బతుకు చిత్రం-20

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

***

          జాజులమ్మకు ఈర్లచ్చిమి వెళ్ళిపోగానే ఏదో వెలితిగా అనిపించింది. అత్త ఒక్కరాత్రి బాగోతం ఆటకు పోతేనే తన పరిస్థితి ఇలా ఉంది. రేపు తను దూరమైతే తానుండ గలదా?మొదటి నుండి అత్తే తన మీద ప్రేమతో బిడ్డలాగా చూసుకుంటున్నది. కొడుకును కూడా తనతో బాగుండాలని ఎప్పటికప్పుడు సమయం దొరికినప్పుడల్లా చెప్పుతూనే ఉన్నదీ. తల్లిలా చేయవలసినదాని కంటే ఎక్కువే చేస్తున్నది.

          సైదులును మార్వ్చుకోవడంలో తన పాత్ర కూడా ఉండాలి గదా! గుర్రాన్ని నీటిదాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేము కదా! అలాగే అత్త కూడా తన విషయంలో తనకు వెన్నంటి ఉంటున్నది. మరి, తాను సైదులును తన వైపు తిప్పుకోవడానికి జీవితాన్ని పండించుకోవడానికి ఇంకా ఏ ప్రయత్నమూ చేయడం లేదు. అత్త ఇప్పుడు తమ ఏకాంతం కోసమే భాగవతం చూడ్డానికి వెళ్ళింది. తను ఇప్పుడైనా సైదులుతో మనసు విప్పి మాట్లాడాలి. అతని ఇష్టాఇష్టాలు తెలుసుకోవాలి. కానీ అతను ఎప్పటిలా తాగి రాకుండా ఉంటె బాగుండు. ఆ వాసనతో వాంతి వచ్చినట్టుగా ఉంటున్నది. ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ కూర్చుండి పోయింది.

          తన ఆలోచనలకు ఆటంకం కలిగిస్తున్నట్టుగా వాకిలిలో చప్పుడు కావడంతో అటు వైపు చూసింది. సైదులు బాగా తాగినట్టున్నాడు. తూలుతూ వస్తూ నడవలేక నడుస్తున్నాడు. జాజులు వెంటనే వెళ్ళి పడిపోకుండా పట్టుకుంది.

          సైదులు చూశాడు.కానీ మాట్లాడలేదు. అవ్వా !అవ్వా !అంటూ మత్తులోనే పిలవసాగాడు.

          అమ్మ లేదు. గుడిలో బాగోతం చూడ్డానికి పోయింది. అన్నది.

          అర్రే !మర్సిన, నాయనను అవ్వే కదా ! ఇంతకు ముందు గుడికాడ ఆపి మరీ….. తీసుకు పోయింద అంటూ నాలిక కరుచుకొని, నువ్వెందుకున్నావ్ ? పోక ? నా కాపలానా ?అన్నాడు. డభేలుమని పడిపోతూ.

          జాజులు పొయ్యిమీది వేన్నీళ్ళు పట్టుకచ్చి జాలాట్లో కూర్చోబెట్టి శుభ్రంగా స్నానం చేయించింది. 

          కాస్త తేరుకున్నాడు.

          అన్నం పళ్ళెంలో తెచ్చి ముందట పెట్టింది. అతను తినే పరిస్థితిలో ఉన్నట్టు అనిపించలేదు. తానె ముద్ద లు కలిపి తినిపించసాగింది.మాట్లాడకుండా మొత్తం తినేశాడు. బాగా ఆకలి మీద ఉన్నట్టు అర్థమై మరికొంచం తినిపించి మూతి కడిగి తన కొంగుతో తుడిచింది.

          జాజీ ..!జాజీ ..!నన్నెందుకు పెళ్ళాడావె ? పిచ్చిదానా? నాతో సుఖంగా ఎలా ఉంటాననుకున్నావే? నేనో పెద్ద తాగుబోతును. నన్ను మా అవ్వ తప్ప ఎవ్వరు మెచ్చుకోరు. నాయన బాగ తాగిస్తడు. నా కట్టమంత నాయ్నే దాస్తడు. తాడు బొంగరం లేక హాయిగా ఉన్నోన్ని ఎందుకె కావాలనే కంపను తగిలిచ్చుకున్నాట్టు తగిలించుకున్నావ్?అని ఏవేవో కలవరిస్తూ నిద్రలోకి జారుకున్నాడు .

