మల్లెమొగ్గల గొడుగు – మాదిగ కతలు 

పుస్తకాలమ్’ – 12

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

సీకటి కంటె సిక్కనైన కులాన్ని కోసే ఎల్తురు కత్తి

          “…కులముండ్లా! అది సీకటికంటే సిక్కనైంది. యిప్పుడు దాన్ని గోసే యెల్తురు గత్తులు గావాలన్నా” అంటాడు మాదిగ పంతులు కొడుకు యాదాంతం (వేదాంత ప్రసాదు) ‘అచ్చిరాలే ఆయుదాలు’ అనే కథలో.

          ఈ సమాజానికి అవసరమైన అటువంటి కోట్లాది ఎలుతురు కత్తుల్లో చాల పదునైన, శక్తిమంతమైన కత్తిగా మూడు దశాబ్దాలకు పైగా అద్భుతమైన సాహిత్య, సామాజిక కృషి సాగించిన ఎండ్లూరి సుధాకర్ శుక్రవారం ఉదయం కన్ను మూశారు.

          మధ్యాహ్నం హిమశీతల పేటికలో శాశ్వత నిద్రలోనో, హేమలత జ్ఞాపకాల కలల్లోనో పడుకుని ఉన్న ఆయనను చివరిసారి చూసి నమస్కరిస్తున్నప్పుడు, కన్నీళ్లలో ముప్పై ఏళ్ల జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి.

          ఆయన కవిత్వమూ పరిశోధనా ఉపన్యాసమూ స్నేహశీలతా సహృదయతా, పుట్ల హేమలత గారితో అవిభాజ్య అనుబంధమూ, మానస, మనోజ్ఞల మీద ప్రేమా సరేసరి, నాకు మళ్లీ మళ్లీ గుర్తొచ్చినవి ‘మల్లెమొగ్గల గొడుగు’లో ఆయన చిత్రించిన అద్భుతమైన జీవితమూ, పాత్రలూ.

          ఆయన స్మృతిలో ఈ వారం పుస్తకాలమ్ ‘మల్లెమొగ్గల గొడుగు’ నే పరిచయం చేయదలిచాను.

          ‘మల్లెమొగ్గల గొడుగు’ మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1996-97ల్లో ధారావాహికగా వచ్చినప్పుడో, లేక ఆ తర్వాత 1999లో దండోరా ప్రచురణలుగా పుస్తకంగా వెలువడి నప్పుడో ‘మాదిగ కతలు’ అనే ఉపశీర్షిక పెట్టారు. నిజానికి అవన్నీ కథ అనే కాల్పనిక సాహిత్య ప్రక్రియ కన్న ఎక్కువగా కఠోర వాస్తవ జీవిత గాథలు.

          సుదయ్య, సుధాకర్, సార్ అని తనను తాను ఒక పాత్రగా పెట్టుకుని సుధాకర్ తన తండ్రి పుట్టిన ఊరు రావిగుంటపాలెం కేంద్రంగా ఎన్నో నిజజీవిత పాత్రలతో నడిపించిన ఆత్మకథా చిత్రాల ధార అది.

          “ఈ కథల్లో కనిపించే సుదయ్య నిజానికి నేను కాదు. అది మా నాయన దేవయ్య. నా చిన్నప్పటి నుంచి ఆయన చనిపోయేదాకా ఆయన నోట విన్న మాటలూ మాండలికాలూ పాటలూ ఈ కథలకు దారి చూపాయి” అని ఆ పుస్తకం ముందుమాటలో సుధాకరే చెప్పుకున్నట్టు ఇవి బహుశా సుధాకర్ తండ్రి ఎండ్లూరి దేవయ్య గారి జీవిత చరిత్ర భాగాలు.

          అంతకన్న ఎక్కువగా ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మన గ్రామీణ సామాజిక చరిత్ర శకలాలు.

          అలా ఈ పుస్తకం కథ కన్న ఎక్కువగా ఆత్మకథ, జీవిత చరిత్ర, సామాజిక చరిత్ర.

