నారి సారించిన నవల-38
-కాత్యాయనీ విద్మహే
కేంద్రప్రభుత్వ సమాచార ప్రసార శాఖలో సంగీత నృత్య నాటక విభాగంలో సంగీత కళాకారిణి ఉద్యోగంలో ఉన్న రాజీ అదే సమాచార ప్రసారశాఖ మంత్రి అయిన మూర్తికి ఆంతరంగిక కార్యదర్శిగా బదిలీ అయ్యాక అప్పటి ఆమె అనుభవాలు వస్తువుగా వచ్చిన నవల మలుపులు. ఈ నవలలో ఫ్లాష్ బ్యాక్ కథన శిల్పం ఉంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితుడైన మూర్తి గారికి ఆంతరంగిక కార్యదర్శిగా ఢిల్లీ నుండి హిమాచల్ ప్రదేశ్ కు కారులో వెళ్తున్న రాజీ అనంత్ మరణం తరువాత అంతవరకు తనజీవితంలో జరిగిన విషయాల జ్ఞాపకాల తలపోతగా మలుపులు నవలలో కథ ప్రవర్తిస్తుంది. రాజీ నవల ఎమర్జన్సీ ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర ముగిస్తే మలుపులు నవలలో గతంగా కనిపించే ఘటనలు, సందర్భాలు , కదలికలు అన్నీ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా జనతా పార్టీ ప్రభుత్వాధికారం చేపట్టిన నుండి చరణ్ సింగ్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాలంలో సంభవించినవి. సంజయ్ గాంధీ మరణం (1980), పంజాబ్ అలజడులు , అస్సాం అల్లర్లు , భోపాల్ గాస్ లీక్ ప్రమాదం, ఇందిరాగాంధీ హత్య(1984) రాజీవ్ గాంధీ అధికారంలోకి రావటం, బోఫోర్స్ అలజడి, ఆర్ధిక సంస్కరణలు (1990) , మహిళా కమీషన్ ఏర్పాటు (1992) , బీజింగ్ మహిళా సదస్సు (1994) చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ బిల్లు ( 1996) మొదలైన వాటి ప్రస్తావనలను బట్టి స్థూలంగా ఈ నవలలో కథ ప్రవర్తించిన కాలం 1977 నుండి 2000 వరకు అనుకోవచ్చు. కథలో రాజీ కేంద్ర మంత్రికి ఆంతరంగిక కార్యదర్శిగనూ, రాజ్య సభలో అనువాదకురాలిగానూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన కాలం కనుక ఈ ప్రస్తావనలు ఇతివృత్త నిర్మాణంలో సహజంగా ఇమిడిపోయాయి. రాజీ రాజకీయ అవగాహనలో భాగమయ్యాయి.
