బతుకు చిత్రం-25

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది .

***

          నామయ్య తో తన సమస్యను చెప్పుకొని పరిష్కారం పొందాలనుకొని చెప్పడం మొదలు పెట్టింది.

          బాపూ ! నీ కోక కథ చెప్తా. విని న్యాయం ఎట్లా నో నువ్వేచెప్పే. అని తన కథలాగా
కాకుండా వేరే పిట్టల కథలా మొదలు పెట్టింది.

          ఓకే చెట్టు మీద ఒక పావురం ఉండేది. అది కొంచెం అందంగ లేకుండే. దానికి చాలా
దినాలదాకా తోడు దొరకలే. ఓపారి బాగా జోరున వాన పడుతున్న సైమమున ఒక తోడు గూడు కూలి ఎగురుతూ వచ్చి ఈ పావురం దగ్గర ఆ రాత్రికి సేదతీరింది. తెల్లారి పోయేటప్పుడు ఈ సాయానికి నన్ను ఏమివ్వమంటావని అడిగింది. దానికి ఈ పావురం తనను లగ్గం జేసుకోమ్మన్నది. మాట ఇచ్చినందుకు ఆ పావురం సంతోషంగా ఒప్పు కున్నది. కొన్ని దినాలదాకా అవి సంబురంగ ఉన్నంక ఈ పావురానికి తనది తనకే అసహ్యం అనిపించవట్టింది, ఎందుకంటే తను సాయం చేసినట్టే చేసి ఎంతో అందమైన ఆ పావురాన్ని బలిమికి లగ్గం చేసుకునేలా చేశానని ………..అంటూ

          చెప్పుకుపోతున్న జాజులమ్మ పెద్ద పెట్టున నామయ్య ఒక్కసారిగా నవ్వడం
మొదలు పెట్టేసరికి చెప్పడం ఆపి చిత్రంగా తనవైపే చూడసాగింది.

          నామయ్య ,నవ్వడం ఆపకుండానే ,
తల్లీ !నన్ను చిన్న పిల్లాన్ని చేసి ఏదో పిట్టకథ చెప్పుకు పోతున్నావ్. నాకు బాగా
అర్థమైంది. ఏందంటే, నువ్వేదో మానసిక ఆందోళనతో గుబులు పడుతున్నావ్. దానిని ఇలా బయట పెడుతున్నావ్. కొద్ది పరిచయం ఉన్న నాతో ఇలా మాట్లాడుతున్నావంటే, నన్ను నిజంగా నమ్మి అసలు సంగతి చెప్పవచ్చు కదా !అన్నాడు నవ్వి ఆపి.

          నిజమేనే నాయనా ! నా మతి ఆజ్ఞ తప్పింది. ఎవలకు చెప్పుకోవాల్నో సుత తెలియని పరిస్థితి లో ఉన్నా. అని రాజయ్య మాట్లాడిన సంగతి గురించి చెప్పింది.
బిడ్డ ! ఎనుకటి మనిషి లెక్క న ఉన్నట్టున్నది కదా ? ఆయన ? మగపిలగాడు, వారసుడు అని ఇంకా పట్టుకు వేళ్ళాడుతున్నడంటే ఆయనను మార్చే తరం నీ వల్ల అయితదను కుంటే ధైర్యంగా నిలబడు. లేదంటవు ఆయన చెప్పిన తీరుగ నీకు మేలు చేసిండు కాబట్టి తప్పుకొని మల్ల లగ్గమన్న చెయ్యి. ఇండ్ల ఇంక్నో ముచ్చట ఏందంటే మీ ఆయన
ఇంకొగరిని ఇష్టపడి తెచ్చుకుంటే మాత్రం ఒప్పుకోకపోయే దానివా? నీకు తెలిసి నీ
చేతుల మిద జరిపించు అన్నదానికి ఎందుకు ఎదురుతిరిగి ఎరెల్లి ఈ వయసుల మీ నాయనకు తీరని శోకం బెడుతవ్. కమల నీ దోస్తే కాబట్టి లగ్గం జేసి ఆమెకు గూడ ఓ దారి
చూపించరాదు? కావాలని కట్టాలను కౌగిలించుకోవడం అవసరమా? చెప్పు? అన్నాడు లగ్గం చేయడమే మంచిది అన్నాట్టుగా .

