వ్యాధితో పోరాటం-9
–కనకదుర్గ
సాయంత్రం పిల్లల్ని తీసుకుని శ్రీని వచ్చాడు. పాప ఆ రోజు సరిగ్గా పడుకోలేదు, అందుకే కొంచెం చికాగ్గా వుంది. ఏడుస్తుంది. అందరూ వూరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
“ఇది హాస్పిటలా, ఇల్లా? ఇక్కడ పేషంట్లకి రెస్ట్ అవసరం అని తెలీదా? ఇపుడే నిద్ర పట్టింది? ఇక్కడ సరిగ్గా పడుకోవడానికి కూడా లేదా?” అని గట్టిగా అరిచింది పక్క పేషంట్.
నర్స్ బెల్ ఆగకుండా నొక్కుతూనే వుంది. జూన్ పరిగెత్తుకొచ్చింది.
పాపని చూసి,” హాయ్ స్వీటీ! వాట్ హాపెన్డ్? నిద్రొస్తుందా?” అని పలకరించింది.
“నేను పిలిస్తే అక్కడ కూర్చొని పిల్లతో కబుర్లా? మనవాళ్ళ గురించి ఇంట్రెస్ట్ మనకే లేకపోతే వేరే వాళ్ళకెందుకుంటుంది?” అంది పక్కామె గట్టిగా.
“నీ దగ్గరకే వస్తున్నాను. ఏం జరిగింది?”
“పేషంట్స్ దగ్గరకు చంటి పిల్లలను తీసుకురాకూడదని రూల్ ఏమీ లేదా ఈ హాస్పిటల్ లో? ఆ పిల్ల ఏడుపుకి నాకు మెలుకువొచ్చింది తెల్సా?”
“ఇది విజిటింగ్ హవర్స్. ఈ టైంలో ఫ్యామిలీలు పేషంట్స్ ని చూడడానికి రావొచ్చు. మధ్యాహ్నం కూడా వస్తారు కొంత మంది, వచ్చి పక్క పేషంట్స్ ని డిస్టర్బ్ చేస్తారు. మేము ఏమి అనము, పేషంట్స్ కూడా ఏం మాట్లాడరు. లేచి బయటకు వెళ్ళిపోతారు…..”
“నన్నే అంటున్నావా? అవును నన్ను చూడడానికి వచ్చారు, వాళ్ళేమి వెళ్ళి పొమ్మనలేదు, తనే వెళ్ళిపోయిందేమో! అయినా నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తావేంటీ?”
“నేనెవర్ని సపోర్ట్ చేయను. ఉన్నది చెప్పాను. మేము నర్సులము అందర్ని ఒకటేలా ట్రీట్ చేయాలి.”
అప్పటికే మేమంతా పాపని ఎత్తుకుని బయటికి వెళ్ళి హాల్ లో తిరగడం మొదలు పెట్టాము.
“ఆమెంటీ అంత గొడవ చేస్తుంది??
“రాత్రొచ్చింది. అప్పట్నుండే గోల మొదలెట్టింది.”
“ఇలాంటివారు కూడా వుంటారు.”
“మనం ఇక్కడికొచ్చినప్పటి నుండి చూస్తునే వున్నాము కదా! మనం వచ్చిన కొత్తలో చైతు 4-5 ఏళ్ళ వయసపుడు మన అపార్ట్మెంట్ క్రింద వాళ్ళు వీడు పరిగెత్తగానే ఓ కర్ర తీసుకొని మనకి వినిపించేలా క్రింద నుండి కొట్టేవాళ్ళు కదా! అపుడు మనం వాడిని పట్టుకొని కూర్చోబెట్టేవాళ్ళం. ఎగరకుండా చూసుకునేవాళ్ళం. వాళ్ళ కారు పార్కింగ్ లో లేకపోతే వాళ్ళు ఇంట్లో లేరని వాడిని ఫ్రీగా ఆడుకోవడానికి వదిలేసేవాళ్ళం. వాడి ఫ్రెండ్స్ వచ్చినా క్రిందకే తీసుకెళ్ళి ఆడించేవాళ్ళం కదా!”
