వ్యాధితో పోరాటం-7
–కనకదుర్గ
మోరా ఇంజెక్షన్ తీసుకొచ్చింది. “హే స్వీటీ, వాట్ హ్యాపెన్డ్? కమాన్, ఇట్స్ ఓకే డియర్!” ఇంజెక్షన్ పక్కన పెట్టి నా తల నిమురుతూ వుండిపోయింది.
“మోరా కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యాంటి యాంగ్జయిటీ మెడిసన్ ప్లీజ్! ఈ రోజు తీసుకోలేదు ఒక్కసారి కూడా.”
“ఓకే హనీ నో ప్రాబ్లెం. ఫస్ట్ టేక్ యువర్ పెయిన్ ఇంజెక్షన్. దెన్ ఐ విల్ గెట్ యువర్ అదర్ మెడిసన్.” అని ఇంజెక్షన్ ఇచ్చి.
కాసేపట్లో ’అటావాన్,’ ఇంజెక్షన్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇలా ఎక్కువగా బాధ పడ్తున్నపుడు, ఆందోళన ఎక్కువయినపుడు ఇవ్వమని డాక్టర్స్ రాసారు ఈ మందు.
బాత్రూమ్ కి వెళ్ళడానికి సాయం చేసి మంచం పై పడుకున్నాక, లైట్లు ఆఫ్ చేసి ’గుడ్ నైట్ ఐ విల్ సీ యూ ఇన్ ద మార్నింగ్,” అని కర్టెన్ వేసి, తలుపు మూసి వెళ్ళింది మోరా.
ప్రొద్దున్నుంచీ నొప్పితో బాధ పడడమే కాదు, మానసికంగా బాగా కృంగిపోయి వున్న నాకు, ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే నిద్ర పట్టేసింది.
రెండు గంటలు పడుకున్నదో లేదో, తలుపులు బార్లా తెరిచిన చప్పుడు, రోలింగ్ మంచం పైన ఒక పేషంట్, ఐ.వి పట్టుకుని ఒక నర్స్, మంచంని తోస్తూ ఒక టెక్ రూంలోకి వచ్చారు. రెండు మంచాల మధ్యన వుండే కర్టెన్ ను లాగారు. ఇంకా నిద్ర మత్తులో వున్న నాకు పేషంట్ ని సరిగ్గా చూసే అవకాశం రాలేదు. ఆ పెషంట్ ని బెడ్ పైన పడుకోబెట్టి తనకి ఏం కావాలో అన్నీ చేసి వెళ్ళేవరకు అరగంట పైనే అయింది. మోరా నా వైపు చూసి,’సారీ, గో బ్యాక్ టు స్లీప్,’ అని దూరం నుండే అని వెళ్ళింది.
తను వచ్చినప్పట్నించి ప్రక్కన ఎవ్వరూ లేకపోవడంతో అది ప్రైవేట్ రూంలానే అనిపించింది. కొద్దిగా నీళ్ళు త్రాగి పక్కకి తిరిగి పడుకోవడానికి ప్రయత్నించింది. ఇంతలో ప్రక్క పేషంట్ నర్స్ బటన్ ప్రెస్ చేసింది. అయిదు నిమిషాలయినా ఎవరూ రాకపోయే వరకు ఆ పేషంట్ కొంచెం కోపంగా, ’హలో! ఎనిబడీ దేర్, ఐ యామ్ డైయింగ్ విత్ పేయిన్,’ అని గట్టిగా అరవడం మొదలు పెట్టింది.
ఎమర్జన్సీ నుండి వచ్చినట్టుంది, అక్కడ నొప్పికి మందు ఇచ్చి వుంటారు. అది ఇచ్చి చాలాసేపయితే మళ్ళీ ఇవ్వాల్సి వుంటుంది. టెక్ వచ్చింది పరిగెత్తుకుంటూ.
“ఏం కావాలి?” అని అడిగింది పక్క పేషంట్ ని.
“నర్స్ ఏది? ఐ నీడ్ పేయిన్ మెడిసన్. చాలా నొప్పిగా వుంది?” అని కోపంగా అంది.
