సత్యభామా పరిణయము (లేక) నీలాపనిందాపరిహారము

అను ఆంధ్రనాటక ఫ్రబంధము

 శ్రీమాన్ వింజమూరి వీరరాఘవాచార్య విరచితం

1896

సంధ్యా వింజమూరి

 సమీక్ష
 

          “బాణౌచిష్టం ఇదం జగత్” అన్నట్లు బాణభట్టుడు ఏడవ శతాబ్దంలో హర్షచరిత్ర రచించి కావ్య రచనకి శ్రీకారం చుట్టినప్పటి నుండి ఆంధ్ర దేశంలో అనేక పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక రచనలు వెలువడ్డాయి. కానీ, ఆ కాలంలో వాటి పరిరక్షణా విధానం అంత అభివృద్ధి చెందలేదు. ఫలితంగా అనేక  సాహిత్య రత్నాల జాడా కూడా తెలియకుండా పోయింది.

          ఈ నాడు ముద్రణా విధానాలు అభివృద్ధి చెందటమే కాక, డిజిటల్ మీడియా అభివృద్ధి వలన గ్రంధ పరిరక్షణ సులభతరం అయ్యింది. ఈ కారణంగా దొరికిన ప్రాచీన గ్రంధాలని సంరక్షించటం కూడా సులభతరం అయ్యింది. మన పూర్వ సాహిత్య వైభవం మరుగున పడకుండా ఉండాలంటే, ప్రాచీన గ్రంథ పరిశొధన, పునరుద్ధరణ అత్యవసరం.

          ఈ పరిశోధన- పునరుద్ధరణ ఫలితమే  ఈ సత్యభామా పరిణయం వెలుగులోనికి రావటానికి కారణం అయ్యింది. ఈ చిరు నాటక ప్రబంధం (100 పుటలు) 2022లో “గానకళానిధి డా. వింజమూరి వరదరాజ అయ్యంగార్ మెమోరియల్ ట్రస్టు” చే  125 సంవత్సరాల అనంతరం పునప్రచురింపబడినది.

          సత్యభామా పరిణయం లేక నీలాపనిందా పరిహారం అనే ఆంధ్ర నాటక ప్రబంధం నూజివీడు సంస్థాన పండితుడు, సంస్కృతాంధ్రకవితా విచక్షణుడునూ నైన శ్రీమాన్ వింజమూరు వీరరాఘవాచార్య పండితులవారిచే రచింపబడినది. ఈ ప్రబంధము శ్రీ మత్పనపాకం అనంతాచార్యులు ఆనరబుల్ విద్యావినోది గారి ఆజ్ఞానుసారము “శ్రీ వైజయంతి” ముద్రాక్షరశాలలో ప్రప్రధమంగా 1898వ సంవత్సరములో ప్రచురింప బడింది.  

          పండిత శ్రీమాన్ వింజమూరి వీరరాఘవాచార్యుల వారి గురించి కొన్ని విషయాలు:

          పండిత శ్రీమాన్ వింజమూరి వీరరాఘవాచార్యులవారు 1851 వ సంవత్సరంలో జన్మించి 1920 వరకు జీవించారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని దొంతవరం అగ్రహారానికి చెందిన శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందినవారు. వీరు కౌశిక గోత్రులు. వీరి పూర్వీకులు తమిళ దేశ తిరునల్వేలి జిల్లాలోని శ్రీవిళ్ళిపుత్తూర్ నుండి ఆరు తరాలకి ముందు అంధ్ర దేశానికి వలస వెళ్ళారు. వీరి పూర్వికం భగవద్రామానుజుల వారిచే నియమింపబడిన 74 మంది పీఠాధిపతులలో ఒకరైన శ్రీమాన్ అరుళాల్ పెరుమాళ్ ఎంబెరుమానార్ గారికి చెందింది.

          వీరికి “సంస్కృతాంధ్ర కవితా విచక్షణుడు” అనీ “అభినవ కాళీదాసు” అనీ బిరుదులు. వీరు తనని తాను “విద్వజ్జన విధేయుడని” పరిచయం చేసుకొన్న నిగర్వి. వీరు కొంతకాలము నూజివీడు సంస్థాన పండితుడిగా ఉన్నారు. ఆయన చాలాకాలం బెజవాడలో నివసించి, అక్కడి ఉన్నత పాఠశాలలో సంస్కృత పండితునిగా ఉపాధ్యాయ వృత్తి చేశారు.

