జీవన లాలస
పుస్త‘కాలమ్’ – 16
(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )
-ఎన్.వేణుగోపాల్
జీవన లాలసే అంతిమ జీవన సాఫల్యం
(గత శనివారం వీక్షణం హడావిడిలో ఈ కాలమ్ రాయలేకపోయాను. ఇప్పుడు ఇక్కడ పంచుకుంటున్నది కూడ ఇప్పటికే వెలువడిన పుస్తకం పరిచయం కాదు. తొంబై ఏళ్ల కింది ఒక అద్భుత ఇంగ్లీష్ పుస్తకానికి ఈ నెలలో వెలువడనున్న తెలుగు అనువాదానికి నేను రాసిన ముందుమాట ఇది.)
ఎవరికైనా జీవితం మీద ప్రేమ ఉంటుంది. మనిషికి అంతిమ క్షణంలో కూడ కనీసం ఇంకొక క్షణం బతకగలిగితే బాగుండునని అనిపిస్తుంది. ఈ జీవనలాలసలో కళాకారులకూ కళాకారులు కానివారికీ ఏమీ తేడా కూడ ఉండకపోవచ్చు. కాని ఆ వ్యక్తిగత జీవనలాలస సమాజం మీద ఎలా ప్రవహిస్తుందనేదే, ప్రభావం చూపుతుందనేదే కళాకారులను ఇతరుల నుంచి వేరుచేస్తుంది. కళాకారుల జీవన కాంక్ష వారు తమ జీవితాన్ని గడుపుతున్న నిర్దిష్టమైన తీరులో మాత్రమే కాదు, అసలు జీవనాన్ని అమూర్తంగా భావించడంలో, తమ జీవనాన్నీ తమ చుట్టూ ఉన్న జీవనాన్నీ విలక్షణంగా, సమగ్రంగా గ్రహించడంలో, తమ గ్రహింపును భావితరాల కోసం తమ కళలో నిక్షిప్తం చేయడంలో అనంత రూపాలలో వ్యక్తమవుతుంది. వారి ఈ వ్యక్తీకరణలు వారి జీవితాన్నీ, కళనూ సౌందర్యవంతం చేస్తాయి. చాల సాధారణమైన జీవితాలు కూడ ఆ కళ వల్ల తేజోమయమవుతాయి. కళాకారుల జీవితాలు సమకాలికులకు ఎంత సాదాగా, అస్తవ్యస్తంగా, అరాచకంగా, దుర్గుణాల కుప్పలుగా కనబడినప్పటికీ ఆ సమకాలీన దురభిప్రాయాలు ఆ జీవితాలతో పాటే సమసిపోతాయి. తర్వాతి తరాలకు మిగిలేది కళ మాత్రమే. ఆ కళే వారి జీవితాల్ని కూడ ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా, రోమాంచకారిగా, కొన్ని సందర్భాల్లో ఆదర్శంగా కూడ మారుస్తుంది. అలా వారి కళ మాత్రమే కాదు, జీవితాలు కూడ స్థలకాలావధులను అధిగమిస్తాయి.
అటువంటి స్థలకాలావధులను అధిగమించిన మహత్తర జీవితాల ఆసక్తికరమైన క్షేత్రంలోకి ప్రవేశించాడు అమెరికన్ రచయిత ఇర్వింగ్ స్టోన్ (1903-1989). డజనుకు పైగా చారిత్రక వ్యక్తుల జీవితాలను తీసుకుని వాటి ఆధారంగా నవలలు అల్లాడు. ఇతర నవలలన్నీ అలా ఉంచి, విన్సెంట్ వాన్ గో (1853-1890) జీవితం మీద రాసిన ‘లస్ట్ ఫర్ లైఫ్’, మైఖెలాంజెలో (1475-1564) జీవితం మీద రాసిన ‘ది అగోనీ అండ్ ది ఎక్స్ టసీ ఆ నవలా నాయకుల వలెనే వర్ణమయ చిత్రలేఖన అద్భుతాలు. వారి జీవితాలు మామూలు గానే ఆసక్తికరమైనవి కాగా, కొంత కాల్పనీకరించి నవలా రూపంలో వాటిని మరింత ఆకర్షణీయం చేశాడు ఇర్వింగ్ స్టోన్. ‘లస్ట్ ఫర్ లైఫ్’ కు పి. మోహన్ తెలుగు అనువాదం ఈ ‘జీవన లాలస’.
