ఓ పేరు లేని కథ

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో ప్రత్యేక బహుమతి రూ.750/- పొందిన కథ)

– రత్నాకర్ పెనుమాక

          మొన్న అందరూ కలిసి అమలాపురం ఎర్రొంతెన కాడ పెట్టిన ఎగ్జిబిషన్‌ కెళ్లినపుడు కొన్న, గోడ గడియారం లోంచి చిలక బయటికొచ్చి అయిదు గంటలు కొట్టి లోపలికి పోయి దాక్కుంది. అప్పటి వరకూ దుప్పట్లో దాక్కున్న రమణి లేచి చేతితో తడిమి పక్కన చిన్ని ఉన్నదని కళ్ళు తెరిచి చిన్ని మొఖం చూసింది. చిన్ని మత్తుగా నిద్రపోతుంది. ముద్దొస్తున్న చిన్నిని చూసి దిష్టి తీస్తున్నట్లు మెటికలు విరుచుకుంది రమణి. అలా పడుకుని ఉన్న చిన్నిని గాల్లోనే ముద్దెట్టుకుంది. వాళ్ళమ్మ దగ్గరకెళ్ళి కాళ్ళు ముట్టుకుని కళ్ళకద్దుకుంది. అమ్మమ్మ దగ్గరకెళ్ళి కాళ్ళు ముట్టుకుని కళ్ళకద్దుకుంది. చెల్లెలిని చూసి గాల్లోనే ముద్దాడుతూ నిద్రపోతున్న ఆమెను చూసి మురిసిపోయింది.

          గబగబా కాలకృత్యాలు ముగించుకుని స్టవ్‌ వెలిగించి చిన్నికిష్టమని ముద్దపప్పు, చెల్లెలికిష్టమని బంగాళా దుంప ఫ్రై, అమ్మమ్మకు, అమ్మకు ఇష్టమని వంకాయ బాగా కాల్చి రోటిలో దంచి రోటి పచ్చడి చేసింది. అన్నం వండి పల్లెంలో చల్లార్చి స్నానానికి వెళ్లింది. స్నానం చేసి వచ్చేసరికి అందరూ లేచారు. పూజ చేసుకుని ఇంకా ఎవరూ మంచాలు దిగకుండానే అమ్మకి, అమ్మమ్మకి నెస్‌కెఫెతో కాఫీ ఇచ్చింది. చెల్లికి గ్రీన్‌టీ ఇచ్చింది. తను బాదం టీ కలుపుకొని వాళ్ళతోపాటు మంచాల మీద కూర్చుని అందరూ కలిసి కబుర్లాడుకుంటూ తాగారు. బాక్సు సర్దుకుని తన ఏక్టివా వేసుకుని ఆఫీసుకి బయల్దేరింది. రమణి రెవిన్యూ డిపార్టుమెంటులో సూపరింటెండెంట్‌గా చేస్తుంది. నెలక్రితమే అమలాపురం ఆర్‌.డి.ఓ ఆఫీసు నుంచి కపిలేశ్వరపురం ఎమ్‌.ఆర్‌.ఓ ఆఫీసుకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. జాయిన్‌ అయ్యి లీవ్‌ పెట్టింది ఓ పదిరోజులు. ట్రాన్స్‌ఫర్‌ అంటే ఒక సీటు మారటం కాదు. ఒక కుటుంబం మొత్తం ఇంకో ఊరు వచ్చి స్థిరపడటం. అది అంత తేలిగ్గా అయ్యేది కాదు కదా! ఇక్కడ అన్నింటికీ అనుకూలంగా ఉన్న ఇల్లు దొరకాలి. సామాన్లు మనుషులు అందరూ అక్కడి నుంచి ఇక్కడికి మారాలి. స్కూళ్లు కాలేజీలు మార్చాలి. ఇక్కడివి అన్ని అలవాటు పడాలి. ఇలా సవాలక్ష ఉంటాయి. అందులోనూ వీళ్ళది మగ పురుగు లేని సంసారం. అలాంటి ఈ ఇంటికి రమణియే పెద్ద దిక్కు, వయసులో కాదు, బాధ్యతలలో!

          ఇక్కడ ఇల్లు దొరకటమే పెద్ద ప్రహసనమైంది. రమణిని చూడక ముందు అన్ని ఆఫీసు అటెండర్‌ పాలూరు గురుమూర్తి అద్దె, అడ్వాన్స్‌ మాట్లాడి ఆరోజు అడ్వాన్స్‌ ఇవ్వటానికి ఇంటి ఓనర్‌ దగ్గరకెల్తే, అతను రమణిని చూసిన మరుక్షణమే మాట మార్చేసాడు. ‘‘ఏవండీ మూర్తిగారు మా వాడు నెలాఖరుకి వస్తున్నాడట ఓ రెండు నెలలు సెలవు మీద. అందుచేత ఇల్లు ఇవ్వలేం. మీరొచ్చే ముందే ఫోన్‌ చేసాడు అంటూ మాట మార్చేసాడు. అతనెందుకలా మాటమార్చేసాడో గురుమూర్తికి, రమణికీ కూడా అర్ధమైంది. ఆమెకి ఇలాంటి అవమానాలు మామూలే! కొత్తకాదు. గురుమూర్తి ‘‘సరే అమ్మగారూ ఈడు కాకపోతే ఇంకోక సేను గాడు ఇంక ఈ ఊళ్ళో ఇళ్ళే లేవా? ఎధవ నాటకాలాడతన్నాడు. తవరేం ఇదవ్వకండి. ఇంకో ఇల్లు చూద్దాం’’ అన్నాడు. ‘‘పోన్లే మూర్తి నన్ను ముందే చూడటం మంచిదైంది. అలా కాకుండా ఇంట్లోకొచ్చిన తర్వాత చూసి ఉన్నపళంగా ఖాళీ చెయ్యమంటే? పోన్లే అంతా మన మంచికే జరిగింది’’ అంది.

          ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిసి కపిలేశ్వరం లోని గిరజాలోరి వీధి, బ్రామ్మల అగ్రహారం, ఆకుమర్తోరి వీధి తిరిగి రమణిని చూసి ఎక్కడా ఇల్లివ్వకపోయే సరికి తెలుకులోల్ల వీధిలో తెల్లమేకల గోవిందు గారింట్లో టు`లెట్‌ బోర్డు చూసి ఆగారు. బోర్డు మీదున్న నెంబర్‌కి ఫోన్‌ చేసారు. ఆ ఇంటి ఓనర్‌ తెల్లమేకల గోవిందు ఖద్దరు బనీను గెచ్చకాయ రంగు నిక్కరేసు కుని నోటిలో కరీం బీడి కాలుస్తా టి.వి.ఎస్‌ బండేసుకుని వచ్చాడు.

          వస్తూనే రమణిని చూసి కొంచెం తటపటాయించాడు. కానీ ఇంటికి తాళం తీసి ఇల్లు చూపించాడు. ఇల్లు చాలా బాగుంది. కానీ సంవత్సరాలుగా వాడనట్టు బూజులు పట్టి ఉంది. గోవిందు జుట్టులాగా! ఇంట్లో అన్ని సదుపాయాలున్నా ఆ ఇల్లు ఖాళీగా ఉండటానికి కారణం ఇంటికి వీధి శూల ఉంది. అందుకే ఎవరూ అద్దెకు రావటం లేదు. గోవిందు తండ్రిచ్చిన వాటాలోనే మకాం ఉంటున్నాడు. ఇక్కడికి వేరుగా వచ్చేద్దామని ఈ ఇల్లు కట్టించాడు. కానీ ఇక్కడికొచ్చిన రెండు నెలలకే అతని దొంగసారా వ్యాపారం ఎక్సైజ్‌ వాళ్ళ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌కి దొరికిపోయి ఆ కేసుల్లో లక్షలు తగలెయ్యాల్సి వచ్చింది. అందుకే వెంటనే ఇల్లు ఖాళీ చేసేసి సొంతింటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అంటే సుమారు రెండేళ్ళ నుంచి అద్దెకు ఎవరూ రాలేదు. ఇదిగో ఇప్పుడు రమణి వచ్చింది. అందుకే గోవిందుకి ఆవిడకి ఇవ్వటం సుతారమూ ఇష్టం లేకపోయినా ఇల్లు ఖాళీగా వదిలెయ్య లేక మూడు వేలు కూడా చెయ్యని అద్దె అయిదు వేలకిచ్చాడు. గురుమూర్తి బేరమాడుతున్నా రమణి వారించింది. గోవిందు కూడా వీళ్ళకి వేరే గత్యంతరం లేదని గ్రహించే భీష్మించు కూర్చున్నాడు. వెంటనే అతను రెండు నెలలే అడిగినా ఆరు నెలల ఎడ్వాన్సు ఇచ్చింది. కనీసం అడ్వాన్స్‌ కోసమైనా ఓ ఆరు నెలలు ఉంచుతారని!

          గురుమూర్తికి డబ్బులిచ్చి ఇల్లు శుభ్రం చేయించమంది. మంచి రోజు చూసుకుని ఇంట్లో దిగారు రమణి కుటుంబం. సామాన్లు సర్దుకుని అంతా చక్కబడటానికి ఇన్ని రోజులు పట్టింది. రోజూ రమణి బాక్సు పట్టుకుని ఆఫీసుకి వెళ్ళి పోతుంది. ఎందుకంటే ఆఫీసులో పని అలాంటిది. ఏ రోజూ తన టేబుల్‌ మీద ఏ ఫైలు తన వల్ల ఆలస్యం కాకూడదని ఆమె ప్రయత్నం. అందుకే ఇంత పంక్షువల్‌గా ఉంటుంది. ఆఫీసులో అందరినీ పరిచయం చేసుకుంది. కానీ ఎవరూ ఆమెతో స్నేహంగా ఉండటానికి కానీ ఆమెతో మాట్లాడటానికి కానీ ఇష్టపడటం లేదు. ఆ విషయం తనకి అర్ధమౌతుంది. స్నేహంగా లేకపోయినా పర్వాలేదు తనని అవమానించకుండా ఉంటే చాలు అనుకుంది. కానీ మనుషులు ఎక్కడున్నా ఒకేలా ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు. తనకి గతంలో ఎదురైన అవమానాలే ఇక్కడా పునరావృతమౌతున్నాయి.

