కాళరాత్రి-12
ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్”
అనువాదం : వెనిగళ్ళ కోమల
ఒక వారం గడిచాక క్యాంపు మధ్యలో నల్లని ఉరికంబం ఉండటం చూశాం. అప్పుడే పని నుండి తిరిగి వచ్చాం. హాజరు పట్టీ చాలాసేపు పట్టింది ఆ రోజు. ఆ తరువాతే సూపు యిస్తారు మాకు. ఆర్డర్లు రోజూ కంటే కఠినంగా వినిపించాయి. లెగరాల్ టెస్ట్ ‘టోపీలు తీయండి’ అని అరిచాడు. పదివేల టోపీలు పైకి లేచాయి. టోపీలు కిందకి’ అన్నాడు. టోపీలు తల మీదికి వచ్చాయి.
తెరుచుకున్న గేట్లుగుండా ఎస్.ఎస్.లు వచ్చి మమ్మల్ని చుట్టు ముట్టారు. వాచ్ టవర్స్ నుండి మెషీన్ గన్స్ ఎపెల్ ప్లాట్జ్ వైపు ఎక్కుపెట్టి ఉన్నాయి.
ఆపద రాబోతుందని భయపడుతున్నారు అన్నాడు జూలియక్.
ఎస్.ఎస్.లు ఒంటరి శిక్షల గదుల వైపు నడిచారు. ఒక నిందితుని వెంట బెట్టుకుని వచ్చారు. అతను వార్సా యువకుడు. 3 ఏళ్ళుగా కాన్‌సంట్రేషన్ క్యాంపులో ఉన్నాడు. పొడగరి, బలవంతుడు. ఉరికంబం వైపుకి వీపు తిప్పి ఉన్నాడు. క్యాంపు అధికారి అయిన జడ్జి వైపు ముఖం తిప్పాడు. పాలిపోయి ఉన్నా ప్రశాంతంగా ఉన్నాడు. భయం గోచరించ లేదు. అతని కట్టి వేయబడిన చేతులు ఒణక లేదు. వందల మంది ఖైదీలు చుట్టూ ఉన్నారు. వందల మంది ఎస్.ఎస్. గార్డుల వైపు చూస్తున్నారు.
లెగరాల్ టెస్ట్ శిక్ష ప్రతి పదం ఒత్తి పలుకుతూ చదువు తున్నాడు. ఒక ఖైదీ నంబరు …. ఎయిర్ రెయిడ్ టైములో దొంగతనం చేశాడు. మరణ శిక్ష విధింపబడింది. ఇది ఖైదీలందరికీ గుణపాఠం కావాలి’. ఎవరూ కదల లేదు. నా గుండె చప్పుడు నాకు వినిపిస్తున్నది. రోజూ ఆష్‌విట్స్‌లోనూ, బెర్కీనాలోనూ వేల మంది చంపబడటం నన్ను బాధించలేదు. కాని చావుకు సిద్ధంగా ఉన్న ఈ యువకుడు నాలో బాధను తట్టాడు.
ఈ తంతు త్వరగా ముగిస్తే బాగుండును. నాకు చాలా ఆకలిగా ఉన్నది అన్నాడు జూలియక్. లెగరల్ టెస్ట్ సంజ్ఞ చేయగా లాగర్ కపో యువకుని దగ్గరకొచ్చాడు. ఇద్దరు ఖైదీలు సహాయ పడుతున్నారు. వారికి సూపు అదనంగా దొరుకుతుంది ఆ రోజు. యువకుని కళ్ళకు గంత కడతానంటే అతను నిరాకరించాడు.
ఉరితీతగాడు అతని మెడకు ఉచ్చు తగిలించాడు. ఉచ్చు బిగించబోతుంటే యువకుడు గట్టిగా నినదించాడు. ‘‘స్వేచ్ఛ చిరాయువుగావాలి జర్మనీని శపిస్తున్నాను. నా శాపం, నా….’’ అంటుండగా అతని ప్రాణాలు పోయాయి.
‘‘టోపీలు తీయండి’’ అని అరుపు వినిపిస్తే తీశాం పదివేల మందిమీ యువకునికి గౌరవ వందనం గావించాం. ‘‘తలలు కప్పుకోండి’’ అని అరుపు వినిపిస్తే టోపీలు తలల మీద పెట్టుకున్నాం.
అందరం ఉరికంబం మీద ఉన్న ఆ యువకుని పక్కగా తరలి పోయాం. కళ్ళు మూసి ఉన్నాయి. నాలుక వేలాడుతూ ఉన్నది. మేమందరం అతని ముఖం చూడాలని కపోల ఆర్డరు.
మా బ్లాకులోకి పోనిచ్చారు. తిండి పెట్టారు. ఆ సాయంత్రం నాకు సూపు ఎప్పటికన్నా రుచిగా అనిపించింది.
ఇంకొంత మందిని ఉరి తీయటం చూశాను. ఎవరూ ఏడవలేదు. ఆ వసివాడిన శరీరాలు కన్నీళ్ళను ఏనాడో మరిచి పోయాయి.
