ఓసారి ఆలోచిస్తే-3
అనురాగ స్పర్శ
-డి.వి.రమణి
బాల్కనీలో నిలబడి మార్నింగ్ వాక్ కి వోచ్చేవారిని గమనిస్తూ ఉండటం అలవాటు, కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాను. రకరకాలుగా వాళ్ళ మాటలు ఉంటాయి. పనిమనుషులతో ఇబ్బందులు , పిల్లల మీద , భర్త మీద చెప్పుకుంటూ నడుస్తూ ఉంటారు…
ఒక్కడినే ఉంటూ ఉంటాను, కాబట్టి నా మీద, అరిచే వాళ్ళు, నా కోసం చూసేవాళ్ళు, తినాలి అనుకునే వాళ్ళు ఉండరు. ఒక కుక్నిపెట్టుకున్నాను, కానీ, వాళ్ళ వంట నచ్చక
మాన్పించేసాను, టిఫిన్ సెంటర్ వాడి పుణ్యమా అని పస్తుల్లేవు, అభిమానం గా
మాట్లాడతాడు. నా కోసం ఇడ్లీలు సాంబారు, రోటి కూర, దోశ , పొంగల్ ఎదో ఒకటి
ఉంచుతూ ఉంటాడు, ఫోన్ చేసి అడిగి తెచ్చి ఇస్తూ ఉంటాడు.
చిట్టిబాబు పిలుస్తాడు, తమ్ముడు కాబట్టి , మరదలు మర్యాదగా అన్ని వండి పెడుతుంది. ఇద్దరు ఉద్యోగస్తులు, అన్ని ఎక్కువ శాతం బయట నించి వొస్తూ ఉంటాయి. ఓక కప్ టీ లేదా కాఫీ తాగి వోచేస్తాడు, ఇద్దరు పిల్లలని చక్కగా పలకరించి, వాళ్ళతో కాసేపు గడిపి వొచ్చేస్తాను మళ్ళి నేను నా ఒంటరితనం “ మై ఔర్ మేర తన్హాయి … “ అనుకుంటూ …
ఏమిటో వెళ్లెవరకూ వెళ్లాలని పీకుతుంది వెళ్ళాక , ఒక అరగంట కన్నా కూచోలేడు. పిల్లలకి స్టేషనరీ నించి బుక్స్ పెన్ సెట్ కొన్ని పళ్ళు స్వీట్స్ తీసుకుని వెళ్తాడు. అక్కడకి వెళ్ళగానే జానకి జ్ఞాపకం మనసుని తాకుతుంది. ఎక్కువ సేపు ఉండలేక వొచ్చేస్తాడు.
“ ఎందుకు అన్న ఇవన్నీ? నువ్వు నా దగ్గరే ఉండచ్చు కదా! ఒక్కడివి ఏమి ఉంటావ్ నేను
చూసుకుంటాను గా “ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడు కానీ తనే వెళ్ళలేడు”
కానీలేరా, రిటైర్ అయ్యాక ఉంటాలే “ అని సున్నితంగా తిరస్కరిస్తాడు. ఎందుకంటే ‘రాను’ అంటే రమ్మనే అడుగుతారు తీరావొచ్చాక? ఎన్నో లోపాలు కనిపిస్తాయి, కొన్నాళ్ళకి భారమై ఆనక బరువైపోతారు ఎంత మందిని చూడలేదు… మారిన కాలంలో మనం కూడా మారాలి. కాలంతో బాటు లేకపోతే కష్టపడేది మనమే, ఎందుకో జానకి కి మాత్రం ఈ సూత్రం అర్ధం కాలేదు, కొడుకు అవమానం చేసాడన్నట్టు, దుర్యోధనుడి చెల్లెలా కలత పడి జీవితం అంతం చేసుకుంది.
