‘జోగిని’ పుస్తక సమీక్ష
-పి.జ్యోతి
ఒక స్త్రీ తన తండ్రి శారీరిక అవసరాను తీర్చవలసి రావడం, అదీ ధర్మబద్దంగా జరగడం అన్నది ఊహించుకుంటేనే భరించలేని బాధ కలుగుతుంది. తరతరాలుగా కొందరు స్త్రీలను ఊరమ్మడి ఆస్త్రిగా భావిస్తూ వావి వరుసలు లేకుండా వారితో తమ అవసరాలు తీర్చుకోవడానికి మతాన్ని, దేవుడిని అడ్డం పెట్టుకుని పితృస్వామ్య వ్యవస్థ జరిపిన క్రూరత్వాన్ని గురించి తెలుసుకుంటే ఈ సమాజంలో మనమూ ఓ భాగమయి నందుకు రోత పుడుతుంది. “జోగిని” ల గురించి కొంత సమాచారం ఇంతకు ముందే తెలిసి ఉన్నాఈ నవల ఇంకా సమగ్రంగా ఆ సమస్యను చర్చకు పెట్టడం వలన ఆ సమస్య మూలాలలోకి తొంగి చూడగలుగుతాం.
అసలు సమాజంలో మగవాడి శారీరిక వాంచలకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అతనికి ధర్మకార్యకలాపాలలో, దైనిక జీవినంలో పాలు పంచుకోవడానికి ఓ స్త్రీ భార్యగా కావాలి. ఆమె అతని కుటుంబం, అతని జీవిత భాద్యతలను మోసే క్రమంలో అతని నిత్యావసరాలకు మాత్రమే పనికి వచ్చే వస్తువు అవుతుంది. భాద్యతల నడుమ జీవించే మరమనిషిగా మారి ఆమె భర్త కామ విలాసాలను, అతని కోరికలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండలేదు. ఆమె ఏ మాత్రం తన భాధ్యత మరిచినా, వాటి పట్ల ఏమరుపాటుగా ఉన్నా కుటుంబ జీవనమే అస్తవ్యస్త్యం అవుతుంది. ఆ కుటుంబంలో అందరి భౌతిక అవసరాలు ఆమె ద్వారా తీరాలి కాబట్టి భార్య అయిన స్త్రీ పరిధి నిర్ణయించి ఆమెకు ఓ స్థానం కల్పించింది సమాజం. ఆ స్థానంలో ఉండే స్త్రీ పురుషుడి శారీరిక అవసరాలను పూర్తిగా సంతృప్తిపరచలేదు. అందుకని ఆ పురుషుడ్ని రమింపజేయడానికి వెసులుబాటు కోసం మరో స్త్రీ ని సిద్దం చేసి ఉంచింది ఈ వ్యవ్యస్థ. అలాంటి స్త్రీలు కొన్ని చోట్ల, దేవదాసీలు అని, కొన్ని చోట్ల జోగినిలు, శైవులు, బసివిలు, మాతంగులు, మాతమ్మలు, శివ సతులు, పార్వతులు అని ఇలా రకరకాల పేర్లతో పిలవబడుతూ ఆ ఊరి సొత్తుగా మారిపోతారు. ఊరందరి అవసరాలు తీర్చడానికి ఆ స్త్రీని మానసికంగా సిద్దం చేయడానికి ఈ వ్యవస్థ “దేవుడి”ని వాడుకుంది. ఆమెను దేవుని సొత్తుగా అంటే దేవునికి భార్యగా మార్చివేస్తుంది. దీని కోసం దేవునితో ఆమె వివాహం జరిపిస్తుంది.