          అలా చాలా సేపు అక్కడే కూర్చుని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినదై ఊరు
బయలుదేరింది. 

          కమల జాజులమ్మను చూసి, ముందు ఆశ్చర్య పోయినా, తేరుకొని ఏమయిందే? అప్పుడే వచ్చినావ్? బిడ్డను నేను కోసుక తింటానని గిన వచ్చినవా? ఒక్క రాత్రికే? అని అడిగింది. నవ్వుతూ.

          అమ్మా !అని వచ్చి బిడ్డ, వాటేసుకొంగానే వల వలా ఏడ్చింది. జాజులమ్మ తీరు చూసి కమల కంగారు పడుతూ నేనేదో నవ్వులాటకు అడిగిందానికే ఇంతలాఇదవుతున్నా వేమిటే? ఇప్పుడే తీసుకొని బయలు దేరు, నేను ఉండమంటే అడుగు అంటూ ఓదార్చ సాగింది.

          కొంత నిదానించి నేను నాయన కాడికి పొయ్యొస్త. బిడ్డను ఈన్నే ఉంచుకో అని తన
ఇంటికి చేరుకుంది. పీరయ్య జాజులమ్మను చూసి సంతోషించినా, మనుమరాలును కమల దగ్గరే వదిలిరావడంతో కొంత చిన్నబుచ్చుకున్నాడు .

          నాయనా! నేను నీ తోని మాట్లాడే పని వెట్టుకొని వచ్చిన. అందుకే బిడ్డను తోలుకరాలే. అని రాజయ్య తనతో మాట్లాడిన సంగతిని తండ్రికి చెప్పింది. పీరయ్య, ఉగ్రమూర్తి అయ్యిండు. ముగ్గురు బిడ్దలున్న వానీ మారు మనువా? అందుకు
నువ్వు సరే అనాలా? ఇదెక్కడి అన్యాయం? నేను ఇప్పుడే మనోల్లందరినీ కూడగడుత. అందరికి జెప్పి వాని సంగతేందో అడుగుత అని ఊగిపోసాగాడు.

          నాయనా !ఆవేశపడకు. నిదానించు. నీ అల్లునికి ఇంకా ఈ ముచ్చటే తెలువది. నువ్వు తొందరపడకు. ఏ తండ్రికైనా మగపిలగాడు ఉంటె బాగుంటదనే ఉంటది. మామకు మాత్రం మనుమడు కావాలని ఉండడంలో తప్పేమున్నది?

అంటే ?

          ఏమి లేదు ఆయన కోరుకున్నట్టే కమలను ఒప్పించి లగ్గం జేత్త, అన్నది స్థిరంగా.
పీరయ్య షాక్ లోనే ఉండి పోయి ఏమి మాట్లాడలేదు. కమల ఇల్లు చేరుకొని విషయం చెప్పి ఆలోచించుకొని మళ్ళీ తమ ఊరు రమ్మని చెప్పి బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చింది.

          దారిలో తనలో కమల ఒప్పికుంటే సైదులును ఎలా ఒప్పించాలని ఆలోచన చేసింది. ఈర్లచ్చిమి జాజులమ్మను కనిపెట్టి ఆరా తీసింది .

          మామకు బుద్దిలేకపాయే ! నీ బుద్ది ఏమైనట్టు? బంగారు కత్తి అని మెడకాయ కోసుకో గూడదు. కమల కష్టంలోనే ఉంది కావచ్చు కాని, నీకు సవతిని చేసుకోకు. కమల కాకపోయినా, మామ ఇంకెవరినైనా తెచ్చి చెత్తా అని బలంగా ఉన్నప్పుడు ఎదురు తిరిగి గొడవలు తెచ్చుకునుడు అవసరమా? అని పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతుండగా రాజయ్య రావడంతో, ఈర్లచ్చిమి, నీకు మెదడు గిన మోకాళ్ళ జేరిందా? పొల్లకు ఏమి నూరిపోసినవ్.. అని తిట్ల దండకం అందుకోగానే, రాజయ్య ..