ఎందుకో తెలియని దూరం అందరితో, జానకి వెళ్ళిపోయాక ఏర్పడింది, నా ప్రమేయం లేకుండానే … ఒక నిజం ఏమిటి అంటే… భార్య -భర్తల్లో ఒకరు ముందు వెళ్ళిపోతే మిగిలిపోయిన వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. ముఖ్యంగా మగాడు ఉండలేడు… అన్నది జగమెరిగిన సత్యం. కొంత మంది అదృష్ట వంతులు ప్రాక్టికల్ గా ఆలోచించి వేరే తోడులో గడిపేయగలరు. కానీ నేను ఆ కోవకి రాను కదా ! ఎవరో ఒకరిలో అనురక్తి చూసుకో గల ఓర్పు నేర్పు లేకపోయాయి మరి.
ఒక్కగానొక్క కొడుకు ఎప్పుడో ఆస్ట్రేలియా వెళ్లి పోయాడు, అక్కడే స్థిరపడ్డాడు, టంచన్ గా
నెలకి ఒక సారి కాల్ చేస్తాడు,” అకౌంట్ లో మనీ వేసాను” అని చెప్తాడు,” మీరు
బాగున్నారుగా మేము బాగున్నాము” అంతే అక్కడితో మాటలైపోతాయి , అంతే అంత కంటే వాడు మాత్రం ఏమిచేస్తాడు భార్య చేతిలో కీలుబొమ్మ అయ్యాక!!!! నాకు జాలి వాడ్నిచూస్తే.!
పాపం జానకి వాడికోసం బాధపడి పడి దూరమై వెళ్ళిపోయింది. వాళ్ళ అన్న
కూతుర్ని చేసుకోలేదని, వాళ్ళ అన్నఇంటి మీదకి వచ్చి చాలానే గొడవచేసి రాకపోకలు
మానేసాడు, దాంతో కుంగి పోయింది, మనసుకు గాయం అయింది, మరి కోలుకో లేదు.
అందర్నీ కలవటం మానేసింది, వాళ్ళేమన్నా అంటారేమోనని తనే ముందు ఫీల్ అయి,
ఇంట్లోనే ఉండి పోయేది. ఎంతో రుచిగా వంట చేసేది నాకు కొసరి కొసరి వడ్డించేది, అంతా, ఇష్టంగా తినే వాళ్ళు, వాళ్ళ ఇష్టా అయిష్టాలు గుర్తుపెట్టుకుని మరి, వంట చేసేది. అలాంటిది ఏమీ చెయ్యటం మానేసింది. కూర మాడిపోయేది, పప్పులో అన్ని మర్చిపోయేది, అదేమీ అని అడిగితే జవాబు కూడా ఇచ్చేది కాదు కూరలు డస్టబిన్ లో పడేసి సోఫా లో కూచునేది, నేను ఏ అవకాయో వేసుకుని తినేసే వాణ్ని, తను తినలేదు అని తెల్సు, పిలిచినా రాదు తినదు, ఏమి చెయ్యాలో అర్ధం అయ్యేది కాదు. అంత మూర్ఖం గా ఉంది. దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ లో టీచర్ గా పని చేసేది, చాలా హుషారుగా సరదాగా ఉండేది. ఆ ఉత్సాహం అంతా ఊదేసినట్టు పోయింది, ఎంత నచ్చచెప్పినా, ఎవరు చెప్పిన వినేది కాదు, అలా సోఫాలో గంటలు కూచుని ఉండేది, నేను సమానంగా బాధ పడ్డ, నాకు ఆఫీస్ వర్క్ తో నేను వెళ్లి పోయేవాడిని, ఫ్రెండ్స్ బోలెడు మంది, నన్ను నేను డైవర్ట్చేసుకో గలిగాను కానీ., నాకే జానకి బాధ అర్ధం కాలేదు , పైగా కోపం వొచ్చేది. జానకి ని మళ్లించే ప్రయత్నం చాలానే చేశాను, సాంస్కృతిక కార్యక్రమాలకి గాని సినిమాలకి గాని వొచ్చేది కాదు, కార్ తో బాటు డ్రైవర్ ని కూడా ఏర్పాటు చేశాను ఫలితం లేకపోయింది. మొండితనం కాక ఏమిటన్నట్టు?
