కథా మధురం
బుద్ధవరపు కామేశ్వరరావు
‘మానసిక ఒత్తిళ్ళకు మందు లేదు. కానీ ఒక విలువైన జపమాల వుంది..’ అని చెప్పిన కథ!
-ఆర్.దమయంతి
***
‘ఇవాళ నేను – అస్సలు పని ఒత్తిడికి గురి కాకూడదు.’ అని అనుకుంటూ నిద్ర లేవడం తోనే మొదలౌతుంది స్ట్రెస్..’ ఇది చదివితే నవ్వొస్తుంది కానీ, నిజమేమిటంటే – ఈ ఆధునిక యుగంలో ప్రతి మహిళా మానసిక ఒత్తిడికి గురికాక తప్పడంలేదనే చెప్పాలి.
కారణం – స్త్రీలు చదువుని, ఉద్యోగాన్ని జీవితం లో ప్రధానాంశాలు గా భావిస్తున్నారు. ఇంకా చెప్పాలీ అంటే – పెళ్ళి అయినా, భర్త అయినా – ఉద్యోగం తర్వాత మాటే!
వివాహానంతరం, గృహిణిగా ఎన్ని బాధ్యతలో! అంతకు మించిన మరో పెద్ద బాధ్యత – పిల్లల పెంపకం. ఇవి కాకుండా, అత్తమామల బాగోగులు, అడపా దడపా పండగలు పబ్బాలు, పెళ్ళిళ్ళూ పేరంటాళ్ళు, వూళ్ళ ప్రయాణాలు, అప్పు సొప్పు లు తీర్చుకోవడం, ఇల్లూ వాకిలీ, కారు సమకూర్చుకోవడంలో అయ్యే ఋణ భారాలు, వాటి వడ్డీలు పెరిగిపోకుండా ఎప్పటికప్పుడు చెల్లింపులు, నెలవారీ ఖర్చులను అదుపులో వుంచుకునే ప్రయత్నాలు..ఇవన్నీ ఆర్ధికపరమైన ఒత్తిళ్ళు. మరోవైపు రిలేషన్ షిప్స్ ని మెయింటైన్ చేయడం! (కొంతమంది తో ఇష్టం లేకపోయినా, సర్దుకుపోతూ, బాంధవ్యాలని మెయింటెయిన్ చేయాల్సి రావడం ప్రత్రి మహిళకీ తప్పదు. నిజానికి అది అన్నిటి కన్నా పెద్ద స్ట్రెస్స్. ఉదాహరణకి భర్త తరపు వారో, ఆ కుటుంబానికి దగ్గరి స్నేహితులో, బంధువులో, లేక తన వైపు వారే మర్యాద కోసమనో భరించాల్సి వుంటుంది.
రామాయణ మహాభారతాలలోని పాత్రలు ఎక్కడో వుండవు. మన కుటుంబాలలోనే చూడొచ్చు. కొన్ని పాత్రల ప్రవేశంతో కాపురాలు అల్లకల్లోలం అవుతాయి. అలా కాకుండా.. జాగ్రత్తగా గడుపుకు రావాలి.. వాళ్ళని దాటుకుని. అందుకు సహనం ఒక్కటే ఎంత తెలివైన స్త్రీకైనా వున్న ఆయుధం.
ఇక రోజూ వారీ ఇంటిపనులు, పిల్లల ఆక్టివిటీస్, కుకింగ్, వంట తర్వాత క్లీనింగ్, ఆఫీస్ కి పరుగులు, అక్కడి పోటీ దారులతో, శతృవులతో ఢీ కొనడాలు, అఫీషియల్ మీటింగ్స్ కి, కాన్ ఫరెన్సెస్ కి ప్రిపేర్ కావడం, లంచ్ చేసే తీరిక సైతం లేక టీ తో సరిపెట్టుకుని, తలనొప్పితో ఇల్లు చేరడం, భర్త విమర్శలకి ఏడ్వలేక నవ్వడం.. ఇలా వుంటుంది..ఒక్కోసారి పరిస్థితి.
సరిగ్గా ఇలాటి క్షణంలో ఏ స్త్రీకైనా ఏమనిపిస్తుంది?
ఎవర్నీ సంతోషపరచలేని నా జీవితానికి ఇంత స్ట్రెస్ అవసరమా? ఈ బ్రతుకు బ్రతికీ ఎందుకు? ముగించేస్తే పీడా పోతుంది కదూ? అని విరక్తి పుట్టుకొస్తుంది. స్ట్రెస్ అయినప్పుడల్లా ఇదే ఆలోచన మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తుంటుంది. మానసిక ఒత్తిడి కారణం గా ఆత్మహత్యలకు గురి అవుతున్న స్త్రీల గురించి వార్తల్లో చూస్తుంటాం. వారిలో ప్రముఖులు, సెలెబ్రెటీలు కూడా వుండటం ఎంతైనా విషాదకరం! ఇదంతా స్ట్రెస్స్ ప్రభావం. అధిక మానసిక ఒత్తిడి అని, డిప్రెషన్ అని అందరూ అంటారు.. కాని నేనంటాను.. ఒత్తిడి మాత్రమే కాదు. ఆమె పడుతున్న అధిక శ్రమకి సరైన గుర్తింపు లేకపోవడం. ఆమె ని ఆదరించి, కాసింత స్వాంతన చేకూర్చే నాలుగు మంచి మాటలు చెప్పే నేస్తం లేకపోవడం. ముఖ్యం గా ఆమెని, ఆమె మానసిక, శారీరక పరిస్థితుల్ని అర్ధం చేసుకుని, ఊరడిస్తూ, విశ్రాంతినిచ్చే ఒక మనసైన మనిషి పక్కన లేకపోవడం. ఈ కారణాల వల్ల స్త్రీలు మరింత ఒత్తిడికి గురి అవుతారు. చెప్పలేనంత నిరాశకి గురౌతారు.
