వేకువలో చీకటిలో

-తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం

          ” నీకు బొత్తిగా బాధ్యత తెలియడం లేదు. ఎన్ని సార్లు చెప్పాను అంతంత అన్నం పారేయవద్దు అని” పొద్దున్నే భార్య మీద విరుచుకు పడ్డాడు సత్యం.
పనిమనిషికి వేసిన గిన్నెలలొ ఒక గిన్నె నిండా అన్నం కనబడడం తో ఒళ్ళు మండి పోయింది అతనికి..

          “రాత్రి మీరు మామూలుగా భోజనం చేస్తారు అనుకుని వంట చేసాను. తీరా చూస్తే మీరు కడుపులో బాగాలేదు అన్నం వద్దు అని మజ్జిగ తాగి పడుకున్నారు. అందుకే ఆ కాస్త మిగిలింది. నేనేమీ రోజూ వృధాగా పారబోయడం లేదు ” నెమ్మదిగా అంది శాంత .

          భార్య జవాబుతో మరింతగా రెచ్చి పోయాడు సత్యం.

          “అంటే తప్పంతా నాదే అంటావు, అనవూ?ఏనాడైనా పది రూపాయలు సంపాదించి వుంటే డబ్బు విలువ తెలిసేది. కష్టపడి పనిచేసి, వచ్చిన జీతం నీ చేతులలో పోసాను ఇన్నాళ్లు. ఇప్పుడు పింఛను మీద బతకాలే అన్న జాగ్రత్త వుంటే కాదూ నీకు? ” చేతిలోని పేపరును విసిరి కొడుతూ అరిచాడు.

          ఇంటి బయట నీళ్ళు జల్లి, ముగ్గు వేసి లోపలికి వస్తున్న రంగమ్మను చూడగానే శాంత గొంతు తగ్గించి అంది ” అరవకండి. వారానికో పది రోజులకో ఒకసారి అన్నం మిగులుతుంది. రంగమ్మ మంచిది కాబట్టి ఎప్పుడూ వట్టి గిన్నెలే వేసినా ఏమీ అనదు. మీ మాటలు వింటే అసహ్యంగా ఉంటుంది .”

          సత్యం చరాలున లేచి చెప్పులు తొడుక్కుని బయటకు వెళ్ళి పోయాడు. శాంత అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడి పోయింది.

          ” ఏమిటో ఈ మనిషి ? పదవీ విరమణ తరువాత పని లేకనో, తోచకనో ప్రతి చిన్న విషయానికి కసురు కోవడం విసుక్కోవడం. అవును తనకు పెద్ద చదువు లేదు కనుక ఉద్యోగం చేయలేకపోయింది. మరి ఇన్నేళ్ళు గా తను ఈ ఇంట్లో చేసిన చాకిరీకి విలువ లేదా? టిఫీను, వంట, బట్టలు వుతకడము, ఇల్లు సర్దడము, పిల్లలను సాకడం ఇవన్ని మరొకచోట చేస్తే తనకు జీతం వచ్చేది. పది రూపాయలు సంపాదించ లేని దానివి అని ఎంత చులకనచేసారు. ” కళ్ళలో నీళ్ళుతిరిగాయి ఆమెకు. రంగమ్మ కంట పడకూడదు అని పని ఉన్నట్టు గదిలోకి వెళ్లిపోయింది .

          సత్యమూర్తి శాంతల పెళ్లి అయి ముప్పై అయిదేళ్ళు. పిల్లలు ఇద్దరికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తమ సరదాలను పక్కన పెట్టి పొదుపుగా సంసారం నడుపుకు వచ్చారు. నగలు, చీరలు, ఆడంబరాలు లేవని ఎన్నడు భర్త మీద విసుక్కోలేదు శాంత.
పిల్లలు బుద్ధిగా చదువుకున్నారు. కూతురు రమ్యకు తమ తాహతుకు తగిన సంబంధం చూసి పెళ్లి చేసారు.
కొడుకు ఉద్యోగంలో చేరాక నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు. కానీ అనుకోనిది జరగడమే జీవితం అన్నట్టు కొడుకు సుధాకర్ అన్య మతం పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. అప్పటికే రిటైరు అయిన సత్యమూర్తి ఆరోగ్యం ఈ సంఘటనతో దెబ్బతిన్నది. హై బి పి తో ఒక రోజు పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. బి. పి కి తోడు సుగర్ కూడా ఉన్నట్టు పరీక్షలలోతేలింది.

