నా జీవన యానంలో- రెండవభాగం- 25
-కె.వరలక్ష్మి
1997 జనవరిలో తిరుపతిలో జరగబోయే అప్పాజోశ్యుల పెట్టిన విష్ణుభొట్ల వారి నాల్గవ వార్షిక సమావేశాల సందర్భంగా కథల పోటీలో నా ‘మధుర’ కథకు బహుమతి వచ్చిందని చెప్పేను కదా! ఆ సందర్భంగా ఐదు బహుమతి కథలను ‘అలరూపకథాప్రభ’ పేరుతో ఒక పుస్తకంగా తెచ్చే బాధ్యతను ప్రఖ్యాత సీనియర్ రచయిత భరాగో గారికి అప్పగించారట ఫౌండేషన్ వారు. ఆ పుస్తకం కోసం బహుమతి పొందిన కథా రచయితలు ఐదు గురినీ ఫొటోసెషన్ కోసం విజయవాడ రమ్మని ఫోన్ చేసారు భరాగో గారు. 96 డిశంబర్ ఏడున జ్యేష్ఠ ట్రస్ట్ మెంబర్ పి.వెంకటరత్నం గారితో కలిసి రత్నాచల్లో విజయవాడ వెళ్తున్నామని, చివరి కంపార్ట్ మెంట్ లో ఉంటామని, టైంకి వస్తే తమతో కలిసి ప్రయాణం చెయ్యచ్చని చెప్పేరు.
మా చిన్నమ్మాయికి పాపాయి పుట్టిన సందర్భంగా ఎలాగూ రాజమండ్రిలోనే ఉన్నాను కాబట్టి బాధ్యత మా గీతకు, మా చిన్నచెల్లికి అప్పగించి 5.30 PM కి రాజమండ్రి స్టేషన్లో ట్రెయిన్ అందుకున్నాను. భరాగో గారితో ప్రయాణం నిజంగా హేపీజర్నీనే, సైగల్ని, భానుమతిగారిని అనుకరిస్తూ ఆయన పాడిన అద్భుతమైన పాటలు వింటూ ప్రయాణం హాయిగా సాగింది. కంపార్ట్ మెంట్ లోని జనం చాలా మంది మా చుట్టూ చేరిపోయారు. మరో పక్క పగల బడి నవ్వించే భరాగో మార్కు జోక్స్. కాకరాల గారి తమ్ముడు బాటా కంపెనీ లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారట. ఆయనా మాతో బాటు ప్రయాణం చేసారు. ట్రెయిన్ దిగేక “వెళ్లొస్తానండి”అన్న ఆయన్తో “వెళ్లిరండి, మేమెప్పుడూ. మీ చెప్పుల జతల్లోనే ఉంటాం” అని నవ్వించేరు.
8:30 PM కి ముందే బుక్ చేసిన హోటల్ అనుపమ చేరుకున్నాం. వస్తారనుకున్న జ్యేష్ఠ గారి భార్య జానకీదేవి గారు రాకపోవడంతో ఆ డబుల్ సూట్ నాకే ఇచ్చారు. హోటల్లో దోసె తప్ప ఏమీ లేదన్న బేరర్ తో “దోసె దోసె నాచలా” అని పాడి నవ్వించారు. తిన్న వెంటనే నా రూంలోకెళ్లి ఎన్నాళ్ల అలసటో తీరేలా ఆదమరచి నిద్రపోయాను. ఉదయాన్నే లేచి కధాప్రూఫ్ దిద్ది, కథా నేపథ్యం రాసే సరికి ఫొటోగ్రాఫర్ వచ్చాడు. మా రచయితలు అయిదుగురికీ విడిగానూ, భరాగో, వెంకటరత్నంగారు, భమిడి పాటి జగన్నాథరావు గార్లతో కలిపి వేరేగానూ ఫొటోలు తీయించారు. భోజనాలు కాగానే బయలుదేరి దొరికిన పాసింజరు రైలు ఎక్కి రాజమండ్రి చేరుకున్నాను. తనకి అన్నీ అమర్చి వెళ్లినా తనకన్నా నాకు సాహిత్యమే ఎక్కువైపోయిందని మా చిన్నమ్మాయి నా మీద అలిగింది.
