైపు ఇంటి కోసం చేసిన అప్పుల్లో పీకల్లోతు కూరుకుపోయిన స్థితి. విని అర్ధం చేసుకోవాల్సిన మోహన్ అసలు కలిసి రాకపోవడం. ఆ ఆందోళనలు తట్టుకోలేక నా హెల్త్ పాడవడం మొదలు పెట్టింది. పొడిదగ్గు, సన్నని జ్వరం, హై బీపీ. రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్ ల్లో టెస్టుల తర్వాత టి.బి స్టార్టైందని, ఏడాది పాటు మందులు వాడాలని చెప్పేరు. పిల్లలు గాభరా పడతారని ఎవరికీ చెప్పలేదు. మందులు కొని వేసుకుంటూ ఉన్నా రకరకాల ఆలోచనలు భయపెట్టడం మొదలుపెట్టాయి. నా కేమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి? బాగా చదివించాలను కున్న ఆడపిల్లల్ని అప్పటికప్పుడు ఓనిర్ణయం తీసుకుని పెళ్లిళ్లు చెయ్యాల్సి వచ్చింది. 92 ఏప్రిల్ ల్లో గీతకు, డిసెంబర్ లో లలిత కు పెళ్లిళ్లు అయ్యే సరికి ఇంకాస్త అప్పులెక్కువయ్యేయి. పిల్లలకు కోద్దో గొప్పో పెట్టగా మిగిలిన బంగారం అమ్మేయాల్సి వచ్చింది. ప్రతి చిన్న దానికి అలకలు, గీత అత్తింటి వాళ్ళ తో పెద్ద సంక్షోభం. నా ఓపిక మేరకు వాళ్లడిగిందల్లా ఇస్తున్నా, ఏ కొంత ఆలస్యమైనా పెద్ద పెద్ద విమర్శలు. చివరికి నా సాహిత్య జీవితం మీదా, నేను అటెండయ్యే సాహిత్య సభల మీదా విమర్శలు గుప్పిస్తూ మోహన్ కి అక్క కుటుంబమే కాబట్టి అతనికి నూరిపోస్తూ ఉండేవాళ్లు. పిల్లలిద్దర్నీ అత్తవారింటికి పంపించేక నా జీవితం ఇంట్లో ఓ నరకమైపోయింది. మా అబ్బాయి ఊళ్ళో డిగ్రీ కాలేజ్ లేదని, దానికోసం ప్రయత్నించి ఆర్ధిక వనరులు లేక ఆగిపోవాల్సి వచ్చింది. అదో అసంతృప్తి. May నెలలో మధ్యాహ్నం నిద్రపోయి లేచిన మోహన్ కి కుడి చెయ్యి, కాలు తిమ్మిరిగా అనిపించి కదపలేకపోతూంటే టైంకి రిక్షా దొరికి హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. మైల్డ్ పెరాల్సిస్ స్ట్రోక్ అని తేలింది. ‘వెంటనే వైద్యం అందింది కాబట్టి భయం లేదు, కానీ స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఆపకపోతే మళ్ళీ రావచ్చు’ అన్నారు మా ఫేమిలీ డాక్టర్ జయగారు, ఉన్న సమస్యలు చాలవని అదొకటి తోడైంది. కల్లోల సాగరంలో ఒంటరి గా చిక్కుకున్నట్లు అయిపోయింది నా పరిస్థితి.
తండ్రి గారి ఉద్యోగం వలన మాఅబ్బాయికి BC రిజర్వేషన్లు ఏవీ ఉపయోగ పడలేదు. నేను పంపించే డబ్బులకి తను ఖాళీ సమయాల్లో కాలేజెస్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ హాస్టల్లో ఫీజ్ చెల్లించే స్టూడెంట్ గా ఉండి చదువుకున్నాడు యూనివర్శిటీలో. అలాంటి సంక్షోభంలో ‘నేనున్నాను’ అని నన్ను ఆదుకున్నది నా సాహిత్య వ్యాసంగం.