          విషయం తెలిసి తండ్రిని చూడడానికి వచ్చాడు సుధాకర్. కొడుకును చూడగానే ఆవేశంతో సత్యమూర్తికి బి పి మరింత పెరిగిపోయింది. కొడుకును సమాధాన పరచి పంపించి వేసింది శాంత.

          రమ్య వచ్చి, తల్లికి సాయంగా పది రోజులు ఉండి, తండ్రి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక వెళ్ళిపోయింది.

          చేతికి అంది వచ్చిన కొడుకు దూరం అయిపోయాడనో, వచ్చే కాస్త పింఛనుతో ఎలా బ్రతకాలి అన్నఅభద్రతా భావంతోనో సత్యమూర్తికి విసుగు, కోపం ఎక్కువ అయ్యాయి .
భర్త మాటలకు నొచ్చుకున్న శాంత ఆ రోజు అతడికి మాత్రం సరిపడా అన్నం వండింది.
గిన్నెలో కొద్దిగా ఉన్న అన్నం చూసి తన కంచం పక్కకు తోసేసాడు సత్యమూర్తి . ” పెళ్లానికి తిండి కూడా పెట్టలేని పరమ దౌర్భాగ్యుడు అని నిరూపించడానికా చాలకుండా వండి పెట్టావు “అంటూ భోజనం చేయకుండా లేచేసాడు. బయటగేటు ధన్ మని పడింది.

          గిన్నెల మీద మూత పెట్టేసి అలా కూర్చుండి పోయింది శాంత. ఇంతలో ఫోను గణ గణ లాడింది. ఉదాసీనంగా తీసింది శాంత. ” హలో అమ్మ భోజనాలు అయ్యాయా ? నాన్న ఎలా ఉన్నారు? అంటూ వినిపించింది రమ్య గొంతు. కూతురు పలకరింపుకు దుఖం ముంచుకు వచ్చింది శాంతకు.

          మీ నాన్నకేం బాగానే ఉన్నారు. నన్ను కాల్చుకు తింటున్నారు అంతే. ఏడాదిగా చూస్తున్నాను ఎప్పుడూ కోపంగా అరవడమే. విసుక్కోవడమే. ఎవరి ఇంట్లో ఈ చాకిరి చేసినా నా జీవితం గడిచిపోతుంది. ఇటు వంటి బ్రతుకు ఎవరికి వద్దు. ” అంటూ ఇక మాట్లాడ లేక ఫోను పెట్టేసింది శాంత.

          నాలుగు రోజులు కాస్త ప్రశాంతంగా గడిచాయి. ఆ రోజు తల నొప్పిగా ఉండడం వలన మాత్ర వేసుకుని మధ్యాహ్నం నిద్ర పోయింది శాంత. రోజూ నాలుగు గంటల కల్లా మొగుడికి కాఫీ అందించేదల్లా అయిదు వరకు లేవలేదు. అప్పుడు హడావుడిగా కాఫీ కలిపి ఇచ్చింది .

          ” నీ మొగుడేమన్నా ఉద్యోగం వెలగబేడుతున్న మహారాజా నువ్వు వేళ తప్పకండా కాఫీలు టీఫిన్లు అందించడానికి? రిటైర్ అయి ఇంట్లో కూర్చున్న వాడు పనివాడి కన్నా లోకువ .” కాఫీ గ్లాసు విసురుగా తీసుకుని మాటల బాణాలు విసిరాడు.

          ఒక్క రోజు గంట ఆలస్యం అయినందుకు ఎంత సాధింపు ? ఎవరు ఇక్కడ పని మనిషి? తానుకాదు రెటైర్ మెంట్ లేని పనిమనిషి ? శాంత రోషంగా అనుకుంది .
” ఎంత కాలం ఈ కోపాలు, అరుపులు సహించడం? ఏదో ఒకటి చేయాలి . పొద్దున్న లేచింది మొదలు కూర్చున్న చోటికి అన్నీ అందిస్తున్నా ఏదో తక్కువ చేసినట్టు కోపము, చిరాకు. నా తమ్ముడు, నా చెల్లెలు అంటాడు గాని ఎవరూ ఒక పూట వచ్చి ఆదుకోరు . నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతే తెలుస్తుంది . ” మౌనం గా నిలబడిన శాంత మనసులో తిరుగుబాటు తల ఎత్తింది .

          అక్కడే ఉంటే ఏం మాట్లాడుతుందో అని పడక గదిలోకి వచ్చి బీరువాలోని బట్టలు లాగి, మడతపెట్టడం మొదలు పెట్టింది.

