మిట్ట మధ్యాహ్నపు మరణం- 11
– గౌరీ కృపానందన్
‘హనీమూన్ కి వచ్చిన భర్త రక్తపు మడుగులో శవంగా మారిన ధుర్ఘటన” న్యూస్ పేపర్లలో ఒక మూలగా బాక్స్ కట్టి ప్రచురించబడింది.
“శ్రీమతి ఉమా కృష్ణమూర్తి హనీమూన్ రక్తపు మడుగులో ముగిసింది. ఎవరో మూర్తిని ఘోరంగా కత్తితో పొడిచి చంపారు. నిలువుటద్దంలో ‘MAYA’ అని వ్రాసి ఉంది. దాని అర్థం ఏమిటి? ఇంకా తెలియ లేదు. “
పక్కనే పుట్ట్టేడు శోకంతో విలపిస్తున్న ఉమ ఫోటో ప్రచురించ బడింది.
కాస్సేపు ఆ ఫోటోను చూస్తూ ఉండి పోయాడు. ఈ ముఖాన్ని ఇంతకు ముందు ఎక్కడో చూశాడు? ఎక్కడ? ఎక్కడ? నిన్న కబ్బన్ పార్క్ లో… అవును .. వాళ్ళని ఫోటో కూడా తీసాడు. ఈడూ జోడూ బాగా ఉన్నారని వాళ్ళ దగిరికి వెళ్లి అనుమతి అడిగింది జ్ఞాపకానికి వచ్చింది. ఆ క్షణం వాళ్ళ కళ్ళలో కనబడిన ప్రేమానురాగాలు గుర్తుకు వచ్చాయి. ఆ అమ్మాయి భర్త హత్య చేయబడ్డాడా? వెంటనే ఆ ఫోటోను డెవలప్ చేయడానికి నిశ్చయించుకున్నాడు ఫోటోగ్రాపర్.
ఆ ఫోటో పోలీసులకు ఒక ముఖ్యమైన క్లూను అందించ బోతోంది.
***
దివ్య భయం భయంగా చూస్తూ గదిలోకి అడుగు పెట్టింది.
“రండమ్మా రండి. కూర్చోండి. భయపడకండి. రొటీన్ ప్రశ్నలు మాత్రమే. మీ పేరు?”
“దివ్య.”
“బెంగళూరుకు ఏ పని మీద వచ్చారు?”
ఆమె కుర్చీ అంచులో కూర్చుంది. ఆమె నుదుట పట్టిన చెమటను ఇనస్పెక్టర్ గుర్తించారు.
“బంధువులున్నారు.”
“బంధువులు అంటే?”
“మా అక్కయ్య.”
“అలాగా. మూర్తిని మీకు ముందే తెలుసా?”
“తెలుసు. ఎక్కువ పరిచయం లేదు.”
“మీరు ఆయన్ని పెళ్లి చేసుకునే ప్రపోజల్ ఉండిందటగా?
“చాలా రోజుల ముందు మాట అది. జాతకాలు కలవ లేదని మానేశారు.”
“ఆ విషయంలో మీకేమైనా నిరాశ కలిగిందా?”
“ఛ… ఛ”
“మూర్తి ఎలాంటి వ్యక్తి?”
“అతని గురించి నాకు అంతగా తెలియదు.”
“అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా?”
“నాకు తెలిసినంత వరకు లేరు.”
“అతను ఎలా హత్య చేయబడ్డాడో తెలుసా?”
“తెలుసు.” వెంటనే అంది, ఆ వివరాలను మళ్ళీ ఇంకోసారి తెలుసుకోవడానికి ఇష్ట పడనట్లు.
“మాయ అని ఎవరైనా మీకు తెలుసా?”
“తెలియదు.”
“మాయ అని ఇంగ్లీషులో వ్రాసి చూపించండి.” పేపర్ పెన్ను చేతికి అందించారు.