” ఏం జరిగింది?” అనుకుంటూ మోరా వచ్చింది.
“నాకు పేయిన్ మెడిసన్ కావాలి. చాలా నొప్పిగా వుంది కాలు!”
“ఐ నో డియర్! మీరు పైకి వచ్చే ముందే ఇచ్చారు కదా! ఇంకో గంట అయ్యే దాక ఇవ్వడానికి రాదు నొప్పి మందు.”
“నాకు నిద్ర పట్టటం లేదు. నిద్రకేదయినా ఇవ్వండి.” ఆమె కొంచెం కరకుగానే మాట్లాడుతుంది.
“డాక్టర్లు ఏం రాయలేదు నిద్రకోసం మీకు. ఇపుడు కావాలంటే మేము డాక్టర్ కి కాల్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. దానికి టైం పట్టొచ్చు.”
“ఎందుకు రాయలేదు? కాలు జారి క్రింద పడ్డాను. దెబ్బ బాగా తగిలింది, నొప్పి ఎక్కువగా వుంది. నిద్ర రాదు నొప్పి వల్ల రాయాలని తెలియదా?”
“మీరు ఎమర్జన్సీలో ఉన్నపుడు అడిగితే రాసేవారేమో. మీరు అడిగారా?”
“అన్నీ అడగాలా? ఇట్స్ కామన్ సెన్స్. అది కూడా తెలియదా? ఇదేం హాస్పిటల్?” అని కోపంగా వాదించసాగింది.
“కామ్ డౌన్! మ్యామ్. నేను డాక్టర్ కి కాల్ చేస్తాను, నిద్రకి మందు రాస్తే అది ఫార్మసీ నుండి రాగానే నేను మీకు తీసుకొచ్చి ఇస్తాను. డాక్టర్ రాయకపోతే నేనొచ్చి చెపుతాను మీకు. పేయిన్ మెడిసెన్ టైమ్ కాగానే తీసుకొచ్చి ఇస్తాను. మీరు కామ్ డౌన్ అవ్వడానికి ట్రై చేయండి. పక్కన పేషంట్ కి కూడా చాలా నొప్పిగా వుంది. తను కూడా పడుకోవాలి కదా!”
అని మెల్లిగా నచ్చచెప్పడానికి ప్రయత్నం చేసింది మోరా.
“నేను పడుకోవద్దన్నానా ఆ పేషంట్ ని? నాకు మందు కావాలని అడుగుతుంటే పక్క పేషంట్ కి నిద్ర కావాలంటావేంటీ?’’
అక్కడే నిల్చుని ఇదంతా చూస్తున్న టెక్ మోరాకి తనని వెళ్ళమని సైగ చేసి, “తను వెళ్ళి డాక్టర్ కి కాల్ చేసి వస్తుంది. కాలుకి హాట్ ప్యాక్ తీసుకొచ్చి పెట్టనా? కొంచెం రిలీఫ్ గా వుంటుంది.” అని నిదానంగా అడిగింది.
“ఓకే. గెట్ మీ దట్. కానీ చాలా సేపు చేయకు. పిలవగానే రారెందుకు? త్వరగా తీసుకురా!”
“ఒన్ మినిట్, ఐ విల్ గెట్ ఇట్,” అని పరిగెత్తుకెళ్ళి రెండు నిమిషాల్లో వచ్చింది.
నాకు నిద్ర వస్తుంది, కానీ ఈ చప్పుడుతో నిద్ర పట్టడం లేదు.
“ఆ..ఆ…ఆ..ఇట్స్ టూ హాట్.. ఏం చేస్తున్నావు? నా నొప్పి ఎక్కువ చేయడానికి చూస్తున్నావా?” అని గోల చేయసాగింది.
“సారీ మామ్! నేను కావాలని చేయలేదు. ఇది మరీ ఎక్కువగా వేడి లేదు.”
” అంత వేడి పెట్టి, వేడి లేదంటావా?”
