పేషంట్ చెప్పే కథలు – 9
విరిగిన కెరటం
–ఆలూరి విజయలక్ష్మి
తెల్లమబ్బులు, నీలిమబ్బులు కబాడీ ఆడుతున్నాయి. ఎంపైరింగ్ చేస్తున్న సంధ్య ఒంటరిగా, దీనంగా కూర్చున్న లేత రోజా రంగు మబ్బు వంక జాలిగా చూసింది.
పిల్లల్లంతా అరుస్తూ, కొట్టుకుంటూ, నవ్వుతూ కేరింతలుకొడుతూ ఆడుకుంటున్నారు. ఒకవైపు కోకో, ఒకవైపు గోళీలు, మరో వైపు క్రికెట్, ఇంకోవైపు లాంగ్ జంప్, హైజంప్. ఉత్సాహం వెల్లువై ప్రవహిస్తూంది మైదానమంతా.
ఈ ఉరవడిని ఉత్సుకంగా గమనిస్తున్నాయి రెండు కళ్ళు, నర్సింగ్ హోమ్ వరండాలో నిలబడి అటే చూస్తున్నాడు గోపి. లోతుకుపోయిన అతని కళ్ళు ఉండుండి తళుక్కు మంటున్నాయి. ఉద్వేగపు కెరటాలు విరిగిపడుతున్నాయతని చిన్నారి గుండెలో. అతని కాళ్ళు వేగంగా పరుగెత్తడానికీ, తన యీడు పిల్లలతో ద్వంద్వ యుద్ధం చెయ్యడానికి తహతహలాడుతున్నాయి. అతని శరీరంలోని ప్రత్యణువు ఆ పిల్లల్లో ఒకడుగా కలిసి మిగతా లోకాన్ని మరిచి హాయిగా ఆనందించడానికి తపించి పోతూంది.
కానీ… ఊహతెచ్చిన ఉద్రేకాన్ని తట్టుకోలేని అతని గుండె గోడలు బలంగా ప్రకంపిస్తున్నాయి. ఉఛ్వాస నిశ్వాసాలు తీవ్రమయ్యాయి. కాళ్ళు శక్తీ లేనట్లు ఊగసాగాయి. చేతులు వాలిపోయాయి. శరీరమంతటా చిరుచెమట అలముకుంది. కోపం, బాధ, దుఃఖం, తనముందున్న మృష్టాన్నాన్ని తినలేని అశక్తత…
“గోపీ!” బయట పిల్లల్నీ, అతన్నీ గమనిస్తున్న శృతి మెత్తగా పిలిచింది. బలవంతాన శక్తిని కూడదీసుకుని వరండా క్రిందకు గెంతబోయిన గోపీ పట్టుబడిని దొంగలా ఆగిపోయాడు.
“పడుకుని ఉండాలని చెప్పాను కదా, ఎక్కడికటు?” ఈ ఒక్కరోజు, ఒక్క పావుగంట, ఇంకెప్పుడూ అడగను.”
ఆశగా అడిగాడు గోపి, లేడిలా తాను పరుగెత్తిన రోజులు, చక చకా చెట్లెక్కి జామకాయలు కోసుకుతిన్న క్షణాలు. గొర్రెపొట్టేళ్ల పై తన స్నేహితులతో తలపడి కొట్లాడిన సమయాలు గుర్తుకొచ్చాయి గోపీకి.
చెమ్మగిల్లిన శృతికళ్ళు గోపీలాంటి లక్షలాది నిర్భాగ్య బాలల్ని అవలోకిస్తున్నాయి. తొలకరి జల్లులో హాసిస్తున్న ఇంద్రధనుస్సులా, వెన్నెల చాందినీ పై పారాడుతున్న తుషార బిందువులా ఆహ్లాదంగా గడిచి పోవలసిన వారి బాల్యం ఒక భయంకరమైన స్వప్నంలా మారుతూంది. సరదాగా, హుషారుగా, ఈ లోకంలోని కష్టాల్ని, పళ్ళాలనీ గమనించకుండా ‘కొండల్ని పిండిచేస్తాం’ అన్నంత ధీమాగా ఉండవలసిన పిల్లలు ఈ ‘రుమాటిక్ హార్ట్ డీసీజ్’ వల్ల నిస్పృహతో, నిరాశతో, నిస్సత్తువతో కృంగిపోతున్నారు.
అనారోగ్యపు పొరల్ని ఛేదించుకొని రెక్కలు విప్పుకున్న శ్వేత కపోతంలా ఎగిరిపోవాలనే గోపి ఆరాటాన్ని చూస్తుంటే కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ భానో, ఆయన యూనిట్ లో తాను హౌస్ సర్జన్ గా పనిచేస్తున్నప్పటి ఓ సంఘటణ గుర్తుకొచ్చింది శృతికి. “ఇన్నాళ్ల నుంచీ ఎందుకు తీసుకురావడంలేదీ అమ్మాయిని? ఎప్పటికప్పుడు చెకప్ కి తీసుకొచ్చి మందులు వాడితేనేగాని జబ్బు తగ్గదని చెప్పానుకదా?! మళ్ళీ ముంచుకు వచ్చాక తీసుకొచ్చారు” ఓ.పీ.లో డాక్టర్ భానోజీ ఎదురుగా కూర్చుని మరో పేషెంట్ వివరాలు వ్రాస్తున్న శృతి తలెత్తి ఆ అమ్మాయి వంక చూసింది. అర్భకంగా, అమాయకంగా ఉన్న ఆ అమ్మాయి బేలగా చూస్తూంది.
