మా కథ (దొమితిలా చుంగారా)- 41
రచన: దొమితిలా చుంగారా
అనువాదం: ఎన్. వేణుగోపాల్
1974 నవంబర్ లోనే ప్రభుత్వం కొందరు వ్యక్తుల్ని “మౌలికస్థాయి సమన్వయ కర్తలు”గా నియమించింది. వీళ్ళు యజమానులకు, కార్మికులకు మధ్య వారధిలా పనిచేస్తారని వాళ్ళన్నారు. కాని కార్మికుల మీద నిఘావేయడమే వీళ్ళ పని. వాళ్ళు తమ పని మొదలు పెట్టగానే కార్మికులు సమన్వయకర్తల్ని నిరాకరించి, వాళ్ళ నిర్ణయాలను తాము ఒప్పుకోమని ప్రకటించారు. ప్రతి శ్రేణిలోనూ తామే ప్రతినిధులను ఎన్నుకోవడానికీ, వాళ్ళతో “మౌలికస్థాయి ప్రతినిధి వర్గాల”ను స్థాపించుకోవడానికి నిర్ణయించుకున్నారు. సైగ్లో-20లో అలా నలుగురు ప్రతినిధుల్ని ఎన్నుకున్నారు. ప్రభుత్వమూ, కంపెనీ మొదట మా వాళ్ళను గుర్తించకుండా, సమన్వయకర్తలనే గుర్తించాయి గాని చివరికి దిగిరాక తప్పలేదు.
కార్మికులకు ఒక మహత్తరమైన శక్తి ఉంది. దాని పేరే ఐక్యత. నిర్బంధాన్ని ఎదిరించడానికి కార్మికవర్గం చేతుల్లోని శక్తివంతమైన ఆయుధాలు రెండే – ఐక్యత, సమ్మె.
కొన్ని దేశాల్లో కార్మికుల ఎత్తుగడలు విఫలమయ్యాయని నాకు తెలుసు. అక్కడ కార్మికులు సమ్మెకు దిగినా ఎవరూ పట్టించుకోరు. కాని బొలీవియాలో తగరమే ఆర్థిక వ్యవస్థకు మూలాధారం గనుకా, అప్పటికే బొలీవియన్ ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదార్లతో ఒప్పందాల మీద సంతకాలు చేసి ఉంది గనుకా అది సమ్మెకు తలవంచక తప్పదు.
సమ్మె చేశామంటే మేం నష్టపోతున్నామన్నట్టే. సమ్మె చేసినన్ని రోజులూ మాకు జీతం ఇవ్వరు. కాని ప్రభుత్వం ఇంకా ఎక్కువ నష్టపోతుంది. ఎక్కడో విదేశీ పరిశ్రమల వాళ్ళు మా తగరం కోసం ఎదురుచూస్తూ కూచుంటారు. ప్రభుత్వానికేమో తగరం పంపాల్సిన బాధ్యత ఉంటుంది. కనుకనే మా దేశంలో సాగుతున్న నిర్బంధాన్ని, దోపిడీని సమ్మెద్వారా ప్రతిఘటించగలుగుతున్నాం.
ప్రభుత్వానికి శక్తివంతమైన మిత్రులున్నారనే మాటా, భవిష్యత్తులో కార్మికుల మీద మరిన్ని నిర్బంధ చర్యలు తీసుకుంటారనే మాట నిజమే. మా దగ్గర డబ్బులు లేవు గనుక వాళ్ళు మమ్మల్ని ఆకలికి మాడ్చి చంపొచ్చు. ఈ పరిస్థితిలో మేం ఎంత కాలం నిలబడతామో నాకు తెలియదు. కాని ఇప్పటికైతే మా చేతుల్లో ఉన్న పదునైన ఆయుధాలివి – ఐక్యత, సమ్మె.
మీలో ఎవరు జవాబిస్తారు?
గని కార్మికులకు సొంతంగా మూడు రేడియో స్టేషన్లుండేవి. సైగ్లో – 20లో ‘మైనర్స్ వాయిస్’, ‘ కటావిలో ‘
డిసెంబర్ 21, లాలాగువాలో రేడియో లాలాగువా’ పేరుతో అవి ఉండేవి. వాటిని మేం ఎన్నో కష్టాలుపడి, ఎంతో త్యాగం చేసి సంపాదించుకున్నాం. వాటిని పూర్తిగా మేమే నడుపుకునేవాళ్ళం. దాంట్లో వ్యాఖ్యాతలు మా వాళ్ళే ఉండేవారు. వాళ్ళు మా భాషే మాట్లాడేవారు. దేశంలోని పరిస్థితిని వాళ్ళు మాకు విప్పి చెప్పేవాళ్ళు. మేం ఆ రేడియో స్టేషన్లనూ, ట్రాన్స్ మిటర్లనూ కాపాడుకోవడానికి చాల జాగ్రత్తలు తీసుకున్నాం. అవి గని కార్మికులవి. వాళ్ళకవి ప్రాణమంత ముఖ్యమైనవి. ఈ రేడియోలు మమ్మల్ని చైతన్య పరచేవి, వినోదం అందించేవి.
