పరస్థాన శయన పురాణము (గల్పిక) 

-జోగారావు 

నేను ఈ మధ్య రజత గ్రీన్స్ ఎపార్ట్ మెంట్స్ లో ఉంటున్న మా మేనకోడలు విజయ ఇంటికి వెళ్ళేను.

ఆ రోజు శని వారం.

అప్పుడు సాయంత్రము ఆరు గంటలు.

వారి పదేళ్ళ శుభ ఒక సంచీతో లోపల గదిలో నుంచి వస్తూ నన్ను చూసి హల్లో అని పలకరించింది.

శుభ వెనుకనే మరో పదేళ్ళ అమ్మాయి వచ్చింది. పేరు విభ .

“ బాగున్నాయి పేర్లు. “ అన్నాను.

“ ఈ రోజు మన శుభ తన ఫ్రెండ్ విభ వాళ్ళింటికి స్లీప్ ఓవర్ కు వెళుతోంది.

నిన్న సాయంత్రం విభ మా ఇంటికి స్లీప్ ఓవర్ కు వచ్చింది మావఁయ్యా “ అంది శుభ వాళ్ళ అమ్మ విజ్జీ అనబడే విజయ.

“ స్లీప్ ఓవర్ అంటే ? “ అడిగేను నాకు తెలియక.

“ స్లీప్ ఓవర్ అంటే ఆ రాత్రి వాళ్ళింటిలో పడుకోవడానికి వెళ్ళడము.” అంది విజ్జీ .

అప్పటికీ నాకు అర్ధం కాక ఆముదము ముఖం పెట్టేను.

ఒక ప్లేట్ లో పుంజీడు కొయ్య చేగోడీలు, పప్పు చేగోడీలు, పక్కనే రెండు మైసూర్ పాక్ అచ్చులు, మంచి నీళ్ళ గ్లాసు తెచ్చి

“ ఇప్పుడు ఈ స్లీప్ ఓవర్ సంగతి చెప్తాను. నవుఁలుతూ వినండి మాఁవయ్యా “ అంది విజ్జి.

విజ్జీ చెప్పడం ప్రారంభించింది.

“ ఈ మధ్య స్కూళ్ళలో ఈ స్లీప్ ఓవర్ ఎక్కువగా ఉంటోంది.

నెల మొదట్లోనే కాసులో ఇద్దరేసి అమ్మాయిలు ఆ నెల స్లీప్ ఓవర్ ప్రోగ్రామ్ నిర్ణయించుకుంటారు. శనివారం ఒకరి ఇంట్లో స్లీప్ ఓవర్ కి శుక్ర వారం సాయంత్రం రెండవ వారు మూటా ముల్లె సర్దుకుని వెళతారు. శనివారం సాయంత్రం వాళ్ళిద్దరూ మొదటి అమ్మాయి ఇంటికి వస్తారు. ఆదివారం సాయంత్రం ఎవరింటిలో వాళ్ళుంటారు.

ఒక్కోసారి ముగ్గురేసి అమ్మాయిలు కూడా గ్రూప్ గా వెళతారు.”

అప్పటికి సగం ప్లేట్ ఖాళీ చేసి, బాగుండదని అడిగేను.

“ ఇంతకీ, స్లీప్ ఓవర్ లో ఒకరింటికి ఇద్దరూ వెళ్ళి ఏం చేస్తారు? “

“ ఏముందీ? ఇద్దరూ ఆడుకుంటారు. పాడుకుంటారు. హడావుడి చేస్తారు.ఇల్లు పీకి పునాదులు తీసి పందిరేస్తారు “ కొంచెం కోపంగా అంది విజ్జీ.

“ వంటింటిలో దూరి బ్రేక్ ఫాస్ట్ చేసుకుంటామని పెంట పెంట చేస్తారు ?”

“ వంట కూడా చేసేసుకుంటారా? “ సందేహంతో అడిగేను

“ వాళ్ళ మొఖాలకి అదొక్కటే తక్కువ “

“వాళ్ళ తల్లి దండ్రుల మాటలు వినరా ? ” అడిగేను.