          వెనకాలే లోపలికి వచ్చాడు సత్యం. ” ఎక్కడికి వెళ్ళాలని బట్టలు సర్దుతున్నావు ? కూతురు ” ఏదో మా బతుకు మేము బతుకు తున్నాము అంటుంది గాని పది రోజులు వచ్చి ఉండండి అమ్మా అనదు. ఇక నీ కొడుకు గుమ్మంలోకి అడుగు పెట్టే పని చేశాడా ? మీ అమ్మ పోయాక నీకు పుట్టిల్లులేనట్టే అయ్యింది. ఎక్కడకు పోతావు ? ” గాయ పడిన మనసు మీద కారం చల్లుతున్నట్టు ఉన్నాయి అతని మాటలు .

          “ఎవరి దయ దాక్షిణ్యాలు నాకు అక్కర లేదు. ఎవరి ఇంట్లో నైనా వంట మనిషిగా చేరితే చాలు నా బ్రతుకు గడిచి పోతుంది. ” వెనక్కి తిరిగి మొగుడి కేసి చురుకుగా చూసి అంది.

          ” పౌరుషానికేమీ తక్కువ లేదు. “అనేసి చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళి పోయాడు.

          రిటైర్ అయ్యాక కొత్తగా వచ్చింది ఈ అలవాటు. ఏదైనా మాటా మాటా అనుకుంటే , కొపమొస్తే బయటకు వెళ్ళి పోతాడు. మగ మహారాజు గనుక అలా వెళ్లగలడు. ఇంటి ఇల్లాలు ఎక్కడకు పోతుంది ? అతను తిరిగి వచ్చేదాకా ఆమె గుండెలు దడ దడ లాడుతూ ఉంటాయి.

          ఈ రోజు మాత్రం మనసు గాయపడి ఉన్నదేమో ” పోతే పో నాకేమీ నష్టం లేదు ” అని పైకే అంటూ ధనాలున బీరువా తలుపు మూసింది. ఆ విసురులో బీరువా రహస్య అరలో నుండి తొంగి చూస్తున్న రెండు కవర్లు క్రింద పడ్డాయి.

          కోపంగా వాటిని తీసి మంచం మీదకు విసిరి, హాల్లోకి వెళ్ళి వీధి తలుపు గడియ పెట్టి వచ్చి పరుపు మీద వాలింది శాంత. కళ్ళలో నుండి నీరు కారి చెంపలను తడిపేస్తూ ఉంటే, పక్కకు తిరిగి తలగడకు ముఖం హత్తుకుని కళ్ళు మూసుకుంది. ముఖానికి ఏదో గరుకుగా తగిలి, లేచి చూసింది.

          ఇందాక బీరువా నుండి పడిన కవర్లు తలగడ మీద కనబడ్డాయి. సత్యమూర్తి దస్తూరి చూసి ఉత్తరం చేతిలోకి తీసుకుంది. గుండ్రని ముత్యాల వంటి రాత. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రిందటి తారీకు.

          ” పిల్లల పరీక్ష గురించి నువ్వు బెంగ పెట్టుకోకు శాంతా. వాళ్ళకు కావాలన్నవి వండి పెడుతున్నా. సుధాకర్ కు అప్పడాలు వేయించి పెడితే చాలు పేచీ పెట్టకుండా తినేస్తాడు. చిన్న దానికి చింతకాయ పచ్చడి ఉంటే చాలు. బాగా చదివిస్తున్నాను. సుధాకర్ పదో క్లాసు లో స్కూలు ఫస్ట్వస్తాడు చూడు. పాప చెప్పిన మాట వింటోంది. నువ్వు నిశ్చింతగా మీ అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మీ వదిన చెల్లెలి పెళ్ళికి వెళ్ళింది గనుక అత్తయ్యను దగ్గర ఉండి చూసుకోవలసిన బాధ్యత నీదే. మా గురించి దిగులు పడకు. ఇట్లు సత్యమూర్తి ”

          పిల్లలకు పరీక్షలు దగ్గర పడుతున్నా, అమ్మకు ఒంట్లో బాగాలేదని, వదిన కూడా పుట్టింటికి వెళ్ళిందని తెలియగానే అతనే శాంతకు నచ్చ చెప్పి మరీ పంపించాడు.
ఆ ఉత్తరాన్నీ గుండెకు హత్తుకుంది శాంత .