మోరా వచ్చి, “డాక్టర్ నిద్రకి మందు రాసారు. ఫార్మసీ నుండి రావడానికి 10 నిమిషాలు పడ్తుంది. రాగానే తెచ్చి ఇస్తాను.” అని చెప్పింది.
“ఓహ్ మై గాడ్! ఇంకా పది నిమిషాలా? హాట్ ప్యాక్ తో నా కాలు కాల్చేసింది ఈ పిల్ల.”
“ఏది నేను ట్రై చేస్తాను.” మోరా తీసుకొని మెల్లి మెల్లిగా చేయసాగింది.
బయట నర్స్ బటన్ మ్రోగసాగింది. టెక్ పరిగెత్తుకెళ్ళింది.
మా ప్రక్క రూంలో నుండి గట్టిగా ఏడుపు వినిపించసాగింది. అందులో ఒక వృద్ద పేషంట్ వున్నాడు. దాదాపు 90 ఏళ్లుంటాయట. నేనొచ్చిన రాత్రి సడన్ గా ఏడుపు వినిపిస్తే ఉలిక్కిపడి లేచాను. కానీ కాసేపు కాగానే ఆగిపోయింది, అందులో ఆ రోజు నొప్పి ఎక్కువగా వుండడం వల్ల మూడు గంటలకోసారి నొప్పి మందు ఇవ్వడంతో నిద్ర పట్టేసింది.
ప్రొద్దునే టెక్ వచ్చినపుడు రాత్రి వినిపించిన ఏడుపు గురించి అడిగితే,”చాలా పెద్దాయన. 90 ఏళ్ళ పైనే వుంటాడు, మంచి మనిషి. పిల్లలున్నారు, ఎక్కడెక్కడో వున్నారు ఈ దేశంలోనే. ఫోన్ లు చేసి అడుగుతారు ఎలా వున్నారాయన అని. కానీ ఎవ్వరూ వచ్చి చూడరు. భార్య, ఈయన ఒకటే నర్సింగ్ హోంలో(వృద్దాశ్రమం) వుండేవారు. ఇద్దరూ చాలా బాగా వుండేవారు. ఒకరిని వదిలి ఒకరుండేవారు కాదు. ఆమె సడన్ గా నెల కింద పోయింది. అపుడొచ్చి వెళ్ళారు పిల్లలు, అంతే. ఈయనకి భార్య గుర్తొచ్చినపుడల్లా ఇలా గట్టిగా ఏడుస్తుంటాడు పాపం!” అని చెప్పింది.
ఇక్కడకొచ్చిన కొత్తలో తల్లితండ్రులు పెద్దవాళ్ళయిన తర్వాత ఇంట్లో వుండరని, నర్సింగ్ హోం లలోనే వుంటారని, పిల్లలు మంచివాళ్ళయితే, దగ్గర వుంటే వచ్చి చుస్తుంటారు.
పండగలకు, పుట్టినరోజులకు ఇళ్ళకు తీసుకెళ్తారు. ఈ నర్సింగ్ హోంలు కూడా వివిధ రకాలుంటాయి. వృద్దాప్యంలో అవసరానికి డబ్బు దాచుకున్నవారు, మంచి ఇన్సూరెన్స్ వున్నవారు మంచి నర్సింగ్ హోంలో వుంటారు. అన్నీ సౌకర్యాలుంటాయి. పెద్దవాళ్ళయినా ఆరోగ్యంగా వున్నవారు వారికిష్టమైన ఆటలు ఆడొచ్చు, కళలను కూడా కొనసాగించవచ్చు, ఏ కష్టం లేకుండా వుంటారన్న మాట. పేదవారు డబ్బు ఎక్కువగా లేని వారు, వారికీ కేవలం ఇన్సూరెన్స్ ఉన్నవారికి సౌకర్యాలు అంత గొప్పగా లేని నర్సింగ్ హోంలలో వుంటారు. వచ్చిన కొత్తలో రోజు న్యూస్ పేపర్ చదవేదాన్ని. ఒకసారి ఒక నర్సింగ్ హోంలో ఇన్సూరెన్స్ నుండి డబ్బులు లాగడానికి అక్కడ వున్న వృద్దులని ఇష్టమొచ్చినట్టు కొట్టి వారికి దెబ్బలు తాకితే కట్లు కట్టి, వారు బాత్రూంలో జారి పడ్డారని వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని దానికి ఇన్సూరెన్స్ నుండి డబ్బులు లాగడానికి ఇలా హింసిస్తున్నారని ఒక రిపోర్టర్ ఫోటోలతో సహా బయట పెట్టినపుడు అది చదివి చాలా బాధ పడ్డాను.