          మరాఠీలో విస్తృతంగా వెలువడిన దళిత ఆత్మకథల సంప్రదాయం తెలుగులో కూడా రావలసిన అవసరం ఉందని 1990ల్లో కలిగిన గుర్తింపుకు తొలి అడుల్లో ఒకటి మల్లెమొగ్గల గొడుగు.

          ఇరవై ఐదు సంవత్సరాల కింద ఆంధ్రజ్యోతి వారపత్రికలో వస్తున్నప్పుడు ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ఈ ధారావాహిక, ఇరవై రెండు సంవత్సరాల కింద పుస్తకంగా వెలువడి, మళ్లీ పునర్ముద్రణ అయినట్టు లేదు. గడిచిన రెండున్నర దశాబ్దాలలో దళిత జీవితాన్ని కథ, ఆత్మకథ, జీవిత చరిత్ర ప్రక్రియల్లో చిత్రించే కృషి గణనీయంగానే జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా తొలి ఆత్మకథ/జీవితచరిత్ర/సామాజిక చరిత్రగా గుర్తించదగిన మల్లెమొగ్గల గొడుగు పుస్తకాన్ని మళ్లీ పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది.

          ఇవి ఇరవై ఏడు కథలు. కాని అన్నీ కథల్లోనూ కథకుడి ప్రధాన పాత్ర ఒకటే, చాలా పాత్రలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ఆ రకంగా ఒకే కథకు ఇవి ఇరవై ఏడు భాగాలు, అధ్యాయాలు అనవచ్చు. అన్ని కథలూ ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం లోని రావిగుంట పల్లె, లింగారెడ్డిపల్లె, అలవలపాడు, బల్లేపల్లి, మార్కాపురం వంటి చోట్ల రచయిత సొంత అనుభవాలనో, విన్న సంగతులనో ఉత్తమ పురుషలో చెపుతాయి. ఇరవై ఏడు కథల్లోనూ కలిసి ఇరవై ముప్పై మంది మనుషులు, సరోజినత్త వంటివారు మూడు నాలుగు కథల్లో కూడ, కనబడతారు.

          ఈ కథా ధార అంతటిలోనూ నిరంతర ప్రవాహం మాదిగ జీవితం. ఆ జీవితంలోని కష్టాలూ కన్నీళ్లూ వివక్షా అస్పృశ్యతా అక్షరాల్లోకి ఎక్కడం సహజమే. కాని అంతకన్న ముఖ్యంగా మల్లెమొగ్గల గొడుగును గుర్తించవలసిన ప్రత్యేకతలున్నాయి. మాదిగలు సామూహికంగానూ, కుటుంబాలలోనూ చెప్పుకునే చారిత్రక గాథలు, డప్పు తయారీలో, చెప్పు తయారీలో మాదిగల అద్భుత కళా నైపుణ్యం, వారి జీవితంలోని సంతోషాలు, హాస్యాలు, ఎడబాట్ల దుఃఖాలు, వీరత్వం వంటి ఎన్నో అంశాలను సుధాకర్ అద్భుతంగా వ్యక్తీకరించారు.

          ‘డప్పు గొడితే సరస్పతి సిందులెయ్యాల’లో “నిజ్జం జెబుతుండ సుదయ్య బావా! నేను గానీ సుక్కేసుకోని కాకబెట్టిన పలక వాయిస్తే, దీనబ్బడాల! సరస్పతి గూడ ఈన అవతల బారనూకి సిందులెయ్యకపోతే నేను మా యబ్బకి బుట్టలా! నేను మల్లెల చినబోడయ్యనే గాను” అంటూ చినబోడయ్య వివరించిన డప్పు తయారీ విధానం, డప్పు వాయించే పద్ధతులు, డప్పు శబ్దానికి ఉన్న బలం చదివి తీరవలసినవి. గ్రామీణ జీవితంలో అన్ని కులాల వారికీ అవసరమైన, అనివార్య భాగమైన డప్పు వాయించేవాళ్లు మాత్రం ఎట్లా అవమానానికి గురవుతున్నారో కూడా చినబోడయ్య అదే వరుసలో చెపుతాడు. “పీర్ల గుండం మాదిరి చినబోడిబావ లోన కుతకుతలాడతా వుండాడు. యింగ యెప్పటికైనా చినబోడి బావ లాంటోల్లు దండుగట్టి నిప్పుల గుండాలయ్యే రోజు దగ్గర్లోనే వుందనిపించింది”  అని రచయిత చేసిన ఊహ నిజమైతే ఎంత బాగుండును.