“దేనికి”
“ఈ కేసు లో మేం బ్లాంక్ గా ఉన్నాము. మీరు చెప్పే ఏ చిన్న విషయం అయినా మాకు ఉపయోగ పడవచ్చు.”
“అది సరే. దానికి నేను మాయ అని వ్రాసి చూపించడానికి సంబంధమేమిటి?”
“మీరు మూర్తిని హత్య చేయలేదు కదా?”
“మై గాడ్! ఎంత దారుణంగా అడుగుతున్నారు?”
“అలాగైతే మీరు వ్రాసి చూపించడానికి సందేహించక్కర లేదు.”
దివ్య పేపర్ మీద మాయ అని వ్రాసి చూపించింది. “ఇప్పుడు మీకు ఓకే నా?”
“కోప్పడకండి.”
కానిస్టేబుల్ కూల్డ్రింక్ తీసుకు వచ్చి ఆమెకి ఇచ్చాడు.
“తీసుకోండి దివ్యా.”
దివ్య గడగడా కూల్ డ్రింక్ తాగేసింది.
ఇనస్పెక్టర్ మాధవరావు అడిగారు. “బెంగళూరులో ఎవరున్నారని చెప్పారు?”
“మా అక్కయ్య.”
“నిన్న ప్రొద్దుటి నించీ ఎక్కడెక్కడికి వెళ్ళారో చెప్పగలరా?”
“ప్రొద్దున్న ఎనిమిది గంటలకి నిద్ర లేచాను. పది గంటలదాకా ఇంట్లోనే ఉన్నాను. ఆ తరువాత మార్నింగ్ షో సినిమాకి వెళ్లాను.”
“ఏ సినిమా?”
“జాస్.”
“ధియేటర్ పేరు?”
“లిరో.”
“వంటరిగానే వెళ్ళారా?”
“అవును… కాదు కాదు.”
“జవాబు అవునా కాదా?”
“ఫ్రెండ్ తో వెళ్లాను.”
“ఇప్పుడు మీతో వచ్చాడే. ఆ ఫ్రెండేనా?”
“అవును. అతని పేరు రామకృష్ణ. నాకు కజిన్ బ్రదర్, దూరపు బంధువు.”
“ఫ్రెండా… కజిన్ బ్రదరా? సరిగ్గా నిశ్చయించుకుని చెప్పండి దివ్యా.”
“సార్! మీరు ఈ విషయాన్ని మా అక్క దగ్గర అడగరు కదా?”
“అడగం. అతను మీ బాయ్ ఫ్రెండ్. అంతేనా?”
“అవును.”
“మూర్తికూడా ఒకప్పుడు మీకు బాయ్ ఫ్రెండ్ గా ఉండే వారా?”
“నో!”
“సినిమాకి వెళ్ళారు కదా? సినిమా కధను కాస్త చెప్పగలరా?”
“అది సొర చేప గురించిన కధ.”
“ఆ విషయం అందరికీ తెలుసు. ప్రారంభం లో వచ్చే సీన్ ని కాస్త వివరించండి.”
“అదీ… అదీ… మేము కాస్త ఆలస్యంగా వెళ్ళాము.”
“ఎప్పడు వెళ్ళారు? ఏ సీనులో వెళ్ళారు? చెప్పండి.”
ఉన్నట్టుండి దివ్య ఏడవ సాగింది.’
“సో… మీరు సినిమాకి వెళ్ళలేదు. అవునా?”
అవునన్నట్లుగా తల ఊపింది దివ్య.
“సరే. మళ్ళీ మొదటి నుంచీ ప్రారంబిద్దాం. మీరు ఏడిచి ముగించేదాకా వెయిట్ చేస్తాను. ఇదిగో చూడండి. పోలీసుల దగ్గర అబద్దం చెప్పడం మంచిది కాదు. చెప్పండి మూర్తి దిగిన హోటల్ కి ఎందుకు వెళ్ళారు?”
“నో.. నో.. నేను అక్కడికి వెళ్ళనే లేదు.”