“ ఇంకా నయం ! వాళ్ళనిఏమైనా అంటే ఏమైనా ఉందా ? రాధ్ధాంతం చేయరూ ? “

అప్పటికి చేగోడీలు, మైసూర్ పాస్ అచ్చులు ముగించేసి, గ్లాసులో నీళ్ళు గడ గడా

తాగి, తాపీగ్గా కూచుని కాఫీ గ్లాస్ అందుకున్నాను

“ కోథాస్ కాఫీయేనా ? “ అడిగేను.

“ కోథాస్ కాఫీ తాగితే కబుర్లు బాగా చెప్పుకోవచ్చు అని అంటారు కదా ?”

“ ఇప్పుడు నేను చెప్పేది విను విజ్జీ “

కాఫీ తాగుతూ ప్రారంభించేను.

“ ఈ స్లీప్ ఓవర్ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు విజ్జీ “ ప్రారంభించేను.

“ మా చిన్నప్పుడు , ప్రయాణాల సమయము లో వర్జ్యం, దుర్ముహూర్తం ఉన్నప్పుడు, ఆ ముందు రోజు వర్జ్యం దుర్ముహూర్తం లేని సమయలో ప్రయాణం లో తీసుకు వెళ్ళ వలసిన సూట్ కేస్ గాని , పెట్టి గానీ, అదీ కూడా కుదరక పోతే మరచెంబు లో నీళ్ళు పోసి, పక్కింటి వారి ఇంటిలో ఉంచుతూ “  అత్తయ్య గారూ ! దీన్ని మా అమ్మ మీ ఇంట్లో పరస్థానం పెట్టి రమ్మంది “ అని ఇచ్చే వాళ్ళం.

ఆ రోజు మధ్యాహ్నమో సాయంత్రమో, పక్కింటి అత్తయ్య గారు మా ఇంటికి వచ్చి మర్నాటి ప్రయాణం గురించి ఆరాలు తీసే వారు “

అలా పక్కింటిలో మన ప్రయాణంలో తీసుకుని వెళ్ళ వలసిన ఒక వస్తువును పక్కింటిలో ఒక రాత్రి ఉంచడాన్ని పరస్థానం అని అనేవాళ్ళు. అంటే, ఆ రాత్రి మన వస్తువు పక్కింటి వారింటిలో పరస్థానం పేరుతో పడుకునేది మాట “

“ రాహు కాలం ?” అడిగింది విజ్జీ.

అప్పట్లో రాహు కాలం మన ప్రయాణాలలోనూ, పంచాంగాలలోనూ ఇంత ప్రచారంలో లేదు విజ్జీ “ అన్నాను.

“ సరే చెప్పండి మాఁవయ్యా “ అంది విజ్జీ.

“ సరే ! పరస్థానం అంటే తెలిసింది కదా ! ఇక విను “ ప్రారంభించేను.

“ ఇద్దరు, ముగ్గురు స్నేహితులు కంబైండ్ స్టడీస్ పేరుతో ఒకరింటికి వెళ్ళి అక్కడ కలసి చదువుకుంటూ, రాత్రి పడుకుని తెల్ల వారు ఝామునే లేచి మళ్ళీ చదువుకుని తెల్లవారేక ఎవరింటికి వారు వెళ్ళే పధ్ధతి ఉండేది “

పరీక్షల సమయాల్లో ఈ కంబైండ్ స్టడీస్ చాలా ఎక్కువగా ఉండేవి .

ఇక మామూలు రోజులలో కూడా ఒకరింటికి మరొకరు వెళ్ళి రాత్రి ఉండి పడుకుని తెల్ల వారేక వాళ్ళింటికి వెళ్ళి పోవడము కూడా ఉండేది .