ఇర్వింగ్ స్టోన్ 31వ ఏట ప్రచురితమైన ఈ నవలను అంతకు ముందు మూడు సంవత్సరాల్లో కనీసం పదిహేడు మంది ప్రచురణకర్తలు తిరస్కరించారంటే, 26-27 ఏళ్లకే నవల పూర్తి చేశాడనుకోవాలి. రచయితలో తొణికిసలాడిన ఆ యవ్వన తేజం నవల పొడవునా పాఠకుల కళ్ల మీద చింది ముఖం మీద వెలుగులీనుతుంది. ఆ యవ్వన తేజపు రంగూ చిరునవ్వు వెలుగూ ఎంతగా ఇర్వింగ్ స్టోన్ వో అంతగా, బహుశా అంతకన్న ఎక్కువగా ఈ నవలా నాయకుడైన, 37 ఏళ్ల కంటె ఎక్కువ జీవించలేకపోయిన, ఆ ముప్పై ఏడేళ్లలో కూడా వందల ఏళ్లకు సరిపడిన జీవనోత్సాహాన్నీ జీవన లాలసనూ అనుభవించిన విన్సెంట్ వాన్ గో వి. జీవితమంతా వెంటాడిన అపారమైన నిరాశా నిస్పృహలలో, చివరికి ఆత్మహత్యతో అంతమైన ఒక వ్యక్తి జీవితానికి లస్ట్ ఫర్ లైఫ్ (జీవన లాలస) అనే పేరు విరోధాభాస కాదు, అది ఇర్వింగ్ స్టోన్ రచనాశక్తి. తన వస్తువు అసలు సారాంశాన్ని గ్రహించడం, అందులో మమేకం కావడం.
అసలు విన్సెంట్ జీవితం దానికదిగానే ఒక కాల్పనిక రచనా వస్తువు అనిపిస్తుంది. ఆ జీవితం తిరిగిన మలుపులూ, పొందిన నిరాశలూ నిజంగా వాస్తవికమైనవాటికన్నా ఎక్కువ కల్పనలా అనిపిస్తాయి. ‘కల్పన కన్న చిత్రమైన వాస్తవం’ అనే నుడికారానికి నిదర్శనంలా సాగినది విన్సెంట్ జీవితం. అటువంటి ఇతివృత్తాన్ని తీసుకుని, అందులోనూ ఆ నాయకుడి మానవ సంబంధాలను, చిత్రలేఖనాలను, వర్ణ సమ్మేళనాలను, ఆశనిరాశలను తన ఊహాశక్తితోనూ, కవితాత్మక సాంద్ర వ్యక్తీకరణలతోనూ అక్షరాల్లో పునర్జీవింపజేసే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకుని నవలగా మలిచాడు ఇర్వింగ్ స్టోన్.