97 జనవరి 10 ఉదయానికి నేను, మోహన్ తిరుపతి చేరుకున్నాం. గాంధీరోడ్ లో ఉన్న రాయల్ పేలస్ లాడ్జిలో చాలా మంది రచయితలతో బాటు మాకూ రూమ్ ఇచ్చారు. మేం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి మధురాంతకం రాజారాం గారొచ్చి పలకరించారు. మేం అక్కిరాజు రమాపతిరావుగారున్న రూంకెళ్లి పలకరించి వచ్చాం. సమావేశాలు ముందురోజే ప్రారంభమై ఉండడం వల్ల అప్పటికే ఆహూతులంతా వచ్చి ఉన్నారు. అదే హోటల్ రూఫ్ మీద వేడి వేడి వంటకాల్తో భోజనాలు. పేర్లు వినడమే తప్ప ఎప్పుడూ చూడని మహామహులైన రచయితలు ఎందరో కుటుంబ సమేతంగా వచ్చి ఉన్నవారంతా పరిచయమయ్యారు. మధురాంతకం వారి భార్య, కొడుకులు నరేంద్ర, మహేంద్ర, కోడళ్లు, కవనశర్మ దంపతులు, వివినమూర్తి దంపతులు, శ్రీకాంత శర్మ, ఇంద్రగంటి దంపతులు, పవని నిర్మల ప్రభావతి దంపతులు, ఆర్.ఎస్. సుదర్శనం, బలివాడ కాంతారావు, ఓలేటి పార్వతీశం, తిరుమల రామచంద్ర, హితశ్రీ, కొమ్మూరి వేణుగోపాల రావు, కప్పగంతుల మల్లికార్జునరావు, ఘండికోట బ్రహ్మాజీరావు, కలువకొలను సదానంద, పోరంకి దక్షిణామూర్తి, నవీన్, పోలాప్రగడ, మృణాళిని, కోడూరి శ్రీరామ్మూర్తి , పి.ఎస్. గోపాలకృష్ణ, శీలా వీర్రాజు, వాడ్రేవు పాండురంగా రావు, మహీధర నళినీ మోహనరావు, వాకాటి పాండురంగా రావు, మునిపల్లె రాజు, శ్రీపతి, కోవెల సుప్రసన్నాచార్య, కేశవరెడ్డి, ప్రసాదరాయ కులపతి, చందు సుబ్బారావు మొదలైన ఎందరెందరో రచయితల్ని చూసి మనను, కళ్లు నిండి పోయాయి.
అప్పటికి అజో-విభా వారు జీవితసాఫల్య పురస్కారం – ప్రతిభా మార్తి ఒక్కటే ఇస్తున్నారు. ఆ పురస్కారం శ్రీ మహీధర రామమోహనరావు అందుకున్నారు ఆ సంవత్సరం.
11 వ తేదీన ఉదయం వైజాగ్ నుంచి అనుకోకుండా మా అబ్బాయి రవీంద్ర వచ్చాడు. మన విజయాలు మన పిల్లలు చూడాలని ఉంటుంది కదా! నాకు గొప్ప ఆనందంగా అన్పించింది. మా అబ్బాయి చొరవగా అప్పాజోశ్యుల సత్యనారాయణగార్ని పలకరించి నన్ను తీసుకెళ్లి పరిచయం చేసాడు సభాప్రాంగణంలో.