          ఇంకో ఉత్తరం అతను రాసిందే. మరో రెండేళ్ల తరువాత తారీఖు. అదీ ఇన్‌లాండ్ కవరులో రాసినదే. రంగు మారి పాత కాగితంలా ఉంది. ముత్యాల వంటి దస్తూరి.
“శాంతా! నువ్వు నా జీవితం లోకి వచ్చాక ఇక దేని గురించి దిగులు పడే అవసరంలేదన్న ధీమాను నాకు కలిగించావు. నువ్వు తోడుగా ఉంటే అన్ని సవ్యంగా గడిచి పోతాయన్న నమ్మకం. సుధాకర్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నప్పుడు నేను మీ దగ్గర లేను. నువ్వే వాడికి అమ్మా నాన్నాఅయి చూసుకున్నావు. మా అమ్మకు ఉన్నదున్నట్టు పక్షవాతము వచ్చి పడిపోతే నేను ఇన్‌స్పెక్షన్లో వున్నా ఆమెను ఆస్పత్రి లో చేర్పించి కంటికి రెప్పలా కాచుకున్నావు. నేను దగ్గర లేక పోయినా నువ్వే అన్ని చూసుకుంటావు అన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. నువ్వు పక్కన లేకుంటే నేను ఏమీ లేని వాడిని. చీకటిలో, వేకువలో నువ్వు నాతో వున్నావు వుంటావు అన్నభావమే నాకు బలం. మరో రెండు రోజుల్లో వచ్చేస్తాను. ఇట్లు సత్యం. ”

          ఈయనకు నేనంటే ఎంత ప్రేమ! ఎంత నమ్మకం! అనుకుంటే శాంత కళ్ళలో నీళ్ళు నిండాయి. మనసు శరీరం తేలిక అయిపోయిన భావం.

          ఉద్యోగ విరమణ, శరీరంలోకి కొత్తగా వచ్చి చేరిన షుగర్, బి పి , కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కలసి అతన్ని అతలాకుతలం చేసాయి. ప్రేమ, సహనం, ఆప్యాయత స్థానంలో కోపము, చిరాకు, విసుగు వచ్చి చేరాయి పాపం. ‘ మొగుడి మీది ప్రేమతో శాంత గుండె నిండిపోయింది.

          వీధి తలుపు చప్పుడు అయ్యింది. గభాలున లేచి, ఉత్తరాలు పరుపు క్రింద దాచేసి, కొంగుతో ముఖం తుడుచుకుని, వెళ్ళి తలుపు తీసింది.

          స్కూటర్ ఆగిపోతే తోసుకు వచ్చినట్టున్నాడు ఆయాస పడుతున్నాడు సత్యం. పరిగెత్తినట్టే వంటింటిలోకి వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఫాను వేసి, టి. వి పెట్టింది. వేడిగా కాఫీ అందించింది. భోజనం సగంలో వెళ్ళి పోయాడేమో ఆకలితో ముఖం వాడి పోయింది. లోపలికి వెళ్ళి పదినిముషాలలో ఉప్మా చేసి తీసుకు వచ్చి అందించింది. ” ఇవాళ శనివారం కదా ” అంటూ.

          మాట్లాడకుండా స్పూన్ తో ఉప్మా తీసి నోట్లో పెట్టుకున్నాడు. బి. పి. షుగర్ మాత్రలు పక్కన పెట్టింది. నెరిసి పోయిన పల్చని క్రాపు, కాస్త వంగిన భుజాలు, అరవై అయిదేళ్ళ సత్యం ఆమెకు ఆడి, ఆడి, అలసి పోయిన పసివాడిలా కనిపించాడు.

          చిన్న ఇల్లు, చిన్న టి. వి, డొక్కు స్కూటర్ అన్నీ అందంగా ఆనందంగా అనిపిస్తున్నాయి. అతను టి. వి. వైపు చూస్తూ తింటుంటే ఆమె అతని వైపు చూస్తోంది.
సుధాకర్ తొందరలో వంశాంకురాన్ని అందిస్తే, కొడుకును దగ్గరకు తీసుకుంటాడు. అనుకుంది మురిపంగా.

          ఆమె కన్నుల నిండా కరుణ, చూపులలో ప్రేమ వెలుగు, రెప్పల తడిలో పశ్చాతాపం
అతనికి పొలమారి దగ్గు వచ్చింది. మంచినీళ్ల గ్లాసు నోటికి అందించింది శాంత. ఒక్క గుటక వేసి భార్య వైపు చూసి నవ్వాడు చిన్నగా.

          శాంత పెదవులు విచ్చుకున్నాయి. వేకువలో, చీకటి లో నీతోనే నేను అన్నట్టు అతని చేతి మీద చేయి వేసింది.

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.