దేవుని భార్య అంటే ఊరందరి సొత్తు. ఆమె వద్దకు ఏ మగవాడయినా వెళ్ళవచ్చు. ఆమె అందరి అవసరాలు తీర్చాలి. దేవుని భార్యను ఉమ్మడి సొత్తుగా మార్చగల భక్త సమాజం ఆ దేవుడికి ఇచ్చే విలువ ఎలాంటిదో మరి. దేవుని భార్య తల్లి స్థానంలో ఉండాలి కాని ఆమె అందరి పక్కలోకి చేరే వస్తువుగా ఎలా మారుతుంది అని ప్రశ్నించడానికే కొన్ని వందల సంవత్సరాలు పట్టింది అంటే , ఈ సమాజంలో స్త్రీ కున్న విలువ అర్ధం చేసుకోవచ్చు. శైవ మతాన్నిఅవలంబించే చోట ఈ స్త్రీలను బసివిరాండ్రు అంటారట. వైష్టవ మతంలో వీరే దేవదాసీలు. ఈ మతం అన్నదాన్ని, దేవుని భార్య అనే బిరుదును ఆపాదించడం వలన జోగినులకు ఈ వ్యవ్యస్థను ఎదిరించే శక్తి ఉండదు. తాము ఊరందరి కోసమే పుట్టామని నమ్మి తమ జీవితాలని ఊరి మగవారి కామానికి అర్పించడానికి వారిని స్దిదం చేయడానికి స్త్రీ జాతిపై జరిగిన కుట్ర ఇది. మతం, రాజకీయం అనాదిగా కలిసే పని చేస్తున్నాయని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి దేవుని భార్యలను జోగినులు అని పిలుస్తారట. ఇది శైవ మతంలోనించే పుట్టుకొచ్చిందట. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రెండు వేల మంది జోగినులు ఉన్నారు అని ఈ నవలలో చెబుతారు రచయిత్రి శాంతి ప్రబోధ. కరీంనగర్ లో వీళ్ళే శివ సతులు అనే పేరుతో ఉన్నారు. వీరి మెడలొ తోలుతో చేసిన పుస్తె ఉంటుందట. ఊరి ఉత్సవాలలో వీరు నాట్యం చేస్తారు. ఊరిలో ఎవరు మరణించినా శవం ముందు నాట్యానికి వీళ్లను పిలుస్తారట. అక్కడ చిల్లర ఏరుకుంటారు. ఊర్లో భిక్షాటన చేస్తారు. ఊరి పండుగలు, జాతరలకు వీరే నాట్యం చేయాలి. అ ఊరిలో ఏ మగాడయినా వీరిని కోరవచ్చు. ఊరిలో మిగతావారికి వావి వరుసలు ఉంటాయేమో కాని వీరికి అవీ లేవు. తండ్రికీ, అతని కొడుకుకి కూడా వీళ్లు కేవలం సుఖానిచ్చే స్త్రీలే. మరీ ఘోరంగా ఓ మగాడు ఓ జోగినిని తల్లిని చేసి ఆమెకు పుట్టిన పిల్లతో మరో పిల్లను కనడం లాంటి సంఘటనలు ఈ జోగినీల జీవితంలో మామూలే అంటే ఎంతటి మానసిక సంఘర్షణతో కూడిన జీవితాలు వీరు జీవిస్తారో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ వ్యవ్యస్థలో పోతురాజులంటూ కొందరు ఉంటారు. వీరివీ దుర్బరమయిన జీవితాలే. చిన్న పిల్లలను జోగినులుగా మార్చే క్రమంలో ఊరి పెద్ద, లేదా కామందు ఆ బిడ్డ మెడలో తాళి కడతాడు, లేదా పోతురాజే ఆ బిడ్డ మెడలో తాళి కట్టి అమెను జోగినిగా ప్రకటించే వేడుకకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇక బేగరోళ్ళని మరికొందరు ఉంటారు. ఊరి ఉత్సవంలో జంతు బలి సమయంలో ఆ జంతు కళేబరన్ని వీళ్లే మోసుకుని తిరుగుతారట. ఉత్సవానికి ముందు బేగరోడు భార్యను విధవగా మార్చే తంతు నిర్వహిస్తారట. ఈ ఉత్సవంలో బేగరోళ్లు అ దారుణమైన పద్దతులకి చనిపోయే అవకాశాలు ఎకువ. ఒక వేళ బ్రతికి వస్తే, ఆ బేగరోడుకి అతని భార్యకు తిరిగి ఊరంతా పెళ్ళి చేస్తారట. ఇలా ఆ బేగరోడి భార్య కూడా ఊరి కోసం ఎన్నో సార్లు విధవ అయి మళ్లీ ఆ భర్తనే పెళ్ళి చేసుకుంటుంది. ఊరిలో ఎవరు చనిపోయినా ఆ అంత్యక్రియలు అయ్యేదాకా పోతురాజు పస్తు ఉండాలి. చాకలి వచ్చినా, దీపం ఆరిపోయినా భోజనం వదిలి లేచి వెళ్ళిపోవాలి. ఇంత అమానుషమైన ఆచారాల కోసం దళిత స్త్రీలు, పురుషులనే జోగినులుగా, పోతురాజులుగా, బేగరోళ్లగా ఎన్నుకోవడం సమాజంలో దళితులపై జరిగిన కుట్రగానే గమనించాలి.
