కనక నారాయణీయం -39

పుట్టపర్తి నాగపద్మిని

          ఆ ఆనందకర వాతావరణంలో ముందుగా తేరుకుని, చప్పట్లు కొడుతూ నిలబడి గొంతు సవరించుకుంటూ కృష్ణమాచార్యులు అన్నాడు,’ అమ్మా, కనకమ్మా!! చక్కటి కూతురును కన్నారమ్మా మీ దంపతులు!! చదువూ, సంస్కారం, కలగలసిన సంప్రదాయ కుటుంబం మీది. సాక్షాత్తూ సరస్వతీపుత్రుడు పుట్టపర్తి వారు. ఇటు, బాణగిరి వంశోద్భవులు, లక్ష్మీసంపన్నులు దేశికాచార్యులవారు. ఇద్దరి కుటుంబాల మధ్యా బంధుత్వం ఏర్పడే శుభ సూచనలు కనిపిస్తున్నాయి..’ అనేశాడు.

          పుట్టపర్తి దంపతులిద్దరి మనసుల్లో ఆనందం తాండవించింది. పుట్టపర్తి అన్నారు,’ధన్యోస్మి!! ఇది మా అదృష్టం కూడానయ్యా!! మరి వరుని మనసులోని మాట..??

          తంగమ్మ అందుకుంది.’మావాడెప్పుడో సరే అనేశాడు చూపులతోనే!!’ అని!

          ఇంకేముంది !! పుట్టపర్తి దంపతుల మనసుల్లో ఆనంద సాగర తరంగాలు వువ్వెత్తున ఎగసి పడుతున్నాయి. పెద్దమ్మాయికి ఇంత సులభంగా సంబంధం కుదిరిపోవటం ఎంత అదృష్టం!!

          ఇంతలో ప్రొద్దుటూరు నుండీ పుట్టపర్తి శిష్యుడు, పుత్ర సమానుడు మాలేపాటి  సుబ్రహ్మణ్యం అక్కడికి చేరుకున్నాడు. కృష్ణమాచార్యులకు  కూడా సుబ్రహ్మణ్యం ఆప్తుడే!! పుట్టపర్తి దంపతులలో అతన్ని చూడగానే మరింత ధైర్యం వచ్చేసింది. కడుపున పుట్టకపోయినా, ఇంట్లో ప్రతి కార్యానికీ  సుబ్రహ్మణ్యం ఉండి తీరవలసిందే ఇంత వరకూ!! ఇప్పుడీ పెళ్ళి సంబంధం విషయంలోనూ కృష్ణమాచార్యుల వెంటపడి మరి మరీ గుర్తు చేసి, ఇంతవరకూ తీసుకు రావటం లో మొదటి దత్తు కుమారుడిగా  అతని పాత్ర  కూడా చాలానే వుంది మరి!! 

          ‘రారా..సుబ్రహ్మణ్యం!! పైకి అనలేదుకానీ, ఇంకా నువ్వు రాలేదేమా?? అనే ఆలోచిస్తున్నాను. బస్ దొరకలేదా??’ అన్నాడాయన!!

          ‘కాదు అన్నయ్యా!! ఆఫీసు పనివల్లే ఆలస్యమైంది.’ అన్నాడతను. ఓరియెంటల్  ఇన్శూరన్స్  ఏజెంట్  గా పనిచేస్తున్నాడిప్పుడు!! ఆ లావాదేవీలెప్పుడూ వుంటుంటాయి మరి!!