డబ్బుంటే మంచి నర్సింగ్ హోంలో అన్నీ సౌకర్యాలతో పాటు, మంచి వైద్యం కూడా దొరుకుతుంది. డబ్బు లేని వారి పరిస్థితే దీనంగా వుంటుంది.
ఆ రాత్రంతా అలాగే గడిచింది. చిన్న చిన్న కునుకులతోనే సాగింది నిద్ర.
ప్రొద్దునే 5 గంటలకు టెక్ వచ్చి బ్లడ్ టెస్ట్ కోసం రక్తం తీసుకెళ్ళేది. ఈ పరీక్షలో పాన్ క్రియాస్ నుండి వచ్చే రెండు ఎంజైమ్స్ లెవెల్స్ ఎలా వున్నాయో చూస్తారు. మొదటి రోజు “అమెలైజ్, లైపేజ్,”( Amalyse and Lipase) లెవెల్స్ ఎక్కువ వున్నాయా, తగ్గుతున్నాయా చూసి చెపుతారు. 5 గంటలకు టెక్ వచ్చి రక్తం తీసుకెళ్ళాక మళ్ళీ కాసేపు పడుకోవడానికి ప్రయత్నించాను. కానీ నర్సులు, వస్తూ, పోతూ వుండడం వల్ల సరిగ్గా పడుకోలేకపోయాను. నేను లేచి బ్రష్ చేసుకుని, రోజూ వేడిగా వున్న సబ్బుతో వున్న చిన్న టవల్స్ వొళ్ళు తుడుచుకోవడానికి, ఫ్రెష్ హాస్పిటల్ గౌన్, సాక్స్ ఇస్తారు. నాకు ఆ గౌన్ చాలా పెద్దదవుతుంది. ముందువైపు లోనెక్ లా వస్తుంది, వెనక కట్టుకోవాలి, నడుస్తుంటే లోపల నుండి కాళ్ళు కనిపిస్తాయి. అందుకని నేను ఇంటినుండి నేను ఇంట్లో వేసుకునే కాటన్ పాంట్స్, పైజామాల్లాగ వుంటాయి, అవి వేసుకొని పై నుండి ఈ గౌన్ వేసుకుంటాను. అలాగే గౌన్ పైన స్వెటర్ వేసుకుంటాను.