“ఏం చెయ్యమంటారయ్యా? హాస్పిటల్ కి రావాలంటే ఒకరోజు పని సున్నా. మాపటేలకు నాలుగు డబ్బులు తేస్తేగాని కడుపునిండని బతుకులు” విచారంగా చెప్పాడా పిల్ల తండ్రి. ఈ కటువైన వాస్తవం డాక్టర్ భానోకి తెలుసు. అతను పైకి చెప్పని మరో కారణం కూడా డాక్టర్ కి తెలుసు. గుండెజబ్బుల డాక్టర్ గారి దగ్గరకు పిల్లను పదిసార్లు తీసుకెళితే జబ్బు సంగతి అందరికీ తెలిసి పిల్లకు పెళ్ళవ్వదేమోనని భయం.
“గచ్చాకు, పుచ్చాకు వైద్యంతో కొంతకాలం, డాక్టర్ కు చూపించకుండా మెడికల్ షాపులో తెచ్చుకున్న బిళ్ళలు వాడి కొంతకాలం జరిపేసారు. తరువాత డాక్టర్ దగ్గరకు వెళ్ళినా అతను వ్రాసిన మందులు ఫుల్ కోర్స్ వాడలేదు. గొంతునొప్పి, జ్వరంతో మొదలయిన వ్యాధి గుండెజబ్బుగా మారాక ఇక్కడకు వచ్చారు. యిక్కడ పూర్తి ట్రీట్మెంట్ తీసుకోవడానికి, ఎప్పటికప్పుడు చెకప్స్ కి రావడానికి ఎన్నో వ్యక్తిగతమైన, సాంఘికమైన అవరోధాలు.” ఈ వ్యాధికి ఎరవుతున్న పిల్లల్ని గురించి చెప్తున్నా డాక్టర్ బానో కళ్ళల్లో ఆందోళన, ఆవేదన కదిలింది. శాస్త్రపరిశోధనకు, వృత్తికి అంకితమై విజ్ఞాన జ్యోతిలా భాసించే డాక్టర్ భానో దగ్గర పనిచేయడం ఓక గొప్ప అవకాశంగా భావిస్తున్న హౌస్ సర్జన్లు ముగ్గురూ తమ మనసులోని సందేహాలు బయలు పెట్టారు. తమ సందేహాల్ని తీరుస్తూ ఆయన చెప్పింది గుర్తుకొచ్చి శృతి గుండె భారంగా అయింది.
“దయనీయమైన విషయమేమంటే ఉత్పత్తి కార్యక్రమాల్లో చురుగ్గా తమవంతు పాత్రను నిర్వహించాల్సిన లక్షలాది యువతీయువకులు తమ జీవితంలో ఏ సుఖానికీ, సంతోషానికీ నోచుకోని దురదృష్టవంతులవడమే కాకుండా కుటుంబానికీ, దేశానికీ భారంగా తయారవుతున్నారు. బ్రతుకు అందించే ఎన్నో ఆనందాల్నించి వంచితులవుతున్నారు. దాంపత్య జీవితం గడపడానికీ, గర్భవతి అవడానికి అర్హతలేని ఇలాంటి పిల్లల్ని చూస్తుంటే ఎలా ఈ భయంకరమైన సమస్య పరిష్కరింపబడుతుంది అన్న ఆవేదన కలుగుతుంది. రోజురోజుకూ అస్తవ్యస్తంగా తయారవుతున్న దేశ పరిస్థితుల్ని గమనిస్తూంటే, అత్యంత వేగంగా పెరిగిపోతున్న దారిద్యాన్ని చూస్తూంటే ఇప్పట్లో ఈ సమస్య పరిష్కరింప బడదేమోనన్న నిరాశ ఆవరిస్తుంది.” డాక్టర్ భానో మంద్ర గంభీర స్వరం వినిపిస్తున్న భావన కలిగింది శృతికి.
“ఇక్కడున్నావంటరా? నీ కోసం ఇందాకటి నుంచి వార్డఅంతా వెతుకుతున్నాను, రా, పడుకుందువుగాని” గోపి తల్లి కంఠం వినిపించి స్వప్నం నుంచి బయటపడింది శృతి.
“వదులు నేనాడుకోవాలి… చచ్చిపోతే చచ్చిపోతాను… హాయిగా ఆడుకుని మరీ చచ్చిపోతాను… ఎప్పుడూ పడుకో పడుకో, ఈ మాట వినీ వినీ విసుగెత్తిపోయింది నాకు. పడుకుని, పడుకుని పిచ్చెక్కి పోతూంది. ఆ వార్డునీ, మంచాన్ని చూస్తుంటే పెట్రోల్ పోసి తగలబెట్టాలనిపిస్తోంది. నేనింక పడుకోలేను. వదులు నన్ను.” ఉద్రేకంగా అరుస్తూ, గింజుకుంటూ తల్లి పట్టును విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు గోపి.
“గోపీ!” గోపీ భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కుంది శృతి. ఆమె స్పర్శతో అతని ఉద్రేకం నెమ్మదిగా చల్లబడసాగింది.
“నీ జబ్బు నయమవ్వాలని నీకుందా లేదా చెప్పు? నీ ఆరోగ్యం బాగుపడ్డాక చక్కగా ఆడుకుందువుగాని, ఇప్పుడు లోపలకు వేళ్ళు. రెస్ట్ తీసుకో.” మృదువుగా శాసించింది శృతి. రెక్కలు తెగిపడిన పక్షిలా, కాళ్ళు నరకపడ్డ కుందేలు పిల్లలా శృతి వంక చూసాడు గోపీ.
*****
డా.ఆలూరి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి, వైద్యులు, సంఘసేవకులు. దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించారు. అనువాదాలు కూడా చేసారు. వీరి రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ‘ఆరోగ్య విజయాలు’ అనే శీర్షికను నిర్వహించారు.