“కొంతమంది అంతే. ఏం చేస్తాం?”
జూన్ నర్స్ స్టేషన్ దగ్గర కనిపించింది.
“సారీ జూన్. బాగా గొడవ చేసిందా ఆమె?”
“నో, నో! ప్లీజ్ డోంట్ అపాలజైజ్. షి ఈజ్ రాంగ్. కొంత మంది అంతే, మారరు. సంకుచితంగానే ఆలోచిస్తారు. ఐ యామ్ సారీ డియర్!” అని వంగి చైతుకి చెప్పింది.
“ఐ యామ్ ఓకే!” అన్నాడు వాడు ఇబ్బందిగా.
కాసేపయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు. లిక్విడ్ డైట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో సగం కూడా తినలేదు నేను. కానీ నొప్పి ఇంజెక్షన్స్ తీసుకోవడం తగ్గించాను.
ఆ రాత్రి రకరకాల ఆలోచనలతో నిద్ర పట్టలేదు. పక్క పేషంట్ ఫోన్లో గట్టిగా మాట్లాడడం, పడుకున్నపుడు గురక పెట్టడం, రెండు గంటలు పడుకోవడం, నొప్పి అని గొడవ పెట్టడం, నిద్రకి మందివ్వమని అడగడం, ఇచ్చాక వెంటనే నిద్ర పట్టలేదని గొడవ. ఇలాగే సాగింది రాత్రంతా!
తెల్లవారాక కొంచెం కళ్ళు మూతలు పడ్డాయి.
“అయినా ఇంకా పూర్తిగా టెస్ట్స్ చేయకుండా, తనకి నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోకుండానే జీవితాంతం ఇలాగే వుంటావని చెపితే ఆ అమ్మాయి పరిస్థితి గురించి ఆలోచించారా డా. డేవిడ్?” జూన్ గొంతు వినిపించి మెలుకువొచ్చింది నాకు. ఇదేంటి నిజంగానే డా.డేవిడ్‌ని దులిపేస్తుందా?
ఆయన ఇపుడు చూడడానికి వస్తే ఏం చెప్పాలి? ఏం మాట్లాడాలి?”
“నర్స్ జూన్, తను అడిగిందానికి అలా చెప్పాను కానీ తనను భయపెట్టాలనుకో లేదు.”
“డెలివరి తర్వాత తన ఫస్ట్ హాస్పిటలైజేషన్, పాపని ఇంట్లో వదిలి పెట్టి వచ్చింది. ఇంటికి వెళ్ళాలని వున్నా ఈ నొప్పి ఎందుకొస్తుందో తెలుసుకోవాలని, ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారేమో, ఈ నొప్పి తగ్గిపోతుందేమో అనే ఆశ వుంటుంది కదా పేషంట్ కి. నువ్వు జీవితాంతం ఈ నొప్పితో బ్రతుకుతున్నవారున్నారని చెబితే ఎవరికైనా భయం వేస్తుంది కదా!”
నేను బాత్రూమ్ లోకెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చాను. లిక్విడ్ డైట్ పెట్టి వుంది. టీ కప్ లో వున్న నీరు చల్లగా అయిపోయాయి. నర్స్ బటన్ నొక్కితే ఎవ్వరూ రాలేదు. నేనే కప్ పట్టుకుని, ఐ.వి పోల్ పట్టుకుని బయటకు వెళ్ళాను. డా. డేవిడ్ మా పక్క రూంలో వున్నట్టున్నాడు. అక్కడ కనిపించిన నర్స్ ని టీ కప్ వేడి చేసి ఇమ్మంటే చేసి ఇచ్చింది. నేను థ్యాంక్స్ చెప్పి మా రూంలోకి వెళ్ళి బిస్కెట్స్ నంచుకుని టీ తాగుతుండగా డా.డేవిడ్ వచ్చారు.
