ఆలాపన

-బండి అనూరాధ

 
నిదానంగా కురిసే ప్రేమని 
పెనుగాలులు అసలేమీ చెయ్యలేవు. 
దీపాలు కొండెక్కడం మామూలుకాదు. 
నానాతంటాలూ పడి ఏదో అనాలని చూస్తారుకానీ 
కాంతిలో తేలిపోతారు
 
ఎవరివి హృదయాలని వెతకకు
ఎక్కడ మనుష్యులూ అని తిరుగకు
విరిగిపోయిన ముక్కల్లో లెక్కలు చూడకు
దూరమైనసూదుల్లాంటిభావాల్లో తలనుదూర్చి
నిన్ను నువ్వు గుచ్చుకోకు
గ్రహించు
దారంలేనివి ఆధారాలు కావెప్పుడూ 
 
అయినా పలకరింపుల్లేని ప్రేమల్లో విహరించడం
ద్వంద్వాల్లో మరణించడం
ఇప్పుడసలేమీ బాగోదు
 
సంధిచేసేవాళ్ళకి తెలియదు
విసిరివెయ్యబడిన రాళ్ళు మునిపటిలా దొరకవని
ఎరవేసేవన్నీ వ్యర్ధవెన్నెలప్రయత్నాలనీనూ
 
పెనుగాలులు నిజాలని కరుచుకుని 
ప్రేమని తెలుసుకునే రోజొకటి రావొచ్చు
ప్రయాణం తప్పనప్పుడు, ప్రేమ 
మృత్యువంత అందంగా ఉండితీరుతుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.