ఒక్కో సారి, తల్లిదండ్రులు పెళ్ళిళ్ళకో, మరో పని మీదో బయటకు వెళ్ళ వలసి వస్తే,

ఆ పిల్లలు తమ తమ స్నేహితుల ఇళ్ళల్లో ముఖ్యంగా రాత్రుళ్ళు ఉండి పోయే వారు.

ఇవి కూడా పరస్థాన శయనమనబడే స్లీప్ ఓవర్లే !

ఒక్కో సారి, మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, మా అమ్మ గారు నన్ను మా తమ్ముడిని పిలిచి ఈ రాత్రి కి మీరు కృష్ణమాచారి ఇంట్లో, నువ్వు సుబ్రమణ్యం ఇంట్లో పడుకోమని చెప్పేవారు.

వచ్చిన చుట్టాల్లో మా ఈడు వాళ్ళుంటే, మరొకళ్ళ ఇంటికి వెళ్ళి పడుకునే అవసరము ఉండేది కాదు. “

ఒక్కొక్కప్పుడు, మా చెల్లెళ్ళు కూడా రాత్రుళ్ళు వాళ్ళ వాళ్ళ స్నేహితురాళ్ళ ఇళ్ళల్లో పడుకోవడానికి వెళ్ళే వారు.

ఇవీ పరస్థాన శయనమనబడే స్లీప్ ఓవర్ లే!

ఇక మరో రకాల స్లీప్ ఓవర్ల సంగతి చెప్తాను.

ఒక్కో సారి, మాకు తెలిసిన అత్తయ్య గారో, పిన్ని గారో, దొడ్డమ్మ గారో సాయంత్రం మా ఇంటికి వచ్చి మా అమ్మ గారితో నన్ను వాళ్ళింటికి ఆవిడకి, పిల్లలకి రెండు మూడు రాత్రులు పడుకోవడానికి పంపించమనేవారు, అప్పటికేదో నేను హీరో అయినట్టు , రాత్రి దొంగలతో యుధ్ధం చేసే సామర్థ్యం ఉన్నట్టు.

నాకు పదేళ్ళ వయసు నుండి ఈ పధ్ధతి అలవాటు అయ్యింది.

ఇక మరో రకం స్లీప్ ఓవర్లు విను విజ్జీ !

ఎదురింటి వారో, పక్కింటి వారో, మా బంధువులో, మా నాన్న గారితో పనిచేస్తున్న వాళ్ళో, తెలిసిన వారో వచ్చి మా అమ్మ గారికో, నాన్న గారికో మేము ఇన్ని రోజులు ఇంట్లో ఉండము , ఊరు వెడుతున్నాము, మీ అబ్బాయిని తన స్నేహితుడితో వచ్చి మా ఇంట్లో పడుకోమని చెప్పండి అని చెప్పి వారి ఇంటి తాళం చెవులు ఇచ్చి వెళ్ళే వారు.

వాళ్ళు తిరిగి వచ్చేవరకు నేను మా ఆచారి రాత్రుళ్ళు వాళ్ళ ఇంటిలో పడుకునే వారం.

నేను ఏతా వాతా చెప్పేది ఏమిటంటే , ఈ స్లీప్ ఓవర్ కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. నాకు ఏభయ్యేళ్ళ ముందు నుండీ తెలుసును .”

అన్నాను.

“ చాలా బాగా చెప్పేరు మాఁవయ్యా ! మరో కప్ప కాఫీ తాగుదామా ? “ అడిగింది విజ్జీ.

“ సరే “ అన్నాను.

మరో కప్ప కోథాస్ కాఫీ తాగి “ సరే వస్తాను విజ్జీ “ అని లేచేను.

“ నేనూ వస్తాను . పదండి మాఁవయ్యా !”

“ వద్దులే ! ఈ సాగనంపడాలు వద్దు “ అన్నాను.

“ అదేం కాదు మాఁవయ్యా ! ఈ రాత్రి నేనూ మాఫ్రెండ్ విమల విశాల ఇంటికి

స్లీప్ ఓవర్ కు వెడుతున్నాం “ అంటూ లేచింది విజయ.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.