          జాజులమ్మకు చాలా సంతోషం కలిగింది. ఇన్నిరోజులకు మొదటిసారిగా తనను జాజీ ..! అని పిలవడం. ఆనందంతో నిద్ర పోతున్న సైదులును గాడంగా ప్రేమగా ముద్దు పెట్టుకుంది.

          ఆ రాత్రంతా ఆ ఆనందంతో జాజులమ్మకు నిద్ర పట్టలేదు. ఇన్ని రోజులుగా సైదులు మనసులో ఏముందో తెలియక సతమతమైంది. కానీ తన పట్ల అతనికి ఎంతో కొంత ప్రేమున్నందుకు మనసు గాలిలో తేలుతుండగా ఆలోచించసాగింది.

          మనిషి,అత్త చెప్పినట్టు మంచివాడే. కానీ తాగుడే అతనిని నాశనం చేస్తున్నది. ఈ తాగుడు మాన్పించ గలిగితే ! అవును, ఎలాగైనా తాగుడును మాన్పించ గలిగితే తానూ అందరిలా గౌరవంగా ఉంటాడని ఆ ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది.

***

          తెల్లవారింది. ఈర్లచ్చిమి వేకువజామున ఇల్లు చేరుకుంది. అప్పటికే జాజులమ్మ ఇల్లూ, వాకిలి అంతా శుభ్రంగా ఊడ్చి అందంగా ముగ్గులు పెట్టింది. తలారా స్నానం చేసి దేవుడి గూట్లో దీపం కూడా వెలిగించి పొయ్యి అంటించింది.

          జాజులమ్మ ముఖంలోని సంతోషాన్ని చూసి ఏదో విశేషమే ఉంటుందని గ్రహించి ఈర్లచ్చిమి తృప్తి పడింది.

          రాజయ్య సైదులు వంక అనుమానంగా చూస్తుండడం గమనించి, ఏందయ్యా?పన్నోన్ని అట్ల చూడవడితివి? అన్నది ఈర్లచ్చిమి.

          ఆ..వీడు,సైదులుగాడేనా? అని డౌటు కొడ్తాంది అన్నాడు.

          ఏం? ఎందుకని?

          లేకుంటే ఇప్పుడే తానం బోసుకున్నట్టు అట్ల నిగ నిగ లాడుతుంటే నూ..! అన్నాడు.

          నా కోడలు జాజులు వాణ్ణీ పసిపిల్లాడి లెక్కన అనుకోని తానం బోసి కడుపునిండ తినవెట్టి పండవెట్టింది. మరి, ఇగ నా పాణం ఎప్పుడు పోయినా నాకు బాధ లేదు. అన్నది.

          జాజులమ్మ హడావుడిగా ఈ మాట విని వచ్చి అత్తా ! పొద్దు పొద్దుగాల్నే ఏమి మాటలివి? నువ్వు లేకుంటే నేను మళ్ళా తల్లి లేని దాన్ని అయితా అన్నది గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ.

          పిచ్చిదానా! నాకేం కాదులేవే ? ఏదో మాట వరుసకు అలా అన్నాను. అంతే అంది ఓదారుస్తూ.

          రాజయ్య ఇద్దర్నీ చూస్తూ, సాల్లే సంబడం అన్నట్టుగా అక్కడి నుండి వెళ్ళి పోయాడు.

***

          జాజులమ్మ పెళ్లై ఆరు నెలలు కావస్తున్నది. కొంచెం కొంచెంగా చుట్టు పక్కల వారితోనూ, ఊర్లో వారితోనూ పరిచయాలు పెంచుకో సాగింది. ముఖ్యంగా ఈర్లచ్చిమికి చాలా దగ్గరి స్నేహితురాలైన సుందరమ్మతో తనకూ మంచి చనువు ఏర్పడింది. అలా ఒకరోజు సుందరమ్మ…

          పిల్లా ! నువ్వు సిగ్గు పడకుండా నేను అడిగినదానికి అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలి. అన్నది.

          ఏంటత్తా?అది?