          వీరు 1. రామానుజ స్తోత్రత్రయీ 2. మానస సందేశం 3. హనుమత్ సందేశం 4. పానక నరసింహ స్తోత్రం 5. రఘువీర గద్య వ్యాఖ్య 6. చతుశ్లోకీ వ్యాఖ్యఅనే సంస్కృత గ్రంథాలు రచించినట్లు తెలియ వచ్చింది.అంతేకాక, “విశ్వరూప సందర్శన నాటకం”, “శృంగారాది పాకభాణ” అనే గ్రంథాలు కూడా రచించినట్లు తెలియవచ్చింది. 1909 ప్రాంతంలో ప్రచురింపబడిన “మాధవ నిదానము”, “పరమార్థసారము”, “అద్వైత సుధానిథి”, “రసేంద్ర చింతామణి” అనే గ్రంథాలకు వారు సంపాదకత్వం చేసినట్లు తెలిసింది.

          సత్యభామా పరిణయం గ్రంథ ప్రాశస్త్యం గ్రహించిన వింజమూరి వంశస్తులు దీనిని పునః ప్రచురణ చెయ్యాలని సంకల్పించుకొని, వింజమూరు వీరరాఘవాచార్యుల వారి సోదరుడైన వింజమూరి భావనాచార్యులు, గుంటూరు వారి కనిష్ట కుమారుడును, గానవిద్యా దురంధరుడును అయిన  గానకళానిధి శ్రీమాన్ వింజమూరి వరదరాజ అయ్యంగారి పేరిట స్థాపింపబడిన “గానకళానిధి డా. వింజమూరి వరదరాజ అయ్యంగార్ మెమోరియల్ ట్రస్ట్” ద్వారా ఈ గ్రంథాన్ని బహుజన ప్రయోజనకారిగా, భగవత్ కైంకర్యం గా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రచురించారు. ఈ గ్రంధం 1898 లో ప్రచురించ బడిన ప్రాచీన గ్రంథాన్ని 125 సంవత్సరాల అనంతరం యధాతధంగా మళ్ళీ ప్రచురించటమైనది. కనుక కొద్దిపాటి అక్షర స్పష్టత, తేడాలు సహజములు.

          19వ శతాబ్ద కాలంలో భారతావనిలో జమీనులు, రాజ సంస్థానాలు ఉండేవి. వీధి నాటక ప్రదర్శనలు, ప్రబంధ ప్రదర్శనలు, కోలాట ప్రదర్శనల వంటివి మాత్రమే ప్రజలకు, పాలితులకు వినోదాలు. కవి పండితుల ఆదరణ, ప్రోత్శాహం ఉచ్చస్థితిలో ఉండడం వలన అనేక అద్భుత రచనలు వెలువడినాయి.

          నూజివీడు సంస్థాన పండితుడుగా ఉండిన శ్రీమాన్ వీరరాఘవాచార్యులుగారు 1896 లో సంస్థానాధిపతి ఆదేశం పై రచించిన నాటకప్రబంధమే ఈ సత్యభామా పరిణయం.

          శ్రీమాన్ వీరరాఘవాచార్యులుగారు తన పీఠికలోనే చాలా విషయాలు స్పష్టీకరించారు. జాంబవతీ, సత్యభామల వివాహం ఒకే ముహూర్తానికి జరిగినా, సత్యభామ ముఖ్యత్వం వలన నాటకప్రబంధానికి ఆ పేరు పెట్టటమైనది. సమంతకమణి కథనం, నీలాపనింద, పరిహారం, శ్రీకృష్ణ పరమాత్మునితో జాంబవతీ వివాహం ప్రముఖ పాత్రలు కనుక, వినాయక చవితి వ్రతముగింపుకై ఆ కథనం ముఖ్యమైనందు వలన ఈ గ్రంథ ప్రతినామం “నీలాపనిందా పరిహారం” అని వివరించారు. అంతేకాక పీఠికలోనే అపనిందకు నీలాపనింద అనే పేరు ఏ విధంగా ఎర్పడినదన్న విషయం కూడా అందులో భాగమయ్యింది.

          ఇక, నాటక ఆరంభం సాంప్రదాయాన్ననుసరించి నాంది, సూత్రదారుని ప్రవేశంతో, ఉపోద్ఘాతముతో అత్యంత రమణీయమైన పలుకులతో రచించారు. శివకేశవ భక్తులందరికిప్రియంగా “శివకేశవ వృత్తాంతములు గల ఈ అభినవ రూపకము” అని సూత్రదారునిచే పలికించారు కవివరులు.

          పార్వతీ పరమేశ్వరుల పాచికలాట సమయంలోనే కవి అనేక దృశ్యాలను మన కళ్ళముందు నిలుపుతారు. వారి సంభాషణల ద్వారా పార్వతీ పరమేశ్వరుల సంబంధము, అనుబందాదులు తెలియజెప్పి ఆ చరిత్ర క్లుప్తంగ  ప్రేక్షలకు అందించారు కవి.

