పేషంట్ చెప్పే కథలు – 11
ప్రతిఫలం
–ఆలూరి విజయలక్ష్మి
సంధ్య అధరాలపై విరిసిన పూవులు నక్షత్రాలై ఆకాశం మీద పరుచు కుంటున్నాయి. తుంపర మెల్ల అల్లనల్లన జారుతున్న సన్నసన్నటి తుంపర మేల్ల మెల్లగా వీస్తున్న గాలితో కలిసి కదం కదుపుతూ సర్వజగత్తునూ పులకరింపజేస్తోంది.
శ్రద్ధగా శబ్ధాన్నాలకించిన అశ్విని ఒక్క పరుగుతో వాకిట్లోకి వచ్చింది.
“ఇంత ఆలస్యంగానా ఇంటికి రావడం?!” అశ్విని కంఠం మెత్తగా, మధురంగా ఉంది. స్కూటర్ ని ఆపిన రఘువీర్ ఆమెను గమనించనట్లు నటించాడు.
“అయ్యో! తలంతా తడిసిపోయింది.” భర్త చేయి పట్టుకుని ఇంట్లోకి అడుగు పెట్టిన అశ్విని అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి పయట చెంగుతో తల తుడిచింది. అతనికి ఇష్టమయిన ఇలాంటి సన్నివేశంలో ఆమె వ్రేళ్ళ చివర్ల స్పర్శతో ఉత్తేజితుడై, ఎగసిపడే ఉత్తుంగ తరంగంలా ఆమెను చుట్టేసే రఘు నిర్లిప్తంగా కూర్చున్నాడు.
“ఏమిటండీ అంత డల్ గా ఉన్నారు? ఒంట్లో బాగోలేదా?” ఆదుర్దాగా భర్త నుదుటి మీద చెయ్యేసి చూసింది అశ్విని.
“ఏమీ లేదులే” కనుబొమలు ముడుస్తూ విసుగ్గా చూసాడు రఘువీర్. అతని ప్రవర్తనకు చిన్నబుచ్చుకొన్న అశ్విని మౌనంగా అతనికి సపర్యలు చేయసాగింది. భోజనాలయ్యాక అన్నీ సర్దుకుని పడకగదిలోకి వచ్చింది.
“ఇక్కడెందుకు? అవతల రూమ్ లో పడుకో” కటువుగా అంటున్న అతని వంక తెల్లబోయి చూసింది అశ్విని.
“ఏమిటి మీ ఉద్దేశ్యం?” రోషంతో కందాయామే చెక్కిళ్ళు.
“నీకింకా కొన్నాళ్ళు రెస్ట్ యివ్వాలని చెప్పింది డాక్టర్” ఇదెంత పెద్ద అబద్ధమో తెలుసు అశ్వినికి. క్రితంసారి పరీక్ష చేయించుకోవటానికి వెళ్ళినప్పుడు మామూలుగా దాంపత్య జీవితాన్ని గడపవచ్చని చెప్పింది డాక్టర్. అయినా ఎందుకైనా మంచిదని ఇన్నాళ్ళూ ఆగి ఇవాళ మరోసారి డాక్టరుతో చూపించుకోవటానికి వెళ్ళింది. తన అనుమానాల్ని విని నవ్విందామె.
“గర్భకోశం తీసే ఆపరేషన్ చేయించుకుంటే యింక దాంపత్య జీవితం గడపడానికి పనికిరారని అనుకుంటున్నావులా వుంది, నీ అనుమానాల్ని వింటూంటే. క్రిందటిసారి వచ్చినప్పుడే చెప్పానుకదా మామూలుగా ఉండొచ్చని.”
తనతో అలా చెప్పినామె ఈయనతో మరోలా ఎందుకు చెప్తుంది? తనంటే ఈయన విసుగుకు, నిరాసక్తతకు అసలు కారణమేమిటో తనకు చూచాయగా తెలుసు. అది ఎంత వరకు నిజమో తేల్చుకోవాలి. “నా రెస్టు సంగతి సరే, యిక్కడ పడుకోవడాని కేముంది?” అతని ప్రక్కన చోటు చేసుకుని పడుకుంది అశ్విని.