          మావాడు సైదులు నీతో సంబురంగా ఉంటున్నాడా? లేదా? నేనైతే మీరిద్దరూ ఎప్పుడూ కిలకిలా నవ్వుకోవడం నేను చూడలేదు అంది.

          ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్న జాజులుతో. మళ్ళీ తనే…

          నాకు తెలుసె! చీకటి పడగానే తాగి పడుకోవడం తప్ప వానికి మరోటి తెలియదని. అందుకే, నేనోటి చెప్తా ఇను. నేను సేప్పినట్టు సేసినవంటే వాడు నీ కొంగు ఇడ్సిపెట్టి తిరుగడు. కుక్కలా తోకాడించుకుంటూ నీ వెంటే తిరుగుతాడు అని ఆగింది.

          ఏమట త్తా? అది చెప్పుమన్నట్టుగా అడిగింది. జాజులమ్మ.

          చెప్తానుగానీ, ఛీ ..ఛా ..అనకుండా మూడో కంటికి తెలియకుండా పని కానివ్వాలి మరి, ఆఖరికి మీ అత్తకు కూడా అన్నది గుసగుసగా.

          అలా అనగానే జాజులమ్మ కొంచెం తగ్గి భయంతో, అత్తమ్మకు తెలియకుండానా?అమ్మో! తల్లి లాంటిదాన్ని మోసం చేయలేను అన్నది.

          అదికాదే,పిల్లా! నువ్వూ , నీ మొగుడూ చిలుకా గోరింకలెక్క ఉంటే ముందుగాల సంబురపడేది మీ అత్తేకదేనే, అన్నది.

          అది కూడా నిజమేననుకున్న జాజులమ్మ అయితే ఇషయం ఏమిటో చెప్పు అన్నది.

          ఇగో “ఆ పొద్దులల్ల” వాడుకునే బట్టముక్కలు ఉంటయ్ గదా!వాటిని ఒక కొస కాల్చి నుసి లాగ చేసి నీ భర్తకు తాగే వాటిల కలిపి ఇచ్చిన వంటే పని ఇట్టే అయిపోతది. నువ్వు గీసిన గీత దాటితే నన్నడుగు, అన్నది చాలా నమ్మకంగా.

          జాజులమ్మకు వినగానే కొంచెం ఏవగింపు కలిగింది. ఆ పొద్దు మైల బట్టలు …పిండడం, ఆరబెట్టడమే గగనం. అల్లాంటిది ఈ పని, ఆమెకు మనసొప్పలేదు. కానీ నిజంగా అలాగే జరిగి సైదులు తాగుడు మానితే అత్తకూ, తనకూ మంచిదేగా! అనుకోని ఆలోచనలో పడింది.

          ఇగో !పిల్లా ! తలవలిగేటట్టు సోచాయించే ముచ్చటేమీ గాదిది.పెద్దదాన్ని మంచిగోరి సెప్తున్నా. వాని పానానికి ఏం గాదు. ఇంక వాడే తాగుడు మాని దారిలో పడ్తడు. అన్నది.

          జాజులమ్మకు సుందరమ్మ అంత నమ్మకంగా చెప్తుండడంతో చేస్తే తప్పేమిటి?అనుకోని ఊరుకుండి పోయింది.

***

          ఇలా చేయడం సరైనదేనా? అనే సందిగ్ధతలో ఆమెకు ఏమి తోచడం లేదు.
పసిగట్టి ఈర్లచ్చిమి అడిగినా, ఏమీ లేదని దాత వేసింది.

          మరుసటి రోజు ఉదయమే పొయ్యి అంటిచ్చినప్పుడు, మసి గుడ్డగా తను వాడుకునే గుడ్డను తెచ్చి వాడుతున్నట్టుగా చేస్తూనే, ఎవరూ చూడక మునుపు కావాలనే పొయ్యిలోకి వేసింది.

          ఎర్రలుకు వేస్తున్న ఈర్లచ్చిమి బట్టకాలుతున్న కమురు వాసనను తొందరగానే గుర్తుపట్టి, బయటికి వచ్చి, మండుతున్న పోయ్యిలో నుండి గుడ్డను బయటకు లాగి,
జాజులూ! ఏమిటే? ఇది? శుక్రారం పూట ఈ అపశకునం పనులేమిటి? గుడ్డలను ఎప్పుడు సుత కాలవేట్టద్దు. అట్టాంటిది, ఇంట్ల గిట్లెట్ల చేస్తానవ్? పేయ్యేక్కడున్నదే? అన్నది.