అనువాదకురాలిగా రాజ్యసభ కార్యాలయానికి బదిలీ అయిన రాజీ ఉద్యోగ జీవిత అనుభవాల కథనంలో భాగంగా పార్లమెంట్ ఉభయసభల పనితీరు ఇతివృత్తంలో భాగం అయింది. చట్టాల ముసాయిదాల పరిశీలన మొదలైన విషయాల మీద ఏర్పడే కమిటీల సమావేశాల నిర్వహణ, పార్లమెంటు సమావేశాలు జరిగేప్పుడు ముందస్తుగా సభ్యులు వివిధ విషయాల మీద పంపే ప్రశ్నల స్వభావం, సమావేశ సమయంలో వాటికి ఉండే ప్రాధాన్యత, రాజ్యసభ సభ్యత్వం వల్ల వచ్చిన అధికారాన్ని ఆధిక్యతను, అవకాశాలను స్వప్రయోజనాలకు వాడుకొనే తీరు, ఉద్యోగులను ప్రలోభపెట్టే ప్రయత్నాలు, వాళ్ళపై చేసే పెత్తనం మొదలైనవి పాఠకులకు తెలియవస్తాయి. అలాగే రాజ్యసభలో ప్రశ్నల విభాగం, ప్రోటోకాల్ విభాగం వంటి వాటిలో ఇన్ ఛార్జ్ గా రాజీ పని సామర్ధ్య నిరూపణ ఇతివృత్తంలో భాగమయింది. ఈ క్రమంలో మహిళాభ్యుదయాన్ని గురించిన ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలు, వాటిని సంతృప్తి పరచటానికి ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు, ఆచరణ తీరు రాజీ దృక్పథం నుండి విశేషంగా చర్చకు వచ్చాయి. ఆ రకంగా ఈ నవలలో నమోదు అయింది, చట్టసభలలో మహిళా
1994 లో బీజింగ్ లో జరిగిన మహిళా సదస్సుకు భారతపార్లమెంటు స్త్రీ సభ్యులతో పాటు తోడుగా వెళ్లిన ఉద్యోగినులలో రాజీ కూడా ఉంది. ఔత్సాహిక సమాజ సేవాసంస్థల సమ్మేళనంలో మరునాటి ఆధికారిక సమావేశంలో జరిగిన చర్చలకు రాజీ ప్రత్యక్ష సాక్షి. వివిధ దేశాల నుండి వచ్చిన స్త్రీలు పురుషుల వల్ల స్త్రీలు పడుతున్న శారీరక మానసిక హింసల గురించి, లేని పౌరహక్కుల గురించి అవకాశాల గురించి, భారతీయ ప్రతి నిధులు వరకట్న వేధింపులు, చావులు, బలాత్కారాలు వంటి వాటి గురించి మాట్లాడటం తప్ప స్త్రీల పరిస్థిని మెరుగుపరచటానికి తమదేశాలలో జరుగుతున్న ప్రయత్నాల గురించి అసలు మాట్లాడలేదన్నది రాజీ గుర్తించింది. భారతదేశంలో అప్పటికి జాతీయ మహిళా కమీషన్ ఏర్పాటుతో ఆ దిశగా ప్రారంభమైన ప్రయత్నాలను అప్పటికప్పుడు ఒక పేపర్ మీద వ్రాసి ఒక ప్రతినిధికి ఇచ్చి సభలో ప్రస్తావనకు వచ్చేట్లు చేసింది. అలాగే ఆధికారిక సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు ధనశ్రీ చదవటానికి వీలుగా స్థానిక పాలనలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగ చట్టంలో మార్పు తెచ్చిన విషయం రాసిచ్చింది రాజీ. అది చదవటమే కాక ధనశ్రీ ఒక ప్రశ్నకు జవాబుగా శాసన సభలలో పార్లమెంటులోనూ స్త్రీలకు అలాంటి అవకాశం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్న విషయం కూడా చెప్పింది. ఆ రకంగా ప్రపంచమంతా ప్రజాస్వామ్య వ్యవస్థలో స్త్రీలకు తగినన్ని స్థానాలు లేవని అనుకొంటున్న తరుణంలో భారతదేశంలో ఆ దిశగా మొదలైన మార్పును బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిగా రచయిత్రి ఈ నవలలో నమోదు చేసింది.
