శ్రీరాగాలు-4
‘జీవనవాహిని’
– అనూరాధ నాదెళ్ల
“సీతా!సీతా!” అన్న పిలుపులో అంతవరకూ క్షణమొక యుగంలా ఎదురుచూసిన నిరీక్షణ తాలూకు ఆరాటం ఉంది. అంతకు మించి ఆనందం పొంగులెత్తుతున్న ఉద్వేగం ఉంది.
కొత్తగా పెళ్లై కాపురానికెళ్ళిన ఉష ఉత్తరం కోసం నాలుగు రోజులుగా ఎదురు చూస్తున్న ఆ జంట, వాళ్ళతోపాటు శాంతమ్మగారు భౌతికావసరాలు తీర్చుకుందుకు మినహా వాకిటి గుమ్మాల్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఈ నాలుగు పగళ్ళూ వాళ్లకి అక్కడే గడిచాయి. రాత్రిళ్ళు నిద్రరానితనం, తెల్లవారి ఆ బడలిక తాలూకూ నీరసం వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మూడు రోజులు నిరాశ, నిస్సత్తువలలో అలసిన వాళ్ల మనసులు ఆ పూట ఆనందంతో ఊయలలూగాయి. చేతిలో పట్టుకున్న ఆ కవరు కొన్ని క్షణాల వరకు తెరవలేక పోయారు రామచంద్రంగారు.
“ఎవరూ, మన ఉషలేనా?” వత్తులు చేసుకుంటున్న శాంతమ్మగారు బోసినవ్వుతో అడిగారు.
భర్త పిలుపుతో వాకిట్లోకి పరుగున వచ్చిన సీత కూడా అక్కడే చతికిలబడి పోయింది. ముగ్గురి కళ్ళలోనూ నీటి తెరలు కమ్ముకొచ్చాయి. వారి మౌనంలో ఓ భాష ఉంది. అది వాళ్ళ మనసులకి అర్థం అవుతుంది. ఈ మధ్య తరచుగా వాళ్ళ భాష అదే.
దీర్ఘంగా నిట్టూర్చి ఆయన కవరు అంచు జాగ్రత్తగా చింపారు. తెల్లటి పొడవాటి కాగితం మడతలు విప్పి ఆత్రంగా అక్షరాల వెంట చూడబోయి ఓ క్షణం నిరుత్సాహ పడ్డారాయన. ఓ పది పన్నెండు పంక్తులు మాత్రం ఉన్నాయందులో.
“ప్రియమైన అమ్మకు, నాన్నకు” అంటూ మొదలైన ఉత్తరం అంతలోనే చదవడం పూర్తయిపోయింది. మళ్ళీ మొదటి పంక్తిని, మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చదివారో!
“ఏం రాసింది చిట్టితల్లి?” ఆవిడ ఆత్రాన్ని అర్థం చేసుకున్నట్లు అప్పుడందించారాయన ఉత్తరాన్ని.
ఆయన లేచి పెరటివైపు వెళ్ళిపోయారు. ఆయన వెనకే ‘మున్నీ’ లేచి పరుగందుకుంది.
* * *
అయిదారు సంవత్సరాల క్రితం ఆ పెరటి నిండా ఎన్ని మొక్కలు! అన్నీ పూల మొక్కలు. సాయంకాలం స్కూలు, కాలేజీల నుండి వస్తూనే శారద, రజని, ఉష ముగ్గురూ ఆ మొక్కల చుట్టే ప్రదక్షిణాలు చేస్తుండే వారు.
రోజుకో కొత్త మొక్క తెచ్చి తోటనిండా నాటుతుండేది ఉష. “నా గులాబీ మొక్క ఎన్ని పూలుపూసిందో చూడు” అని ఒకరంటే “నా సన్నజాజి తీగ ఎంచక్కా రోజూ పూస్తుంది” అంటూ ఇంకొకరు. ఆ మొక్కల్ని చంటి పిల్లల్ని సంరక్షించినట్లు సంరక్షించేవారు.
అంతలో శారద పెళ్లి నిశ్చయం అయింది. అమ్మ, నాన్న, నానమ్మలకి దూరంగా వెళ్ళాలన్న బాధ ఓ వైపు అయితే,పెరట్లో పూల మొక్కలతో అల్లుకున్న ఆత్మీయతనీ దూరం చేసుకోవాలన్న వ్యథ మరోవైపు. తిరిగి తిరిగి చూస్తూ కన్నులద్దుకుంటూనే భర్త చెయ్యి పుచ్చుకు వెళ్ళిపోయింది శారద.
క్రమేపీ చైతన్యం మళ్ళీ వచ్చిందా ఇంట్లో. సాయంకాలాలు పెరడంతా వినవచ్చే చిట్టిపొట్టి తగాదాలు, చిలిపి అల్లర్లతో జీవం పోసుకుంది.
