నారి సారించిన నవల-37
-కాత్యాయనీ విద్మహే
రాజీ జీవితంలోని మరొక పురుషుడు రవికాంత్. అనంత్ కు వలెనే అతనూ వివాహితుడే. భార్యా పిల్లలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ప్రభుత్వ పనులలో తిరుగుతుండే అతనికి ఆవేదనలు వెళ్లబోసు కొనటానికి రాజీ కావాలి. నాలుగేళ్ళ క్రితం చూసి, మూడేళ్ళ క్రితం ఆమె పాట విని, ఆమెనే గుర్తు చేసుకొంటూ గడిపి మూడవసారి ఢిల్లీలో చూసి పరిచయం చేసుకొన్నాడు. ఇంటికి వచ్చి ఆమె సమయం తనకే అన్నట్లు హక్కుగా ప్రవర్తించటమే కాదు, ఆమెను ముట్టుకొని ముఖాన్ని అరచేతులతో పట్టుకొని మాట్లాడగల చనువు ప్రదర్శించాడు. రాజీ పని చేస్తున్న యూనిట్ సాంస్కృతిక కార్యక్రమాలు సైనికులకు మాత్రమే కాక గ్రామా ప్రజలకు కూడా విస్తరింప చేయాలని ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తూ తనలో చెలరేగే భావాలకు రేకెత్తే ఆలోచనలకు రూపం రావటానికి సృజన మేధో శక్తులు మేల్కొన్నరాజీ ఆలంబనను అభిలషిస్తాడు. అందుకు స్పందిస్తూ రాజీ మీతో పాటు ఈ పనిలోకి మీ భార్యను దించితే సరిపోతుంది కదా అన్నట్లు మాట్లాడితే కొంత వరకు ప్రయత్నించాను అంటాడు అతను. ఆమె చదువుకొన్నదే, కొంత వరకు అర్ధం చేసుకోగలదు కూడా. కానీ అతని ఆరాటం ఆమెకు అర్ధం లేనిదిగా కనబడటంలో ఉంది అసలు సమస్య. సంభాషణా క్రమంలో తనను తలచు కొనటానికి పిల్లలతో తీరిక ఉండదు అంటాడు. అందులో కాస్త అసంతృప్తి జీర లేకపోలేదు. ఒకప్పుడు రచయిత అయిన అతను రాజకీయాలలో రాసే తీరిక దొరకక పోయినా గ్రామీణ ప్రజలలో చైతన్యం కలిగించటానికి వ్రాయ గలిగిన వాళ్లతో కావలసిన విధంగా వ్రాయించి ప్రచారం చేయించాలన్న ఆశయంతో ఉన్నాడు. దానికి ఆలంబనగా రాజీ తటస్థపడింది అతనికి. ఆమె ప్రేరణ లేకపోతే తానేమీ చేయలేనని అనుకొంటాడు. శాంతి దొరకదని అనుకొంటాడు. అందుకోసం ఆమె సమయాన్ని, స్నేహాన్ని అర్ధిస్తాడు.
అనంత్ లాగా తుఫానులా ఆమె జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయినవాడు కాదు రవి కాంత్ . రాజీని ఎమర్జన్సీ కాలపు నిర్బంధం నుండి విడిపించటం దగ్గర నుండి ఆమె జీవితంలో ప్రతి మలుపులోనూ అతను ఉన్నాడు. రాజీకి తిరిగి ఉద్యోగం ఇప్పించటం దగ్గర నుండి, ఉద్యోగ జీవిత అభివృద్ధి గమనంలో అతను ఆమెను ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉత్సాహ పరుస్తూ వచ్చాడు. అదంతా ఆమె నుండి ఏమీ ఆశించని అచ్చమైన ప్రేమ వల్లనే సాధ్యం అయింది. రాజీ నవలలోనే కాదు, దానికి సీక్వెల్ గా వచ్చిన మిగిలిన మూడు నవలలోనూ అతని ఆ ప్రవృత్తి వికసనం వ్యాపించి ఉంది.