          ఈ కొత్త వ్యక్తి ఎవరా అని ప్రశ్నార్థకంగా చూస్తున్న దేశికాచార్యులు  తంగమ్మ దంపతులకేసి  చూస్తూ కృష్ణమాచార్యులన్నాడు. .’ఇతను మాలేపాటి సుబ్రహ్మణ్యం. పుట్టపర్తి స్వామివారికి  దత్తపుత్రుడు. (పుట్టపర్తిని స్వామీ అనే పిలిచేవారు,  బంధు వర్గంలోని వారు కూడా, ఎంతో గౌరవంగా!!) వైశ్యుల ఇంట తప్పబుట్టిన వైష్ణవుడు!! మా ఆవిడకు తమ్మునికన్నా ఎక్కువే!! ప్రొద్దుటూరులో ఉంటే వాళ్ళింటికన్నా మా ఇంట్లోనే ఎక్కువ ఉంటాడంటే నమ్మండి  దేశికాచార్యులవారూ!! ఇప్పటికిదీ ఇతని పరిచయం. ముందు ముందు మీకే తెలుస్తుంది ఇతని వ్యక్తిత్వంలోని ఔన్నత్యం!!’

          సుబ్రహ్మణ్యం కళ్ళలో వినయ భావన!!

          ‘ఇదిగో! కనకా !! అందరికీ మరోసారి కాఫీ ఏర్పాట్లు చేయి. పాలూ అవీ ఉన్నయా?  చూడు?? ఒరే సుబ్రహ్మణ్యం! మీ అమ్మనడిగి ఏమైనా కావాలేమో తీసుకు రా.’ పురమాయించారు పుట్టపర్తి తన కుమారునికి! 

          కనకమ్మ తాను లేచి,  కరుణాదేవిని కూడా  ఇంట్లోకి వెళ్ళమని సైగ చేసింది. అక్క చెల్లెళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్తుంటే, ముచ్చటగా చూస్తున్నారు దేశికాచార్యుల దంపతులూ ! పెళ్ళికొడుకు రాఘవాచార్యులూ కరుణా దేవిని చూసీ చూడనట్టు చూసే ప్రయత్నం చేస్తుండగా, లోపలికి వెళ్తూ కనకమ్మ ‘ఇదిగో!! కృష్ణమాచార్యులూ! ఒకసారి రావయ్యా! ఒరే సుబ్రహ్మణ్యం!! నువ్వూ రా ” అని పిలిచారు. 

          ‘వద్దొద్దు!! ఇప్పుడవన్నీ అక్ఖరలేదు. మేమింక బయలుదేరుతాము లెండి!! ‘దేశికాచార్యులు భుజం పైన టవల్ సర్దుకుంటూ లేచే ప్రయత్నం చేస్తున్నారు.

          కనకమ్మ గారి భావమేమిటో అర్థమైనట్టుగా కృష్ణమాచార్యులు, ‘వెళ్దురుగాని! ఇప్పుడే వస్తాను.’ అంటూ లోపలికి నడిచాడు.

          దేశికాచార్యులు, కుమారుడు రాఘవతో ఏదో మాటల్లో పడ్డారు. తంగమ్మ, చెక్కిట చేయి చేర్చి, వాళ్ళీద్దరివైపూ ఆసక్తిగా చూస్తుండగా, మెల్లిగా పుట్టపర్తి కూడా ఇంట్లోకి నడిచారు.

          వంటింటికి ఆనుకుని వున్న వసారాలో కనకమ్మ, పుట్టపర్తిని చూడగానే, ‘నేనే పిలుద్దామనుకుంటున్నా!! మీరే వచ్చేశారు. కృష్ణమాచార్యులకు ఎంతో ఋణ పడి వున్నాం మనం..’ అంది.

          పుట్టపర్తి అందుకున్నారు..’ అవునురా!!  సంబంధం కుదిరింది, నీ దయవల్ల!! సంతోషమప్పా!! (ఇది సీమ ముఖ్యంగా అనంతపురం ప్రాంతం వాడుక పదం. పుట్టపర్తి మాటల్లో అనంతపురం యాస ధ్వనిస్తూ వుంటుందిలాగే!!) 

          కనకమ్మ .’  మరి వరదక్షిణా కట్న కానుకలూ వంటి వాటి గురించి ఎప్పుడు చెబుతారు?? చూస్తున్నావు కదా!! మా ఆర్థిక పరిస్థితి!! నీకు తెలియనిదేముంది?? మళ్ళీ మనము కర్నూలుకు వెళ్ళవలసి వుంటుందా?? చెప్పవలె నీవే’!!