జోగినిగా పెద్ద కులాలకు చెందిన స్త్రీలను ఎన్నుకోరు. దళిత కుటుంబంలోని స్త్రీలు ఏదో కష్టంలో తమకు పుట్టిన బిడ్డని జోగినిగా మారుస్తామని అనుకుంటారు అట. ఊరి పెద్ద నిర్ణయంతో తరువాత ఆ కుటుంబాలలో ఆడపిల్లలు జోగినులుగా మార్చబడతారట. దీనికి వప్పుకోకపోతే ఊరికి అరిష్టం అనే ప్రచారం ఉంటుంది. దీనితో ఆ ఆడపిల్లల తల్లి తండ్రులకు తమ పిల్లల భవిష్యత్తుని నిర్ణయించే హక్కు లేకుండా పోతుంది. ఊరి బాగు పేరుతో తమ బిడ్డను బలి చేయకతప్పదు వారికి. ఏ ఊరిలో జోగినీ కుటుంబీకులయినా తమ బిడ్డకు వివాహం చేయ సంకల్పిస్తే, ఆ ఊరిలో ఏ చిన్న ప్రమాదం జరిగినా, అది ఆ అమ్మోరు కోపం అని ఆ పెళ్ళి పెటాకులు చేసి మరో జోగినీగా ఆ అమ్మాయిని మారుస్తారు ఊరి వాళ్లు. దీని వెనుక ఆ ఊరి పెద్దల స్వార్ధం కూడా ఉంటుంది. ఈ పెద్దలు అగ్ర కులాలకు చెందిన వ్యక్తులే అయి ఉంటారు. ఒక వేళ ఎవరయినా కాస్త తక్కువ కులానికి చెందిన వారు అధికార స్థానంలో ఉన్నా అధికారమనే ముసుగులో వీళ్లు కూడా ఈ పద్దతులను సమర్ధిస్తూ, తద్వారా తమ అవసరాలు తీర్చుకుంటూ ఉండడం జోగిని వ్యవ్యస్థ అంత బలంగా పాతుకుపోవడానికి కారణం అయింది.
జోగిని వ్యవ్యస్థ గురించి తాను సేకరించిన సమాచారాన్నంతా ఈ నవలలో పొందుపరిచారు రచయిత్రి. విద్య అనే ఓ యువతి ఓ ఊరికి రావడం, అక్కడ ఉండే జోగినుల గురించి తెలుసుకోవడంతో నవల మొదలవుతుంది. వారి గురించి సమాచారం సేకరించాలని దళితవాడలో ఓ చివర్న ఉన్న ఈ జోగినుల ఇంటికి ఆమె తరుచూ వెళుతుంది. అక్కడే ఓ జోగిని కుటుంబంతో పరిచయం పెంచుకుంటుంది. మూడు తరాల నుండి జోగినులుగా జీవిస్తున్న ముగ్గురు స్త్రీలతోనూ, ఆ ఇంట్లో మరో చిన్న పాపతోనూ ఆమె స్నేహం పెంచుకుంటుంది. తరువాత రీసెర్చ్ కోసం జోగినీల జీవితాలనే విషయంగా తీసుకుని పని చేయాలని నిశ్చయించుకుంటుంది. ఆ జోగినీ కుటుంబంలో మూడవ తరానికి చెందిన పోశవ్వ ఈ నవల కథానాయిక. ఆమెలో మొదటి నుంచి ఓ కసీ కోపం ఉంటాయి. తన తండ్రి ద్వారానే ఆమె ఓ బిడ్డకు తల్లి అవుతుంది. ఇది ఆమెను ఎప్పుడూ బాధిస్తూ ఉండే విషయం.
చదువు మధ్యలో ఉండగానే, విద్య తన ప్రొఫెసర్ తమ్ముడితో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపొతుంది. ఈ లోగా ౩౩% మహిళా రిజర్వేషన్ల పుణ్యమా అని అనుకోని పరిస్థితులలో ఆ ఊరికి సర్పంచ్ అవుతుంది పోశవ్వ. ఆ ఊరి పెద్ద రాజాగౌడ్ కొన్ని రాజకీయ కారణలతో జోగవ్వను తమ పార్టీ ప్రతినిధిగా నిలబెట్టి ఆమె గెలుపు కోసం కష్టపడతాడు. ఆ అనాగరిక స్త్రీని ఎదురుగా పెట్టుకుని తాను ఆమె వెనుక చక్రం తిప్పుదామన్నది అతని పన్నాగం. కాని కొందరి సహాయంతో పోశవ్వ ఈ ఎత్తుగడ అర్ధం చేసుకుని తానే అన్ని పనులు నేర్చుకుని తన భాద్యతల్నినిర్వర్తించడం మొదలు పెడుతుంది. అలా ఆమె గొప్ప ప్రజా ప్రతినిధిగా ఎదుగుతుంది. రాష్ట్ర స్థాయిలోనూ దేశీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకుంటుంది. అమెరికాలో ఉంటున్న విద్య ఓ పేపర్లో వచ్చిన ఇంటర్వ్యూ చూసి పోశవ్వ గురించి తెలుసుకుని సంతోషిస్తుంది.