ఈ మాటకి చాలా మంది మగవాళ్ళు గయ్య్ మంటారు..’మాకు మాత్రం ఒత్తిళ్ళు లేవా? తట్టుకోవడం లేదా?’ అని. ఇదిగో ఇలా మాట్లాడే భర్తల వల్లే – భార్యల మానసిక బాధలు వెయ్యింతలౌతుంది.
అయితే, అలా ఎలాటి ఒత్తిడినైనా ఇట్టే మాయం చేసే ఒక మంత్రం వుంది అని మీకు తెలుసా?
అదే. జపం.
మీరు ధ్యానం గురించి విని వుంటారు కాని స్ట్రెస్స్ పోగొట్టే జపం గురించి కానీ, ఆ జపానికి కావల్సిన జపమాల గురించి కాని మీకు తెలుసా? బహుశా విని వుండరు. నాకూ తెలీలేదు. ఈ కథ చదివే దాకా!
అదే మరి ఈ కథలో దాగిన రహస్యం.
జపమాల.. అంటే 108 – రుద్రాక్షలో, క్రిస్టల్ పూసలో గుచ్చిన దండ అనుకునేరు. కాదు. అంతకు మించిన మహిమ గల అక్షరాల దండ. ప్రతి స్త్రీ ధరించాల్సిన ఆరోగ్య ఐశ్వర్య మాల…ఈ ‘జపమాల..’ కథ.
***
అసలు కథేమిటంటే :
ఓ నాలుగు రోజులుండి పోదామని కూతురింటికి వస్తుంది సుభద్ర. కానీ ఇంటి పరిస్థితీ, ఇంట్లో వారి తీరునీ, ఊపిరి తీసుకునే సమయం కూడా చిక్కక ఉక్కిరి బిక్కిరౌతున్న కూతుర్నీ గమనిస్తుంది. ఆలోచనలో పడుతుంది. ఇదే పరిస్థితి కనక కొనసాగితే, సుధకి మానసిక శాంతితో బాటు శారీరక ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరం గా మారే ప్రమాదం లేకపోలేదన్న ఊహకే ఆమె చలించిపోతుంది.
సమస్యకి భయపడకుండా పరిష్కార దిశ గా ఆలోచిస్తుంది. ఫలితం గా కూతురి కి ఒక జపమాలని ప్రసాదిస్తుంది.
తల్లి దగ్గర ఇంత రహస్యమైన మహిమ గల జపమాల వుందని తెలుసుకున్న సుధ ముందుగా ఆనందాశ్చర్యాలలో, ఆ తర్వాత సంబరంలో మునిగిపోతుంది.
ఏమిటా జపమాల రహస్యం అంటే.. కథ చదివితే తెలిసిపోతుంది.
***
కథలోని స్త్రీ పాత్రల విశేషాలు :
సుభద్ర :
ఈమె సుధకి తల్లి. రచయిత్రి కూడా. ఈ కథలో అసలైన హీరోయిన్ ఈమే అని నాకనిపిస్తుంది. ఈవిడకున్న మరో అదనపు అమూల్యమైన అర్హత ఏమిటంటే, – ఈమె రచయిత్రి కూడా.
‘ఉత్తమ రచయిత్రి కి వుండాల్సిన ప్రధమ లక్షణం.. తన కళ్ళ ముందు జరుగుతున్న సమస్యాత్మక సంఘటనలను, దృశ్యాలను ఓ కంట గమనిస్తూ, ఆ వెనకే మరో కంట వాటి నివారణొపాయాలను ఆలోచిస్తూ, సమస్యలను చకచకా పరిష్కరిస్తూ చక్కని తీర్పుని ఇవ్వగలగడం. ‘ అని అనడానికి రుజువు గా నిలిచిన పాత్ర -సుభద్ర.
మనుషుల్ని చదివే అలవాటు :
ఈ లక్షణం చాలా మందిలో వుంటుంది కానీ రైటర్స్ లో అధికం గా వుంటుందని చెప్పాలి. సుభద్ర కూడా అంతే. కూతురి ఇంటి పరిస్థితుల్ని, అల్లుణ్ణి, అతని బద్ధకాన్ని, పిల్లల్నీ, పిల్లల తెలీని తనాన్ని, కూతుర్నీ, కూతురి అమాయకత్వాన్ని అన్నీ ఇట్టే చూపులతోనే చదివేస్తుంది.
ఆపదలను ముందుగా పసిగట్టగలగాలి అమ్మలు : అనే సూక్తి కి ఉదాహరణ గా నిలుస్తుంది సుభద్ర పాత్ర. కూతురు ఇలానే కనక గొడ్డు చాకిరీ చేసుకుంటూ పోతే తనకి తాను మిగలక పోగా కుటుంబం కూడా ఆగమైపోయే ప్రమాదముందని గ్రహిస్తుంది.
సరిగ్గా అలాగే జరుగుతుంది. కూతురు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని, వెళ్తుంది. రోగం పెద్దది కాదు. కానీ, పడే బాధ మాత్రం నానా యాతనగా వుంటుంది.
ఈ ప్రపంచంలో అన్నిటికీ అన్ని మందులున్నాయి కానీ..మానసిక ఆందోళనలకి, ఒత్తిళ్ళకి మందు లేదు. అందుకే అనే వారు ఆ కాలం లో పెద్దలు. మానసిక రోగాలకు మందు లేదని.. ( ఇప్పుడున్నాయిలెండి..) అందులో తొలి మెట్టు అయిన వ్యాధి..ఒత్తిడి.
ఆడపిల్లని అత్తారింటికి పంపితే చాలు ఇక పని అయిపోయినట్టేనా?:
తల్లి తన కడ శ్వాస దాకా కూడా కూతురి గురించి ఆలోచించడం,ఇష్టంగా తీసుకునే బాధ్యత అనడానికి సుభద్ర పాత్ర ఒక సాక్ష్యం.
ఈ ప్రపంచం లో ఏ బాధ్యతాయుతమైన మనిషికైనా సరే, ‘కుటుంబ బాధ్యతలు తీరాయి. ఇక అంతా విశ్రాంతే.’ అని అనుకుని, చేతులు ముడుచుకుని కుర్చోవడం కుదరని పని.