          ఇట్లా ఒక్కొక్క జీవన శకలాన్నీ వివరంగా చెప్పాలనే ఉంది గాని, స్థూలంగా కథావస్తువులను చెప్పి, మీ అంతట మీరు చదువుకోవడానికి ఆసక్తి కలిగించి ముగిస్తాను.  

          దుబాయి ఉద్యోగం కోసమని ఏజెంట్లను నమ్మి మోసపోయిన కొడుకు ఇంటికి తిరిగి రాకుండా బొంబాయిలో ఉండిపోతే, అసలు విషయం తెలియని తండ్రి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండే దుఃఖపు కథ, దావీదమ్మను చెరబట్టడానికి ప్రయత్నించే కోటారెడ్డి మీద గొడ్డలి తిరగేసిన గురయ్య కథ, “మన వోసన తగిలితే కస్సుమనే తాసుపావుల లాంటి నల్లదొరల కన్నా” దగ్గరికి తీసిన, జుట్టు కత్తిరించిన, తిండి బెట్టిన, అక్షరం ముక్కలు నేర్పిన తెల్లదొరలే మేలు అని తలచుకునే కథలు, కోడలి కోసం వంట కూడా చేసిపెట్టే మామ కథ, ఆ మామ మీదికి గొడ్డలి తీసుకొనిబోయిన కోడలి కథ, పదమూడేళ్ల పెళ్లి అయి తెగదెంపుల దాకా వచ్చిన కథ, ఊరి నుంచి చిన్న పట్నానికి వెళ్లి చిన్న హోటల్ పెట్టుకున్నా తప్పని కుల వివక్ష కథ, కుక్కలను కూడా ప్రేమగా చూసుకునే గంగిరెద్దుల సంచార జాతివాళ్లు కూడా మాదిగల దగ్గర గింజలు తీసుకుంటాం గాని, మాదిగలు వండిన సంగటి తినబోమన్న వివక్ష కథ, మాదిగల్లోకి క్రైస్తవం ప్రవేశించిన కథ, చుక్క పడితే గాని డప్పు కొట్టలేని వారి జీవితాల్లో మద్య నిషేధం తెచ్చిన కష్టాల కథ, మాదిగ గూడెంలోని కర్ణుల, వీరుల కథ, కరువు కథలు, వలసల కథలు, జాంబవంతుడి కథ, ఆరంజోతి కథ, యెండ్లూరి కుటుంబ కథ – ఎన్నెన్ని కథలో, సమస్త జీవిత వైశాల్యమూ లోతూ ప్రతిఫలించే కథలు. చదివితీరవలసిన కథలు.

          ఈ కథలు చదువుతున్నప్పుడు కొట్టవచ్చినట్టు కనబడే అంశం కథల్లో చిత్రితమైన జీవితపు ప్రత్యేకత మాత్రమే కాదు, ఈ కథలు చెపుతున్న సృజనకారుడు అప్పటికే కవి గనుక, మూడు నాలుగు భాషా సంప్రదాయాలు తెలిసినవాడు గనుక ఆ కథనంలో వ్యక్తమైన అద్భుతమైన అభివ్యక్తి. పడమటి ప్రకాశం జిల్లా మాండలికం, మాదిగ గూడాల్లో వినిపించే భాషా సౌందర్యం ఈ కథల్లో అడుగడుగునా కనబడుతుంది, వినబడుతుంది.

          “మనకు డప్పైనా సెప్పైనా గురువిజ్య గాదు. వెలివిజ్య”.

          “బెరస పుంజు జుట్టు మాదిరి ఎర్రంగా పొద్దు బొడిసేది”.