        ఓరోజు తన ఆఫీస్ టేబుల్ మీదున్న నేమ్ ప్లేట్ లో “రమణి సూపరింటెండెంట్” అని ఉన్న దాంట్లో తన పేరుని “రమణి” ని “రమణ” గా దిద్దారెవరో అది చూసి తనకి వాళ్ల ఆంతర్యం అర్థమైంది తను హిజ్రా నని తను “మగాడ” దాన్నని గేలి చేస్తున్నారని. అది తనని కొత్తగా బాధ పెట్టలేదు.ఎందుకంటే ఇలాంటి అవమానాలు తనకి కొత్తకాదు. అందుకే నవ్వుకుంది .పగలబడి నవ్వుకుంది .కన్నీళ్లొచ్చేలా నవ్వుకుంది .

          అయినా తనేం చేయ గలదు! అది తనకు దేవుడిచ్చిన శాపం. వందమందిలో ఒకరు మాత్రమే పుట్టుకతో హిజ్రాగా పుడతారట. మిగిలిన 99% మంది బలవంతంగా మార్చబడతారట. ఆ ఒక్క శాతం దురదృష్టం తనని వెంటాడింది. హిజ్రాగా పుట్టింది. అది తనకు దేవుడిచ్చిన శాపం. అయినా శపించిన వాడినే పూజించేంత మంచి మనసున్న ఆమె వీళ్ళనేమి చేస్తుంది? ఆఫీసులో ఆమెది ఆఫీసర్‌ కేడర్‌ అయినప్పటికీ ఆ గౌరవం ఆమెకు ఏనాడు దక్కలేదు. అయినా ఆమె బాధపడలేదు. ఆమె సబార్డినేట్‌ ముప్పాళ్ళ వెంకటరావు ఒకరోజు ఆవిడని సంభోదిస్తూ ‘‘సర్‌… మేడమ్‌’’ అంటూ నాలుక కరుచుకున్నట్టు నటించాడు ఆమెని చూసి వెకిలిగా నవ్వుతూ…

          ఈ మనుషులకి ఒక వ్యక్తి రూపంతో ఏంటి సంబంధం మనిషితోటే కదా!? నిజానికి చాలామంది మగాళ్ళు పైకి మగాళ్ళలాగా లోపలంతా ఆడ లక్షణాలతో ఉంటారు. అలాగే కొందరు ఆడాళ్ళు పైకి ఆడాళ్ళ లాగా ఉన్నా లోపలంతా మగ లక్షణాలతో ఉంటారు. ఇలా హార్మోన్ల లోపం వల్లో భగవంతుడి చిన్న చూపు వల్లో హిజ్రాగా పుడితే వాళ్ళని సామాన్యులుగా గుర్తించటానికి మనుషులుగా అంగీకరించటానికి మనుషులు చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ మనుషుల దృష్టిలో హిజ్రాలంటే ఏ రైల్వే స్టేషన్లోనో, బస్టాండులోనో అడుక్కుంటూ ఉండాలి. లేదా ఒళ్ళమ్ముకుని చీకటి బ్రతుకు బ్రతకాలి తప్ప చదువుకొని, ఉద్యోగం చేస్తూ స్వశక్తితో గౌరవంగా బ్రతికితే ఈ మనుషులు సహించ లేరు.  

          చిన్ని, రమణి వెనకాలొచ్చి వాటేసుకుని ముద్దుపెట్టుకుంది. అప్పటికి రమణి పెండింగ్ ఫైల్‌ వెరిఫై చేస్తుంది. దాన్ని పక్కన పెట్టి చిన్నిని వీపుపై ఊయలలాగా ఊపుతూ ‘‘చిన్నిబాబు బువ్వ తిన్నాడా?’’ దానికి చిన్ని గారంగా, ‘‘ఇప్పురే చిన్నక్క తినిపించింది’’ అంది. కథ చెప్పనా అనడిగింది. ‘‘కథొద్దు లేవు రివర్‌బేకి ఎల్దాం అక్కా’’ అనడిగింది. ‘‘సరే బంగారం’’ అంది.

          రేపు సండేనే కానీ అర్జంట్‌ ఫైల్‌ ఒకటి ఉంది అది రాత్రంతా కూర్చుంటే కానీ అవ్వదు. అది అయిపోతే రేపు ఆఫీసుకెళ్ళనవసరం లేదు. లేదంటే ఎమ్‌.ఆర్‌.ఓ గారు ఫోన్‌ చేసి విసిగిస్తారు అనుకుని రేపటి ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. తనకిలాంటివి ఇష్టముండదు. కానీ చెల్లికి, అమ్మకి, అమ్మమ్మకి నర్సరీలంటే ఇష్టం. చిన్నికి రివర్‌బే ఇష్టం కాబట్టి ఈ టూర్‌. ఆ రాత్రంతా కూర్చుని పెండింగ్‌ ఫైల్‌ మొత్తం పూర్తి చేసి రాత్రి ఒంటి గంటకి పడుకుంది. సాధారణంగా ఇలాంటి ఉద్యోగాలు చేసేవాళ్ళకు ఆదివారం వస్తే బయటికెళ్ళి తిరగాలని ఉండదు. ఆదివారం మధ్యాహ్నం వరకూ పడుకుని, ఆకలేసినపుడు తిని బద్దకంగా గడపాలనిపిస్తుంది. కానీ చిన్ని కోసం తప్పట్లేదు. ట్రావెల్స్‌ వాళ్ళకి ఫోన్‌ చేసి స్కార్పియో బుక్‌ చేసింది.