          నాదీ అదే ప్రశ్న అన్నట్టు పుట్టపర్తి అతని వైపే చూస్తున్నారు. ‘అమ్మా!! నాదేముంది?? అంతా ఆ పెరుమాళ్ళు సంకల్పం. మీరు దిగులు పడవద్దు. వాళ్ళకు డబ్బుకు కొదువే లేదు. కట్న కానుకలకు ఆశించే రకాలు కాదు. తంగమ్మ పేరుకు తగ్గట్టు నిజంగా బంగారమే!! ఇంకేముంది??  నేను సర్ది చెబుతాను కదా!! మీరు నిశ్చింతగా వుండండి.’

          సుబ్రహ్మణ్యం అన్నాడు.’అది కాదన్నయ్యా!! ఇప్పుడే వాళ్ళను మాటల్లో పెట్టి అడిగేస్తే??’

          ‘ప్రయత్నిస్తాను. అమ్మా!! కనకమ్మా!! మీరు ఆ కాఫీ ప్రయత్నలేవో చేయండి మరి! రారా సుబ్రహ్మణ్యం!!’ అని పడసాలలోకి వెళ్ళాడు కృష్ణమాచార్యులు!!

          తరులత కాఫీ ప్రయత్నాలు మొదలు పెట్టేసిందప్పుడే!! కరుణాదేవి, పెరట్లో తులసి చెట్టుదగ్గర కూర్చుని వుంది బుద్ధిగా!!

          కృష్ణమాచార్యులు అంటున్నాడు దేశికాచార్యులతో,’ ఆ బావగారూ!! ఈ సంబంధం గురించి మాట్లాడుకుంటున్నప్పటి నుంచే అన్నీ శుభ శకునాలే!! అనుకున్నట్టే,  పిల్లవానికి అమ్మాయి కూడా నచ్చింది. మరి పెళ్ళి విషయమై,  అదే వరదక్షిణా వంటి వాటి విషయంలో మీ మనసులోని మాటేదైనా చెబితే బాగుంటుందేమో అని నా అలోచన!!’

          భళ్ళున నవ్వేశారు దేశికాచార్యులవారు. ‘ఇదిగో కృష్ణమాచార్లూ!! మాదేముందయ్యా!! ఉద్యోగస్తులం!! ఏదో పెద్దలిచ్చిన పొలమూ పుట్రా వున్నాయి. కానీ వీరేమో సరస్వతీ పుత్రులే సాక్షాత్తూ!! వీళ్ళమ్మాయి మా ఇంటికి కోడలుగా  రావటానికన్నా భాగ్యమేముంటుంది మాకు!! వాళ్ళకు తోచిందేదో వాళ్ళ అల్లుడికీ కూతురికీ పెట్టుకోమనండి. మాకిద్దరు ఆడపిల్లలు. రెండో కొడుకింకా కాలేజి చదువులో వున్నాడు. మా ఇంటికి వచ్చే కోడలు, మా ఇంట్లో పిల్లగా కలిసిపోవడమే మాకు మీరిచ్చే గొప్ప కట్నం!! అంతే!!’ కుండబద్దలు కొట్టినట్టే చెప్పేశాడాయన! 

          తంగమ్మా ఆయన మాటే తనమాట అన్నట్టు నవ్వుతూ చూస్తూ వుంది.

          కృష్ణమాచార్యుల గొంతులో అనందం తాండవిస్తున్నది. ‘విన్నారా స్వామీ!! ఇదీ మా దేశికాచార్యులవారి గొప్ప మనసు!! ఇంకేముంది??  మంచి ముహూర్తం చూసి పెట్టు కోవటమే తరువాయి. శుభస్య శీఘ్రం!!’