ఆఫీసు నుండి వచ్చి వాళ్ళ అల్లరిని హాయిగా భరిస్తూ కూర్చునేవారు రామచంద్రం. ఆయన్నంటే అర్థాంగీను. ఆ దృశ్యంలో పెద్ద కూతురు కూడా కనపడుతూనే ఉండేది వాళ్ళ మనోనేత్రాలకి.
ఇంతలోనే రజని పెళ్లి కుదిరింది. మిగతా ఇద్దరికంటే అల్లరి. కబుర్లు తక్కువే అయినా తల్లీ తండ్రీ వెనుక అనుక్షణం నీడలా తిరుగుతూ పసితనం వీడని తత్వంలో ఆమె ఉండేది.
ఆమె కూడా వెళ్ళాల్సిన రోజొచ్చింది. భర్త అడుగులు ముందుకు వేస్తుంటే, చేతిని తప్పించుకుని అమ్మానాన్నల్నల్లుకుపోయి బావురుమంది.
ఇంట్లో చడీ చప్పుడూ లేదు. అంత అల్లరి చేసే ఉష కూడా అక్కలిద్దరూ వెళ్లి పోవడంతో ఒంటరిదై కొన్నాళ్ళు మూగనోము పట్టినట్లుండేది. కాలేజీ నుండి వచ్చాక ఒక గదిలోంచి ఇంకో గదిలోకి ఊర్కే తిరుగుతుంటే కాలికున్న మువ్వలు ఘల్లుమంటూ ప్రతిధ్వనిస్తుండేవి గదులన్నీ.
పెరట్లో తిరుగుతుంటే ఏవేవో మనసులో జ్ఞాపకాలు కదిలేవి.
తల్లిదండ్రుల గాంభీర్యాన్ని చూసి వాళ్ళ మనసుల్ని చదివినట్లే దూరంగా మసిలేది. నానమ్మని ఆటలు పట్టించటం మానేసింది. ఆవిడ గదిలోకెళ్ళి “నానమ్మా నీకేదైనా చదివిపెట్టనా?” అంటూ అడుగుతూంటే ఆవిడ ప్రాణం ఉసూరుమనేది – “ఎంత అల్లరిపిల్ల ఎంత పెద్దరికాన్నితెచ్చిపెట్టుకుంది?” అని. ఏవో కబుర్లలోకి దించే వారావిడ.
ఆ రోజు కాలేజీ నుండి వస్తూనే బుజ్జి కుక్కపిల్లని తెచ్చింది ఉష. ‘మున్ని’ అని పేరుపెట్టి ఇల్లంతా తిప్పి ఆడించేది. ఇంట్లో కదలిక వచ్చింది. పగలంతా చేతులకి, కాళ్ళకి అడ్డం పడుతుండే ఆ చిన్న ప్రాణి పట్ల అందరికీ ఇష్టం ఏర్పడింది. శాంతమ్మగారి పూజా పునస్కారాలకి కాస్త భంగం కలిగిస్తున్నా ఆవిడ దాని అల్లరిని ముద్దుగానే విసుక్కుంటుండేవారు.
శారద, రజని పండుగలని, పురుళ్ళని వస్తూ వెళ్తూ ఆ ఇల్లంతా వెలుగులతో నింపి వెళ్తుండేవాళ్ళు.
రోజులు గడుస్తున్నకొద్దీ సీత, రామచంద్రంలా మనస్సులో ఓ కొత్త దిగులు మొదలైంది. ఇంకెన్నాళ్ళు, ఉష కూడా ఈవేళోరేపో అత్తవారింటికి వెళ్ళే ఘడియ వస్తుంది కదూ.
యాంత్రికంగా గడుస్తున్న రోజులు ఉష పెళ్ళితో కాస్త హడావుడిని పుంజుకున్నాయి. ఉష అమ్మానాన్నల సామీప్యాన్ని తప్పించుకుని తిరుగుతోంది. “గుండె గొంతుకలో” అన్న భావన అప్పటికి అనుభవంలోకి వచ్చింది. ఏం మాట్లాడబోయినా నోరు పెగలదు. కళ్ళు చెమరుస్తాయి.
పిల్లలు ముగ్గురూ కబుర్లతో, కేరింతలతో పెళ్లిసంబరాన్ని, కొత్త కళని ఇంటికి తెచ్చారు. అనుకున్నంతసేపు పట్టలేదు. ఇట్టే పెళ్లయిపోయింది. శేఖర్ వెంట పెళ్లి బట్టలతో వెళ్ళిపోయింది ఆ యింటి చంటి పిల్ల ఉష.
పెళ్ళికి వచ్చిన శారద కూడా నెమ్మదిగా ప్రయాణం కట్టేసింది – “అప్పుడే మీ అల్లుడు వెళ్లి వారం అయింది. భోజనానికెంత ఇబ్బంది పడుతున్నారో. వీడికి స్కూల్ చాలా రోజులు పోయింది” అంటూ.
“రజనీ! నువ్వింకో నాలుగు రోజులుండవే. నీ కూతురింకా పసిపిల్లే. స్కూలు పోతుందన్న దిగులు లేదు కదా” అంటూ చెల్లెలికి, అమ్మానాన్నల్ని, నానమ్మని, యింటిని అప్పగించి వెళ్ళిపోయింది.