సైన్యం దాడిచేసిన ప్రతీసారీ మొట్టమొదట ట్రాన్స్ మిటర్లమీద విరుచుకుపడేది. మేం మా మధ్య సంబంధాలు తెగిపోకుండా ఉండేందుకు ట్రాన్స్ మిటర్లు కాపాడు కోవడానికి చాల ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం.
అలాగే మతాధికారులకు చెందిన పయస్-12 అనే రేడియో స్టేషన్ కూడా ఉండేది. మొదటి రోజుల్లో వాటికన్ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులను ఎదిరించమని క్రైస్తవులకు ఒక పిలుపిచ్చింది. అందులో భాగంగా పయస్ 12 రేడియోలో మాకు వ్యతిరేకంగా ఎడతెగని ప్రచారాలు జరుగుతుండేవి. కాని ఇప్పుడదంతా మారిపోయింది. కొన్నేళ్ళుగా పయస్ 12 రేడియో మాకు కొంచెం అనుకూలంగా పనిచేస్తోంది. సర్కారు కూడ గతంలో మతాధిపతులను ఏమీ అనకపోయేది గాని ఇప్పుడు మాత్రం మా లాగనే వాళ్ళనీ తంతారు, జైళ్ళకు పంపుతారు, దేశం నుంచి తన్ని తరిమేస్తారు కూడా.
1974 దాకా మాకు టెలివిజన్ అంటే ఏమిటో తెలియదు. ఆ ఏడాది బన్ జెర్ ఐదువేల ప్రభుత్వ “ఔదార్యపు ఫలితం”గా సైగ్లో-20కి టెలివిజన్ సెట్లు వచ్చాయి. కొమిబొల్ ఆ సెట్లన్నిటినీ కొని మా దగ్గర తక్కువ వాయిదాల మీద డబ్బు తీసుకునే ఒప్పందం మీద ఇంటికొక టి.వి. సెట్ బిగించింది. ఐతే బొలీవియన్ టెలివిజన్ లో ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రమే వస్తాయి. వాటిలో ప్రభుత్వాన్ని “చాల మంచి” ప్రభుత్వంగా వర్ణిస్తారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా విపరీతమైన విదేశీ, సామ్రాజ్యవాద ప్రభావంతో నిండి ఉంటాయి.
నా కొడుకు ఓరోజు మా పక్కింట్లో టి.వి. చూసి వచ్చాడు. దాంట్లో వాడొక కొత్త ప్రపంచం చూశాడు. ఎలుకలు మాట్లాడాయి, అందమైన తోటలు కనబడ్డాయి. అలాంటి రంగుల కలలెన్నో ఆ కార్యక్రమంలో ఉన్నాయి. అది డిస్నీలాండ్ గురించిన కార్యక్రమం. అప్పుడు వాడు ఇంటికొచ్చి నాతో “అమ్మా … మరే … నేను మంచి వాణ్ని కదా … నన్ను డిస్నీ ల్యాండ్ తీసుకుపోవూ … నాకు చిన్న ఎలుగుబంటితో ఆడుకోవాలనుందే … చిన్న చిన్న ఎలుక పిల్లల్తో ఆడుకుంటానే … అబ్బా అమ్మా … తీసుకుపోరాదే … నాకో చిన్న రైలు కూడా ఉంటే బావుంటుందే” అని గొణగడం మొదలు పెట్టాడు.
ఒక వారం వరకు వాడికి తన పాత బొమ్మలతో, లక్కపిడతలతో ఆడుకోవడానికి మనసొప్పనేలేదు. బైటికి వీథిలోకి వెళ్ళాలనిపించనేలేదు. డిస్నీలాండ్ కె వెళ్తామనిపించింది. వాడిక డిస్నీలాండ్ గురించి కలలు కనడం మొదలు పెట్టాడు. అవి కావాలి, ఇవి కావాలి అని మారాం చేస్తుండే వాడు. నేనింక భరించలేక వాడితో టీవీ చూడ్డం మానిపించాను.
తర్వాత ఓ రెండు మూడు రోజులకి నాతోటి స్త్రీలు కొందరు నాకో దుకాణంలో కలిశారు. “అక్కా – టీవీ చూశావా?” “చూడలేదు. మాకు లేదు” అన్నాను. “అమ్మో! రాత్రి వాళ్ళోక వింత వింత దుస్తుల కార్యక్రమం చూపెట్టారు. అది ఎంత బావుందో! మనం ఈ చాకిరీలో మగ్గిపోతున్నవాళ్ళం అలాంటి బట్టలెప్పుడూ కట్టుకోలేం. అలా జుత్తు సవరించుకోలేం. టీవీలో వాళ్ళు పెట్టుకున్న నగల్లాంటివి నేనసలు చూడలేదంటే నమ్ము … మనం ఈ గని కార్మికుల్ని చేసుకోవడం ఎంత పొరపాటైపోయింది …” అన్నారు.
ఒక్కసారి ఈ పరిస్థితి ఊహించండి! ఈ టీవీ నా జనం ఆలోచనల్లో విషం నింపుతున్నదనుకున్నాను నేను. పిల్లలు తమ బొమ్మలతో ఆడుకోవడానికిష్టపడడం లేదు. స్త్రీలు తమ బతుకుల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. … టీ.వి మాకెంత చెరుపు చేస్తోంది!
*****
(సశేషం)