ఒకసారి మాత్రం…
ఒబెర్ కపో 52వ కేబుల్ కమాండ్ డచ్ వాడు. పెద్ద విగ్రహం ఆరు అడుగులకు మించి ఎత్తు. అతని అధీనంలో 700 మంది ఖైదీలున్నారు. అందరికీ ‘‘అతనంటే సోదర ప్రేమ’’. అతను ఎవరినీ కొట్టిగానీ, అవమాన పరచటం గాని చేయలేదు.
అతని అధీనంలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. పైపెల్ అంటారు. చిన్న వాళ్ళను. ఆ బాలుడు సుకుమారంగా, చక్కగా ఉంటాడు. క్యాంపులో అలాంటి వాళ్ళు ఉంటారంటే నమ్మశక్యం కాని సంగతి.
ఈ పైపెల్లు పెద్ద వాళ్ళ కంటే క్రూరంగా ప్రవర్తిస్తారు. 13 ఏళ్ళ వాడొకడు తండ్రి తన పక్క పరచలేదని కొట్టాడు. పెద్దాయన నిశ్శబ్దంగా ఏడ్చాడు. కొడుకు రంకె వేస్తుంటే. ‘‘నీవు ఏడుపు ఆపకపోతే నీ రొట్టె తెచ్చియివ్వను’’ అన్నాడు.
ఆ చక్కని కుర్రాడంటే అందరికీ యిష్టమే. ఒకరోజు బ్యూనాలో ఎలక్ట్రిక్ ప్లాంట్ పనిచేయ లేదు. గెస్టాపో పరీక్షించి యిది ఎవరో చేసిన పని (సెబటాజ్) అని తేల్చాడు. డచ్ ఒబెర్ కపో బ్లాకులో జరిగినట్లు గ్రహించారు. అక్కడ వెతకగా చాలా ఆయుధాలు దొరికాయి.
ఒబెర్ కపోను అక్కడే అరెస్ట్ చేశారు. వారాల తరబడి చిత్రహింసలకు గురి చేశారు. అయినా అతను ఎవరి పేరూ బయట పెట్టలేదు. అతన్ని ఆష్‌విట్స్‌కి పంపారు. అతన్ని గురించి అటు తరువాత ఎవరికీ ఏమీ తెలియదు.
చిన్న పైపెల్‌ను ఒంటరి గదిలో బంధించారు. హింసించారు. అతను కూడా ఏమి బయట పెట్టలేదు. అతనికి, ఇంకా ఆయుధాలు కలిగి ఉన్న మరో యిద్దరికీ ఉరిశిక్ష వేశారు.
మూడు ఉరికంబాలు రెడీగా ఉన్నాయి. ఎస్.ఎస్. ఎప్పటి కంటే తేడాగా ఏదో విచారంలో ఉన్నాడు. ఒక పసివాడిని వేల మంది సమక్షంలో ఉరితీయటం అంత చిన్న విషయం కాదు. పై అధికారి శిక్ష చదివాడు. అందరూ చిన్న వాడిని చూస్తున్నారు. పాలిపోయి ఉన్నాడు. కాని నిబ్బరంగా కనిపించాడు. ఉరికంబం నీడలో పెదాలు కొరుకుకుంటూ నిలబడ్డాడు.
లాగర్ కపోతాను ఉరి తీయనన్నాడు. ముగ్గురు ఎస్.ఎస్.లు ఆ పని చేపట్టారు. ముగ్గురినీ కుర్చీ లెక్కించి ఉచ్చులు మెడలకు తగిలించారు. ఇద్దరు పెద్దవాళ్ళు ‘‘స్వేచ్ఛగల కాలం బ్రతకాలి’’ అని అరిచారు. పిల్లవాడు ఏమీ అనలేదు.
‘‘దయామయుడైన దేవుడు ఎక్కడున్నాడు?’’ అని అడుగుతున్నాడొకాయన నా వెనుక నుండి. ముగ్గురినీ ఉరి తీశారు. ఆర్డరు ప్రకారం మా టోపీలెత్తాం, దించాం ` అందరం ఏడ్చాం.
ఆ ముగ్గురి ముందు నుండీ మేము కవాతు చేస్తూ పోవాలి. ఇద్దరు అప్పటికే చనిపోయారు. వాళ్ళ నాలుకలు వేలాడుతున్నాయి. చిన్నవాడి తాడు యింకా కదులుతున్నది. వాడు ఆఖరిశ్వాస తీసుకుంటున్నాడు.
అలా చావు బ్రతుకుల మధ్య అరగంట కొట్టుమిట్టాడాడు. మా కళ్ళ ముందే కదులుతున్నాడు. అతన్ని నేను దాటి వచ్చినప్పుడు యింకా బ్రతికే ఉన్నాడు. నాలుక ఎర్రగా ఉన్నది. కళ్ళు యింకా వాలిపోలేదు.
‘’దేవుడనేవాడెక్కడున్నాడు?’’ అని నా వెనుక వ్యక్తి ప్రశ్నిస్తూనే ఉన్నాడు. నాలో నేను సమాధానం చెప్పుకున్నాను. ` యిక్కడే ఉరి తీయబడ్డాడు అని.
ఆ రాత్రి సూపు శవాల కంపు కొట్టింది.
*****
(సశేషం)
వెనిగళ్ళ కోమల మూల్పూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారి సతీమణి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.