          వాళ్ళ మాటలు  వింటున్న పుట్టపర్తి దంపతులకు నోట మాటే కరువైంది. సరస్వతీ కృప యీ రూపంలో సాక్షాత్కరిస్తుందంటే నమ్మవలె సుమా!! విద్వాన్ సర్వే సర్వత్ర పూజ్యతే కదా మరి!!

          దంపతులిద్దరూ చేతులు జోడించి నిలబడ్డారు  ఆనంద బాష్పాలతో!! పక్కనే సుబ్రహ్మణ్యం కూడా!!

          కనకమ్మ వెంటనే వంటింట్లోకి వెళ్ళి చక్కెర చిన్న గిన్నెలో తీసుకు వచ్చి, సంతోషంగా తలా కాస్త అందించింది, శుభ వార్తను ఖాయం చేసుకుంటూ!

          వినయంగా తల్లి కనకమ్మ తంగమ్మ చేతులు పట్టుకుని అంది. ‘అమ్మా! ఆడపిల్ల గల వాళ్ళం!! మాకు చేతనైనంత రీతిలో పిల్లకు నగానట్రా, నాలుగైదు  పట్టు చీరలూ,  పెడతాము. వరదక్షిణ కింద పెళ్ళికొడుకుకు పట్టు బట్టలూ, వెండి తట్టా (భోజనం కోసం ఉపయోగించే పళ్ళెం)చెంబూ, లోటా, వరప్రయాణం, ఎదురుకోళ్ళూ, నిశ్చితార్థం, కాశీ ప్రయాణం, ముహూర్తం  ఇట్లా సందర్భానికి తగిన   నాలుగైదు పాంట్లూ, షర్టులూ పెడతాము. మీ దంపతులకు పట్టు బట్టలు, మీ పిల్లలకు కూడా పెళ్ళి బట్టలు పెడతాము. పెళ్ళి కూడా సంప్రదాయ బద్ధంగా చేయిస్తాము. ఇదీ మా యోగ్యత. ఇంతకంటే చెప్పలేము. మీ పెద్ద మనసుకు చాలా కృతజ్ఞతలు.’

          దేశికాచార్యులు ఆయన సహజ ధోరణిలో ‘బంగారం వంటి కోడాలినిస్తున్నారు మీ దంపతులు మాకు. ఇంతకంటే ఏమి కావాలమ్మా మాకు?? ఇదిగో కృష్ణా!! ఇక కాబోయే పనులన్నీ చూసుకోవాలయ్యా నువ్వే!’

          కృష్ణమాచారి ‘అంతకంటేనా? తప్పకుండ చూస్తాను, వీడున్నాడు కదా నాతో, యీ సుబ్రహ్మణ్యం!! వీడు హనుమంతుడి వంటి వాడు. క్షణాల్లో అన్నీ సమకూరుస్తాడు. ఆ పనిమీదే ఉంటానింక!!’ అన్నాడు నవ్వుతూ!!   

          దంపతులిద్దరూ కాబోయే వియ్యంకులకు సేవించారు. సుబ్రహ్మణ్యం తో పాటూ!!

          పుట్టపర్తి  ‘ఒరే కృష్ణమాచారీ!! నువ్వు జాతక బ్రహ్మవు కదా!! పిల్లల జాతకాలూ నువ్వే కదా చూసింది!! ఈ పుణ్యం కూడా నువ్వే కట్టుకో!! ముహూర్తమదీ చూసి తెలిపితే ఇక మా ఏర్పాట్లు మేమూ చేసుకుంటాం.’ అన్నారు.

          ‘ఇదిగో!! వదినె గారికి  బొట్టు పెడతాను..’ అంటూ లోపలి నుంచీ పసుపూ కుంకుమా తీసుకు వచ్చి తంగమ్మకు తాంబూలం అందించింది.

          సంతోషంగా అందరూ వీడుకోలు పలుక్కుంటూ వున్నప్పుడే దేశికాచార్యులు అన్నారు, ‘అవునూ!!  తెల్లగా వుందే, అమ్మాయి, మీ రెండో కూతురు కూడా పెళ్ళికి ఉందా??’ 

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.