          పార్వతీ పుత్రునితో మహేశ్వరుని సంభాషన అత్యంత ఉత్సాహంగా ఉండి, చిన్ని బాలుని వయస్సుకి మించిన మాటలు శివునికి ఆగ్రహం తెప్పించే విధంగా అతి సహజంగా సాగుతాయి. పాత్రల ద్వారా ఆయా సందర్భాలకు తగిన రసోత్పత్తి కలిగించటం కవి రచనా స్థాయిని తెలుపుతుంది. ఈ విధమైన చమత్కార సంభాషణలు ఈ రూపకంలో అనేకం. 

          కవివర్యులు ఈ నాటాక ప్రబంధంలో ప్రతి వృత్తాంతానికి మూల కథని ఇచ్చారు. విఘ్నరాజ వృత్తాంతం వలెనే కుమార స్వామి జనన వృత్తాంతం కూడా విపులంగా సంభాషణా చాతుర్యంతో ఇచ్చారు కవి.

          త్రేతాయుగంలో  శ్రీరామునితో యుద్ధం చెయ్యాలన్న జాంబవంతుని కోర్కె ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిచే తీరటము, జాంబవంతుడు బ్రహ్మచారియై జాంబవతిని తెచ్చి, తన కుమార్తెగా అల్లారు ముద్దుగా పెంచుకొని , శమంతకమణిని ఆ బాలిక ఉయ్యాలకి కట్టి జోల పాడుట వంటి అనేక వర్ణనా యుతములైన సంభాషణలు చదువరికి అతి సంతోషాన్నిస్తాయి.

          ఈ కలికాలంలోనే భారతదేశ వివాహ వ్యవస్థ అంత పరిణితి చెంద లేదు. కాని, ఈ నాటక ప్రబంధంలో ద్వాపరయుగంలో జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చెయ్యదలచిన జాంబవంతుడు, మొదట జాంబవతిని తనకు శ్రీకృష్ణునితో వివాహము ఇష్టమేనా అని అడగడం హృద్యంగా ఉంటుంది.

          వసుదేవుడు గర్గ మహర్షిని శ్రీకృష్ణ జాంబవతుల వైవాహానికై ముహూర్తము పెట్టమని ఆడిగినప్పుడు, గర్గ మహర్షి ముహూర్తముచూచి, ఆ ముహూర్తమున శ్రీకృష్ణునకు రెండు వివాహాలు జరుగనున్నట్లు తెలియజేస్తాడు. కానీ రెండవ కన్య ఎవరన్న విషయం చెప్పడు.  శ్రీకృష్ణుని అన్న బలరాముడు, సత్రాజిత్తు తన తమ్మునిపై పడిన నీలాపనిందను తొలగించి, సత్రాజిత్తునకు శమంతక మణిని ఇచ్చినయనంతరము, సత్రాజిత్తు తను శ్రీకృష్ణునిపై వేసిన నిందకు పరిష్కారము చెయ్య దలుస్తాడు.

          ఇక్కడ గూడా కవి చమత్కారం కనిపిస్తుంది.  సత్రాజిత్తు తన భార్య సుదేవిని పరిష్కారమడగగా, ఆమె తమ కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము జరుపుట నిజమైన అపరాధ క్షమ అని తెలుపుతుంది. సత్రాజిత్తు కూడా తన కుమార్తె కు శ్రీకృష్ణునితో వివాహము సమ్మతమేనాయని కుమార్తె అభిప్రాయము అడుగుతాడు. ఈ విధంగా ద్వాపరయుగంలో ఒక స్త్రీ కి ఉన్న గౌరవం తెలియ జేస్తారు కవి.

          1886లో రచించిన ఈ నాటక ప్రబంధం ఈ నాటి సామజిక పరిణామాలకు నాందిగా నిలుస్తుంది. ప్రతి నాటక ప్రియులు, ప్రతి పురాణప్రియులు, ప్రతి సాహిత్య ప్రియులు తప్పక చదవ వలసిన చిరు నాటాక ప్రబంధము సత్యభామా పరిణయము.

          నాటకానికి “నాట్యప్రధానమై పద్యగద్యాత్మకమైన గ్రంథవిశేషము” అన్న భావం ప్రకటించారు మన పెద్దలు. ఈ నాటక ప్రబంధంలో ఉన్న అనేక చిరు కథలు ఒక్కొక్క నాటికగా కూర్చుకొని, నాటికగా, నాట్య ప్రదర్శనగా కూడా ఉపయోగించుకొన వచ్చును.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.