“అమ్మకి ఇలా ఉందిరా “ అని చెప్తే మంచి డాక్టర్ దగ్గరకి వెళ్ళండి ట్రీట్మెంట్ ఇప్పించండి శ్రద్ధ తీసుకోండి, అని ఉచిత సలహా ఇంకేమి చెప్పగలడు?
వాడు ఆస్ట్రేలియా వెళ్లే ముందు బెంగళూరు లో పని చేసేవాడు, ఆ అమ్మాయి అక్కడనో, ఆస్ట్రేలియాలోనో పరిచయం తెలీదు, నేరుగా పెళ్ళి చేసుకుని వొచ్చేసాడు , గుమ్మంలో ఇద్దర్ని చూసి జానకి షాక్ అయింది, ఏమి అనలేదు. నా వైపు చూసిన ఆ
చూపులో ఉన్నఅర్ధాలు నాకు మాత్రమే తెలిశాయి లక్కీగా ఇంట్లో మా తమ్ముడు చిట్టిబాబు కూతురుంది హారతి ఇచ్చి లోపలి తీసుకు వొచ్చింది. చెయ్యి పట్టుకుని, జానకి చూస్తూ ఉండి పోయింది, వాళ్ళు ఇద్దరు కాళ్ళకి దణ్ణం పెట్టారు. దీవించ లేదు. పక్కకి జరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. నేను మాత్రం దీవించాను.
తాగుతున్న కాఫీ పక్కన పెట్టేసింది, కాఫీతోబాటు జీవితాన్ని కూడా పక్కకి నాకు
అప్పుడు తెలియలేదు, పిలిచినా గాడి తలుపు కూడా తియ్యలేదు వాడి మొహంలోకి
చూడలేదు, ఆ అమ్మాయిని కూడా పలకరించలేదు.
వాడికి నచ్చచెప్పాను, రెండు రోజులు అయితే సర్దుకుంటుందిలే అని, కానీ అసలు
తేరుకోదు అని అనుకోలేదు ఆ కండిషన్ తీవ్రతని మనసు, మేధ గ్రహించనందుకు
ఎప్పుడూ నన్ను నేను తిట్టుకుంటాను.
జానకి లేని లోటు నన్నింతగా పీడిస్తుంది అని తెలీలేదు, రిటైర్ అయ్యేదాకా ఆఫీస్ పనులు ఫ్రెండ్స్ నా లోకం నాకుండి అర్ధం కాలేదేమో ! ఫ్రెండ్స్లో కొందరు మణి కొండ కొండాపూర్ వైపు వెళ్లిపోయారు, కొందరు సొంత ఊర్లకి, కొందరు విదేశాలకి ఇలా విడి పోయాము , కొందరు ఊర్లు తిరుగుతున్నారు ఇలా ఒంటరినైపోయాను. కిందటి నెల్లో ఇంకో బెస్ట్ ఫ్రెండ్ కాలం చేసాడు, దాంతో మరి దిగులు కమ్మేసింది. అది గ్రహించి చిట్టిబాబు వస్తూ సాధ్యమైనంత నాకు టైం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. పార్క్ లోనే నాలుగు అడుగులు వేద్దామని పార్క్ కి వెళ్తున్నాను, పొద్దున్న సాయంత్రం కూడా జానకి జ్ఞాపకాల్లో బతుకుతూ మాట్లాడుకుంటూ నడిచే జంటల్ని చూస్తూ గడిపేస్తున్నాను.
***
ఒక సాయంత్రం 10 ఏళ్ళున్న బాబు పక్కనో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు నా దగ్గరికి వొచ్చి …
“ అంకుల్ బోర్ కొడుతోందా ? నాతో చెస్ ఆడతారా?”
జాలిగా చూస్తూ అడిగాడు, చెస్ అనే మాట విని ఒక యుగం అయిపోయింది.
ముద్దుగా ఉన్న వాడ్ని చూస్తున్నాను, వాడు మల్లి అడిగాడు,” వొచ్చా నాతో గెలవగలరా?”
దర్పంగా అడిగాడు, నవ్వొచ్చింది, “ సరే ఆడదాం , చెస్ బోర్డు, మెన్ లేరుగా ?” ఎలా
అన్నట్టు అడిగాను .
