వ్యాధితో పోరాటం-12

కనకదుర్గ

          8వ నెలలో మళ్ళీ ఒక అటాక్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళారు. నొప్పి ప్రాణం పోతుందేమో అన్నంతగా వచ్చింది. నేను అంబులెన్స్ కి కాల్ చేయమంటే ఎందుకు నేను తీసుకెళ్తాను అంటాడు శ్రీని. మనమే కార్ లో వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాలి, ట్రాఫిక్ ఎక్కువగా వుంటే ఆగిపోతాము, ఇక నొప్పితో ఏం జరిగినా ఏం చేయడానికి వుండదు. అదే అంబులెన్స్ అయితే వాళ్ళకి ట్రాఫిక్ లో క్లియరెన్స్ వుంటుంది. అదీ గాక పారామెడిక్స్ మనని జాగ్రత్తగా అన్నీ చెక్ చేస్తూ, అంటే బీ.పి, చెక్ చేస్తూ, అవసరమైతే ఆక్సీజన్ పెట్టి, హాస్పిటల్ వారికి, తీసుకొచ్చే పేషంట్ గురించి అన్నీ డిటైల్స్ ఇచ్చేస్తుంటారు. కాబట్టి ఎమర్జన్సీలో మనం వెళ్ళగానే వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తారు. శ్రీనికేమో తనే అంబులెన్స్ కంటే త్వరగా తీసుకెళ్తాననుకునేవాడు. నేను రానని అంబులెన్స్ కి నేనే కాల్ చేస్తానంటే అపుడు చేసేవాడు. అలా ఎమర్జన్సీకి వెళ్ళగానే నరంలోంచి నొప్పి మందు ఇచ్చారు. నొప్పి తగ్గుతుంది అనుకుంటుండగా కాన్పు నొప్పులు మొదలయ్యాయి. అపుడు ఈ హాస్పిటల్ లో త్వరగా డెలివరీ అయ్యేవారి కోసం ప్రీ నేటల్ కేర్ స్పెషల్ వార్డ్ లేదు. వెంటనే మరో హాస్పిటల్ కి అంబులెన్స్ లోనే పంపించారు.

          ఇక్కడ చూసే గైనకాలజిస్ట్స్ అక్కడ కూడా వచ్చేవారు. వారంలో కొన్ని రోజులు మేన్ లైన్ హాస్పిటల్ లో తర్వాత ఈ హాస్పిటల్ లో కొన్ని రోజులు పని చేసేవారు.

          నన్ను అడ్మిట్ చేసుకోగానే ఒక గైనకాలజిస్ట్ వచ్చి, నా చేతులు పట్టుకుని, “నన్ను క్షమించు ప్లీజ్! నువ్వు అడిగావు పాన్ క్రియటైటిస్ పేషంట్స్ ప్రెగ్నెంట్ అయితే ఎలాంటి సమస్యలొస్తాయి, వస్తే ఎలా ట్రీట్ చేస్తారు చూసి చెప్పమని కానీ నేను సీరియస్ గా తీసుకోలేదు. మా దగ్గరకు అలాంటి కేసులు రాకున్నా వేరే హాస్పిటల్స్ లో వచ్చాయేమో, వస్తే ఎలా ట్రీట్ చేసారు కనుక్కుని నేను చెప్పాల్సింది. నాకు చాలా సిగ్గుగా, బాధగా, నీ బాధకి నేనే కారకురాలనయ్యానేమో అనిపిస్తుంది. కానీ నీకు మాటిస్తున్నాము మా టీం మొత్తం కల్సి నీకు, నీ బేబికి ఏం కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం!” అని చెప్పింది. అప్పటికే మందు మత్తులో వున్నాను నేను, అయినా అప్పటికే పాప ఎలా వుందని చాలా సార్లు అడిగాను.

          హార్ట్ మానిటర్ తీసుకొచ్చి పెట్టి వినిపించారు. “వాటే స్ట్రాంగ్ బేబీ. చూడు ఎంత గట్టిగా, బలంగా గుండె కొట్టుకుంటుందో! తను బాగుంది! ఇపుడు నువ్వు నీ గురించి ఆలోచించాలి. నువ్వెంత ధైర్యంగా వుంటే పాప అంత ధైర్యంగా వుంటుంది. నీ లాగే ఫైటర్ బేబీ!”

          సగం మత్తులో, సగం మెలుకువలో వున్నా కూడా, “బేబీ కి హర్ట్ అవుతుంది! టేక్ హర్ అవుట్, ఇంక్యుబేటర్ లో పెట్టండి ప్లీజ్! నాలో వున్నంత సేపు దానికి కష్టం అవుతుంది. అది తట్టుకోలేదు. డెలివరీ చేసేయండి ప్లీజ్!” అని అడుగుతూనే వున్నాను.

          గైనకాలజిస్ట్స్ అందరూ కల్సి మీటింగ్ లో ట్రీట్మెంట్ ఏం ఇయ్యాలి, ఎలా ఇయ్యాలి? పాపని వీలయినంత వరకు తల్లి గర్భంలోనే వుంచడానికి ప్రయత్నించాలని నిర్ణయం తీసుకున్నాక ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.

          మరో నాలుగు వారాలయితే డెలివరీ ఎపుడైనా పరవాలేదు. ఇప్పుడైతే పాప 4 పౌండ్లుంది, ఇంక్యుబేటర్లో పెట్టాల్సి రావొచ్చు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.