యాత్రాగీతం

బహామాస్ 

-డా||కె.గీత

భాగం-9

బహామాస్ క్రూజ్ (రోజు -3, భాగం-2)

          అక్కణ్ణించి సిడ్నీ పోయిటర్ బ్రిడ్జి మీదుగా నాసోని ఆనుకుని ఉన్న పారడైజ్ ద్వీపంలోని అట్లాంటిస్ (Atlantis) లగ్జరీ  కేసినో & రిసార్ట్ సందర్శనానికి తీసుకెళ్ళేరు. వ్యానులో నుంచి దిగిన మొదటి ప్రదేశం అది కావడంతో పిల్లలు హుషారుగా పరుగులు తీసేరు. ప్రాచీన ఈజిప్ట్ కళాకృతిలో నిర్మించబడిన అధునాతనమైన అతి పెద్ద రిసార్ట్ అది. మధ్య బ్రిడ్జితో కలపబడిన లేత ఇటుక రంగులోని రెండు పెద్ద పెద్ద భవంతులు, 141 ఎకరాల మేర పరుచుకున్న వాటర్ యాక్టివిటీస్ తో నిజంగానే స్వర్గతుల్యమైన ప్రదేశం. రోజుకి దాదాపు అయిదు వందల డాలర్ల పై చిలుకు అద్దెకి గదులు ఉంటాయక్కడ. ఆవరణలో ఎదురుగా అతిపెద్ద ఎగిరే అశ్వాల ఫౌంటెన్ ని దాటుకుని వెళ్ళగానే 

సముద్రపు నీరు లోనికి చొచ్చుకు వస్తున్న పెద్ద వంతెనల వంటి ప్రాకారాల మధ్య నడిస్తే వచ్చే ఠీవి అయిన భవంతి ముఖ ద్వారం. రాజభవంతిలోకి అడుగుపెడుతున్న భావన కలగజేసే భారీ ఎత్తు కుడ్య శిల్పాకృతులు. 

లోపల మాలాగా చూడ్డానికి వచ్చినవాళ్లు, హోటలులో దిగేందుకు వచ్చినవాళ్లతో లాబీ అంతా కోలాహలంగా ఉంది. కూర్చునే కుర్చీలతో సహా మహారాజావారి ఆసనాల్లాగా ఉండడంతో పిల్లలు పోటీలు పడి అన్నిటిలోనూ కూర్చుని లేస్తూ ఫోటోలు తీసుకున్నారు.  

అక్కణ్ణించి ఫోర్ట్ షార్లెట్ (Fort Charlotte) కి వెళ్ళేం. వ్యాను ఆగిన ప్రదేశం నించి కొద్దిగా నడవాల్సి రావడంతో పిల్లలు పేచీ పెట్టేరు.  అది 1787లో నిర్మించబడిన బ్రిటీషు కాలం నాటి చిన్న యుద్ధ స్థావరం. అప్పటి మూడవ కింగ్ జార్జి భార్య పేరిట నిర్మించబడిన ఈ స్థావరమే నాసోలోకెల్లా పెద్దది. ఇది అప్పటి స్పానిషు దురాక్రమణదారుల్ని అడ్డు కోవడానికి నిర్మించిన  యుద్ధ స్థావరాల్లో ఒకటి. బాగా పాతబడిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. లోపల ఒక చిన్న గిఫ్ట్ షాపు,  ఉపరితలం మీద ఫిరంగులు తప్పిస్తే  చూడ్డానికి నిజానికి అక్కడ ఏమీ లేదు. వాహనాలు నిలిపే ప్రదేశం వరకు ఉన్న ఖాళీ స్థలంలో దారి పొడవునా స్థానికంగా తయారైన చిన్న చిన్న వస్తువులు, బట్టలు అమ్ము తున్నారు.  

          ఆ తర్వాత దార్లో గవర్నర్ బిల్డింగుని వ్యానులోనించే చూపించి, బహామార్ అనే మరో రిసార్ట్ చుట్టూ వ్యానుని ఒక రౌండ్ తిప్పేరు. బహుశా: అదొక విధంగా మార్కెటింగ్ అనుకుంటా. నాసో వస్తే ఎక్కడ ఉండాలో చూపిస్తున్నట్టు అనిపించింది మాకు.  

          అక్కణ్ణించి తిన్నగా డౌన్ టౌన్ లోని బ్యూనా విస్టా ఎస్టేట్ లోని జాన్ వాట్లింగ్స్ రమ్ ఫాక్టరీకి తీసుకెళ్ళేరు. 

          ఇది 1789లో కుటీర పరిశ్రమగా  స్థాపించబడిందట. ఇక్కడ రమ్ తయారీ విధానాన్ని వివరిస్తూ టూర్ ఉంది. రుచి చూసి కొనుక్కోవాలకునే వాళ్లకి ఇది ఒక రకంగా మంచి అవకాశం. మేం తాగేవారం కానప్పటికీ అమెరికాలోని వైన్ టేస్టింగ్ టూర్లకు స్నేహితులతో వెళ్లినందున ఇదేమీ కొత్త అనిపించలేదు మాకు. ఇటు వంటి చోట మాలాంటి వారికి చేసేదేమీలేక అంత ఆసక్తిగా అనిపించలేదు. అయినా టూరులో భాగం కాబట్టి ఆవరణంతా చుట్టి వచ్చి చెట్ల కింద కూచున్నాం. ఆ ఆవరణలో “మనుషులు తవ్విన నుయ్యి” అన్న బోర్డుతో చుట్టూ ఫెన్సింగుతో ఉన్న చిన్న నూతి చుట్టూ అంతా మూగి వింతగా చూడసాగేరు. 18వ శతాబ్దిలో అప్పటి బానిసలతో ఈ నుయ్యిని తవ్వించారట. మా చిన్నతనంలో ఎక్కడ చూసినా మనుషులే తవ్వి ఒరలు వేసే నూతులెన్నో చూసిన మాకు నవ్వాగలేదు ఇది చూసి. 

          నాసో ద్వీపంలో ఇక్కడ చూసినా అరటి చెట్లతో, పచ్చని బయళ్లతో సతతహరితంగా ఉంది. జీవన స్థితిగతులు ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి. అమెరికాకి కూత వేటు దూరంలో ఉన్నా ఈ ప్రాంతాలకు, అమెరికాకి ఏమీ సంబంధం లేదు. 

          అక్కణ్ణించి సముద్ర తీరం వెంబడి తీసుకు వస్తూ పదిహేను నిముషాలు ఆపేరు. అత్యంత తెల్లని ఇసుక, పలచని వెచ్చని కెరటాల్లో పరుగులు తీసేం. పిల్లల సరదా చూస్తుంటే మిగతా అన్ని చోట్లకీ తిప్పడం మానేసి ఇక్కడే వదిలేసి ఉంటే బావుణ్ణని అనిపించింది. 

          మూడుగంటల ప్రాంతంలో నాసో నగర సందర్శన ముగించుకుని తిరిగి ఓడ రేవుకి చేరుకున్నాం. మధ్యలో ఒక్కో అరటి పండు, బిస్కెట్లు, చిప్స్, మంచినీళ్ల బాటిళ్లతో స్నాక్ పేకెట్లు ఇచ్చేరు కాబట్టి ఆకలి వెయ్యలేదు ఎవరికీ. అయినా ఓడలోకి ఎక్కగానే మళ్ళీ 24గంటలూ వడ్డించే భోజనాలు ఎదురవ్వగానే అటు పరుగుతీసారు పిల్లలు.

*****

(ఇంకావుంది)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.