          పొద్దుటే అందరూ లేచి త్వరగా బయల్దేరారు. అప్పటికే వచ్చిన స్కార్పియో ఎక్కి ముందుగా కడియపు లంకలో ఎక్కువగా సినిమా షూటింగులు జరిగే పల్ల వెంకన్న నర్సరీకెళ్ళి అక్కడ వింత వింత మొక్కలని పూలని చూసి చాలా చాలా ఆహ్లాదం అనుభవించారు. ఆ తర్వాత రాజమండ్రి పుష్కరాల రేవుకెళ్ళే ఏటిగట్టు రోడ్డులో ఈమధ్యే కొత్తగా పెట్టిన ఆవకాయ్‌ మల్టికజిన్ రెస్టారెంట్‌లో ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్‌ చేసుకుని తిన్నారు. ఆ తర్వాత రివర్‌బేకి వెళ్ళి సాయంత్రం దాకా ఆడుకుని ఆ తర్వాత కోటగుమ్మం సెంటర్‌లో రాయల్‌ డైన్‌లో బిరియాని తిన్నారు డ్రైవర్‌తో సహా! తర్వాత అలసిపోయి ఇంటికొచ్చారు.

          మళ్ళీ పొద్దుటే ఆఫీసు పరుగులు మామూలే రమణికి వాళ్ళు ఈ ఇంటికొచ్చి మూడు నెలలవుతూంది. చుట్టుపక్కల వాళ్ళతో పరిచయాలు బాగానే పెరిగాయి రమణితో తప్ప! ఎడమ పక్కన డాబాలో ఉండే జానకమ్మ వాళ్ళు, ఎదురింట్లో ఉండే తులసమ్మ వాళ్ళు, కుడిపక్క నుండే సుబ్బారావు వాళ్ళు, వెనుకాలింట్లో ఉండే గోపాల క్రిష్ణ వీళ్ళతో బాగానే ఉంటున్నారు.

          కాకపోతే వీళ్ళందరికీ ఒకే ఒక్క అనుమానం రమణి గురించి తను హిజ్రా కదా అని! కానీ ఎవరూ ఈ ప్రస్తావన తీసుకురారు. ఎందుకంటే వాళ్ళక్కావాల్సిన పప్పు ఉప్పులు, చిన్నా చితక చేబదులు అప్పులు వీళ్ళ వల్ల అందుతున్నాయి. అందుకే వాళ్ళకి రమణితో ఇబ్బంది ఉన్నా ఆ విషయం పక్కన పెట్టి మిగిలిన వాళ్ళతో సంబంధాలు పెంచుకుంటున్నారు.

          వాళ్ళకి రమణి విషయం పక్కన పెడితే ఇంకా తీర్చుకోవాల్సిన అనుమానాలు చాలానే ఉన్నాయి. రమణి వాళ్ళ నాన్న ఏడి? ఆ ఇంట్లో అందరూ అల్లారుముద్దుగా చూసుకునే చిన్ని ఎవరు? చిన్ని, రమణికి చెల్లెలైతే ముప్పై ఏళ్ళుండే రమణికి ఏడేళ్ళ చెల్లెలుండడమేమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగితే ఏమౌతుందోనని ఎవరూ ధైర్యం చెయ్యట్లేదు. కానీ గోపాలం అని అందరూ పిలిచే నామాడి గోపాలక్రిష్ణకి కొంచెం నోరెక్కువ ఏదీ దాచుకోలేడు.

          అందుకే ఆరోజు పేపర్‌కని వచ్చి కావ్య ఇచ్చిన కాఫీ తాగి వెళ్తూ వెళ్తూ కావ్యని అడిగాడు ‘‘కావ్యాగారూ ఈ పిల్లకి ఏడుళ్ళుంటాయ్‌ మీ అక్కకి ఓ ముప్పై ఉంటాయ్‌ మీకు ఇంత చిన్న చెల్లెలుందేంటి?’’ అని. దానికి కావ్య గతుక్కుమంది. ‘‘సరే అంకుల్‌ తర్వాత మాట్లాడదాం స్టవ్‌ మీద కూర మాడిపోతున్నట్టుంది వస్తాను అంటూ కంగారుగా వంట గది లోకి పరుగెట్టింది. మళ్ళీ గోపాలం కంటబడితే ఇందాకడిగిన విషయం చెప్పాలని ఇక రాలేదు. చూసి చూసి గోపాలం వెళ్ళిపోయాడు.

          ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన రమణికి వాళ్ళమ్మ తలకు నూని పెడుతూంది. ఇంతలో కావ్య వేడి టీ తెచ్చి అందరికీ ఇచ్చింది. పొద్దుట గోపాలం అడిగిన విషయం రమణికి చెప్పింది. రమణి నవ్వుకుంది. ‘‘ఈ మనుషులకి పక్కవాళ్ళ జీవితం మీద ఎంత ఆసక్తో! ఎవరికీ ఏమీ చెప్పాల్సిన పని లేదు’’ అంటూ ఆ విషయం నుంచి టాపిక్‌ మార్చింది. ఆఫీసు విషయాలు మాట్లాడుతూ పొద్దుట జరిగిన విషయం చెప్పింది.
‘‘పొద్దుట గురుమూర్తి వాళ్ళ పాపని తీసుకొచ్చి రమణికి అక్షింతలిచ్చి కాళ్లకి దణ్ణం పెట్టించి రమణిని ఆశీర్వదించమన్నాడు. ఆ పాప పుట్టినరోజని అర్ధమై అయిదు వందలు ఆ పాప చేతిలో పెట్టి ఆశీర్వదించాను. ఆ తర్వాత ఏం మూర్తీ హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచిదని నమ్ముతారు. అందుకే నా దగ్గరకు తీసుకొచ్చావా? అనడిగాను. లేదమ్మగారు మీలాంటి మంచి మనసున్నవాళ్ళు ఆశీర్వదిస్తే నాబిడ్డ జీవితం బావుంటుందని మీ ఆశీర్వాదం కోసం తీసుకొచ్చాను, తప్ప తవరు అలా ఉన్నారని కాదు అమ్మగారూ, పొద్దున్నుంచి మీ ఆశీర్వాదం కోసమే చూస్తున్నాను. మొట్టమొదటి ఆశీర్వాదం మీదే అమ్మగారు నేను కూడా ఇంకా అక్షింతలు ఎయ్యలేదు అంటూ ఉద్వేగానికి గురైయ్యాడు. నా దగ్గరకి తప్ప ఆఫీసులో ఇంకెవరి దగ్గరకీ ఆ పాపని తీసుకెళ్ళలేదు’’ అని చెబుతూ రమణి ఉద్వేగానికి గురైయింది. అందరూ దగ్గరకొచ్చి ఆమెను ఓదార్చారు. వాళ్ళ మధ్య ఉన్న ఆప్యాయతలకి, ఆత్మీయతలకి నిదర్శనంగా!

          ఆ రోజు డ్యూటీ కెళ్ళటానికి తన బండి స్టార్ట్‌ చేస్తుంటే అది అవ్వక కిక్‌ కొడుతూ తంటాలు పడుతున్నపుడు చూసాడు గోపాలం రమణిని. ఆమె అచ్చం మగాడి లాగే ఉంది. కాకపోతే జుట్టు, చీరకట్టు, నడక, ఆడవాళ్ళ ముఖంలో ఉండే సౌకుమార్యంతో ఆమె ఆడ మనిషి లాగే కనిపిస్తుంది. ఆమెను అలాగే నిశితంగా పరిశీలించాడు. ఎక్కడో చూసిన జ్ఞాపకమొస్తుంది. కానీ గుర్తురావట్లేదు. ఎక్కడ చూసానా అంటూ తెగ ఆలోచించాడు. గుర్తు రాలేదు. అదే విషయం వాళ్ళావిడతో చెబితే ‘‘ఏముంది ఈ ఉద్యోగం రాకముందు ఏ బస్టాండులోనో రైల్వే స్టేషన్‌ లోనో చూసి ఉంటారు అన్నది. ఎంత ఆలోచించినా గుర్తు రాలేదతనికి.

          ఉదయం పదిగంటలవుతూంది. కావ్యా వాళ్ళ అమ్మమ్మ శాంతమ్మ ఎంత లేపినా లేవలేదు. సాధారణంగా ఎనిమిది గంటలకల్లా లేచే ఆవిడ ఈ రోజు పదవుతున్నా లేవకపోయేసరికి ఒళ్ళు పట్టుకుని చూసింది కావ్య. చల్లగా ఉంది. కంగారొచ్చి గుండె దగ్గర చెవి పెట్టి విన్నది. గుండె ఆగినంత పనైంది. అమ్మమ్మ గుండె గంట క్రితమే ఆగిపోయిందని తెల్సింది. రమణికి ఫోను చేసి భోరుమంటూ విషయం చెప్పింది. ఆ విషయం నమ్మని రమణి అమెరికన్‌ ఆసుపత్రిలో డాక్టర్‌ బొబ్బా విజయకుమార్‌ని బతిమాలి తీసుకొచ్చింది. ఆయన స్టెత్‌ పెట్టి చూసి ఆవిడ చనిపోయిందని నిర్ధారించాడు. ఒక్కసారిగా అందరూ గొల్లుమన్నారు. రమణి గురుమూర్తికి ఫోను చేసి దహన సంస్కారాలకి ఏర్పాట్లు చూడమని డబ్బులిచ్చింది.