పందొమ్మిదో శతాబ్ది రెండో అర్ధభాగంలో, అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ సంచలనాలతో అట్టుడుకుతున్న యూరప్ లో, ఉన్నత మధ్యతరగతి డచ్ కుటుంబంలో పుట్టిన విన్సెంట్ జీవితమంతా కష్టాల్లో, పేదరికంలో, నిస్సహాయతలో, నిరాశా నిస్పృహల్లో, గుర్తింపు రాకుండా, కేవలం తమ్ముడి ప్రేమాదరాలతో మాత్రమే గడిచింది. చిన్ననాటి నుంచీ చిత్రకళలో ప్రవేశం ఉన్నా, పూర్తిగా చిత్రకళలోకి వచ్చినది ఇరవయో ఏటి తర్వాతనే. మొదట అప్పటి సుప్రసిద్ధ చిత్రకళా వ్యాపార సంస్థలో హేగ్ లో అమ్మకందారుగా చేరినప్పటికీ వారు త్వరలోనే లండన్ కు బదిలీ చేశారు. అక్కడ ఉద్యోగంలో సంతోషంగా ఉన్నా, ప్రేమ వ్యవహారంలో విఫలమై నిరాశకు లోనయ్యాడు. కళావ్యాపారంలోనే ఉన్న పినతండ్రి పారిస్ కు బదిలీ చేయించినా అక్కడ సరుకుగా మారుతున్న కళను చూసి ఆ ఉద్యోగమే వదులుకున్నాడు. ఉపాధ్యాయుడుగా, పుస్తకాల దుకాణంలో గుమస్తాగా కొంతకాలం పనిచేసి, చివరికి క్రైస్తవ మత ప్రచారకుడు కాదలిచాడు. బెల్జియం బొగ్గు గనుల్లో అత్యంత దుర్భరమైన బతుకులు ఈడుస్తున్న గని కార్మికులలోకి, రైతులలోకి వెళ్లాడు. భయంకరమైన దోపిడీ పీడనలకు గురవుతున్న ఆ గని కార్మికులకు మతాన్ని ఎంత పరిచయం చేయగలిగాడో గాని, వారి అట్టడుగు జీవితాల గురించి తెలుసుకోగలిగాడు. మొరటుదనం అనదగినంత అత్యద్భుతమైన సహజత్వం తో వారిని చిత్రించగలిగాడు. శ్రమతో వంగిపోయిన శరీరాకృతులు, కడుపు నిండా తినలేని, ఉట్టి ఉర్లగడ్డలే భోజనంగా గడిపే కార్మిక కుటుంబాలు, కాని అత్యంత భావస్ఫోరకమైన వారి ముఖకవళికలు అప్పటి వాన్ గో చిత్రాలలో అజరామరమయ్యాయి. అది ఒక కఠోర వాస్తవ చిత్రణ. మానవ సహజమైన అనుకంపతో కదిలిన కుంచె. అధోజగత్ సహోదరుల అచ్చమైన ప్రతిరూపం. అటు మత ప్రచారం కోసం గాని, ఇటు చిత్రకళ కోసం గాని విన్సెంట్ ఆ గని కార్మికుల, రైతుల గుడిసెల్లోకి, చలితో ఆకలితో, శ్రమతో చివికిపోతున్న జీవితాల్లోకి వెళ్లాడు, వారి తిండి తిన్నాడు. ఆ మత బోధకుడి ఉద్యోగమూ పోగొట్టుకుని తల్లి దండ్రుల దగ్గరికి చేరాడు. అక్కడా పొలాల్లోకీ, ప్రకృతిలోకీ వెళ్లి చిత్ర రచన చేయడమే ఏకైక జీవిత లక్ష్యంగా బతికాడు.
సరిగ్గా అప్పుడే యూరపియన్ చిత్రకళా రంగంలో కొత్త గాలులు వీస్తున్నాయి. ఇంప్రెషనిస్టులు చిత్రకళను సమూలంగా మార్చేస్తున్నారు. వస్తువులను చూసే పద్ధతికీ, చూపే, చిత్రించే పద్ధతికీ, రంగులు వాడే పద్ధతికీ కొత్త వ్యాకరణం రచిస్తున్నారు. “ఇంత చిరుగీతి ఎద వేగిరించునేని” కదిలిపోయే భావుకుడూ స్పందనాశీలీ అయిన విన్సెంట్ ను ఈ కొత్త ఉద్యమం కదిలించకపోతే ఆశ్చర్యపోవాలి. ఆ ఉద్యమ భూకంపానికి కేంద్ర స్థానమైన పారిస్ చేరాడు. అక్కడ ఉన్న కాలంలో చిత్రించిన వందలాది చిత్రాలలో ఆయన కళ ఒక కొత్త రూపు సంతరించుకుంది. అంతకు ముందరి గని కార్మికుల, రైతుల చిత్రాలలో ముదురు రంగులూ గంభీరమైన రంగులూ ఉంటే, ఈ కొత్త చిత్రాలలో రంగుల వెల్లువ ఉధృతంగా సాగింది.