“గుడ్ మార్నింగ్ డియర్! గుడ్ టీ, క్రాకర్స్ తింటే నొప్పి రాలేదు కదా!”
“లేదు. నొప్పి ఏం లేదు.”
కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చుని, “ఇపుడు చెప్పు మిస్, నిన్న నేను చెప్పిందాంట్లో ఏది భయపెట్టిందో?”
“ఈ జబ్బుతో ఇలాగే జీవితాంతం వుండాల్సి రావొచ్చు అన్నారు. దాంతో నాకు భయం వేసింది. నాకు ఈ జబ్బు వచ్చి 6 ఏళ్ళు అయ్యింది. కానీ ఇక్కడికి వచ్చాక, పూర్తిగా దాని గురించి మర్చిపోయేలా నాకు నొప్పి రాలేదు, చాలా బ్రేక్ వచ్చింది. మేము పాపని అడాప్ట్ చేసుకుందామనుకున్నాము. కానీ నా ఆరోగ్యం కుదుటపడింది, బరువు పెరిగాను, ఇక్కడికి రాకముందు నేను తినడానికే భయపడేదాన్ని, ఏది తిన్నా నొప్పొచ్చేది. కానీ ప్లేస్ చేంజ్ వల్ల కావొచ్చు మరేదైనా కారణం కావొచ్చు నాకు నొప్పి రాలేదు. అన్నీ తినగలిగాను, అన్నీ టూరిస్ట్ స్థలాలకు వెళ్ళగలిగాము. అపుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. డాక్టర్ల సలహా తీసుకునే ప్రెగ్నెంట్ అయ్యాను. ఏం కాదు అన్నారు, కానీ ఐ హాడ్ టఫ్ ప్రెగ్నెన్సీ యూ నో. కానీ డెలివరీ తర్వాత తగ్గిపోతుందేమో అనుకున్నాము. డా.రిచర్డ్ ఈ.ఆర్.సి.పి వారం క్రితం చేసినపుడు ఎటువంటి ప్రాబ్లెమ్స్ కనిపించలేదు. కానీ డెలివరీ అయినప్పటి నుండి నొప్పి తగ్గటమే లేదు, బ్లడ్ టెస్ట్ చేస్తే మళ్ళీ అటాక్ వచ్చిందని మీరే కదా ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మన్నారు. కానీ దీనికి ఏదో ట్రీట్మెంట్ వుంటుంది తగ్గిపోతుంది, ఇప్పుడే కాకపోయినా కొన్నాళ్ళకయినా తగ్గుతుందని అనుకున్నాము. కానీ మీరు అలా చెప్పే వరకు చాలా భయం వేసింది.”
“ఓ.కే! ఐ యామ్ సారీ అబౌట్ ఇట్ దుర్గా. నీకు ఈ.ఆర్. సి.పి లో ఏమీ తెలియ లేదు కదా! అందుకే నేను ఇది క్రానిక్ ప్రాబ్లెమ్ అవుతుందనుకున్నాను. ఈ ప్రాబ్లెమ్ తో కూడా చాలా ఏళ్ళు క్రానిక్ పేషంట్స్ బ్రతుకుతున్నారని చెప్పాను. అయినా చూద్దాం. రేపు డా.రిచర్డ్ వస్తారు. తర్వాత ప్లాన్ ఏమిటి అనేది చెబ్తారు. కాట్ స్కాన్ , ఎం.ఆర్. ఐ, లాంటివి ఇంకా చాలానే వున్నాయి. ఇందులో ఏం టెస్ట్స్ ఏం చేయాలో చూడాలి. రేపు డా.రిచర్డ్ నిన్ను డిస్చార్జ్ చేస్తారనుకుంటున్నాను. ఇంటికెళ్ళి మీ బేబితో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఓ.కే ఆల్ ద బెస్ట్ దుర్గా! టేక్ కేర్ అండ్ రిలాక్స్, ఓ.కే?” అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు.