రంజని అవార్డు పొందిన నా ‘గాజుపళ్ళెం’ కథ 28.2.92 ఆంధ్ర జ్యోతి వీక్లీ లో ఈ వారం కథగా వచ్చి పలువురు ప్రసిద్ధ రచయితల ప్రశంశలు అందుకుంది. తెరిపిలేని ఫేన్ మెయిల్ కురిసింది. May92 కధా వేదికలో వచ్చిన నా ‘పాప’ కథ కూడా గొప్ప ప్రశంశలకు అర్హమై, ఆంధ్రప్రభ లాంటి పత్రికల్లో ఇంటర్వ్యూలు రావడానికి కారణమైంది.
జులై 92 రచన మంత్లీ లో ‘సంధ్యా సమస్యలు’ కథ
24.6.92 ఆంధ్రప్రభ వీక్లీ లో ‘దగా’ కథ
విశాఖ ఆలిండియా రేడియో లో ‘ కుక్క కరిచింది’ నాటిక
24.1.92 ఆంధ్రభూమి ‘ఆమె’ లో మా అమ్మ మీద రాసిన ఎలిజీ కవిత ‘అదృశ్య మేఘం’;
22.5.92 ఆంధ్రభూమి డైలీ ‘ఆమె’ లో ‘వలస వెళ్ళిన నీ కోసం ‘ కవిత;
అక్టోబర్ 92 రచన మంత్లీ లో ‘కడలికో కబురు’ ప్రచురింపబడ్డాయి.
“నీవు ఈ భూమి మీద పడిపోవచ్చు. అయితే భూమినే ఆధారంగా చేసుకుని పైకి లేస్తావు మళ్ళీ.
వానపడుతున్నా, గాలివీస్తున్నా తెడ్డు వేయడం మానకు. ప్రయత్నం ఫలించకపోతే అధైర్యపడకు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యి అంటాడు సుబాషిత రత్నావళి కర్త. లోకంలో మహాత్ములైన వారు కొందరే ఉంటారు. వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి ఆపదలు చుట్టుముట్టినా తమ స్వభావ సిద్ధమైన ఉదార బుద్ధిని వదిలి పెట్టరు అని కూడా అంటాడు.
పై సుభాషితానికి విరుద్దంగా రాష్ ఫోకోల్డ్ అనే తత్వ వేత్త “ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నట్టే అదృష్టాన్ని కూడా మార్చుకోగలం . అదృష్టం లోపించినప్పుడు నిగ్రహం తో ఉండాలి. బాగున్నప్పుడు దానిని అనుభవించాలి. ఎంతో అవసరమైతే తప్ప దూకుడు గా పరిష్కారం కోసం ఎప్పుడూ ప్రయత్నించ కూడదు.” అంటాడు. 1993లో ఆంధ్రజ్యోతి తో కలిసి న్యూజెర్సీ తెలుగు సంఘం పెట్టిన పోటీలో నా ‘మల్లెపువ్వు’ కథ బహుమతి పొందింది. 2.7.93 ఆంధ్రజ్యోతి వీక్లీ లో ప్రచురింపబడింది.
31.10.93 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ‘పోష్ మేనరిజం’
93 ఆంధ్రజ్యోతి దీపావళి స్పెషల్లో ‘మనసు గతి’ కథ వచ్చాయి.
3.2.93 ఆంధ్రప్రభ వీక్లీ లో ‘ఆ ఇంట్లోనే’ కవిత;
జులై 93 రచన మంత్లీలో ‘కాకినాడ కడలితీరం’ కవిత వచ్చాయి.
28.2.93 ఆంధ్రజ్యోతి స్పెషల్ లో శ్రీ చేరా గారు నా ‘నీ కోసం’‘ఆ ఇంట్లోనే’ కవితల గురించి అద్భుతమైన వ్యాసాన్ని రాసి ఆ కవితలకు గుర్తింపుతెచ్చారు.
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.
ఎన్ని అవాంతరాలు, చిరాకులు ఎదురైనా ధైర్యంగా జీవితాన్ని ఈదాలని మీ జీవితకథ చెప్తుంది వరలక్షిగారు. మీరు సాధించిన విజయం మామూలుది కాదు. మీరు చాలా గ్రేట్