          మొదలు లగ్గం నీ ఇష్టం మీద అయింది. ఇప్పుడన్నా నేను చెప్పినట్టు ఇని
నడుచుకుంటే మంచిది. లేకుంటే ఈమె గాకుంటే ఇంకోగరు. అని చాలా నిర్లక్ష్యంగా
మాట్లాడుతుండడంతో, ఈర్లచ్చిమి, నీకు ఇట్లా బుద్ది రాదు,స్టేషన్ కు తొలక పొయ్యి పెయ్యి వాయగోడితే సక్కగైతవ్! మల్ల మెదడుల ఉన్న జేజమ్మ దిగుతది. అన్నది ఆవేశంగా.

          జాజులమ్మ అడ్డుపడి, అత్తమ్మా! అట్లనకు. ఇంతవరకు పరువుగా బతికినోళ్ళం ఇప్పుడు బజార్లపడద్దు అదీ ..!నా వల్ల, నాకు అస్సలు ఇష్టం లేదు. నీకు చాతనైతే కొడుకును ఒప్పియ్యి, ఇంతకు మించి చేసేదేం లేదు అన్నది.

          జాజులమ్మ మాటలకు ఇర్లచ్చిమి అక్కడి నుండి బాధతో వెళ్లిపోయింది. రాజయ్య, అదేందమ్మ? నేను వానితోని మాట్లాడుతా! అని సంతోషంగా కదిలాడు.

          వారం, పది దినాలు ఇల్లు రణరంగంగా మారగా ఎట్టకేలకు సైదులు అంగీకరించాడు,

***

          కమల తిన్న ఇంటి వాసాలు లేక్కవేట్టినట్టు అవుతుందేమోనని కాసేపు, తానూ కాక
పోయినా వేరే వాళ్ళనైనా తెచ్చి చేసే పిచ్చిలో ఉన్న రాజయ్య పట్టుకు తను చేసుకొని తన ఆస్తిని స్నేహితురాలికి కూడా చెందేటట్లు చేయడంలో తప్పేముందని లగ్గం చేసుకోవడానికే నిశ్చయించుకుంది.

          అందరూ తలా ఒక మాట విసిరినా పట్టించుకొనే స్థితిలో ఆ కుటుంబం లేక పోయింది. రాజయ్య జాజులమ్మను, మనుమరాళ్ళను మునుపటికంటే ఆప్యాయంగా చూసుకోసాగాడు. జాజులమ్మ కూడా అన్నీ మర్చిపోయి కమలకు కొడుకు పుట్టాలని కోరుకుంది.

          అప్పుడప్పుడూ ఏవేవో పీడకలలు మనసును బాధిస్తూ నిద్ర లేకుండా చేస్తున్నా
పట్టించుకోకుండానే మెదలసాగింది. ఉన్నట్టుండి ఓ రోజు ఈర్లచ్చిమి, పని చేస్తున్నదల్లా ఛాతిలో నొప్పిగా ఉందని తల్లడిల్లడం మెదలుపెట్టింది. దేవతక్క దగ్గరికి పరుగుతీసి ఇంటికి తీసుకువచ్చింది. ఆమె చూసి నొప్పి తగ్గడానికి మాత్రలు ఇచ్చింది, కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నది. జాజులు కు గుండె నొప్పి కావచ్చునని చాలా భయం పట్టుకుంది. అదే విషయం అడిగింది.

          దేవతక్క సాయంత్రం వీలు చూసుకొని ఒకసారి ఇంటికి రా! నీతో మాట్లాడాలి అన్నది. అంటే ఏమైనా ప్రమాదమా? అడిగింది.

          మరేమీ లేదు.పెద్దగా భయపడే పనేమీ లేదు, చాలా బలహీనంగా ఉంది. బలానికి మంచి తిండి పెట్టాలి దాని గురించి చెప్తాను. అంతే అని, తప్పకుండా రమ్మని చెప్పి
వెళ్లిపోయింది.

          కమల, రాజయ్య,సైదులు, పిల్లలు అందరూ దిగాలు మొకాలు ఏసుకొని కూచోవడం చూసి జాజులమ్మే అందరికీ ధైర్యం చెప్పింది. ఈర్లచ్చిమి అందరిని అలా చూసి బాగా ఏడ్చింది. నీ పానానికి నా పాణం పొసైనా సరే అత్తా !నిన్ను కాపాడుకుంటా. నువ్వు నా అమ్మవు. అని జాజులమ్మ కూడా బాగా ఏడ్చింది.