విన్సెంట్ ఒక చోట ఒక వ్యక్తీకరణతో సంతృప్తి పడే మనిషి కాదు. పారిస్ నుంచి కొత్త వెతుకులాటలో 1888లో దక్షిణాదికి వెళ్లాడు. అక్కడ ఉజ్వలంగా వెలిగే సూర్యకాంతిలో సాధారణ వర్ణాలే అపురూప ఛాయలు దిద్దుకుంటాయి. అక్కడ ప్రకృతి మీద, ప్రకృతి చిత్రించిన మిరుమిట్లు గొలిపే సకల కాంతిమయ వర్ణాల మీద అపారమైన ప్రేమతో ఉధృతంగా చిత్రలేఖనం సాగించాడు. అక్కడ తన చేతికి అందినవి అతి తీవ్రమైన రంగులు. వెలుగులీనే పసుపుపచ్చ, సూర్యుని తేజస్సుతో పోటీపడే నారింజ ఇప్పుడాయన రంగులు. ఆ రంగులను పాత పద్ధతిలో కుంచె అద్ది సుతిమెత్తగా సుకుమారంగా ఈజెల్ మీద గీయడం కూడ ఆయనకు నచ్చలేదు. పాలెట్ కత్తితో ముద్దలు ముద్దలుగా రంగులను ఈజెల్ మీదికి విసిరి, ఒక విమర్శకుడు రాసినట్టు ‘కుంచె పట్టుకునే కళాకారుడిలా కాదు, తాపీ పట్టుకుని ఇటుకలు పేరుస్తూ మధ్యలో సిమెంట్ కూరుతున్న నిర్మాణ కార్మికుడిలా’ చిత్రలేఖనం చేశాడు.
అక్కడ ఆ మహోజ్వలమైన సూర్యకాంతి వెలుగులో ఆయన చిత్రాలు ప్రకృతిలోకి మాత్రమే కాదు మానవ ప్రకృతిలోని దైనందిన జీవితంలోకి కూడ తొంగిచూశాయి. తన గదిని చిత్రించాడు, కుర్చీనీ, మంచాన్నీ చిత్రించాడు. మామూలు మనుషులను, వేశ్యలను చిత్రించాడు. ప్రతి వస్తువూ రంగుల్లో ప్రాణం పోసుకుంది. నిర్జీవ వస్తువులు జీవం పోసుకోవడం మాత్రమే కాదు, సజీవ వస్తువులు కూడా రంగుల్లో మరింత సజీవతనూ చలనాన్నీ సంతరించుకుని అంతర్గత ఘర్షణను వ్యక్తీకరించడం మొదలు పెట్టాయి. ఒక విమర్శకుడు అన్నట్టు అది ప్రమాదకరమైన కళగా, భయం గొలిపే కళగా పరిణమించింది. గోధుమ చేను మీద కాకుల గుంపు కోపోద్రిక్త సంక్షుభిత దిగంత దృశ్యం కంటికి ఇంపైనది కాదు, కంటినీ మెదడునూ చికాకు పరిచేది.
స్పందనాశీలం వల్ల, భావుకత వల్ల సున్నిత మనస్కుడయ్యాడా, సున్నిత మనస్కుడు గనుక భావుకుడయ్యాడా తెలియదు గాని, ఆ కళాకారుడి ఉద్రేక మానసిక ప్రపంచం చాంచల్యానికి లోను కావడం మొదలయింది. ఉన్మాదపు ఛాయలు పొడసూపాయి. మానసిక చికిత్సలో, నిర్బంధంలో ఉండవలసి వచ్చింది. ఆ నిర్బంధంలోనూ కళాకారుడి తృష్ణ ఆగలేదు. నాలుగు గోడల మధ్య బందీగా కిటికీలోంచి కనబడుతున్నదో, మనసులో వెలుగుతున్నదో గాని ఆయన ఆ మానసిక వైద్యశాల ఒంటరి గదిలో చిత్రించిన నక్షత్ర ఖచిత ఆకాశం వాస్తవం కన్న అద్భుతమైనది. ఆ చిత్రంలో వ్యక్తమైనది తన ఒంటరి అనారోగ్య నిర్బంధంలో వెలుగుతున్న ఆశనా? నక్షత్ర కాంతి కింద సమాజమంతా చీకట్లో మగ్గుతున్న నిరాశనా?