పిల్లల కాపురాలు, వారి కష్టాలు, పిల్లల పెంపకంలో ఎదుర్కునే సమస్యలు, ఆర్ధిక పరమైన సహాయాలు..అన్నీ కూడా తల్లితండ్రులు పంచుకోవాల్సి వుంటుంది. ఈ కాలం లోనూ అదే జరుగుతోంది.. అలానే పంచుకుంటున్నారు కూడా!
ఇక తన కథ అయిపోయింది. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పంపాము. మా విధి మేం చేసాం. ఇక వారి ఖర్మ వారిది.’ అని పిల్లల్ని వదిలేయ లేరు. ముఖ్యం గా తల్లి మనసు మరీ వెన్నలాటిది. ‘అమ్మా, నువ్వొచ్చి నాలుగురోజులు వుంటే నాకు హాయిగా వుంటుంది..’ అని బిడ్డ అడగంగానే అమ్మ మనసు కరిగిపోతుంది. అలాగేనమ్మా..ఇప్పుడే వచ్చేస్తున్నా అంటూ ఉరుకుతుంది.
‘అమ్మా నాకు నీ చేతి వంట తినాలని వుంది..ఆవకాయ తీసుకురా. నువ్వొచ్చాక జంతికలు, బొబ్బట్లు చేసిపెట్టాలి..’ అని కొడుకు అడిగితే ఇక ఆవిడ ఆఘమేఘాల మీద ప్రయాణమై బయల్దేరుతుంది.
అందుకే అంటారు. ‘ఆ జగజ్జనని అందరింటా నివసించే అవకాశం లేక, ఇంటింటి కొక అమ్మని ప్రసాదిస్తుందిట. అందుకే అమ్మ దేవతా మూర్తి. ప్రత్యక్ష దైవం..’ అమ్మా అని పిలవడం ఆలస్యం. ఓయ్ అంటూ ప్రత్యక్షమైపోతుంది. అడిగితే అమ్మ ప్రాణం అయినా ఇచ్చేసే దేవత అని అందుకే అంటారు.
అమ్మ పలుకే మధురం. అమ్మ దీవెనే రక్ష. అమ్మ మంచి మాటే గీతోపదేశం.
కథలో సుభద్రోపదేశం:
కూతురింట్లో వుంటూ.. ఏ తల్లి అయినా ఎన్నాళ్ళని సేవలు చేయగలుగుతుంది? ఎన్నాళ్ళని ఇంటి పనుల్లోను, వంట పనుల్లోను సాయపడుతుంది? అది ఏ తల్లి కీ సాధ్యం కాని పని.
మరి సుధ సమస్య ని చూస్తూ ఊరుకోవడమెలా?
అందుకే ఆమెకొక జపమాల ని ప్రసాదించడం కోసం..తన గదిలోకి పిలుస్తుంది.
వింటున్న మనం..చూస్తున్న మనం, చదువుతున్న మనం కూడా ఆ జపమాలని స్వీకరిస్తున్నప్పుడు కలిగే ఆనందం పారవశ్యం ఎలా వుంటుందో..ఎవరికి వారు అనుభవ పూర్వకంగానే తెలుసుకోవాలి.
ప్రతి తల్లి – ప్రతి కూతురికి ప్రసాదించాల్సిన జపమాల ఇది. నిత్యం జపించు కోవాల్సిన అవసరం ఎంతైనా వుందని అందరూ అంగీకరించి, అభినందించదగిన తల్లి పాత్ర సుభద్ర పాత్ర.
***
‘తనకి మించిన పని భారం తో ముప్పు ఎంతో!’ : అని చెప్పే పాత్ర – సుధ.
‘తెల్లారేది ఎందుకంటే పని లో దూకేందుకు మాత్రమే! ‘అని భావించే స్త్రీలు ఈ కాలం లోనూ వున్నారు..ఏ కాలం లోనూ వుంటారనడానికి చక్కని ఉదాహరణ ఈ కథలో కదిలే సుధ పాత్ర.
ఇంటి పనులంటే – ఎన్నుంటాయో! లెక్కేస్తే తెలుస్తుంది. అసలు ఎన్ని పనులు చేసినా లెక్కే లేని మనుషులకి ఏం అర్ధమౌతుంది, ఇల్లాలు లెక్కలేనన్ని పనులతో సతమౌతోందని!!
ఆడ జన్మ అంటేనే – ఒళ్ళొంచి ఇంటి పని చేయడం కోసం పుడుతుందని..తమ అవసరాలని తీర్చడం కోసమే అనీ, ఎప్పటికప్పుడు అన్నీ క్షణాల్లో అమర్చే బాధ్యత ఆమెకి పుట్టుకతో నే వస్తుందని.. కఠినం గా భావిస్తారు కొంతమంది మగాళ్ళు.
ఈ కథలో అలాటి భర్త కనిపిస్తాడు మనకి. బాత్ రూం లో స్నానికెళ్తూ..కొత్త సబ్బు పెట్టలేదేమని పనిలో వున్న భార్యని కేకేసి మరీ అడుగుతాడు ఆ మగమహారాజు. పొద్దున పూట వంటింట్లో.. క్షణమైనా పక్కకి జరగలేనంత బిజీ సమయం లో కూడా ఆమె ఉరకలు పరుగుల మీద కొత్త సబ్బు తెచ్చి, దాని పైనున్న పాకింగ్ కవర్ కూడా చింపి అతని చేతికిస్తుంది. పాపం, అప్పుడు స్నానానికెళ్తాడు అతడు కష్టపడుతూ. ‘ముందే చూసుకోవద్దా..’ అన్నట్టు ఓ చూపొకటి విసిరేసి.
కనీసం థాంక్స్ చెబితే అయినా ఆమె సంతోషిస్తుంది. కానీ, అబ్బే..ఆ అలవాటు అసలుకే శూన్యం!