“హమ్మయ్యా!” అనుకున్నాను. నర్స్ జూన్ అంత గట్టిగా మాట్లాడితే ఈయనకు బాగా కోపం వస్తుందనుకున్నాను. కానీ నర్స్ అయినా ఆమె సీనియర్ కాబట్టి గౌరవం చూపాడు, కోపం తెచ్చుకోకుండా.
రేపు ఇంటికెళ్ళిపోతాననే సంతోషంతో అందరితో ఉషారుగా మాట్లాడాను.
రేపెళ్ళిపోతానేమో అని అందరికీ సంతోషంగా చెప్పాను.
ప్రక్కావిడ గొడవ చేసినా పట్టించుకోలేదు. సాయంత్రం శ్రీని పిల్లలని తీసుకొస్తే చైతుకి ఆనందంగా చెప్పాను రేపు ఇంటికి వచ్చేస్తున్నానని.
బయట హాల్ లో నడుస్తుంటే నర్సులు శ్రీని ని పట్టుకుని సరదాగా మాట్లాడేవారు, “ఆర్యూ హ్యాపి విత్ యువర్ కిడ్స్? యు హావ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మాకందరికీ మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. మీకిద్దరు పిల్లలు చాలా? మీకు ఇంకా పిల్లలు కావాలా?” అని అడిగేవారు.
శ్రీని ఇబ్బంది పడేవాడు ఒకోసారి అంత డైరెక్ట్ గా అడిగితే.
ఆ రాత్రి పడుకునేముందు అమ్మా, నాన్న, గుర్తొచ్చారు. పాపం ఎంత బాధపడుతున్నారో! అమ్మకి, నాన్నకి పాస్ పోర్టులు లేవు. మేము ఇక్కడ శ్రీని ప్రాజెక్ట్ అయిపోగానే ఇండియాకి వెళ్ళిపోతామని అనుకున్నాము కానీ, ఇలా అయ్యి ఇక్కడ ఇరుక్కుపోతామని అవసరం అయితే వాళ్ళని రమ్మనాల్సి వస్తుందని అనుకోలేదు. ఇప్పటికింకా ఆ ఆలోచన రాలేదు. నార్మల్ డెలివరీ అయ్యి పాప ఆరోగ్యంగా పుట్టడంతో కొంచెం ధైర్యం వచ్చింది. కానీ నొప్పి ఎప్పటికీ తగ్గకపోయేసరికి డాక్టర్ రిచర్డ్ కి ఫోన్ చేస్తే, ” డెలివరీ తర్వాత ఈ.ఆర్.సి.పి టెస్ట్ చేస్తానని చెప్పాను కదా! అది చేసేద్దాము. ఏదన్నా ఉంటే తెలుస్తుంది,” అన్నారు. టెస్ట్ కి వెళ్ళినపుడు పాపని ఎక్కడ వదిలి పెట్టాలి? హాస్పిటల్ కి తీసుకెళ్ళడం ఇష్టం లేదు. ఈ ఈ.ఆర్.సి.పి (ERCP, Endoscopic retrograde cholangio pancreatography) నాకు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయేమో అని టెస్ట్ చేస్తానన్నారు. ( ERCP పరీక్ష లివర్, గాల్ బ్లాడర్,(పిత్తాశయం), బైల్ డక్ట్ (పిత్తవాహిని) పాన్ క్రియాస్ లో వచ్చే జబ్బులను నిర్ధారించే పరీక్ష).
అదీ కాక ఈ టెస్ట్ షార్ట్ ప్రొసీజర్ యూనిట్లో చేస్తారు. లోపలికి ఒక చిన్న కెమెరా వున్న పైప్ ని పంపిస్తారు కాబట్టి, చాలా సేపు నోరు తెరిచి వుంచాలి, గొంతులో నుండి కడుపులోకి వెళ్తుంది, గొంతు నొప్పిగా ఉంటుందని మత్తుమందిస్తారు. టెస్ట్ అయ్యాక ఒక రెండు గంటలు రికవరీ రూంలో వుంచి అంతా బాగుంటే చెక్ చేసి ఇంటికి పంపిస్తారు.