          ఈలోగా ఈ విషయం తెలుసుకుని చుట్టుపక్కల వాళ్ళు ఇంటికొచ్చారు. చాలా మందికి ఆ పెద్దావిడ ఉందని తెలుసుకానీ ఆవిడని చూడలేదు. ఇంట్లోనే ఉండేది. అప్పటికి ఆవిడ వయసు ఎనభై పైనే. అందులోనూ కళ్ళు సరిగా కనిపించేవి కావు. చెవులు సరిగా వినిపించేవి కావు. అందుకే ఆ ఇంట్లో ఆవిడని, చిన్నిని చూసినట్లే చాలా జాగ్రత్తగా గాజు బొమ్మలాగా చూసేవారు. రమణి అయితే మరీనూ! రోజూ ఆవిడతో గంట సేపు గడపనిదే రోజు గడిచేదే కాదు. వాళ్ళమ్మమ్మతో మాట్లాడుతూ కాళ్ళు నొక్కేది. శాంతమ్మ వద్దని వారిస్తున్నా రమణి వినేది కాదు. అలాంటి పెద్దావిడ ఇక లేరు. కపిలేశ్వరపురం నుంచి అంగర వెళ్ళే రోడ్డులో ఉన్న రుద్రభూమిలో శాంతమ్మ దహన సంస్కారాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటి పక్కవాళ్ళు వచ్చారు. ‘‘అమ్మా చుట్టాలెవరన్నా రావాలా? మళ్ళీ లేటయితే చాలా ఇబ్బంది పడాలి. చుట్టాలకి కబురు వెళ్ళిందా’’ అనడిగింది తులసమ్మ. ఇంతలో గోపాలం వచ్చాడు. శాంతమ్మ శవాన్ని చూసాడు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి రమణిని ఎక్కడ చూసాడో!

          ఈలోగా అక్కడికి చేరిన జానకమ్మ, సుబ్బారావు, తులసమ్మ వాళ్ళు గోపాలంతో ‘‘పాపం! ఇంట్లో అందరూ ఆడోళ్ళే జరగాల్సిన పనులు ఎలా చేత్తారో? చుట్టాలకి కబుర్లెళ్లాయో లేదో’’ అంటూ మాట్లాడుతుంటే ఎప్పుడూ ఎదుటివాళ్ళ విషయాల మీద వెటకారాలాడుతూ పెద్ద జోకర్‌ లాగా ఫీలయ్యే గోపాలం వాళ్ళతో చెబుతున్నాడు ‘‘అసలు ఈ ముసలావిడ ఈ రమణి గారికి అమ్మమ్మ కానేకాదు. ఆ మాటకొస్తే ఆవిడకి ఈవిడకి అసలు ఏ బంధుత్వమూ లేదు. ఈ రోజు వరకూ రమణి గారిని చూసినపుడు ఎక్కడో చూసాను అనుకునేవోణ్ణి కానీ గుర్తుచ్చీది కాదు. ఈవిడని చూడగానే గుర్తొచ్చింది.
నేను ఓ ఏడాది కితం వైజాగ్‌ నుంచి గోదావరి బండికి వస్తున్నాను. బండి తునిలో ఆగింది. అక్కడ ఓ కుర్రోడు ఈ ముసలావిడని ట్రైన్‌ ఎక్కించి చేతిలో టిక్కెట్టెట్టి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ అబ్బాయి ఏ వాటర్‌ బాటిలో తేడానికెళ్లాడేమో అనుకున్నాను. ఇంతలో బండి కదిలి పోయింది. అయ్యో ఆ కుర్రోడు బండి ఎక్కలేదని కంగారుపడ్డాను. ఇంతలో టి.సి వచ్చి అందరి టిక్కట్లు చెక్‌ చేస్తున్నాడు. ఈ పెద్దావిడ దగ్గరకొచ్చి టికట్‌ అడిగితే ఆవిడ చేతిలో ఉన్న టిక్కట్టిచ్చింది.

          అది చూసిన టి.సి ‘‘మామ్మా! ఇది టిక్కట్టు కాదు వేరే ఉంటాది చూడు’’ అన్నాడు.
మామ్మకి వినిపించక అలాగే చూస్తా ఉంది.

          ఇంతలో పక్కన కూర్చున్న కాలేజి అమ్మాయి ‘‘బామ్మా టిక్కెట్‌ ఎక్కడుందని అడుగుతున్నారు’’ అంటూ గట్టిగా చెప్పింది. ఆ పెద్దావిడ ‘‘మా మనవడు ఇదే కొనిచ్చాడు’’ అంటూ ఆమె చేతిలో ఉన్న ప్లాట్‌ఫాం టిక్కెట్‌ చూపించింది. దానికి టి.సి ‘‘నువ్వెక్కడికెళ్ళాలి? నీతో ఎవరూ రాలేదా?’’ అంటూ అరుస్తున్నాడు. దానికి ఆవిడ ‘‘హైద్రాబాద్‌ ఎల్లాలి బాబూ! నేనొక్కదాన్నే ఎల్తన్నాను. హైద్రాబాద్‌లో దిగాక ఈ నెంబర్‌కి ఫోన్‌ చేత్తే మా చిన్నోడొత్తాడు’’ అంటూ చెంగు చివరన ముడి విప్పి కాగితం మీద రాసిన ఫోన్‌ నెంబర్‌ చూపించింది.