భర్త సరే అలా! మరి అత్తగారు? – ఆవిడా అంతే.. కూతుళ్ళకి నానా చాకిరీలు చేసే తల్లులు సైతం కొందరు కొడుకు ఇంట్లో చిన్న పని కూడా ముట్టుకోరు. పైగా వాళ్ళని వియ్యాల వారిలా చూడాలంటే..భరించడం కష్టమే..ఆ కోడలికి. ఇది మానసిక ఒత్తిడి కి బలమైన కారణమౌతుంది.
అలానే పిల్లలు కూడా తెలీకుండానే తల్లుల్ని స్ట్రెస్ కి గురి చేస్తుంటారు. సాధించడం వారికీ మెల్లగా తండ్రి నించి అంటుకునే వైరస్ గా మారుతుంది.
‘బాక్స్ లో ఉప్మా పెట్టావ్..తినబుద్ధి కాలేదు మమ్మీ. మసాలా నూడుల్స్ అడిగాను కదా..పాస్తా చేస్తానని చేయలేదే? ‘ అంటూ ఒక్క పూట చేయడం బద్ధకించినా ఏకేస్తుంటారు. పై పెచ్చు, సాక్స్ కనిపించలేదని, స్పోర్ట్స్ డ్రెస్స్ ఐరన్ కాలేదనీ, టిఫిన్ బాక్స్ సర్దడం లేట్ అయిందని.. ఫ్రెండ్స్ తో లేట్ నైట్ షికార్లకి పంపలేదనీ..ఇలా వుంటాయి వాళ్ళ ధోరణులు.
ఇక ఆఫీస్ లో అయితే..వర్క్ పూర్తి చేసాకే ఇంటికి వెళ్ళే పరిస్థితులుంటాయి. కొన్ని రంగాలకు చెందిన ఆఫీసుల్లో.
ముఖ్యం గా బాంక్ ఎంప్లాయీస్! – డబ్బు లావాదేవీలు ఖచ్చితం గా లెక్క తేలాల్సిందే.. అది ఎంత టైం తీసుకున్నా సరే.
ఈ టెన్షన్ కి తోడు..’ఇంకెప్పుడొస్తావ్? మా ముఖాన ఎప్పుడు వండి వారుస్తావ్? డిన్నర్ కేం చేస్తావంటూ’ ఇంటినించి కాల్స్ వస్తే..
ఎలా వుంటుంది ఆ స్త్రీ మానసిక పరిస్థితి? ఆమె మనిషే కదా.. యంత్రానికైనా కాసేపు విశ్రాంతి నిచ్చి పని చేయిస్తారు..కానీ ఈ నాటి మహిళ మాత్రం అవిరామంగా ఇరవై నాలుగు గంటలూ..పనిచేస్తూనే వుండాలి.
‘ హమ్మయ్య ఇవ్వాళ్టికి గట్టెక్కామనుకునేందుకు లేదు. రేపటి కి మళ్ళా కార్యాచరణ పథకాలు ముందస్తుగానే వేసుకోవాలి తప్పదు.
ఒత్తిడి లేని జీవితం కానీ, ఉద్యోగం కానీ, ఈ ప్రపంచం లో ఎక్కడా వుండవు. ఇది నిజం. ఉచితం గా ఏదీ రాదు. అన్నీ పే చేసి తీసుకోవాల్సిందే. సుఖమైనా అంతే. ఇది వంద శాతం నిజం.
మరి ఎలా బ్రతకడం అంటే.. అందులోనే ఆనందం వుంటుంది. ఏ వృత్తిలో సాగినా..అది దైవం లా భావించాలి. ఎంత కష్టతరమైనదైనా..వృత్తి ధర్మ నిర్వహణలో సంతృప్తి దొరుకుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను సైతం సంస్థ అభివృద్ధికి పాటుబడ్డాను..నేను సైతం నా కుటుంబం ఆర్ధికం గా ఎదగడంలో మూలస్థంభం లా నిలిచాను.. అనే సక్సెస్..ఆ విజయం లోనే జీవితానందం దాగి వుంది.
మరి ఆ ఆనందాన్ని సొంతం చేసుకోనీకుండా అడ్డుపడుతున్న ఈ మానసిక ఒత్తిడి మాటేమిటి? దాన్ని ఎలా తొలగించుకోవడం? కొండంత దిగులైపోతున్న ఈ చీకటి భారాన్ని ఎలా తొలగించుకోవడం..
సరిగ్గా ఈ జటిలమైన ప్రశ్నకి జవాబు దొరికింది సుధకి.
తల్లి ఆమెని గదిలోకి పిలిచి, రహస్యం గా అందించిన జపమాల ని స్వీకరించాక.. సుధ మనసు దూదిపింజ లా మారిపోతుంది. హాయిగా ఊపిరి తీసుకుని, నిట్టూర్చుతుంది.
ఆ క్షణం లో తల్లి సుభద్ర – సాక్షాత్తు దైవ స్వరూపిణి లా కనిపిస్తుంది. ఆ పైన ఎన లేని కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తుంది.
***
ఇదీ – ‘జపమాల’ కథా సారాంశం, కథలోని స్త్రీ పాత్రల సుగుణ స్వభావాలు.
మంచి కథని అందచేసిన రచయిత శ్రీ బుద్ధవరపు కామేశ్వర రావు గారికి నెచ్చెలి తరఫున నా అభినందనలు తెలియచేసుకుంటున్నాను.
ఫ్రెండ్స్!
రచన చదివాక, మీ అమూల్యమైన హృదయ స్పందనలను తెలియచేస్తారు కదూ!
ప్రియమైన మీ అందరకీ పండగ శుభాకాంక్షలతో..
మీ
ఆర్.దమయంతి.
***
జపమాల
-బుద్ధవరపు కామేశ్వరరావు
“మమ్మీ ! స్కూలు బస్ వచ్చే టైమయ్యింది. నా టై కనబడటం లేదు. ఎక్కడ పెట్టావు?” అడిగింది ఆరో తరగతి చదువుతున్న కూతురు.