          “మడతలేసిన తోలు మాదిరి ముడుసుకోని”.

          “దూడ దూరమైతే బాలింతావు పొగిలినట్టు పొగలతా వుండానయ్య”.

          “మెత్తటి ముడుసుల్ని పన్రాయి మీనబెట్టి గూటంతో గొట్టి యేడేడి మూలిగని నెయ్యి మాదిరి నాలిక్కి దగిలించేది”.

          “ఆయన్న బరబరా నడస్తవుంటే సరసరా నల్ల నాగుబాము పాకినట్టుంటాది”.

          “సీమసింత కాయల మాదిరి పండ్లేసుకుని నవ్వుతాడు”.

          “గిన్నిలో ఈరిగలూ, గుండెకాయ ముక్కలూ, నెరిడా, ఉలవగాయలూ ఎండకు దగదగా మెరుస్తా వుండాయి”.

          “గ్యేపకాల కత్తిదీసి బతుకుతోలు సెల్లాదీస్తూ…”

          “కొవ్వుబట్టిన మొగతనానికి కులముంటాదా? అంటుంటాదా?”

          “గాలికూగే కొర్రసేను మాదిరి”.

          “బలే నవ్వుద్ది. ఆ పిల్ల నవ్వుతా వుంటే బొండు మల్లెలుండ్లా! అయ్యి యిరబూసి నట్టుంటాయి”.

          “ఈ దేశంలో పొలాలకి కులాలుండై. కులాలకీ పొలాలుండై. దైర్నమనేదుంటే గవర్నమెంటోల్లని ఈ రెంటినీ రద్దు జెయ్యమనండి.”

          “నీరూ మట్టీ కలవందే జనమే లేదు. యిది తెలిసినోడికి కులమేడుంది? పొలమేడుంది?”

          “తాటి పండు సందెపొద్దు మాదిరి ఎర్రంగా నిగనిగలాడతా గుమాయిస్తా వుంది.”

          “ఎట్టి గొడ్డు మాదిరి ఆకాశం యెండిపోతా వుంది. మబ్బులకి పొదుగులు బడితే గదూ, పాల మాదిరి వోనలు నిండుకుండేది.”

          “యిస్పామిత్రుడు కుక్కకూర దిని కూడా మునిగానే వుండి పొయ్యే. మనం మాత్తరం గొడ్డు కూర దిని యిసుమంటోల్ల ముందర కులం జెడితిమి.”

          “మనసు మాతరం లేత తమలపాకు మాదిరి”.

          “నీ సెవులు నా మూతికాడ బెట్టు – నా సెవులు బెరికి వోడి మూతిగ్గరిపిచ్చినా.”

          “గుంజ మాదిరి గుండెల్లో పాతుకుపోవడం.”

          “నిండు శెరువుకు కట్ట దెగినట్టు మాట్లాడడం”.

          “ఆకు రాలినట్టు గొర్రె తోక సర్రున తెగి కింద పడడం.”

          “యీరుల పుటకా, యేరుల పుటకా యాన్నో సెప్పలేమనంటారే? మేం జెప్పగలం. కొండల్లో యేరులూ, గూడేల్లో యీరులూ పుడతారని!”

          “ఆరంజోతి కొడవలి బట్టుకుంటే ఆకాశాన్ని యెడమసేత్తో వొంచి సుక్కల్ని కంకుల మాదిరి కోసి, పారనూకేది.”

          “సెప్పులకి గూడా నోరుంటాది సుదయ్యా! ఆటి బాస మాదిగోళ్లకే దెలుసు.”

          “ముందు కులాన్ని బట్టుకోని సిలువెయ్యాల. యిదే పెద్ద సైతాను గదంటయ్యా! యిది సస్తే గాని ఈ దేసం బాగుపడదు” అనీ, “ముద్దలో మెతుకుల మాదిరి మనుసులంతా కలిసే రోజు రావాల” అనీ సుధాకర్ పాత్రలతో, సుధాకర్ తో గొంతు కలపకుండా ఉండలేం.

 
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.