విన్సెంట్ వాన్ గో తన కాలానికి చెందినవాడూ, తన కాలానికి దూరమైన వాడూ కూడ. జీవించి ఉన్నకాలంలో కళాలోకపు గుర్తింపు పొందలేకపోయాడు. ఈ నవలలోనే అన్నట్టు “అశాశ్వతమైన వాటిలోని శాశ్వతాల కోసం అన్వేషించి”, చిత్రించి, వ్యక్తిగా తన అశాశ్వతత్వాన్ని తన కళ శాశ్వతంగా రూపాంతరం చెందించాడు.
తమ్ముడు పంపే నెల భత్యం మీద చాలీచాలని బతుకు బతకడమే తప్ప విన్సెంట్ తన జీవితకాలంలో ఒక్క చిత్రం కూడ అమ్ముకోలేకపోయాడు. ప్రేమరాహిత్యంలో, ఒంటరితనంలో, దారిద్య్రంలో, నిరాశలో ఆత్మహత్య చేసుకున్నాడు. అన్న మేధలోని అద్భుత నైపుణ్యాన్నీ, జీవనశైలిలోని అరాచకత్వాన్నీ గుర్తించి, అర్థం చేసుకుని, గౌరవించి, జీవితాంతం అన్నకు తోడు నీడగా నిలబడి, నెలనెలా ఆర్థిక సహాయం అందిస్తూ, దాదాపు ప్రతిరోజూ ఉత్తరం రాస్తూ విన్సెంట్ ను తదనంతర ప్రపంచానికి ప్రదర్శించే అవకాశం మిగిల్చినవాడు తమ్ముడు థియోడర్, థియో. అన్న ఆత్మహత్య చేసుకున్న ఆరు నెలల్లోనే చనిపోయాడు. విన్సెంట్ తనకు తమ్ముడు రాసిన ఉత్తరాల్లో కొన్నిటిని మాత్రమే భద్రపరిచాడు గాని, థియో మాత్రం అన్న తనకు రాసిన ఉత్తరాలన్నిటినీ దాదాపుగా భద్రపరిచాడు. పద్దెనిమిది సంవత్సరాల్లో రాసిన 660కి పైగా ఉత్తరాలు, ఆయా కాలాల విన్సెంట్ మానసిక, ఆర్థిక స్థితులనూ, వేయదలచుకున్న, వేసిన చిత్రాల వివరాలనూ సూక్ష్మ వివరాలతో తెలియజేస్తాయి. ఒకరకంగా ఇర్వింగ్ స్టోన్ నవలలో చిత్రితమైన విన్సెంట్ వ్యక్తిత్వానికి సాధికారమైన వనరు ఆ ఉత్తరాలే.
ఆ ఉత్తరాల ఆధారం కొంతా, తన “క్షేత్ర పరిశోధన” కొంతా, వాన్ గో మరణం తర్వాత ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆయన చిత్రాల వివరణా, విశ్లేషణా కొంతా కలిపి ఇర్వింగ్ స్టోన్ ఉపోద్ఘాతంతో, ఎనిమిది అధ్యాయాలతో ఈ నవల రాశాడు. లండన్ జీవితం ఉపోద్ఘాతం కాగా, బోరినేజ్, ఎట్టెన్, హేగ్, నువెనెన్, పారిస్, ఆర్లెస్, సేంట్ రెమీ, ఆవర్స్ అని విన్సెంట్ జీవితం గడిచిన ప్రాంతాల పేర్ల మీద అధ్యాయాలు ఆ ముప్పై ఏడేళ్ల జీవితంలో దాదాపు ఇరవై ఏళ్లను చిత్రిస్తాయి.