“వస్తున్నా తల్లీ, ఇదిగో అన్నయ్య లంచ్ బాక్స్ సర్దుతున్నా!” వంటింట్లోంచి బదులిచ్చింది సుధ.
“మమ్మీ! నా ఉతికిన సాక్స్ ఎక్కడ పెట్టావు? త్వరగా రావాలి, ఆటో వచ్చే టైమయ్యింది” అరుస్తున్నాడు ఏడో తరగతి చదువుతున్న కొడుకు.
“వస్తున్నా నాన్నా! ఇదిగో చెల్లాయ్ టై కనబడటం లేదు. వెతుకుతున్నా.”
“సుధా! బాత్రూమ్ లో కొత్త సోప్ పెట్టలేదా?” పిలుస్తున్నాడు భర్త వెంకట్.
“ఆ తెస్తున్నానండీ, ఇప్పుడే పిల్లల్ని పంపించి, లోపలికి వచ్చాను” బదులిచ్చింది సుధ.
“ఇదిగో సుధా! ఈరోజు ఆఫీసుకు కొంచెం ముందుగా వెళ్లాలి. టిఫిన్, లంచ్ బాక్స్ లు సర్దేయ్. నీకు కూడా బేంక్ టైం అవుతోంది కదా ! నువ్వు కూడా తయారవ్వు” అని చెప్పి, డ్రెస్ చేసుకోవడానికి లోపలికి వెళ్లాడు వెంకట్.
“అలాగేనండీ” అంటూ ఆ పనిలో మునిగి పోయింది సుధ.
వచ్చిన రెండు రోజుల నుంచీ, తన కూతురు చేస్తున్న అష్టావధానం గమనిస్తోంది, పక్క గదిలో పేపర్ చదువుకుంటున్న సుధ తల్లి సుభధ్ర.
“ఇదీ అమ్మా వరుస. ఇక్కడ ఇంటిపనీ, అక్కడ బేంక్ పనితో నిజంగా ఒత్తిడి పెరిగి, టెన్షన్ వచ్చేస్తోందనుకో. పోనీ ఉద్యోగం మానేద్దామా అంటే, ఇంటి కోసం తీసుకున్న అప్పు నిప్పులా భయపెడుతోంది. పోనీ పనిమనిషిని పెట్టుకుందామా అంటే, వాళ్ళు వస్తారా, రారా అని ఎదురు చూడ్డానికే కాలం సరిపోతుంది, అంతే కాదు వాళ్ల జీతాల కోసం నేను ఇంకో చోట పార్ట్ టైం జాబ్ చేయాలి. సరే ఈ గొడవలు ఎప్పడూ ఉండేవే కానీ, నాలుగు రోజులు ఉందామని వచ్చావు, హాయిగా రెస్ట్ తీసుకో. సాయంత్రం వస్తా.” అంటూ తల్లికి చెప్పి, పక్క వీధిలోనే ఉన్న తను పని చేస్తున్న ప్రైవేటుబేంక్ కి బయలుదేరింది సుధ
***
ఆ రోజు సాయంత్రం, బేంక్ నుంచి ఆలశ్యంగా రావడమే కాకుండా, మొహం వేలాడేసుకుని సోఫాలో కూలబడిన సుధని,
“అమ్మడూ, ఏమయ్యిందే తల్లీ ! అలా ఉన్నావు. ఏం జరిగిందో చెప్పవే?” కూతురు పక్కన కూర్చుని, ఆందోళనతో అడిగింది సుభధ్ర.
“ఏం లేదమ్మా! ఈరోజు బేంకులో పని ఎక్కువగా ఉండడం వలన, ఆ ఒత్తిడిలో ఒక ఎంట్రీ తప్పు వేసాను. అది మేనేజర్ కనిపెట్టి సరిచేసి, నాకు చివాట్లు పెట్టాడు” బాధ పడుతూ చెప్పింది సుధ.
“ఏంటి మమ్మీ ! ఇంత ఆలశ్యం. ఇంత వరకూ స్నాక్స్ కూడా తినలేదు” కంప్లైంట్ చేసింది, పక్క గదిలోంచి వచ్చిన కూతురు.
“బేంకులో పనిఒత్తిడి వలన ఆలశ్యం అయ్యింది తల్లీ! అయినా అమ్మమ్మనడిగి ఏవైనా తినలేకపోయారా?”
“నువ్వు లేకుండా ఎప్పుడైనా ఏదైనా తిన్నామా?” సూటిగా అడిగాడు కొడుకు.
“అయ్యయ్యో, అలాగా! ఇప్పుడే తెస్తా ఉండండి.” అంటూ లోపలికి వెళ్లింది సుధ.
ఈ సంఘటనలు చూసిన తరువాత, తను తిరిగి వెళ్లబోయే ఈ రెండు రోజుల్లో ఈ ఇంటికి చేయవలసిన ప్రక్షాళన గురించి ఆలోచనలో పడింది సుభద్ర.
***
మర్నాడు సాయంత్రం, తను రాసిన ఓ కధకు తుది మెరుగులు దిద్దుతున్న సుభద్ర, ఫోన్ రింగ్ రావడంతో,
“చెప్పవే అమ్మడూ! బేంక్ నుంచి బయలు దేరుతున్నావా?” అడిగింది సుధను.
“లేదమ్మా! ఈ రోజు సాయంత్రం డాక్టర్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకున్నాం. ఆఫీసు అవ్వగానే ఆయన ఇక్కడికి వస్తానన్నారు. అందుకే మేము రావడం కొంచెం ఆలశ్యం అవుతుంది. పిల్లలకి ఏం కావాలో చూడమ్మా!”
“సరేకానీ, డాక్టర్ దగ్గరకు దేనికే? ” గాభరాగా అడిగింది సుభద్ర.
“కంగారు పడకు. నీకు నిన్న చెప్పానుగా! ఈ మద్యన కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని ! అందుకే ఓ సారి చూపించు కుందామని వెళ్తున్నాం” అంటూ ఫోన్ పెట్టేసింది సుధ.