అమెరికా నుండి లా విద్యార్థులతో సమ్మర్ కాంప్ కు ఇండియా వచ్చిన ఒక ప్రొఫెసర్ తన బృందంతో పార్లమెంట్ భవనం చూడాలని కోరినప్పుడు ఆ ఏర్పాట్లు చూసింది రాజీ. ఆమె న్యాయశాస్త్రం చదివిందని తెలిసి ఆప్రొఫెసర్ రాజీని తమతోపాటు రమ్మని కోరింది. ఆ రకంగా ఆమె జమైకాకు వెళ్ళింది. అటు నుండి న్యూయార్క్ వెళ్ళింది. ఎక్కడికి పోయినా ఆమెకు ఆసక్తికర అంశం అక్కడి స్త్రీల పరిస్థితి గురించి తెలుసుకొనటం. స్త్రీల విషయంలో జరిగే చర్చలను వినటం. న్యూయార్క్ లో ఆమె ఉన్న ఆ రెండు రోజుల్లో దక్షిణాసియా దేశాల్లో స్త్రీల ప్రతిపత్తిని గురించిన నివేదికను విడుదల చేశారు.మిత్రులతో కలిసి ఆ సమావేశానికి వెళ్ళటమే కాదు, ఇండియాలో స్త్రీలపట్ల జరుగుతున్న అకృత్యాలను ఏకరువు పెట్టిన భాగాన్ని విని స్పందించకుండా ఉండలేక పోయింది. ఇక్కడ కూడా ఆమె స్త్రీల పై జరుగుతున్న దురాగతాలను వర్ణించటమే కానీ వాటిని అరికట్టటానికి జరుగుతున్న ప్రయత్నాలను , రూపొందింస్తున్న కార్యక్రమాలను ఎవరూ ప్రస్తావించటం లేదన్నదే ఆమె ఆరోపణ. భారతదేశంలో జాతీయ కమీషన్ ఏర్పాటును, అత్యా చారాల విషయంలో శిక్షస్మృతిలో జరుగుతున్న చేర్పులను , మార్పులను పేర్కొన్నది. భారతదేశంలో ఒక స్త్రీ ప్రధానమంత్రి అయిన విషయాన్ని గుర్తుచేస్తూ నివేదికలో కారుమేఘాలే చూపారు కానీ వెండి అంచులను చూపనైనా లేదు అని నిష్ఠురపడింది. ఆసియా దేశాల పట్ల పశ్చిమ దేశాల చిన్నచూపు ఫలితమా ఇది అన్న ప్రశ్నతో ముగించింది.
అయితే చట్టసభలలో స్త్రీలకు మూడవవంతు సీట్లను కేటాయించటానికి రూపొందించిన బిల్లు 1996 సెప్టెంబర్ 12 న పార్లమెంటులో ప్రవేశపెట్టబడినప్పటికీ దాని మీద అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. స్త్రీ పురుష ప్రజాప్రతినిధుల ఆక్షేపణలు ఎత్తిపొడుపులతో సభలు దద్దరిల్లాయి. రాజకీయ పార్టీలతో చర్చలు జరిగాయి. కొన్ని సంస్థలను, ప్రముఖ వ్యక్తులను, రాజ్యాంగ నిపుణులను పిలిచి అభిప్రాయాలను సేకరించటం జరిగింది. ఈ క్రమంలో వ్యక్తమైన భిన్నాభిప్రాయాలను నమోదు చేసి రచయిత్రి ఈ నవలను ఒక సోషల్ డాక్యుమెంటుగా చేసింది. మొత్తానికి ఇన్నాళ్లుగా రాజకీయాధికారం చెలాయిస్తున్న పురుషులు అందరూ పార్టీలతో నిమిత్తం లేకుండా రకరకాల సాకులతో బిల్లుకు మోకాలొడ్డుతున్నారనేది వాస్తవం. పురుషులు ఎన్నికలలో పోటీ చేస్తుంటే భార్యలు వాళ్లకు ప్రచారకులుగా మాత్రమే మిగిలిపోయిన స్థితిని పల్లకీ ఎక్కేవారు పురుషులైతే పల్లకీ మోసే పని స్త్రీలకు దక్కుతున్నదని రచయిత్రి అభిప్రాయం. ఆ బిల్లు 2010లో రాజ్య సభ ఆమోదం పొందినప్పటికీ లోకసభలో ఇప్పటికీ కోల్డ్ స్టోరేజిలోనే పడి ఉండటం పెద్ద విషాదం.