ఇద్దరు పేషంట్లకి కలిపి ఒకటే బాత్రుం వుంటుంది షేర్డ్ రూమ్స్ లో. అయితే ఐ.వి ఎక్కిస్తుంటారు కాబట్టి ఒక ప్లాస్టిక్ బౌల్ (గిన్నె)లా వుండి దాని మీద కొలతలుంటాయి. అది టాయిలెట్ లో పెడతారు. మనం వెళ్ళినపుడల్లా ఎంత నీరు బయటకు (మూత్రం రూపంలో) వస్తుందో టెక్ కానీ, నర్స్ కానీ చూసి అది క్లీన్ చేసి వెళ్ళాలి. కానీ ప్రతి సారీ వాళ్ళు రారు. అందుకని ఒకోసారి మనమే గుర్తు పెట్టుకుని, మళ్ళీ వెళ్ళినపుడు అది టాయిలెట్లోకి వొలకబోసి పెట్టాలి. ఒక్కరే పేషంట్ వుంటే పెద్ద సమస్య కాదు. కానీ పక్క పేషంట్ కూడా అదే బాత్రూం వాడుతుంటే, వారు వాడే కొలత బౌల్ వాళ్ళు తీయకపోతే, నర్స్ ని పిలిచి వాళ్ళు వచ్చి అది మార్చేదాక వేయిట్ చేయాల్సి వస్తుంది. వారికి ( మూత్ర సంబంధమైన ఏవైనా ఇన్ఫెక్షన్స్) వుంటే అదే బాత్రూం వాడాలంటే భయంగా వుంటుంది. రోజూ ప్రొద్దున్నే బాత్రూం, రూములు క్లీన్ చేసి చెత్త తీసుకెళ్తారు. కానీ శని, ఆదివారాల్లో ఒకోసారి వచ్చేవారు కాదు, అపుడు ఆ పక్కన వుండేవాళ్ళు పెద్దవాళ్ళో కళ్ళు సరిగా కనిపించక క్రిందా, మీదా అంతా పాడు చేస్తే ఇక మరో పేషంట్ కి నరకమే. అలాంటపుడు నేను ఐ.వి పోల్ పట్టుకుని వాక్ చేస్తూ పేషంట్స్ కోసం వచ్చే కుటుంబం వారి కోసం వేయిటింగ్ రూంలో వుండే క్లీన్ బాత్రూంలోకి వెళ్ళేదాన్ని.
వొళ్ళు తుడుచుకుని, బట్టలు మార్చుకుని తల దువ్వుకుని బాత్రూంలో నుంచి వచ్చే వరకు మంచం దగ్గర టెబుల్ మీద లిక్విడ్ తిండి పెట్టి వుంది. ఆపిల్ జ్యూస్, జెల్లో, వాటర్ ఐస్(మ్యాంగో ఫ్లేవర్), వేడి నీళ్ళు, టీ బ్యాగ్ పెట్టి వున్నాయి.
నర్స్ యాంజెలా వచ్చి, “ఆర్యూ ఓకే?” అడిగింది.
“యా, ఓకే!”
ఈ రోజు నిన్ను ఈ లిక్విడ్ డైట్ ట్రై చేయమన్నారు. మెల్లిగా, నీకెంత వీలైతే అంతే తీసుకో. నీకు కొద్దిగా నొప్పి వచ్చినా వెంటనే ఆపేయి.” అంది నర్స్ యాంజెలా.
“కానీ ఇవన్నీ తినాలా? తాగాలా”
“నో, నో నీవెంత టాలెరేట్ చేయగలిగితే అంతే ట్రై చెయ్యి. ఈ రోజు బావుంటే రేపు మళ్ళీ ఇస్తారు. నీకు నొప్పి రాకుండా ఆకలేస్తే కొద్దిగా ఏదైనా తినడానికి ఇస్తారు. అది టాలెరేట్ చేసి నొప్పి రాకుంటే నిన్ను డిస్చార్జ్ చేసేస్తారు. కానీ ఇంటికెళ్ళి పోవాలని నొప్పి తగ్గకున్నా తగ్గింది అని చెప్పి వెళితే మళ్ళీ వెంటనే హాస్పిటల్ కి వచ్చేస్తావు…”
“నాకొద్దు ఇవి అసలు…నాకు భయం వేస్తుంది.”
“కమాన్ డియర్ నేను జాగ్రత్తలు చెబ్తున్నాను.. నువ్వు తినొద్దని కాదు.”
“నేను కొంచెం టీ తాగుతాను. అంతే.”
“ఇంటికెళ్ళాక ఈ ఐ.వి వుండదు. నువ్వు నొప్పికి భయపడి తినడం, త్రాగడం మానేస్తే చాలా వీక్ అవుతావు. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు, వాళ్ళని చూసుకోవాలి….”
“ఓకే ..ఓకే.. మెల్లి మెల్లిగా ట్రై చేస్తాను..” అన్నాను.
“దట్స్ మై గుడ్ గర్ల్…” అని వెళ్ళిపోయింది నర్స్ యాంజెలా.
*****
(సశేషం)
నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.