“ మీరు పాండిరా నేను రేపు కలుస్తాను “, అని వాళ్ళ తో అని, “ ఇప్పుడే వొస్తా మీరేళ్ళద్దు మిమ్మల్ని నేను గెలవాలి “ అని తూనిగా లా వెళ్ళిపోయాడు.
వాడు, వాడి మాటలు నవ్వొచ్చాయి , ఇంతలో వాడే పరుగెత్తుకుంటూ వొచ్చేసాడు.
“నీ పేరేమిటి బాబు ?” దగ్గరగా తీసుకుని అడిగాను దగ్గరగా వోచ్చి “ సుందరం అంటారు,
పూర్తి పేరు శ్యాం సుందర్, “ అన్నాడు స్వచంగా మాట్లాడుతున్న వాణ్ని చూస్తుంటే చాలా
ముచ్చటేసేంది. “
ఏమి చదువుతున్నావ్?”
“ 6 వ తరగతి సెక్షన్ బి , నె . 9” గుక్క తిప్పుకోకుండా చెప్పాడు వెంటనే నా మనవడు కూడా ఇంతే ఉంటాడు లా ఉంది అనిపించింది. ఒక్కసారి దిగులు మేఘం కమ్మేసింది, చూపిస్తేగా తెలిసేందుకు, పక్కనుంటేగా ఎలా ఉంటాడో తెలిసేందుకు ….
“ ఎందుకు దిగులు పడుతున్నారు ? భయపడకండి ఓడిపోతారేమోనని నేను నేర్పిస్తా”
అన్నాడు ఆరిందాలా!
ఆ మాటలకి గలగలా నవ్వేసాను , “ మరి ఆడండి “ అంటూ బోర్డు మధ్య పెట్టి చక చక సర్దేసాడు.
“ సరే ఆడి చూద్దాము, కొద్దీగా ఆట తెలుసు అంత బాగా ఏమి రాదు “ అన్నాను, వాడు భరోసా ఇస్తున్నట్టు ,” ఫర్లేదు అంకుల్ మొదట్లో అలాగే ఉంటుంది, క్రమంగా ఆట వొస్తే ఇంటరెస్ట్ దానంతట అదే వొస్తుంది “ అన్నాడు.
వాడిటర్న్ రాగానే పాన్ కింగ్ 4 మూవ్ వేసి దీర్ఘం గా ఆలోచిస్తున్నాడు” వాణ్ని ఆలా
చూస్తుంటే మనసులో తెలియని ఆనందం నిండిపోసాగింది, వాణ్ణే చూస్తూ మూవ్ వెయ్యట్లేదు నా వైపు కొంచెం కోపం గా చూస్తూ ,” మీదే టర్న్ ఆడండి …” విసుగ్గా తల
కొట్టుకున్నాడు.
కావాలని సరిగ్గా ఆడకుండా ఆ పిల్లవాడి చేతిలో ఓడిపోయాను. మొహం దీనంగా
పెట్టాను…. నా వైపు పరిశీలనగా చూస్తూ ,”
కావాలని ఓడిపోయారు కదూ?” అన్నాడు .
వాడి షార్పనెస్ కి అబ్బురపడ్డాను, తర్వాత ఆట కూడా ఓడిపోయాను, ఇంకొకటి అంటూ ఆడుతూనే ఉన్నాడు , తర్వాత 4 మూవ్స్ లో ఆట గెలవగ్గానే వాడు నా వైపు చూసిన చూపు మర్చిపోలేను, దిగ్భ్రమ గా చూస్తుంటే దగ్గరకి తీసుకుని ,” యు ఆర్ టూ
ఇంటెలిజెంట్ అండ్ షార్ప్ “ అని నుదిటిమీద ముద్దు పెట్టుకుని గుండెకి హత్తు కున్నాను.
వాడి స్పర్శ ముద్దు మొహం నాలో ముద్ర వేసాయి.
ఇవేవి పట్టించుకోకుండా అలిగినట్టు చెస్ బోర్డు తీసుకుని వెళ్ళిపోయాడు.