“మరి ఎక్కడికి వెళ్ళారు? చెప్పండి. మొదట ఆ ఏడుపు ఆపండి.”
సరిగా అప్పుడు గది తలుపును తోసుకుంటూ ఒక యువకుడు వచ్చాడు.” ఇనస్పెక్టర్! దిస్ ఈజ్ ది లిమిట్! మీకు ఆమెను ప్రశ్నించే అధికారం లేదు.” కోపంగా అన్నాడతను. మంచి ఒడ్డూ, పొడుగు. ధృడంగా ఉన్నాడు.
“ఓ… మీరేనా ఆ బాయ్ ఫ్రెండ్! కూర్చోండి. నిన్న జాస్ సినిమా ఎలా ఉంది?”
“దివ్యా! కమాన్. ఇనస్పెక్టర్ అడిగే ప్రశ్నలకి నువ్వు జవాబు చెపుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. లెట్ మి సీ ది లాయర్.”
“నేను ఈమెను ఒకటి రెండు ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాను.”
“నేనూ వింటూనే ఉన్నాను. దివ్యా! లేచి రా. ఈయనకి ప్రశ్నలు అడగడానికి హక్కు లేదు. కమిషనర్ గారికి కంప్లయింట్ ఇస్తాను.”
“మిస్టర్! మీ పేరు ఏమిటి?”
“P.రామకృష్ణ.”
“మిస్టర్ రామకృష్ణా! C.R.B లో సెక్షన్ 161 మీకు తెలుసా. అర్ధం అయ్యిందా?”
“అదంతా నాకు తెలియదు. నేను లాయర్ని కన్సల్ట్ చేయాలి. దివ్యా! నువ్వు ఉండు. నేను లాయర్ని తీసుకు వస్తాను. అంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడవద్దు.”
మాధవరావు అన్నారు. “అక్కర్లేదు. మీరు తనను తీసుకు వెళ్ళొచ్చు. బాగా గుర్తు చేసుకుని చెప్పండి. ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఏం చేశారు? అన్నీ ఒక స్టేట్ మెంట్ గా రాయండి. నేనే మీ యింటికి వచ్చి తీసుకుంటాను. బట్! అబద్దాలు మాత్రం వ్రాయకూడదు. ఇక మీరు వెళ్ళొచ్చు.”
మాధవరావుని శత్రువుని చూసినట్లు చూస్తూ వాళ్ళిద్దరూ వెళ్లి పోయారు.
కానిస్టేబుల్ అడిగాడు. “ఏంటి సార్? వదిలేసారు?”
“ఎక్కడికి వెళ్లి పోతారు? సెక్షన్ 160లో స్త్రీలను పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇంటరాగేట్ చేయకూడదని ఉంది. లాబ్ రిపోర్ట్ వచ్చిందా?”
“టేబిల్ మీదే ఉంచాను సార్.”
మాధవరావు దివ్య వేలి గుర్తులు ఉన్న గాజు గ్లాసును జాగ్రత్తగా పక్కన తీసి పెట్టి, రిపోర్ట్ తీసి చదవసాగారు.
మూర్తి గదిలో దొరికిన షూ ప్రింట్ తాలూకు రిపోర్ట్ అది.
‘షూ సైజు తొమ్మిది. పొడుగైన, కాస్త బరువు ఎక్కువగా ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అరిగి పోయిన దాన్ని బట్టి చూస్తే నాలుగు నెలల నుంచి ఆరునెలల దాకా ఉపయోగించుతున్నట్లు తెలుస్తోంది. ‘సులేఖ’ అన్న కంపెనీ గుర్తు ఉంది. దాన్ని ధరించిన వ్యక్తి శారీరకంగా ధారుడ్యం గలవాడని చెప్పవచ్చు. ఎత్తు సుమారు ఐదు అడుగుల పది అంగుళాల నుంచి ఆరడుగుల దాకా ఉండవచ్చు.’