సభ ప్రారంభానికి ముందు నేను మహీధరవారిని వెతుక్కుంటూ వెళ్లి పలకరించాను. వారు తన పక్కన కుర్చీలోంచి ఎవరినో లేపి నన్ను కూర్చోమన్నారు. దబ్బపండు ఛాయలో మెరిసిపోతున్న తొంభై ఏళ్ల ఆ మహామహుడు, స్వాతంత్య్ర సమరయోధుడు గొప్ప పూజనీయుడు, నా చేతిని తన చేతిలోకి తీసుకుని ఆదరణతో బోలెడు కబుర్లు చెప్పేరు. నాది జగ్గంపేట అని విని తన బావమరిది జగ్గంపేట సంస్థానంలోని దివాన్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్న సందర్భం గా కుటుంబ సమేతంగా వచ్చి 15 రోజుల పాటు పెళ్ళి వేడుకల లో పాల్గొంటూ అక్కడే ఉండిపోయిన సంగతిని, అక్కడి చెరువు నీళ్లు తాగిన ఫలితంగా ఇళ్లకెళ్లిన తర్వాత అందరూ నార కురుపుల్తో బాధపడడం తల్చుకుని నవ్వేరు.
వేదిక పైన కూడా తన జీవితం, తన రచనల గురించి ‘కొల్లాయి గట్టితేనేమి’ అంటూ అద్భుతంగా ప్రసంగించేరు. తనకి స్వన్మాన సంస్థ వారిచ్చిన 50 వేల రూపాయల్ని ఛీఫ్ మినిస్టర్స్ ఫండ్ కి ఇచ్చేసారు. ఆ తర్వాత కూడా ఛాన్నాళ్లు ఆయన నుంచి ఉత్తరాలు అందుకోవడం నా అదృష్టం.
ఆ రోజు మధ్యాహ్నం బహుమతి గ్రహీతల్లో ఒకరైన స్వామి తన కుటుంబం తోను, సింగమనేని నారాయణగారు వారి అమ్మాయి, అల్లుడు మహర్షితోను మా రూంకి వచ్చి కాస్సేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళ్లేరు.
ఆ పురస్కారం అందుకోవడం మాటేమోగాని ఆ సభలో పాలుపంచుకోవడం రచయితగా నాకు గొప్ప స్ఫూర్తిని, ప్రేరణను, ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించింది. ఆ రోజు సభలోనే మా ఐదు కథల పుస్తకం అపురూపకథా ప్రభ ఆవిష్కరణ చేసి, మా అయిదుగురికి షీల్డ్, 10 వేలు నగదు బహుమతి ఇచ్చి సన్మానించేరు. ఆ మధ్యాహ్నం అటెండైన రచయితలందరికీ గ్రూప్ ఫొటో తీయించేరు. బాల్యం నుంచి రచయితలంటే నాకున్న ఆరాధన, ఆ రోజు వారందరి పక్కన నన్ను నిల్చోబెట్టిన నా కథారచనకు నేను పులకించిపోయాను.
12న తిరుమల కొండ పైకెళ్లి దర్శనం చేసుకుని, 13th ఉషోదయ నీహారికా సౌందర్యాన్నాస్వాదిస్తూ ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య కీర్తనల నేపధ్యంలో ఆనందంగా తిరుగుతూ గడిపి, 11.30 AM కి దిగువకు వచ్చి ట్రెయిన్ ఎక్కేం తిరుగు ప్రయాణానికి.
ఆ సంవత్సరం ప్రారంభం అలా హేపీగా జరిగింది కాని తర్వాతంతా ఒకటే ఇబ్బందుల్తో నిండిపోయింది. ఒకటే కష్టాలు, బాధలు, ఆవేదనలు.
జూన్ లో స్కూల్ ఆపేయవలసి వచ్చింది. ఆర్థికపరమైన ఇబ్బందులు చుట్టు ముట్టేయి.