మరో నాలుగురోజులుంది రజని. ఆమె మనసుకు తోస్తోంది అక్కడ, ఆ వాతావరణంలో కమ్ముకొస్తున్న శూన్యం. అమ్మానాన్నలు పెద్దవాళ్లై పోతున్నారు. ఒంటరిగా ఆ ఇంటికి ఇద్దరూ మిగిలారు. నాన్నమ్మ అసలే పెద్దదై పోయింది. తను వీళ్ళ కోసం ఏం చెయ్యగలదు? పోనీ కాస్త మార్పుగా ఉంటుంది తనతో ప్రయాణం అవమంటే.
“ఎటూ మేం ఇలా అలవాటు పడాలి కదమ్మా. ఎప్పుడో వస్తాంలే మీ ఇళ్ళకి. మీరు ఎలా ఉంటున్నారో చూడొద్దూ” అంటూ నవ్వేశారాయన. ఆ నవ్వులో వ్యధే ఉంది.
ఆమె గమ్యం వైపుగా ఆమె వెళ్ళిపోయింది.
***
ఉత్తరాలే వాళ్ళకిప్పుడు జీవనాధారాలు. రామచంద్రం శెలవు పొడిగించి పొడిగించి వాలంటరీ రిటైర్మెంటుకు నిశ్చయించుకున్నాడు.
పొద్దు గడవదు. ఆ మూగ బాధ తీరేది కాదు. ఆడపిల్లలతో నిత్యం కళ కళలాడుతూ, కేరింతలతో, శుభకార్యాలతో హోరెత్తిపోయిన ఆ పరిసరాల్లో ఒక్కసారి స్తబ్ధత ఆవరించింది.
వాళ్ళు ఒకరినొకరు పలకరించుకుందు క్కూడా సాహసించడం లేదు. ఎక్కడ కన్నీళ్ళతో బయటపడిపోతామో అన్న భయం.
గదుల్లో ఊపిరాడనట్లై పెరట్లోకి వెళ్తారు. అక్కడ, ఆ పూల మొక్కల్ని చూస్తుంటే అదో గుండెకోత. ఇటు వసారా వైపుగా వస్తే… ఏముంది? ఎటు చూసినా ఖాళీతనం వెక్కిరిస్తూంది.
* * *
“సీతా! మనం కాసిని రోజులు ఎటైనా వెళ్లొద్దాం. ఇక్కడ మరీ తోచకుండా ఉంది. అమ్మకీ, నీకూ కాస్త మార్పుగా ఉంటుంది. ఎటు వెళ్దాం?” లాలనగా అడిగారాయన.
ఆవిడ కళ్ళెత్తింది. ఆ కళ్ళలో ఒక ఆశ రెపరెపలాడుతోంది.
ఏదో ఆలోచిస్తున్నట్లు అంతలోనే కళ్ళు వాల్చుకుందావిడ.
“సీతా! నీ మనసులో ఏముందో చెప్పవూ?”
“రావులపాలెం వెళ్లొద్దామా? నాన్న ఒంటరిగా వున్నారు…”
కూతుళ్లను అత్తవారింటికి పంపిన అనుభవం ఆయనదిప్పుడు. పుష్కరంనాడు, మామగారితో పంతానికి పోయి, సీతని పుట్టింటికి వెళ్ళనీయక కట్టడి చేసిన తన కాఠిన్యం తల్చుకుంటే మనసు చివుక్కుమంది.
“తప్పకుండా వెళ్దాం సీతా” అన్నారాయన ఉత్సాహంగా.
ఆవిడ కళ్ళు తళుక్కున మెరిశాయి. ఆవిడ లేచి అత్తగారి గదిలోకి వెళ్ళింది. “అత్తయ్యా! మనం రావులపాలెం వెళ్తున్నాం.”
కోడలి మనసు తెలిసిన ఆ వృద్ధురాలు – “శుభం! ప్రొద్దున్నేబయల్దేరండర్రా. ఏకంగా ఆయన్నిక్కడికి తీసుకొచ్చేయండి. ఈ రెండ్రోజులూ ఇల్లు నేను చూసుకుంటాను” అంటూమనసారా పలికారు.
(రాజా-లక్ష్మీ ఫౌండేషన్ కథల పోటీలో కన్సొలేషన్ బహుమతి పొందిన కథ –
ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక – మే 1993)
*****
పుట్టి పెరిగింది విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటూ పాలొంటూ సైన్యంలో చేరి, రెండు దశాబ్దాల తర్వాత మరో పదకొండేళ్లు కార్పొరేట్లో కదం తొక్కి, మూడేళ్లక్రితం దానికీ గుడ్ బై చెప్పినప్పట్నుంచీ, గాత్రధారణలు, అనువాదాలు చేస్తూ, కథలూ కవితలూ రాసుకుంటూ, సాహిత్యారాధనలో ఢిల్లీలో నివసిస్తున్నాను.