5
ఈ నవలలో రాజీ అత్యాచారానికి గురైన ఘటన ఉంది. లండన్ లో శిక్షణ ముగించుకొని వస్తుండగా చివరి మజిలీ పారిస్ లో ఎదురైన ఆ అనుభవంతో బెదిరిపోయి ముందస్తు టికెట్ తీసుకొని ఇండియా వచ్చింది. మొదటగా ఎదురుపడి పలకరించి ఇల్లుచేర్చి వైద్యపర అవసరాలు చూసిన వాడు కరుణాకర్. శరీరం మీద ఉన్న గాయాలను బట్టి ఆమె మీద అత్యాచారం జరిగిందని అతను గ్రహించాడు. పరీక్షించి మందులు ఇయ్యటానికి లేడీ డాక్టర్ ను తీసుకువస్తానంటే అభ్యంతర పెట్టింది కానీ కరుణాకర్ తో వివరాలు చెప్పటానికి ఆమె సంకోచపడలేదు. దానికి ఒక సమస్యగా, తన పవిత్రతకు సంబంధించిన అంశగా ప్రత్యేక ప్రాధాన్యతను ఇయ్యకపోవటమే ఆమె వ్యక్తిత్వం. పిచ్చి కుక్క కరవటంతో చెప్పిన పోలికలో ఆమె ఆ ఘటనను ఒక ప్రమాదంగా మాత్రమే తీసుకొన్న వైఖరి కనబడుతుంది. సాటి మనిషిని చూసి భయపడవలసిన రోజు రావటమే ఆమెను చింతకులోను చేసింది.
అత్యాచార ఘటనను ఎదుర్కొనే సందర్భంలో స్త్రీల ప్రవర్తన ఎలా ఉండి ఉంటే బాగుండేదో సూచించే వ్యాఖ్యలు – తరచు వింటుంటాం. అన్నయ్య అని సంబోధించి నివారిస్తేనో, రామనామం జపిస్తేనో అత్యాచారం చెయ్యాలనుకొన్న వాడు ఆగిపోతాడని పెద్దలు కొందరు ప్రవచించడం నిర్భయ అత్యాచారఘటన(2012) కాలంలో చూసాం. బాధితురాలి కోణం నుండి దీనిని చర్చకు తేవటం ఈ నవలలో ప్రత్యేకత. వంటి మీద వాపులు, గాయాలు , అవి పెట్టె సలపరింత , వాటివల్ల వచ్చిన జ్వర తీవ్రత భరిస్తూ రాజీ ఎదురు తిరగకుండా లొంగిపోతే అవి తప్పేవి కదా అనుకొంటుంది ఒక క్షణం. లొంగి పోవటం సుఖంగా ఉంటుందా అన్న కరుణాకర్ ప్రశ్నకు “లేదు లేదు. ఆ ఉద్దేశంతో అనలేదు. పర్యవసానం ఒకటే అయింది కదా అన్న చింతతో అలా అన్నాను” అని వివరణ ఇస్తుంది. “కనీసం ఇప్పుడు మీ మనసుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు”. అన్న కరుణాకర్ మాటతో ఏకీభవిస్తుంది. అత్యాచారం అనేది స్త్రీ శరీరం మీద జరిగే దాడి. ఆత్మగౌరవం గల ఏ మనిషి అయినా తన శరీరం మీద తన హక్కును నిరూపించు కొనటానికి పెనుగులాడటమే సహజ న్యాయం. పెనుగులాటలో గాయాలే కావచ్చు , ప్రాణాలే పోవచ్చు … వాటికి భయపడి లొంగిపోవటం తనను తాను లోకువ చేసుకొనటమే. తనను తాను లోకువ చేసుకోలేదు అన్నది ఇప్పుడు రాజీకి లభించిన సంతృప్తి.