అయితే నవల రచనా శైలిలో కొన్నిలోపాలున్నాయి. కథ చెబుతున్న క్రమంలో ఉత్తమ పురుష మధ్యమ పురుషలోకి మారిపోవడం జరిగిపోతూ ఉంటుంది. కొన్ని సంఘటనలు సాగదీసినట్లు, కొన్ని సంఘటనలు త్వరత్వరగా జరిగిపోతూ కనిపిస్తాయి. కథా వస్తువు కాల వ్యవ్యధిలో కూడా ఓ క్రమాన్ని రచయిత్రి అనుసరించినట్లు అనిపించదు. విద్య ప్రస్తావన హఠాత్తుగా ఆగిపోయి పోశవ్వ రాజకీయ జీవితం మొదలవు తుంది. ఆఖరి పేజీలో విద్యను చూపించి కథను ముగించారు రచయిత్రి.
ఇందులో జోగినీ సమస్యతో పాటు, దళిత జీవనం, మూఢవిశ్వాసాలు,రాజకీయాలలో స్త్రీల జీవితం, రిజర్వేషన్లు ఇలా చాలా విషయాలను కలుపుకుంటూ వెళ్ళారు. పోశవ్వలో వచ్చిన రాజకీయ చైతన్యం చాలా త్వరత్వరగా జరగడం కనిపిస్తుంది. కొన్ని సార్లు ఆమె చేసే పనులు ఆమె నేపధ్యంతో పోలిస్తే సాధ్యమేనా అని అనిపించక మానవు. కాని జోగినీ వ్యవ్యస్థలో జీవించిన స్త్రీ కూడా అవకాశం వస్తే చాలా గొప్పగా ఎదగగలదనీ, ఎందరికో మార్గదర్శకం కాగలదని చెప్పడం రచయిత్రి ఉద్దేశం అన్నది మాత్రం స్పష్టం అవుతుంది.
ఈ నవల ద్వారా జోగినీల జీవితాలు, తెలంగాణ ప్రాంతపు పల్లెటూర్లలోని ఆచారాలు, మూఢవిశ్వాసాలు, కుల వ్యవస్థ గురించి చాలా సమాచారం ఇచ్చారు రచయిత్రి. వీరిని బాగు చేయాలని ప్రయత్నించిన అమ్మ పాత్ర శ్రీమతి హేమలతా లవణం గారి స్పూర్తితో తయారయిందని అనిపిస్తుంది. రచయిత్రి కూడా లవణం దంపతులతో కలిసి జోగిని దురాచార నిర్మూలన కార్యక్రమాలలో పాల్గొన్నానని, జోగినీ జీవితాలను గమనించి ఆ అనుభవంతో వారి కథలనే తీసుకుని ఈ నవల రాసానని చెప్పారు.
మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న ఎన్నో దురాగతాలు మనకు పూర్తిగా తెలియవు. జోగినీ అనే పేరు విని ఉన్నా వారి జీవితాల గురించి చాలా తక్కువ తెలుసు మనకు. తరతరాలుగా మన చుట్టూ స్త్రీల పై జరుతున్న దోపిడి గురించి సంపూర్ణంగా తెలుసుకోలేక పోవడం వలనే స్త్రీ పురుష సంబంధిత చాలా విషయాల పట్ల మనకు సంపూర్ణమైన అవగాహన లేదు. ఆర్ధికంగా, సాంస్కృతికంగా, మత పరంగా, కూడా వేళ్లూనుకుని ఉన్న వివక్ష పట్ల స్పష్టమైన అవగాహన రావాలంటే, ఇలాంటి జీవితాల గురించి తెలుసుకోవడం అవసరం. ఈ నవల ఆ అవసరాన్ని తీరుస్తుంది. ప్రత్యక్షంగా జోగినుల మధ్య సమయం గడిపి వారిని గమనించి, వారి స్థితిగతుల వెనుక ఉన్న అన్ని రకాల కారణాలను విశ్లేషించి ఆ అనుభవంతో రచయిత్రి రాసిన ఈ నవల ‘జోగినీ’ వ్యవ్యస్థపై మనకు దొరికిన ఫస్ట్ హాండ్ ఇన్పర్ప్మేషన్. అందుకే ఈ నవల రచనా శైలిలో లోపాలను కూడా పక్కనపెట్టి మనకెవరికీ తెలియని దోపిడి గురించి చర్చించిన రచయిత్రిగా శాంతి ప్రబోధగారి ఈ ప్రయత్నాన్ని అభినందించాలి.
*****
హిందీలో పీ.ఎచ్.డీ చేసారు. రైల్వే జూనియర్ కాలేజీలో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. స్ప్రెడింగ్ లైట్ పేరుతో తార్నాకలో బుక్ క్లబ్ నడుపుతున్నారు. దాదాపు 1000 పుస్తక సమీక్షలు, 1500 సినిమా సమీక్షలు రాసారు.