మాధవరావు ఆలోచనల్లో మునిగి పోయారు. “ఆ ఫైలును ఇలా తీసుకు రా.” మూర్తి ఫైల్ టేబిల్ మీదికి వచ్చింది.
ఆ ఫైల్ లో ముఖ్యంగా తాను వెతక దలచుకున్న లిస్టును చూశారు. హత్య జరిగిన రోజు హోటల్లో బస చేసిన వాళ్ళ లిస్టు. ఇంతకు ముందే రెండు సార్లు చూసి ఉన్నా, ఎందుకో మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది.
రుక్మాంగద రావ్, సదా శివం, శరవణా ఎంటర్ప్రైజెస్, షణ్ముగం, మహమ్మద్ హాబీస్.. డాక్టర్ బట్..
ఊహుం. లిస్టుని పక్కకి పెట్టబోయిన మాధవరావు మళ్ళీ పరీక్షగా చూశారు. రూం నంబరు. 536 మిసెస్ అండ్ మిస్టర్ రామకృష్ణన్! మాధవరావు సన్నగా ఈల వేశారు.
***
ఉప్పెనలా వస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఉమ మూర్తి గదిలోకి వచ్చింది. ఆనంద్ ఆమె పక్కనే నిలబడ్డాడు. కబోర్డులో మూర్తి తాలూకు షర్ట్స్ హేంగర్ లో ఇంకా వ్రేలాడుతున్నాయి. వాటిని చేత్తో తాకుతూ ఉంటే మూర్తినే స్పర్శిస్తూ ఉన్నట్లు అనిపించింది.
టేబిల్ మీద అతని డైరి. ఏవో నంబర్లు 3:46, 4:58 అని వ్రాసి ఉన్నాయి. ఒక్క వాక్యం కూడా రాయలేదు. చిన్న నోటు బుక్కులో టెలిఫోన్ నంబర్లు కనబడ్డాయి.
“దేని కోసం వెతుకుతున్నారు వదినా?”
“ఈ టెలిఫోన్ నంబర్లు ఎవరివి?”
“తెలియదు వదినా. బహుశా స్నేహితులు ఎవరిదైనా అయి ఉంటుంది.
“అన్ని నంబర్ లకీ ఫోన్ చేసి చూడాలి.”
*****
(ఇంకా ఉంది)
1956లో దిండిగల్, తమిళనాడులో జననం. మాతృభాష తమిళం. తండ్రిగారి ఉద్యోగరీత్యా తెలంగాణాలో తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించారు. బి.కాం. పూర్తి అవుతుండగానే వివాహానంతరం చెన్నైకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తరువాతే తమిళ సాహిత్యం చదవడానికి అవకాశం లభించింది. సాహిత్యం అంటే మక్కువ. తెలుగులో తనకి నచ్చిన నవలలు, కధలు తమిళ పాఠకులకు, అలాగే తమిళంలో మనసుకు దగ్గరగా ఉన్న సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలనే కోరికతో, ఆశయంతో అనువాద ప్రక్రియను ఎంచుకున్నారు. 1995లో మొదటి అనువాద కధ యండమూరి వీరేంద్రనాథ్ గారి “ది బెట్’ తమిళంలో ప్రచురం అయ్యింది. దాదాపు ఎనబై తెలుగు నవలలు తమిళంలో వెలువడి ఉన్నాయి. (యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి, D. కామేశ్వరి, ఓల్గా) తెలుగులో పెరుమాళ్ మురుగన్ గారి “పూనాచ్చి ఒక మేకపిల్ల కధ” ఈ మధ్యే వెలువడింది. 2015లో ఓల్గాగారు “విముక్త” కధా సంకలనానికి సాహిత్య అకాడమి అవార్దు అందుకున్న అదే ఏడాది, విముక్త తమిళ అనువాదం “Meetchi”కి గౌరీ కృపానందన్ సాహితి అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు. మూలానికీ, అనువాదానికీ ఒకే ఏడాది సాహిత్య అకాడమి అవార్డులు రావడం ఇదే తొలిసారి.