అత్యాచార ఘటనలలో కారకుల పై విపరీతమైన ద్వేష ప్రకటన తరచు వినేదే . చూసేదే. మగాడిని మృగాడు అని వెక్కిరించేంత ద్వేషం, ఉరి తియ్యాలి, ఎన్ కౌంటర్ చెయ్యాలని డిమాండ్ చేసేంత ద్వేషం అది. అదే సమయంలో శీలానికి సంబంధించిన సంప్రదాయ భావజాలం బాధితులను తమ శరీరాన్ని తామే ద్వేషించుకొనే పరిస్థితికి నెడుతుంది. అయితే ఈ నవలలో రమాదేవి అలాంటి ద్వేషపు అంచు లేకుండా అత్యాచార ఘటనను స్వీయాత్మక ధోరణి నుండి కాక వస్తుగతంగా అర్ధం చేసుకొన వలసిన తీరును రాజీ వ్యక్తిత్వం నుండి నిరూపించింది.
ఈ అత్యాచార ఘటన గురించి రాజీ అనంత్ కు ఒక పెద్ద ఉత్తరం వ్రాసి తెలియ చేస్తుంది. ఆ ఉత్తరం చివరలో ఆమె అనంత్ కానీ అతని లాంటి వాళ్ళు కానీ ఆ ఘటనను ఎట్లా చూస్తారు? ఎలా స్వీకరిస్తారు? ఏమి తీర్పులు ఇస్తారు? అన్న ప్రశ్నలతో కొన్ని అభిప్రాయాలు ప్రకటిస్తుంది. అత్యాచార బాధితుల పట్ల జాలి పడతారు కొందరు. అసహ్యించు కొంటారు మరికొందరు. అత్యాచార ఘటనలో స్త్రీకి విముఖత ఉన్నా సంభోగాన్ని వాళ్ళు ఆనందించే ఉంటారు అన్నది చాలామంది అభిప్రాయం. వీటిని ప్రస్తావిస్తూ రాజీ శీలం లేని ఆడవాళ్లను పశువులతో సంభోగింపచేసి చంపే పూర్వకాలపు పద్ధతిని గుర్తు చేసి తనకు అలా ఉందని చెప్తుంది. విముఖత వున్నా ఆడది ఆనందించ గల రేప్ ఏమిటో తన అనుభవం నుండే చెప్తుంది. అది అనంత్ తోటి అనుభవమే. తాను అతనిని ఇష్టపడుతుంది. కానీ అతను రవికాంత్ విషయంలో తనకు పోటీగా వస్తున్నాడేమోనన్న అసూయతో పిచ్చిపిచ్చిగా మాట్లాడి తనకు కోపం తెప్పించి ఆ సమయంలో ఇష్టం లేకపోయినా బలవంతగా తనతో పడుకొన్న రోజును గుర్తు చేసి అందులో విముఖత ఉన్నా ఆనందపు పాలు కూడా ఉందని సూచిస్తూ అది కూడా అత్యాచారామె కదా అని ముక్తాయింపును ఇస్తుంది. పరాయివాడైనా, ప్రేమికుడైనా , భర్త అయినా స్త్రీ ఇష్టమూ ఆమోదమూ లేకుండా లైంగిక చర్యకు పాల్పడితే అది అత్యాచారామె అవుతుందన్న విస్తృత నిర్వచనం ఇందులో ఇమిడి ఉంది.
ఈ రకమైన చర్చ ఈ నవలలో భాగం కావటానికి 1978 లో దేశమంతా సంచలనం సృష్టించిన రమీజా బీ అత్యాచార ఘటన( హైదరాబాద్) ముందుకు తెచ్చిన అనేక ప్రశ్నలు, సవాళ్లు తక్షణ ప్రేరణ అయి ఉంటాయి. ఈ అత్యాచార ఘటన పైనా , పోలీసు కస్టడీలో రమీజా బీ భర్త మరణించిన ఘటన పైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన ముక్తదార్ కమీషన్ విచారణ, నివేదిక అప్పటికి పూర్తయ్యాయో లేదో కానీ రమాదేవి ఒక న్యాయశాస్త్ర మేధావిగా , ఒక మహిళగా అత్యాచార ఘటనల పట్ల ఉండవలసిన ఒక విమర్శనాత్మక వాస్తవిక దృక్పథాన్ని ఈ నవల ఇతివృత్తంలో భాగం చేయగలిగింది.
*****
(ఇంకా వుంది)
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.