నేను నవ్వుకుని ఇంటికి వొచ్చేసాను, ఆ చిన్న వాడే గుర్తొస్తూ ఉన్నాడు మాగన్ను గా నిద్ర
పట్టేసింది .
తర్వాత రోజు ఆ బాబు రాలేదు, తర్వాత నాకు కొద్దీ రోజులుగా వెళ్ళటానికి కుదరలేదు, నేను చిట్టిబాబు ఉరికెళ్ళి పొలాలు అమ్మేసి ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకు లో వేసేసి, జానకి వాళ్ళ తమ్ముడింటికెళ్లి, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి జానకి నగలు, ఒక లక్ష రూపాయలు ఇచ్చి రావటానికి ఒక వారం పట్టింది కోడలు అలిగి మా ఇంటికి అసలు రాలేదు జానకి నగలు వొద్దు అంది, మా డబ్బు కూడా వొద్దట, మల్లి గతం తాలూకు మంటల సెగ తగిలి ఇంటికి వోచ్చి కూడా మాములు అవలేక పోయాను.
ఆదివారం పార్క్ లో జనాలు తక్కువున్నారు, పల్లీల ప్యాకెట్ కొనుక్కుని ఆ బాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను వస్తాడా? రాడా ! అనుకుంటూ ….
“ హలొ మాస్టర్ గారూ ….” పిలుపు వినిపించి పక్కకి చూసాను ఒక మధ్య వయసు
అతను, పక్కన శ్యాంసుందర్, ఎదో వెతుకుతున్నట్టు నన్నే చూస్తున్నాడు, కొంత సంభ్రమం కొంత ఆశ్చర్యం కొంత సంతోషం తో
“ ఏమి బాబు చెప్పలేదా “ నవ్వుతు శ్యాంని చూస్తూ అన్నాను.
“రామనాధం మాస్టర్ గారే కదు?” నేను మాస్టర్, శేఖర్ ని ఐనవరం వినాయకుని గుడిలో ‘భగవద్గీత ‘ శ్లోకాలు చదివించేవారు …. “ గుర్తు చేస్తూ అన్నాడు.
చల్లని మలయా పావనం లా తాకింది ఆ అనురాగ స్పర్శ “ ఎన్నేళ్లయింది బాబు ఇంకా గుర్తున్నానా?”
“ భలేవారు, మాస్టర్ గారు మీరు చెప్పిన విలువలె నన్ను ఇండియా కి వెనక్కి
తీసుకొచ్చేశాయి, లేట్ చేశాను మాస్టర్ గారు అమ్మ నాన్న ఉన్నప్పుడు రావాల్సింది, వీడు
నా కొడుకే, రండి పక్కనే మా ఇల్లు మిమ్మల్ని చూసి నప్పటినించి మీ గురించే
చెప్తున్నాడు, ఈ రోజు చూపిస్తాను అంటూ తీసుకొచ్చాడు “ అని నా చెయ్యి చొరవగా
తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు పార్క్ నించి పక్కనే ఇల్లు లోపలినించి అతని భార్య వొచ్చి తలుపు తీసింది,
“ నా భార్య రమ్య, రమ్య మా మాస్టర్ గారు నేనెప్పుడూ చెప్తుంటాను చూడు రామనాధం మాస్టర్ గారు “ సంతోషం శేఖర్ గొంతులో.
“ రండి మీ గురించి చాలా చెప్పారు కొత్తగా అసలు అనిపించట్లేదు “ అని సాదరం గా ఆహ్వానించింది రమ్య.
లోపల ఇల్లు విశాలంగా చక్కగా ఉంది పొందికగా సర్ది, భేషజం లేని ఆ దంపతుల్ని
చూడగానే మనసు నిండిపోయింది. ఆ వెంటనే నా కొడుకు ఇందులో ఒక పావు వంతు ప్రేమ చూపించినా జానకి బతికే ఉండేది అనిపించింది ఒక్క క్షణం.
అక్కడనించి పక్క వీధిలోనే నా ఇల్లు. వాళ్ళ ఇంట్లో చాల సేపే ఉన్నాను ఇంకా ఇంటికి బయలుదేరాను నెమ్మదిగా నడుస్తూ… తల్లి తండ్రుల ప్రేమకోసం ఎంత గా బాధ
పడుతున్నాడో శేఖర్ అనిపించింది.