ఫోన్ పెట్టేసిన సుభద్ర, ఈ రోజే తన పథకం అమలు చేయాలని ఓ నిశ్చయానికి వచ్చేసింది.
“అమ్మమ్మా! మమ్మీ ఇంకా రాలేదా, ఈ రోజు కూడా? ” అడిగారు అప్పుడే స్కూలు నుంచి వచ్చిన పిల్లలు.
“మీ మమ్మీకి ఒంట్లో బాగోలేదర్రా! పాపం పని ఒత్తిడిలో నలిగి పోతుంది కదా ? అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. మీరు కొంచెం కోపరేట్ చేస్తే మీ మమ్మీ త్వరగా కోలుకుంటుంది” బిక్కుబిక్కు మంటూ చూస్తున్న పిల్లలతో చెప్పింది సుభద్ర.
“మేము ఏం చేయాలి అమ్మమ్మా, చెప్పు చేస్తాం!” అన్నారు ముక్తకంఠంతో.
“నాకు తెలుసుర్రా! మీరు మంచి పిల్లలని. ఏం చేయాలంటే…” అంటూ పిల్లలకు విడమరిచి చెప్పసాగింది సుభద్ర.
***
పిల్లలతో కబుర్లలో మునిగిపోయిన సుభద్రకు అల్లుడు, కూతురు వచ్చిన అలికిడి వినబడడంతో హడావుడిగా గదిలోంచి బయటకు వచ్చి,
“ఎలావుందే అమ్మడూ! డాక్టర్ గారు ఏమన్నారు?” ఆందోళనగా అడిగింది.
“కంగారు ఏమీ లేదు అత్తయ్య గారూ! నీరసానికి మందులు రాసారు. వీలైతే మెడిటేషన్ చేయమన్నారు” చెప్పాడు అల్లుడు.
అంతా విని, కూతురు వద్దకు వచ్చి,
“అమ్మడూ, రాత్రి పడుకునే ముందు ఓసారి నా గదిలోకి రావే, కొంచెం మాట్లాడే పని ఉంది నీతో” కూతురు భుజంమీద చెయ్యి వేసి, అనునయిస్తూ చెప్పింది సుభద్ర.
“అలాగే అమ్మా! నువ్వేమీ గాభరా పడకు” అంటూ తల్లికి చెప్పి వంట గదిలోకి వెళ్లింది సుధ.
***
“అమ్మా! ఇంకో వారం రోజులు ఉండవచ్చు కదా? ఎప్పుడూ చెప్పులో కాళ్ళు పెట్టుకుని మరీ వస్తావు. సరేకానీ, చెప్పు ఎందుకు రమ్మన్నావు?” తల్లి పక్కన కూర్చుని అడిగింది సుభద్ర.
“నీ గురించి చెప్పి, అల్లుడు గారు రమ్మంటే వచ్చాను గానీ, నీకు తెలియంది ఏముంది? అన్నయ్య ఆరోగ్యం సరైనది కాదు కదా? సరే అసలు విషయానికి వస్తా. ఈ ఒత్తిడి అనేది ఓ జబ్బూ కాదు, అలాగని అంటురోగమూ కాదు. ఇది మన సృష్టించు కున్నదే. అందుకే దీని నివారణ కూడా మన చేతుల్లోనే ఉంది. అలాగని, డాక్టర్ గారు ఇచ్చిన మందులు, సలహాలు మానేయమని చెప్పడంలేదు. వాటితో పాటు ఈ జపమాల అనే పద్ధతి పాటిస్తే, ఈ ఒత్తిడి, అనవసరపు ఆందోళనలు దూరమవుతాయి” చెప్పింది సుభద్ర.
“ఊరుకో అమ్మా! ఈ జపాలూ తపాలు చేసే సమయం ఎక్కడుంటుందే? దేవుడుకి ఓ నమస్కారం పెట్టడానికే సమయం దొరకడం లేదు” కొంచెం విసుగ్గా చెప్పింది సుధ.
“అయ్యో, జపమాల అంటే జపం కాదే. ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడే నాలుగు పద్ధతులలోని మొదటి అక్షరాలే ఈ జ,ప,మా,ల . కిందటి సంవత్సరం మీ వదిన ఇలాగే బాధపడుతూంటే ఈ పద్ధతి చెప్పాను. వెంటనే ఆచరణలో పెట్టడంతో, ఇప్పుడు ఆ ఒత్తిడి అధిగమించి హాయిగా ఉంది.”
“ఔనా ? ఆ జపమాల పద్ధతి ఏమిటో నాకూ చెప్పవే” తల్లి ఒడిలో తల ఆనించి ముద్దుగా అడిగింది సుధ.
“అయితే విను. ఇందులో మొదటి పద్ధతి ‘జ’ న భాగస్వామ్యం:
అంటే మనం చేసే పనిలో కొందరికైనా భాగస్వామ్యం కల్పించాలి. అన్నీ మనం ఒక్కరమే చేద్దాం అనుకోకూడదు. మీ ఇంట్లో చూడు, పిల్లల స్కూలు యూనీఫారాలూ, వాళ్ల టిఫిన్ బాక్సులు సర్దడం, కడగడం అన్నీ నువ్వే చేయాలా? పాపం, చిన్న పిల్లలు, వాళ్లని ఇప్పటి నుంచీ కష్టపెట్టడం ఎందుకని నువ్వు అనుకోవచ్చు. కానీ, వాళ్లు ఎదుగుతున్నారు, రేపో మాపో పై చదువుల కోసం హాస్టళ్లలో ఉండవలసి రావచ్చు. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్లి చేయలేవు కదా? అందుకే వాళ్ళ పనులు వాళ్లను చేసుకోనివ్వాలి. అప్పుడు నీకు కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది” చెబుతున్న ఆమె మొహంలో ముప్పై సంవత్సరాలు ఉపాధ్యాయవృత్తి చేసిన తల్లి కనపడింది, సుధకు.
ఆశ్చర్యంగా వింటున్న సుధ వైపు చూస్తూ, చెప్పసాగింది సుభద్ర.