          ‘‘మామ్మా నువ్వు వచ్చే స్టేషన్‌లో దిగిపో! టికెట్‌ లేదు నీకూడా మనిషి లేడు. బండిలో ఉంటే కుదరదు’’ అంటూ పెద్దపెద్దగా కేకలేస్తున్నాడు. కాలేజీ అమ్మాయి ‘‘బామ్మా ఆ నెంబర్‌ ఇలాగివ్వు’’ అని తీసుకుని ఫోన్‌ చేసి ‘‘సార్‌ ఓ పెద్దావిడ తునిలో ఎక్కింది. హైద్రాబాద్‌ వస్తుంది. పొద్దుట వచ్చి తీసుకెళ్లండి’’ అని చెప్పింది.

          దానికి అతను ‘‘ఆ ముసలిదాన్ని మొన్నటి వరకూ మేమే చూసాం ఈ ఆరు నెలలు వాళ్ళ పెద్దబ్బాయి చూడాలి. అతను తునిలో ఉంటాడు. అతని నెంబర్‌ పెడతాను. అతనికి చెప్పి ఆ ముసలావిడని తీసుకెళ్ళమనండి. నా దగ్గరకొచ్చినా నేను తీసుకెళ్ళను’’ అని ఖరాఖండిగా చెప్పేసాడు.

          ఇది విన్న అందరూ ఆ పెద్దావిడ మీద జాలి పడ్డారు. హైద్రాబాద్‌ అతనిచ్చిన నెంబర్‌కి కాల్‌ చేసింది. అవతలి నుంచి పెద్దావిడ పెద్దకొడుకు ఫోనెత్తి ‘‘అమ్మా ఆవిడ మా అమ్మే కానీ నేను చూడాల్సిన వంతు అయిపోయింది. ఇప్పుడు చిన్న కొడుకు చూడాలి అందుకే అక్కడికి పంపిస్తున్నాం’’ అన్నాడు.

          ఇదంతా ఏమీ అర్ధం కాక ఆ పెద్దావిడ వెర్రిచూపులు చూస్తుంది. ఆ పెద్దావిడకి విషయం చెబితే ‘‘అయ్యో నా కొడుకు నన్ను చూత్తాడమ్మా హైద్రాబాదు ఎల్తాను’’ అంటూ అమాయకంగా మాట్లాడుతుంది. మా బోగీ అంతా కూడా ఇదే విషయం మాట్లాడు కుంటున్నారు.

          బయటికొస్తే అందరూ మంచివాళ్ళే ఇంట్లో ఎలా ఉన్నా! ఆ పెద్దావిడ మీద ప్రేమ కురిపిస్తూ ఆవిడ పిల్లల్ని తిడుతున్నారు అందరూ! బహుసా అందులో వాళ్ళ ఇంటిలో ఇలాంటి పెద్దవాళ్ళకి తిండి పెట్టనోళ్ళు ఓల్డేజ్‌ హోమ్‌లలో వదిలేసినోళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. అక్కడున్న అందరూ ఆవిడ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. కానీ ఎవరూ ఆ పెద్దావిడకి టీ ఇప్పించిన వాళ్ళు కానీ క్రింద కూర్చున్న ఆవిడని లేపి చోటిచ్చి పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళు కానీ ఎవరూ లేరు.

          ఇదంతా జరుగుతుంటే నా ఎదురుగా కూర్చున్న ఒకావిడ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇంగ్లీషు పేపర్‌ చదువు కుంటుంది. పేపర్‌ వల్ల ఆవిడ ముఖం కనిపించట్లేదు. సహజంగా ఉండే చపలత వల్ల ఆవిడని చూడటానికి నా పక్కన కూర్చున్న కుర్రోడు ప్రయత్నించినా కనబడట్లేదు.

          బండి సామర్లకోట వస్తుందనగా టి.సి వచ్చి ‘‘మామ్మా! వచ్చే స్టేషన్‌లో దిగిపోవాలి. నీ మూట తీసుకో’’ అంటూ అరుస్తున్నాడు.

          అప్పటి వరకూ పేపర్‌ చదివిన ఆవిడ పేపర్‌ పక్కన పెట్టి టి.సి.తో ‘‘సార్‌ ఆవిడకి టిక్కెట్‌ నేను తీస్తాను దించకండి’’ అంటూ పర్సులోంచి డబ్బులు తీసిచ్చింది. అప్పుడు చూసాను ఆవిడని. ఆవిడ గొంతే కాదు మొఖం కూడా మగాడి లక్షణాలతో ఉన్న ఆడ మనిషిలా ఉంది. చూడగానే చిరాకేసింది. ఆవిడ లేచి ఆ పెద్దావిడని లేపి తన దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘బామ్మా మీ వాళ్ళు నిన్ను నా దగ్గర ఉంచమన్నారు. మీ చిన్నబ్బాయి వచ్చి తీసుకెళ్తానన్నాడు. మనం రాజమండ్రిలో దిగి కారులో అమలాపురం వెళ్దాం అంది. దానికి ఆ పెద్దావిడ సరేనంది. ఆ పెద్దావిడకి తుని నుంచి రాజమండ్రి వరకూ ఫైన్‌తో సహా టికెట్‌ తీసింది ఆ హిజ్రా. ఆవిడే ఈ రమణి’’ అని చెప్పాడు గోపాలం.