విన్సెంట్ వెళిపోయిన తర్వాత కొన్ని దశాబ్దాల్లోనే ఆయన కళ ప్రపంచమంతా వ్యాపించింది. చాల ఖరీదైన సరుకుగా మారిపోయింది. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న చిత్రకళా ప్రదర్శనశాలలకు ఆయన చిత్రాలు అలంకారాలయ్యాయి. ఆయన కళ సరుకుగా మారిన సందర్భంలోనే, ఆ కళ కన్న విస్తారమైన, వర్ణమయమైన, సంక్షుభిత మైన జీవితం కూడ సరుకు అయింది.
ఆ జీవితాన్ని కాల్పనీకరించి నవలీకరిస్తున్నప్పుడు ఇర్వింగ్ స్టోన్ దాన్ని సరుకుగా చూసి ఉండకపోవచ్చు. కేవలం వస్తువు మీద ప్రేమతో మాత్రమే రాసి ఉండవచ్చు. కాని ఆ నవల వెలువడిన ఈ తొమ్మిది దశాబ్దాలలో డజన్లకొద్దీ భాషల్లోకి అనువాదమై కోట్లాది కాపీలు అమ్మకమైంది. ఆయన మరణించినప్పుడు 1989లో వాషింగ్టన్ పోస్ట్ లో వెలువడిన సంస్మరణ వ్యాసం ఆయన రచనలన్నీ కలిపి అప్పటికి కనీసం 35 భాషల్లోకి అనువాదమై, మూడున్నర కోట్ల కాపీలు అమ్ముడయ్యాయని రాసింది. అందులో సింహభాగం ఒక్క ‘లస్ట్ ఫర్ లైఫ్’ ఆక్రమించి ఉంటుంది. ఆ నవల ఆధారంగా అదే పేరుతో 1956లో వెలువడిన హాలీవుడ్ సినిమా విస్తృతమైన జనాదరణ పొందింది. భారతీయ భాషల్లో కూడా హిందీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళంల లోకి అనువాద మైందని ఆధారాలున్నాయి. తెలుగులోకి కూడా 1957లో జనమంచి రామకృష్ణ అనువాదం వచ్చిందని ప్రస్తావనలు ఉన్నాయి గాని ఈ తరానికి ఆ అనువాదం అందుబాటులో లేదు.
అటువంటి అద్భుతమైన, అరుదైన పుస్తకాన్ని తెలుగు చేయడానికి ఎంచుకున్న మోహన్ కు అభినందనలు. ఆ అనువాదం కేవలం ఆసక్తి కొద్దీ సాగినది మాత్రమే కాక, ఇర్వింగ్ స్టోన్ రచన లాగ అభిరుచితో, హృదయమంతా రంగరించి సాగడం తెలుగు పాఠకులకు దొరికిన గొప్ప రంగుల వెల్లువ. ఈ అనువాదం ఎంత ఆర్ద్రంగా, సాంద్రంగా సాగిందో చూపడానికి ఎన్నో ఉటంకింపులు ఇవ్వాలని ఉంది గాని అది మీరెట్లాగూ చదువుతారు గనుక నేనింక ఎక్కువసేపు అడ్డు నిలవను.