“గెటప్! అవతలికి పొమ్మని చెప్తుంటే…” ఆవేశంగా అశ్విని రెక్కపట్టుకుని గుంజి లేపాడతాను.
తలవంచుకుని నించున్న అశ్విని హృదయం అవమానంతో మండిపోతూంది. పుట్టింటి నుంచి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు కొట్టొచిన్నట్లు కనబడుతున్నా, తన భర్తకు తన మీదున్న ప్రేమ చెక్కుచెదరదని భ్రమిస్తూంది. తాను అనవసరంగా అనుమానపడుతూందని మందలించుకుంది.
“మీ వారిమీద చాడీలు చెప్తున్నానని అనుకోకండి. సమయం మించి పోకముందే మీకు తెలిస్తే మంచిదని చెప్పడానికొచ్చాను. ఆయన మా కొలీగ్ ఒకామెను పెళ్ళి చేసుకునే ప్రయత్నంలో వున్నారు. మీకు ఆపరేషన్ అవడంతో ఇంక పిల్లలు పుట్టే ఆశలేదని, పిల్లల కోసం ఆమెను పెళ్లి చేసుకుంటున్నారని ఆయన ఫ్రెండ్స్ చెప్పు కుంటున్నారు” ఆయన ఆఫీసులో పనిచేస్తున్న విమల నిన్న పనిగట్టుకుని వచ్చి చెప్పింది.
ఆమె చెప్పింది విన్నాక కూడా ఆమె చెప్పింది అబద్ధమేమోనన్న ఆశ ఏ మూలో ఉంది. ఇప్పుడీయన నిర్లక్ష్యం, విసుగు, అహం చూసాక ఆమె మాటలు నమ్మక తప్పడం లేదు. కానీ… తనకు ఆపరేషన్ ఇప్పుడయింది. తమకు పిల్లలు పుట్టక పోవడానికి కారణం ఆయన వీర్యంలోని లోపమని, తనలో ఏ విధమైన లోపమూ లేదని ఎనిమిది సంవత్సరాల క్రితమే అన్ని పరీక్షలూ చేసి నిర్ధారించింది డాక్టరు. తమకు పిల్లలు కలగక పోవటానికి కారణం ఆయనలోని లోపమేనని తనకూ, ఆయనకూ స్పష్టంగా తెలుసు. ఆత్మన్యూనతతో ఆయనెక్కడ కృంగిపోతారోనని కలత చెందుతూ ఇంకా ఎక్కువ ప్రేమగా, ఆదరంగా ఆయనను చూసుకుంది. పిల్లలు లేనంత మాత్రాన ఏమీ కొంప మునిగిపోదని నచ్చజెప్పి ధైర్యం నూరిపోసింది. చిన్నారి పాపాయిల గురించి కోటికలలు కన్న తాను తన కలల్ని గుండెల్లోనే అణిచేసుకుని అతని కోసం బలవంతాన చిరునవ్వుని అతికించు కుంది. తన గొడ్రాలి తనాన్ని అందరూ ఎత్తి చూపుతుంటే, వంశోద్దారకుల్ని కనలేని కోడలు దొరికిందని అత్తింటివారు సూటీపోటీ మాటలంటూంటే మౌనంగా భరించింది. చుట్టుప్రక్కల ఇళ్లల్లో పూవుల్లా వికసిస్తున్న ఏ పాపాయిని చూసినా తన బ్రతుకు నిష్పలంగా గడిచి పోతుందని కృంగిపోయి, అంతలోనే ధైర్యం చెప్పుకుని తన నిరాశను, అసంతృప్తిని తనలోనే దాచేసుకుని తన ప్రేమనూ, ఆప్యాయతనూ మాత్రమే పంచిందతనికి. దానికిదా ప్రతిఫలం?!… ఇంత కపటం!… ఇంత ద్రోహం!… ఇంత కృతజ్ఞత… అశ్విని హృదయంలోని పుష్ప వాటికలు తగలబడి పోతున్నాయి.
*****
డా.ఆలూరి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి, వైద్యులు, సంఘసేవకులు. దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించారు. అనువాదాలు కూడా చేసారు. వీరి రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ‘ఆరోగ్య విజయాలు’ అనే శీర్షికను నిర్వహించారు.