ఇంటికి వెళ్లేసరికి మెట్లమీద కూచుని ఉన్నాడు చిట్టిబాబు, ఇద్దరం లోపలికి వెళ్లి చాలా సేపే మాట్లాడుకున్నాము.
శేఖర్ ఇంటికి తరుచు వెళ్లి బాబు తో, బాబు ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ వాళ్లకి లెక్కలు సైన్స్ ఇంగ్లీష్ చెప్తూ ఉంటె టైం తెలియలేదు
***
పొద్దునే బాల్కనీ లో కూచుని ఉండగా చిట్టిబాబు వొచ్చాడు, “ అరేయ్
రామన్న నీకో విషయం చెప్పాలి మొన్న డాక్టర్కి చూపించుకుంటే, అయన చెప్పినదాన్ని బట్టి నువ్వింక ఒంటరిగా ఉండటానికి ఒప్పుకోను. నేను, శేఖర్ ఒక నిర్ణయానికి వొచ్చాము రా “ అని బలవంతం గా శేఖర్ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇంట్లో రైట్ సైడ్ ఉన్న గది చక్కగా నాకు బెడ్ రూమ్ చేశారు, అందులో నిలువెత్తు జానకి ఫోటో, చూస్తే జానకి నిలబడ్డట్టు ఉంది వరండా లో కుర్చీలు గ్రీన్ బోర్డు పెన్స్ పెట్టారు పిల్లలకి పాఠం చెప్పేందుకు వీలుగా …
చూసి ఆశ్చర్య పోయాను. రమ్య టిఫిన్ ప్లేట్ లో పెట్టి ,” రండి బాబయ్యగారు, మీరు ఇంట్లో ఇలా కనిపిస్తూ తిరుగుతు ఉంటె నాకే చెప్పలేనంత ఆనందం గా ఉందొ, మా శ్యాంకి కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ కి గొప్పగా చెప్తున్నాడు మొహమాట పడకండి, మీ అబ్బాయి పిలిస్తే వెళ్ళరా “ ఎంత మర్యాదగా పిలిచినా ఏ హక్కు తో వెళ్లగలడు? అదే చెప్పాడు, చిట్టిబాబు అన్నాడు ,”ఏముంది అన్నయ్య, ఈ రోజుల్లో కావాలి అనుకున్నవాళ్ళే మన వాళ్ళు దూరం లో ఉండి రాలేని కొడుకులు కూతుర్ల గురించి ఆలోచన వొద్దు. నీకు మనసుకు ఆహ్లాదం గా ఉంటుంది, వీక్ ఎండ్స్ లో మా ఇంటికి రా ఇక్కడ అక్కడ ఉంటూ ఉండు నువ్వు మాతో ఉండాలి అన్నయ్య “
“ మాస్టర్ గారు ఇంకేమి ఆలోచించద్దు మీ ఇంటిని మరమ్మత్ చేసి అద్దెకిద్దాము
ఎందుకంటే అది ఉంటె మీకు బ్రెయిన్ లా జిక్కులు వెతికి ఇబ్బంది పెడుతుంది ప్లీజ్
కాదనకండి … “
శ్యాం పరుగున వొచ్చి నా వొళ్ళు కూర్చున్నాడు, ఇది ఏ నాటి బంధమో ! నన్ను
ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. ఆ అభిమానానికి వశమైపోతున్నా
“ ఇంక అంకుల్ అనను, తాతయ్య అంటాను నీకు ఓకే నా?”
“ సరే” అని తల తిప్పాను.అలా చనువు తీసుకోవటం బాగుంది
“ అసలు గేమ్ కావాలని ఓడిపోకూడదు నన్ను గెలిపించేందుకు, ఆడి గెలవాలి” నా వైపు చూస్తూ తర్జని చూపిస్తూ అన్నాడు….