“…తెల్లగుడ్డ నన్ను దద్దమ్మలా చూస్తుంది. అసాధ్యమనే భ్రమను బద్దలుకొట్టే భావావేశాల కళాకారుడికి అది జడుసుకుంటుంది. జీవితమూ అంతే. అనంత శూన్యంతో, నిరాశానిస్పృహలతో మనకేసి తేరి చూస్తుంది ఈ ఖాళీ కేన్వాసులా! దానిపైన ఏమీ ఉండదు….ఆత్మవిశ్వాసం, శక్తి ఉన్న మనిషి ఆ శూన్యానికి భయపడడు. ధైర్యంగా ముందుకు సాగిపోతాడు, పనిచేస్తాడు, నిర్మిస్తాడు, సృష్టిస్తాడు. చివరకు ఆ కేన్వాసులో శూన్యం అంతరించి సుసంపన్నమైన జీవనవిన్యాసం పొటమరిస్తుంది” అని విన్సెంట్ ఒక స్నేహితురాలితో అన్న మాటలూ,
“ఎక్కడికంటే…ఊగే పైరుకు, లోయ నుంచి వేగంగా దూకే నీటికి, ద్రాక్షపండు రసానికి, మనిషి జీవనవాహినికి. ఇవన్నీ ఒకటే. జీవితంలోని ఏకైక ఐక్యత లయాత్మక ఐక్యత. మానవులతో, ఫలపుష్పాలతో, లోయలతో, నాగేటి చాళ్లతో, పొలాల్లోని బళ్లతో, ఇళ్లతో, గుర్రాలతో, సూర్యభగవానుడితో ఆనంద తాండవం చేయించే లయకు. నీలో ఉన్న పదార్థం రేపు ద్రాక్షపండులోకి చేరుతుంది. నువ్వూ, ఆ పండూ ఒకటే కనక. నేను చెమటోడుతున్న రైతు చిత్రాన్ని వేస్తున్నప్పుడు పంట నేలలోకి ఎలా విస్తరిస్తుందో, రైతూ అలా మన్నులోకి విస్తరిస్తున్నట్టు, మన్నూ పైకి ఎగదన్నుకుని అతనిలోకి పాకుతున్నట్టు జనం అనుభూతించాలని ఆశిస్తాను. ఆ కర్షకుడి దేహంలోకి, పైరులోకి, నాగలిలోకి, గుర్రాల్లోకి చొచ్చుకెళ్తున్న సూర్యుణ్నీ, ఆ చరాచర ప్రకృతి మళ్లీ ఆ కర్మసాక్షిలోకి చొచ్చుకెళ్లడాన్నీ ప్రజలు అనుభూతించాలని కోరుకుంటాను. నేలపై కదిలే ప్రతి అణువులోని విశ్వజనీన లయను అనుభూతించడం మొదలు పెడితే నీకు జీవితం అర్థమవడం మొదలవుతుంది. అదే ఏకైక దైవం” అని గోగాతో అన్నమాటలూ అపురూప మహిమాన్విత చిత్రకారుడు విన్సెంట్ వాన్ గో జీవితానికీ, కళకూ ప్రతీకలు.
ఈ అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేసే అవకాశం నాకిచ్చిన మోహన్ అనువాద శైలికి బిగికౌగిలి ప్రేమ ప్రకటిస్తూ, ఈ అసాధారణ వర్ణమయ అనుభవంలోకి ప్రవేశించమని మిమ్మల్ని కోరుతున్నాను.
పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు. రచనలు: ‘సమాచార సామ్రాజ్యవాదం’, ‘కల్లోల కాలంలో మేధావులు – బాలగోపాల్ ఉదాహరణ’, ‘అమ్మకానికి ఆంధ్రప్రదేశ్’, ‘కథా సందర్భం’, ‘కడలి తరగ’, ‘పావురం’, తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛినమవుతున్న వ్యక్తిత్వం, ‘పోస్ట్మాడర్నిజం’, ‘నవలా సమయం’, ‘రాబందు నీడ’, ‘కళ్లముందటి చరిత్ర’, ‘పరిచయాలు’, ‘తెలంగాణ – సమైక్యాంధ్ర భ్రమలు, అబద్ధాలు, వాస్తవాలు’, ‘శ్రీశ్రీ అన్వేషణ’, ‘లేచి నిలిచిన తెలంగాణ’, ‘ప్రతి అక్షరం ప్రజాద్రోహం – శ్రీకృష్ణ కమిటీ నివేదిక’, ‘రాబందు వాలిన నేల’, ‘ఊరి దారి- గ్రామ అధ్యయన పరిచయం’, ‘విద్వేషమే ధ్యేయంగా విశాలాంధ్ర మహారభస’, ‘కవిత్వంతో ములాఖాత్’, 20కి పైగా అనువాదాలు. సంపాదకత్వం: ‘Fifty Years of Andhrapradesh 1956-2006’, ‘Telangana, The State of Affairs’, ’24గంటలు’, ‘హైదరాబాద్ స్వాతంత్య్ర సంరంభం’, ‘జన హృదయం జనార్దన్’, ‘సమగ్ర తెలంగాణ’ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.