స్త్రీల పై దురాగతాలు-పోలీసుల బాధ్యత అనే అంశం మీద న్యాయకళాశాలలో ఏర్పాటైన ఒక చర్చాకార్యక్రమానికి రాజీ హాజరు అయిన సందర్భం ఒకటి ఈ నవలలో ఉంది. ఆ చర్చలో పాల్గొన్న న్యాయవాదిని, సంఘసేవికలతో రాజీకి పరిచయాన్ని, సంభాషణను కల్పించి గృహహింసకు సంబంధించిన వాస్తవ కథనాలను, పోలీసు న్యాయవ్యవస్థలు బాధ్యతో ప్రవర్తించ వలసిన తీరును, స్త్రీల పై హింసకు మగవాళ్ళను కఠినంగా శిక్షించాలనే వాదనను సవాల్ చేస్తూ అంతమాత్రాన నేరం జరగకుండా పోతున్నదా అన్న ప్రశ్నను చర్చలోకి తెచ్చింది రచయిత్రి. నేర ప్రవృత్తిని నియంత్రించ టానికి మానసిక శిక్షణను ప్రత్యామ్యాయంగా గుర్తించి పనిచేస్తున్న సంస్థలను, బాధిత స్త్రీలకు ఆవాసం కల్పించి ఆదరించే ప్రయత్నాలను కూడా ప్రస్తావించింది. ఈ రకమైన సామాజిక ప్రయత్నాలు, డిమాండ్ల ఫలితంగా స్త్రీలపట్ల దురాగతాలు గురించిన చర్చ ఆడవాళ్ళ వ్యవహారంగా భావించే కాలం దాటి పార్లమెంటు సభలలో పురుష సభ్యులే స్త్రీ సమస్యలను చర్చించటానికి ముందుకు వస్తున్న కొత్త పరిణామాన్ని గుర్తించి రచయిత్రి ఈ నవలలో నమోదు చేసింది. లా చదివింది కనుక చట్ట సభలలో ప్రవేశపెట్టే బిల్లులు చూసే పని కూడా రాజీకి అప్పగించబడింది. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ బిల్లుతో పాటు సభ్యులు వ్యక్తిగతంగా ఇచ్చిన ఆడవాళ్లకు ఇంటిపనిలో వారానికి ఒకరోజు సెలవు, బలాత్కారాల కేసులో నిందితులకు ఉరిశిక్ష వంటి బిల్లులను చదువుతూ అవి నెగ్గకపోయినా ఆసక్తికరమైన , ఆలోచనలు రేకెత్తించే బిల్లులని రాజీ అనుకొంటుంది.
నేర్చుకొనటం, పద్ధతి ప్రకారం బాధ్యతగా పనిచేయటం, నిజాయితీ ఉద్యోగులకు ఎంత హుందాను, గౌరవాన్ని తెచ్చిపెడుతుందో రాజీ వ్యక్తిత్వ నిర్మాణంలో చూపింది రచయిత్రి. మహిళల వృత్తిపర జీవితాన్ని ఇంత సమగ్రంగా సాధికారంగా చిత్రించిన రచయిత్రి మరొకరు కనబడరు.
సమాచార ప్రసారశాఖ మంత్రి అయిన మూర్తికి ఆంతరంగిక కార్యదర్శిగా రాజీ కొత్త బాధ్యతలు తీసుకొనటం దగ్గర మొదలై రాజ్యసభ కార్యాలయ ఉద్యోగంలో ఆమె దక్షతను నిరూపించిన మలుపులు నవల గవర్నర్ గా నియమితుడైన ఆ మూర్తి గారికే ఆంతరంగిక కార్యదర్శిగా రాజీ ఢిల్లీ నుండి హిమాచల్ ప్రదేశ్ కు మకాం మార్చటం దగ్గర ముగుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో ఆమె ఉద్యోగ అనుభవాల కథనం ‘మజిలీ’ నవల.
*****
(ఇంకా వుంది)
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.