“ నా వస్తువులు అవి తెచ్చుకోవాలి ఇంకా ….. “ అంటూ ఉంటె చిట్టి బాబు ఆపేసాడు,”
నీకేమి కావాలో నాకు తెల్సు నేను తెస్తాను ఉండు, “ అని తేవటానికి వెళ్ళిపోయాడు ,
రమ్య వంట చెయ్యటానికి లోపలికి వెళ్ళిపోయింది శ్యాం నేను చెస్ ఆడుకున్నాము.
లంచ్ వడ్డించి పిలిచింది రమ్య, రుచిగా చక్కగా వండింది, చాలా రోజుల తర్వాత మంచి
భోజనం తిన్న ఫీల్ వొచ్చింది.
రెస్ట్ తీసుకోమని చెప్తే గదిలోకి వోచ్చాను a.c వేసి ఉండటం తో చల్లగా ఉంది గది, బ్లు ప్రింటెడ్ కర్టెన్స్ వేసి డిం లైట్ లో ఎంత బాగుందో రూమ్, మెత్తటి పక్క మీద పడుకోగానే నిద్ర పట్టేసింది. 4 గంటలకి టీ తెచ్చి లేపే దాకా మెలుకువ రాలేదు.
హాల్లో కి వచ్చి ఆ ఫ్యామిలీ లో నేను ఒకడిగా కూచోటం ఆనందం నింపింది. ఇంతటి అనురాగ స్పర్శ ని వొదులుకుందుకు మనసు రెడీ గా లేదు ఇగో మాత్రం వొద్దు, అని మారం చేస్తోంది. నా అంగీకారం కోసం చూస్తున్న వాళ్లకి ‘సరే “ అన్నాను మనస్ఫూర్తిగా ఉండటానికి సిద్ధమై. జీవితం లో రెండోసారి వచ్చిన ఆనందాన్ని చెయ్యిజార్చుకోలేక, చిట్టిబాబు ఇచ్చిన ధైర్యంతో.
*****
నా పేరు డి.వి.రమణిగా సాహిత్య ప్రపంచానికి పరిచయం. పూర్తి పేరు దర్భా వెంకట రమణి. దర్భా భాస్కరమ్మ, శివకామ సుబ్రహ్మణ్య శాస్త్రి గార్ల రెండో అమ్మాయిని. మా అమ్మగారు మంచి కవయిత్రి, రచయిత్రి. ఆమె అందించిన వారసత్వమే నా సాహిత్య ప్రయాణం.
పుట్టింది నర్సాపురంలో, గోదావరి జిల్లా. పెరిగింది చదువుకున్నది గుంటూరు. బి.హెచ్ స్కూల్ లో. చాలా చిన్నతనంలో వివాహం అయిపోయింది. ఇంటర్ తో ఆపేసిన చదువు. చదువు కోవటమే కలగా తర్వాత చదువు కోవటం జరిగింది.
బి.ఏ. ఓపెన్ యూనివెరైటీతో మొదలు. ఎం.ఏ.హిందీ, ఇంగ్లీష్, లింగ్విస్టిక్స్ లో డిప్లొమా, టీచింగ్ ఇంగ్లీష్ లో డిప్లొమా, ట్రాన్సలేషన్ లో డిప్లొమా, తర్వాత పి.హెచ్.డిలో కొంత వరకు చేసి కొన్ని వ్యక్తిగత కారణాల వాళ్ళ ఆపివేయటం జరిగింది.
మా వారు బ్యాంకులో పనిచేసే వారు. వారే నన్ను చదివించారు. పిల్లలతో బాటు చదువుకుని లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా కొన్ని ఏళ్ళు గడిచాయి…
సాహిత్యం అంటే ఉండే మక్కువతో హిందీ, ఇంగ్లీష్ తెలుగు భాషలలో పాండిత్యం పొందాక రాయటం మొదలు పెట్టాను.
మొదటి కథ “నర్తకి” నవ్య లో పబ్లిష్ అయింది. ఇంచు మించు 20 కధలు పబ్లిష్ అయ్యాయి. వాటిలో – ‘రంజని’వారు నిర్వహించిన కథల పోటీ లో ‘సుందర స్వప్నం’ అనే కధ మొదటి బహుమతి గెలుచుకుంది.