“ఇక రెండో పద్ధతి
‘ప’ నికి సమయనిర్ధేశం:
అంటే, ప్రతీ పనికి మనం ఓ నిర్ధిష్ట సమయం కేటాయించుకోవాలి. నీ విషయానికి వస్తే, నేను కొన్ని విషయాలు గమనించాను. పొద్దున్నే లేవగానే ఆ ఫోన్ తీసి వాట్సప్ మెసేజులు చూడడం అవసరమా ? అందులో ఏదో ఓ చెత్త మెసేజ్ ఉంటుంది. ఇంక ఆ రోజంతా దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటావు. అందుకే రోజుకు నాలుగు సార్లు, అంటే ఉదయం టిఫిన్ చేస్తూ, మధ్యాహ్నం లంచ్ టైములో, సాయంత్రం ఇంట్లో కాఫీ తాగుతూ, రాత్రి పడుకోబోయే ముందు.. ఇలా సమయం కేటాయించుకో.
అలాగే, రాత్రి టీవీ చూస్తూ మర్నాడు ఉదయానికి కావలసిన కూరలు తరుక్కోవడం, రాత్రి భోజనాలు అయిన తరువాత ఆ పాత్రలు మర్నాడు ఉదయం వరకూ ఉంచకుండా రాత్రి పడుకునే ముందే కడుక్కోవడం, ఇలా సమయ పాలన చేయడం వలన మర్నాడు ఉదయానికి నీకు కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది” చెబుతున్న తల్లి మొహంలో ఓ మోటివేటర్ దర్శనమిచ్చిడు సుధకు.
ఆశ్చర్యంగా చూస్తున్న కూతురు వైపు ఓ సారి చూసి, తిరిగి చెప్పడం మొదలెట్టింది సుభద్ర.
“ఇక మూడోది, అతి ముఖ్యమైనదీ
‘మా’ నసిక స్థైర్యం.
ఇది ఉంటే చాలు, ఒత్తిడి ఏం ఖర్మ, మనం దేనినైనా జయించవచ్చు. మిన్ను విరిగి మీద పడినా కానీ చలించకుండా, ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, కృంగిపోకుండా, నేను దీనిని ఎదుర్కొన గలను అని గట్టిగా పిడికిలి బిగించి మనసులో అనుకో. నీలో ఆత్మ విశ్వాసం పెరిగి, ఒక విధమైన ధైర్యం వచ్చేస్తుంది.
ఇది లేకపోవడం వల్లనే చిన్నపాటి అప్పులు చేసి, అప్పులవాళ్ల ఒత్తిడి భరించలేక మీ నాన్న మీ చిన్నతనంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ధైర్యం ఉంది కాబట్టే నేను చదువుకుని, టీచర్ ఉద్యోగం తెచ్చుకుని, అన్నయ్యను, నిన్నూ చదివించి ఈ స్థితికి తెచ్చాను” అని చెబుతున్న తల్లిలో ఓ సైకాలజిస్టు దర్శనమిచ్చాడు సుధకు.
ఇక ఆఖరుది
‘ల’ క్ష్యం మీద దృష్టి.
అంటే మనం ఏం పని చేస్తున్నామో దాని మీదే దృష్టి కేంద్రీకరించాలి. మాట వరసకి ఒక బస్సు డ్రైవర్ స్టీరింగ్ ముందు కూర్చోగానే, అతని లక్ష్యం ప్రయాణికులని క్షేమంగా గమ్యం చేర్చడం. అందుకే అతని దృష్టి రోడ్డు మీదే ఉండాలి. అలాకాక, ఉదయం ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఆలోచించేడనుకో, అరవై మంది ప్రాణాలు గాల్లో కలిసినట్లే.
నిన్న బేంకులో నువ్వు చేసింది అదే, ఏదో ఆలోచిస్తూ, ఆ ఒత్తిడిలో తప్పుడు ఎంట్రీ వేసావు. అలా కాకుండా లక్ష్యం మీద దృష్టి పెట్టి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. అందుకే పని మీద దృష్టి పెట్టమనేది.
అంతెందుకు, చాలా మంది ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత, గ్యాస్ స్టవ్ ఆపామా? ఇంటి తాళం సరిగ్గా వేసామా అని అనుమాన పడి ఆ ఒత్తిడితో అసలు వెళ్లిన పని మీద దృష్టి పెట్టకుండా ఇంటికి వచ్చి చూసుకొనే వరకూ బిక్కు బిక్కు మంటూ ఉంటారు. అలా కాకుండా తాళం వేసినప్పుడు కొంచెం దృష్టి పెట్టడం కానీ లేదా ఆ సమయంలో ఏదో ఒక సంఘటన అంటే ‘పాపం రామారావు కి ఎలా ఉందో’ అనో లేదా ‘ఆ వీధి కుక్క ఎలా అరుస్తోందో’..ఇలా ఏదో ఒకటి అనుకుని ఆ పని చేసామనుకో. అప్పుడు మనకి ఆ అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి, ఒత్తిడికి దూరం అవుతాం” చెబుతున్న అమ్మ, గీతోపదేశం చేస్తున్న గీతాచార్యుడులా కనిపించింది సుధకు.
“అమ్మా, చక్కటి విషయాలు చెప్పావు. నువ్వు చెప్పిన జ ప మా ల పద్దతి ఇప్పటి నుంచే ఆచరిస్తాను” అంటూ తక్షణ కర్తవ్యంగా సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి, తల్లి వద్దే పడుకుండి పోయింది సుధ.
***
ఉదయమే లేచి బ్రష్ చేసుకుని, కిచెన్ లోకి వచ్చిన సుధ, అక్కడ సింక్ లో గిన్నెలు కడుగుతున్న కూతురు, డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని బెండకాయలు తరుగుతున్న కొడుకు, కాఫీ పెడుతున్న భర్తను చూసి,
“ఏమిటి షడన్ గా ఈ మార్పు” అని అడిగింది ఆశ్చర్యపోతూ.