జోన్, మా అపార్ట్మెంట్ బిల్డింగ్ ఎదురు బిల్డింగ్ లో వుంటుంది. వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ లో వుంటారు. జోన్, రోండా, హెదర్, కామిని, కాంచన, నివేదిత ఇలా పిల్లలున్న వారందరము స్కూల్ బస్ స్టాప్ లో కలిసేవారము. జోన్ కి ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. జోన్, నేను మంచి స్నేహితులమయ్యాము. నేను అందరితో స్నేహంగానే ఉండేదాన్ని. జోన్ కి పుస్తకాలు చదివే అలవాటుంది. ఇద్దరం పుస్తకాలు ఒకరికొకరం ఇచ్చుకునేవారం. శని, ఆదివారాలు పిల్లల్ని తీసుకొని భర్త దగ్గరకు వెళ్ళేది. జోన్ భర్తకి కోపమెక్కువ, ఒకసారి కోపంలో కూతురి చెయ్యి విరగ్గొట్టాడు. జోన్ ఇక భరించలేక కోర్ట్ కెళితే ఇద్దరూ వేరు, వేరుగా వుండేట్టు, శని, ఆదివారాలు ఆయన దగ్గర గడిపేట్టు, భర్త కోపం తగ్గించుకోవడానికి థెరపీకెళ్ళాలని కూడా కోర్ట్ వాళ్ళు చెప్పారు. జోన్ ఇళ్ళు క్లీన్ చేసి, పిల్లలను పెంచుతుంది, దానికి తోడుగా తెల్లవారుజామునే లేచి కుక్కీస్ చేసి బేకరీకి సప్లయ్ చేస్తుంది. భర్త ఒకోసారి డబ్బులిచ్చేవాడు, చాలాసార్లు ఇచ్చేవాడు కాదు. పూర్తిగా తెగ తెంపులు చేసుకోవడం ఇష్టం లేదు తనకి. పిల్లలు పెద్దయ్యి ఎవరి జీవితాల్లో వారు సెటిల్ అయిపోయాక తను ఒంటరిగా ఉండకుండా భర్తతో కలిసి ఉండొచ్చు అనే ఐడియా ఉంది.
నేనే అనేదాన్నీ డైవోర్స్ ఇచ్చేసి ఎవరైనా మంచి మనిషి కలిస్తే తనతో కొత్తగా జీవితం మొదలు పెట్టొచ్చు కదా అని.
“నాకు ముగ్గురు పిల్లలు, నాకు చదువు లేదు, నేను పెద్ద అందగత్తెను కాను,(నిజానికి జోన్ బావుంటుంది, సింపుల్ గా వుంటుంది, గ్లామరస్ గా తయారుకావడానికి తనకి ఇంట్రెస్ట్ లేదు మేకప్ సెట్ కొనడం కంటే పిల్లలకు తిండి పెట్టడం, పుస్తకాలు కొనడం ముఖ్యం తనకి) ఈ వయసులో ముగ్గురు పిల్లల తల్లిని, నాతో పాటు పిల్లల్ని ఎవరు ఇష్టపడతారు చెప్పు? మైకెల్ కి ఇపుడు కాకపోయినా రిటైర్మెంట్ సమయానికైనా థెరపీ పని చేయొచ్చు, నా చిన్న కూతురికి తండ్రంటే చాలా ఇష్టం, ఆయనకు కూడా చిన్న కూతురు నాజుకుగా, అందంగా, చాలా సెన్సిటివ్ గా వుంటుందని ఇష్టం! వయసుతోపాటు కొద్దిగానైనా మార్పు వస్తుందేమో మనిషిలో చూద్దాం. రోజూ కల్సి వుండం కదా! పర్వాలేదు.” అనేది.
*****
(సశేషం)
నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.