ఖలీల్ జీబ్రాన్ ఓ చోట ఇలా అంటాడు –
” వారు మీకు మీ పిల్లలేగానీ.. మీ పిల్లలు కాదు, వారు మీ లోంచివచ్చారు గాని మీ నుంచి కాదు. వాళ్లు మీతోనే ఉన్నప్పటికీ మీకు చెందిన వాళ్లు కారు, మీరు వాళ్ళకి మీ ప్రేమను పంచి ఇవ్వండి కాని మీ ఆలోచనల్ని ఇవ్వకండి. మీరు వాళ్ల శరీరాలకే కర్తలు కాని వాళ్ల ఆత్మలకు కాదు. మీరు ధనువైతే మీ నుంచి విడువబడి ముందుకు దూసుకెళ్లిన శరీర పరంపర మీ పిల్లలు, ఆ శరాలు ఒకోసారి వెనక్కి తిరిగి మీ గుండెను ఛిద్రం చెయ్యొచ్చు.
“ముసుగును తొలగించుకున్న మీలోని విషాదమే మీ సంతోషం. సుఖం గొప్పదని కొందరూ, దుఃఖమే గొప్పదని కొందరూ అనుకుంటూంటారు. కానీ కాదు, ఆ రెండూ విడదీయలేనివి.”“జీవితపూ నిత్య నైమిత్తికాలకన్నా మించిన దేవాలయమేది?”
6.4. 1997 వ సాయంకాలం నలుగురు దుండగులు ఇంట్లో ఉన్న గద్దర్ మీద కాల్పులు జరిపి పారిపోయారు. మూడు బుల్లెట్స్ అతని శరీరం లోకి వెళ్లాయట.
22.3.1997న కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ దేవెగౌడను దించేసి I.K.గుజ్రాల్ ను ప్రధానమంత్రిగా ప్రకటించింది.
మార్చి 17, 18 తేదీలలో బొమ్మూరు తెలుగు యూనివర్సిటీలో ‘తెలుగుకథ – పరిణామము వికాశాలు’ అనే విషయం మీద సాహితీ సదస్సు జరిగింది. ఎండ్లూరి రమ్మని ఫోన్ చేస్తే వెళ్లి పాల్గొన్నాను. స్టూడెంట్స్ ఎందరో లేక సభ వెలవెల పోయింది.
‘మానవ జీవితాల్లోని అసంతృప్తియే ఉత్తమ రచయితకు కథా వస్తువు’ అంటూ ప్రసంగించేరు పెద్దిభొట్ల సుబ్బరామయ్య. ఎండ్లూరి సుధాకర్ మరాఠీ దళిత సాహిత్యం గురించి, దళిత వాదం గురించి మంచి ప్రసంగం చేసారు. కొలకలూరి ఇనాక్, కేతు విశ్వనాథరెడ్డి, కె.సర్వోత్తమరావు మొదలైన రచయితలు కథల పైన అద్భుతమైన ప్రసంగాలు చేసారు.
1997లో ప్రచురింపబడిన నారచనలు:-
10.1.97 ఆంధ్రజ్యోతి వీక్లీలో న్యూ జెర్సీ -రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ బహుమతి కథ ‘పంపకం’ .
6.5.97 స్వాతి వీక్లీలో ‘నాటకం’ కథ.
97 జూలై ఆహ్వానంలో ‘జనం’ కథ.
18.9.97 ఆంధ్రజ్యోతి డైలీలో ‘మాజీ రంగస్థల నటి’ కవిత
22.12.97 ఆంధ్రజ్యోతి డైలీ సాహిత్య వేదికలో ‘చెర’కవిత
97 Ag ఆఫీస్ వారి ‘అమ్మ’ కవితా సంకలనం లో ‘అదృశ్య మేఘం’ కవిత-
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.
మీ సాహితీ ప్రయాణం ఎంత బాగుందో ! మీ గురించి పుష్పాంజలి ( కీ . శే ) చెప్పారు ఒకసారి . మీ ద్వారా తెలియటం మంచి ఫీలింగ్ ఇచ్చింది.