“చూడు సుధా! అత్తయ్య గారు చెప్పిన జపమాలలోని మొదటి పథకాన్ని, మా వంతుగా మేము అమలుపరుస్తున్నాం. మిగతా మూడు పథకాలు ఫాలో అవ్వడం ఇక నీ చేతుల్లో ఉంది” చెబుతున్న భర్తని ఆశ్చర్యంగా చూస్తూ, ఒత్తిడిని జయించిన మొహంతో, పిల్లలను దగ్గరకు తీసుకుంది సుధ, మనసులో తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ.
(జాగృతి వారపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలో బహుమతి పొందిన )
*****
బుద్ధవరపు కామేశ్వరరావు గారి పరిచయం :
తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం దగ్గర లో ఉన్న జగన్నాధగిరి అనే గ్రామంలో డాక్టర్ సూర్యనారాయణ రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన 11 మంది సంతానంలో 7 వ వానిగా 1958లో జన్మించారు.
వృత్తి: ఒక మల్టీ నేషనల్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ గా 2016 లో పదవీ విరమణ చేసి, ప్రస్తుతం హైదరాబాద్ లోని స్వగృహంలో విశ్రాంత జీవనం.
కుటుంబ నేపథ్యం: భార్య శేషుకుమారి, ఓ అమ్మాయి -(సూర్యకళ, అల్లుడు వాసూరావు, వాళ్లకి ఇద్దరు పిల్లలు. పేర్లు సంకీర్త్, ష్రఘ్వి) ఓ అబ్బాయి – (పేరు శశికాంత్, కోడలు శిరీష, వీరికి ఓ అబ్బాయి. పేరు శక్య)
వ్రాయడం మొదలుపెట్టింది : 2017 నుంచి
ఇంతవరకూ రాసిన కథలు : 212
ప్రచురణకు నోచుకున్నవి: సుమారు… 98.
మిగిలినవాటిలో కొన్ని వివిధ మాధ్యమాలలో, పరిశీలనలోనూ, మరికొన్ని మెరుగులు దిద్ది పంపే ప్రక్రియలో నావద్దనూ పెండింగ్ లో ఉన్నవి.
పోటీలలో బహుమతులు పొందినవి (15)
ప్రోత్సాహం ఇస్తున్న వారు:
పత్రికాధిపతులు, సంపాదకులు, సమీక్షకులు, పాఠకులు, అభిమానులు, అలాగే మిగిలిన అందరూ!
*****
ఆర్.దమయంతి
పలు వార మాస పక్ష దిన పత్రికలలో సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం వుంది. వంద పైని కథలు, అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేయడం అంటే తెగని మక్కువ. ఘాటైన విమర్శలతో సాహితీ వేత్తలని బెంబేలెత్తించడం కంటే, రచనల్లోని మంచిని గుర్తించి ప్రశంసించడం మంచిదంటారు. పొరబాట్లుంటే, సద్విమర్శతో సూచించడమూ మేలైన రచనలు అందుతాయనీ, తద్వారా ఉత్తమసాహిత్యాన్ని చదవగల అవకాశంవుంటుందనీ, అదే తను చేయగల సాహితీ సేవ అని అభిప్రాయపడతారు.
కథ కాని కథ, ఈ కథ ఎందుకు నచ్చిందంటే, నేను చదివిన కథ వంటి అనేక శీర్షికలను వివిధ ఆన్లైన్ మాగజైన్స్ – సారంగ, వాకిలి, సాహిత్యం (గ్రూప్) లో నిర్వహించారు.
ప్రస్తుతం ‘సంచిక’ ఆన్లైన్ మాస పత్రికలో ‘ట్విన్ సిటీస్ సింగర్స్ ‘ ఫీచర్ ని, ‘ తెలుగు తల్లి కెనడా ‘ మాస పత్రికలో ‘సిరిమల్లె చెట్టుకింద ..’ అనే శీర్షికలని నిర్వహిస్తున్నారు.
వీక్షణం (బే ఏరియా సాహిత్య సాంస్కృతిక సంస్థ0, తెలుగు జ్యోతి (న్యూజెర్సీ ) వార్షికోత్సవ పత్రికలలో ఆర్.దమయంతి గారి కథలు ప్రచురితమయ్యాయి. ఆంధ్ర భూమి వారపత్రిక, స్వాతి (వీక్లీ, మంత్లీ) నవ్య వీక్లీ, మయూరి పత్రికలలో తో బాటు ఈమాట, కినిగె, వాకిలి, పొద్దు, సారంగ, లలో కూడా అనేక కథలు పబ్లిష్ అయ్యాయి.
రచయిత్రి ప్రస్తుతం – నార్త్ కరొలినా (అమెరికా) లో నివసిస్తున్నారు.
దమయంతి గారూ
నేను రాసిన ఈ కథ చదివి అద్భుతమైన సమీక్ష చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.
🙏🙏🙏
ఎంత అద్భుతంగా సమీక్ష చేసారంటే…
“నేను రాసిన కథలో ఇంత విషయం ఉందా? ” అని నేనే ఆశ్చర్యపోయేంతగా!
ఏమాత్రం వీలున్నా నేను రాసిన మిగతా కథలను కూడా చదివి సమీక్ష చేయగలరని ఆశిస్తున్నా.
అలాగే
నా కథను తమ పత్రికలో పంచిన నెచ్చెలి సంపాదకులకు నా కృతజ్ఞతలు.
🙏🙏🙏
ఇక
నా కథ చదివి తమ అభిప్రాయాలను తెలిపిన, తెలపుతున్న, తెలపబోతున్న అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
🙏🙏🙏
మీ
కామేశ్వరరావు బుద్ధవరపు
బుద్ధవరపు కామేశ్వర రావు గారి ‘ జపమాల’ ఈ తరం వారికి అమూల్య కానుక. రచయిత గారికి అభినందనలు.
చాలా థాంక్సండి..మీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలు.
మీ ఆత్మీయపూర్వక స్పందనకు
ధన్యవాదాలు పుల్లరాజు గారూ!