          జాజులు తొందరగా సదురుకొని, అయ్యో! అత్తా! గాలికి పొయిలకు పోయినట్టున్నది. అని నీళ్ళు తెచ్చి పోసింది. కానీ, అత్త, దాని వంకే పరిశీలనగా చూస్తుండడంతో భయంతో లోలోపల వణికి పోసాగింది.

          ఈర్లచ్చిమికి ఆ గుడ్డ ఎటువంటిదో కూడా తెలిసి వచ్చింది. విషయం అర్థమై, ఏమీ అనలేక జాజులమ్మ అమాయకత్వానికి నవ్వుకొని బాధగా,

          “ఎక్కడయినా మంత్రాలకు చింతకాయలు రాలుతాయానే ” ఎడ్డిదానా! అని మాత్రమె అన్నది.

          జాజులమ్మ ఇంకోసారి ఇటువంటి పనులు చేయనన్నట్టుగా ఈర్లచ్చిమి కాళ్ళు పట్టుకుంది.

          లే ..లే , మూఢ నమ్మకాలతో గాదె ! మనసుతోటి మార్చుకోవాలె , అని రాజయ్య వస్తుండడంతో, మామయ్య వస్తున్నాడు, ఊరుకోమన్నట్టుగా సైగ చేసి మళ్ళీ పని లో పడింది.

          వారం రోజుల వరకూ జాజులమ్మ మనిషి కాలేక పోయింది. అత్త తన పట్ల ఎంత ఓపిక చూపెట్టింది. అక్షరం లేకపోయినా, మూఢనమ్మకాల పట్ల ఎంతటి అవగాహనతో ఉన్నదీ అనుకొన్నది. తాను సుందరమ్మ మాట వినకుండా ఉండవలసింది అనుకొని తనను తానె తిట్టుకున్నది.

          ఇలా ఉండగా ఓ రోజు ఈర్లచ్చిమి,
జాజులూ !జాజులూ ! అని పిలుస్తూ ఆ ఊరి లో నర్స్ గా పని చేసే దేవతక్కని తీసుకొని ఇంటికి వచ్చింది.

          ‘’ఈమె పేరు దేవత. నిజంగానే ఈమె దేవత. మనూర్లో ఎంతో మందికి తన సలహాలూ సూచనలు ఇచ్చి బాగు చేసింది. అందుకే అందరికీ తోబుట్టువు లాంటి అక్కయింది. నువ్వు కూడా నీకు ఏ సమస్య వచ్చినా, మాట సాయానికి తనతో మాట్లాడవచ్చు, ఇన్నోద్దులు తను పనుండి ఊర్లోకి రాకుంటుండే. ఇయ్యాల రాగానే నిన్ను సూపిత్తనని ఎంబడి వెట్టుకచ్చిన.’’ అని పరిచయం చేసింది .

          మాట్లాడుకుంట ఉండుడ్రి. నేను చాయ పట్టుకత్త అని లోపలకు పోయింది.
జాజులుకు ఆమె బాగా నచ్చింది, అత్త చెప్పినట్టే మనిషి సొంత మనిషిలాగా కలసి పోయింది. వయసులో పెద్దదైనా తన దోస్తుల లాగా అన్నీ చెప్పుకునేంత మంచి తనం ఆ కొద్ది సేపట్లోనే కనిపించింది. చాలా సేపు మాట్లాడి వెళ్తూ, నీకు వీలైనప్పుడల్లా నా దగ్గరకు వస్తూ ఉండు అని చెప్పింది.

          జాజులుకు అత్తతోనూ పంచుకోలేని కొన్ని విషయాలు పంచుకోవడానికి ఒక ఆత్మీయురాలు దొరికినట్టు అనిపించింది, చూడబోతే అత్తే కావాలనే తనను ఇంటికి తీసుకువచ్చి మరీ !, పరిచయం చేసినట్టుగా తోచింది.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.