***

          ఆ సాయంత్రం దేవతక్క దగ్గరకు వెళ్ళింది.

          జాజులూ! మీ అత్తమ్మ చెప్పిన లక్షణాలను బట్టి నాకున్న అనుభవంతోనూ, నేను చూసిన వారిని బట్టి ఇది రొమ్ము క్యాన్సరు అని అనిపిస్తున్నది. అనగానే, క్యాన్సరా? అని కుప్పకూలిపోయి ఏడవడం మొదలుపెట్టింది.

          కావచ్చు, కాక పోవచ్చు. అనుమానం మాతరమే, ఒకవేళ అయినా నువ్వు నిబ్బరం
కోల్పోకుండా నేను చెప్పినట్టు చూసుకోవాలి. ఇది సరిగ్గా నిర్దారించడానికి ఈ చుట్టుపక్కల ఎక్కడా సరైన వసతులు లేవు. అందుకని పట్నం వెళ్ళాలి. డబ్బుతో కూడిన వ్యవహారం. పేదవాళ్ళకు రావలసిన జబ్బుకాదిది. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడే ఈ సంగతి ఎవరితోనూ, ముఖ్యంగా అత్తకు తెలియనీయకు, నువ్వూ చాలా ధైర్యంగా ఉండాలి అని వాడవలసిన మందులు ఇచ్చి తనకు తెలిసిన ఒక మంచి డాక్టర్ తో
మాట్లాడి ఆయన సలహాతో పెద్దాసుపత్రికి వెళ్దామని చెప్పి పంపించింది. జాజులమ్మ మనసు అదుపు తప్పింది. ఒకదాని వెనుక ఒకటి ఏమిటి తనకు ఈ కష్టాలు ?దేవుడా? ఈ ప్రమాదం నుండి అత్తను గట్టేక్కించు సామీ! అని దారిలోనే గుడికి వెళ్ళి తడిబట్ట స్నానం చేసుకొని గుడి చుట్టూ పొరలు దండాలు పెట్టి తనివి తీరా ఏడ్చి కన్నీళ్ళతో లింగమయ్యకు అభిషేకించి ఇల్లు చేరుకుంది.

అత్త నొప్పి తగ్గిందేమో! పిల్లలను దగ్గర కూచోపెట్టుకొని

చందామామ చందామామ
సారపప్పు పెట్టామాకు
అల్లుడత్తే పంపాబాకు
మామ వత్తే మళ్ళీ రమ్మను
చద్దీ గట్టా గుడ్డా లేదు
నేనింకా చిన్నాదాన్నే
చుట్టూ పక్కల అమ్మాలక్కలు
హాత్చ్ !అని తుమ్మనన్న తుమ్మారేమే

అని చక్కగా పాడుతూ డ్యాన్సు చేపిస్తున్నది. జాజులమ్మ అత్త ఇలాగే ఇంకో పది కాలాలు కళ కళలాడాలని తపించి పోయింది. ఈర్లచ్చిమి అడిగింది, జాజులూ! అక్క ఏమన్నదే ?అని. ఏమిలేదత్తా! నువ్వు ఇగ పనులు చేసుడు ఆపి కడుపునిండ తిని కంటినిండ నిద్ర పోతే అన్ని బాగైతయ్ అని చెప్పింది అన్నది. బట్టలు తడిగా ఉండడం చూసి, ఇదేందే తడిసి వచ్చినవ్? అన్నది. వచ్చుకుంట లింగమయ్య గుడికి పోయి దండం పెట్టుకొని వచ్చిన. నీ పానానికి ఏమి డోకా లేదు అని విభూతి పెట్టి ప్రసాదం తినిపించింది. ఈర్లచ్చిమి నాకు పాణం బెట్టె బిడ్డున్నంక యమధర్మరాజు నన్నేట్ట ఎటకపోతడే? అన్నది.

          ఆ మాటలకు జాజులమ్మకు నీళ్ళు ఆగలె. కనబడకుండా వెనుదిరిగి ఇంట్లోకి నడిచింది.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.