          అది గుర్తురావటంతో గోపాలానికి రమణి మీద ఎక్కడలేని గౌరవం పుట్టుకొచ్చింది. ఇదంతా వింటున్న కావ్య అవును అందుకే బామ్మ గుర్తొచ్చినప్పుడల్లా ‘‘అమ్మా చిన్నోడెప్పుడొత్తాడు అని అడిగేది.’’ మీరంతా అక్కని చూసి విడ్డూరంగా మాట్లాడు కుంటున్నారు. కానీ నిజం తెలిస్తే ఇలాంటి మనుషులుంటారా అనిపిస్తుంది.
అక్క వాళ్ళ సొంతూరు కోరుమిల్లి. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. ఆ ఊరిలో వాళ్ళదే పై చేయి. అలాంటి కుటుంబంలో అక్క హిజ్రాలా పుట్టటం ఆ కుటుంబానికి అవమానంగా తోచింది. ఇప్పుడున్న హిజ్రాలలో వందలో ఒకరు మాత్రమే పుట్టుకతోనే హిజ్రాగా పుడతారట. మిగిలిన వాళ్ళంతా బలవంతంగా మార్చబడిన వాళ్ళేనట. అలాంటిది ఆ శాపం పాపం తనకే ఎందుకు వచ్చిందో!

          తన డిగ్రీ పూర్తయ్యేసరికి ఊళ్ళో వాళ్ళ గుసగుసలు అవమానాలు ఇంట్లో వాళ్ళని కూడా శత్రువులుగా మార్చాయి. వాళ్ళ అన్నయ్య స్నేహితులు చేసే కామెంట్లు భరించ లేక ఓ రోజు అతను సూసైడ్‌ అటెంప్ట్‌ చేసాడట. అది చూసి తట్టుకోలేక అక్క ఇంట్లోంచి పారిపోయి హైద్రాబాద్‌ అమీర్‌పేటలో కస్తూరిబాయి వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తూ గ్రూప్స్‌ ప్రిపేరయ్యేది. అప్పుడే నాకూ తను పరిచయమైంది. తను గ్రూప్స్‌ రాస్తున్న రోజుల్లో నేను శంకర్‌ అనే వాడి మీద పీకల్లోతు ప్రేమతో ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. వాడు మోసం చేస్తే ఆత్మహత్య చేసుకోబోయిన నన్ను చేరదీసి చదివిస్తోంది నాలుగేళ్ళుగా!

          అలాగే మా హాస్టల్‌లో వాచ్‌మన్‌ ఏక్సిడెంట్‌లో చనిపోతే ఎవరూ లేని అతని భార్యని తీసుకొచ్చి తల్లిని చేసుకుని పెంచుతుంది.

          తనకి ఫస్ట్‌ పోస్టింగొచ్చిన ముమ్మిడివరం ఎమ్‌.ఆర్‌.ఓ ఆఫీసులో పనిచేసే గుమస్తా, అతని భార్య ఎయిడ్స్‌తో చనిపోతే వాళ్ళ పాపని తీసుకొచ్చి పెంచుతుంది. ఆ పాపే ఈ చిన్ని.

          అక్కకి దేవుడిచ్చిన బంధాలన్నీ అవమానించి అవతలకి విసిరేస్తే తాను ఏర్పరచుకున్న బంధాలతో అనుబంధం పెంచుకుంది. ఎవరూ లేని మాకు అన్నీ తానై, తనకి అంతా మేమై బతుకుతుంది అని చెబుతూ చున్నీతో కన్నీళ్ళు తుడుచుకుంది కావ్య!

          ఆ రోజు నుంచి ఈ విషయాలు తెల్సిన వాళ్ళెవరూ రమణిని హిజ్రాలాగా వేరుగా చూడట్లేదు. వాళ్ళందరికీ కుటుంబ పెద్దలాగా! ఆత్మీయురాలిలాగా చూస్తున్నారు.
ఏ కార్యక్రమం చేసుకున్నా రమణికి మొదటి కబురు రావాల్సిందే! ఆవిడ తర్వాతే ఇంకెవరైనా! ఇప్పుడు ఆమెకు ఆ వీధంతా ఆత్మీయులే!

          మనుషులలో ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తారు. చూడటానికి చాలా సామాన్యంగా ఉన్నా హిమాలయమంత ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవిస్తారు. ఇప్పటి వరకూ పేరు పెట్టలేని ఈ కథకి మీరైతే ఏ పేరు పెడతారు?

*****

Please follow and like us:

2 thoughts on “ఓ పేరు లేని కథ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో ప్రత్యేక బహుమతి రూ.750/- పొందిన కథ)”

  1. మీ కథకు పెరులేక పోయినా మంచి విషయం,గొప్ప కథనం వున్నాయి. వస్తువు విభిన్నమైనది. ఇక కథ మొదటినుండి చివరివరకు వూహించని మలుపులు. మీరు మరిన్ని గొప్ప కథలు రాయాలని అభిలాష

    1. సర్ కథ చదివినందుకు ధన్యవాదాలు .మంచి సమీక్ష అందించారు . మీవంటి సాహితీవేత్తలు సాహిత్యాభిమానుల సలహా సూచనలతో నన్ను నేను మెరుగు పరుచుకుంటాను సర్

Leave a Reply

Your email address will not be published.