విషాద నిషాదము

మూగవోయిన సురబహార్

-జోగారావు 

ప్రథమ భాగము : స్వరారంభము – రోషనారా

వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికి తన సంగీత విద్యనే పణంగా పెట్టి, అటు వైవాహిక జీవితాన్ని ఇటు సంగీత సామ్రాజ్యాన్ని రెండిటినీ కోల్పోయిన సంగీత విదుషీమణి శ్రీమతి అన్నపూర్ణా దేవి .

తెగిపోయిన స్వర విపంచి దీనముగా చూస్తున్నా, అర్థ శతాబ్ద కాలము మౌన శృంఖలాలను బిగించుకుని సంగీత సామ్రాజ్యమునకు సుదూరంగా నిలచి పోయిన అభాగ్య జీవి అన్నపూర్ణా దేవి.

అన్నపూర్ణాదేవి జీవితగాధకు సప్త స్వరాలు విలపిస్తాయి. సురబహార్ రోదిస్తుంది.

ఆ నిశ్శబ్ద రోదనా ప్రపంచములోనికి అడుగుపెడదాము.

శ్రీమతి అన్నపూర్ణా దేవి అసలు పేరు రోషనారా.

ఆవిడ సంగీత సమ్రాట్ ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారికి 1927 ఛైత్ర పూర్ణిమ నాడు మధ్య ప్రదేశ్ లో ఉన్న మైహర్ లో జన్మించేరు. ఆవిడ అక్క జహనారా. అన్న ఆలీ ఆక్బర్ ఖాన్.

సంగీత ప్రేమికులైన మైహర్ సంస్థానాధిపతి మహారాజా బ్రజ్ నాథ్ సింగ్ జూదేవ్ గారి అభ్యర్థన మేరకు బాబా అల్లా ఉద్దీన్ ఖాన్ ( 08/ 10/1862 – 06/08/1972 ) తన అన్న ఉస్తాద్ ఫకీర్ అఫ్తబుద్దీన్ ఖన్ , తమ్ముడు ఉస్తాద్ ఆయత్ అలీ ఖాన్ లతో

మైహర్ చేరుకుని వారి అస్థాన విద్వాంసులుగా ఉంటూ సంగీతమును బోధించేవారు. ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారి ద్వారా మైహర్ ఘరానా అనే సంగీత పరంపర ప్రారంభం అయ్యింది.

ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ సితార్, సరోద్ ,వేణువు, పఖ్ వాజ్ , మేండొలిన్, తబల, మృదంగము , పికోలా, బేంజో, షెహనాయ్, నగాడా వంటి అనేక సంగీత వాద్యములను సాధన చేసి నిష్ణాతులయ్యేరు.

రోషనారా ( అన్నపూర్ణ దేవి ) గారి పుట్టిన రోజు గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బెంగాలీ పంచాంగము ప్రకారము 23 ఏప్రిల్ 1927 . హిందూ పంచాంగము ప్రకారము 16 ఏప్రిల్ 1927.

ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారికి జన్మించిన ద్వితీయ పుత్రికకు మైహర్ సంస్థానాధిపతి అయిన మహారాజా బ్రజ్ నాథ్ సింగ్ జూదేవ్ “ అన్నపూర్ణ “ అని నామకరణము చేసేరు.

అయినా, ఇంటిలో రోషనారా అనే పిలిచేవారు.

ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారి మాతృ భాషా బెంగాలీ.

అటువంటి సంగీత కళానిధి కి పుత్రిక గా జన్మించిన రోషనారా సంగీత సాధనలోకి అడుగు పెట్టడము తండ్రి అల్లాఉద్దీన్ ఖాన్ గారికి ఇష్టము లేదు. ఆవిడను కనీసము తంబుర ( తాన్పురా ) ను కూడా తాకనిచ్చేవారు కాదు.

ఎందుకంటే, ఆయన పెద్ద కుమార్తె రోషనారా కు అక్క అయిన జహనారాను అత్తవారు సంగీత సాధనకు ప్రోత్సహించకుండా కూనిరాగము తీసినా ప్రతాడన చేసేవారట.

తన చిన్న కూతురు రోషనారా సంగీతము నేర్చుకుంటే, పెళ్ళి అయ్యేక అత్త వారింట రోషనారా కూడా కష్టాలు అనుభవించవలసి వస్తుందేమోనన్న భయము ఆయనను వేధిస్తూ ఉండేది.

కాని, మైహర్ లో ఉన్న శారదాంబ కటాక్షిస్తే, మానవమాత్రులు ఆపగలరా ?

కోయిల ఇంట కోయిలే పుడుతుంది కదా!

రోషనారాకు అయిదారేళ్ళ వయసులో , ఒక రోజు తండ్రి ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ బయటకు వెళ్ళేరు.

అన్న ఆక్బర్ అలీ ఖాన్ తండ్రి చెప్పిన పాఠాన్ని సరోద్ పైన అభ్యాసము చేస్తున్నారు. అక్కడే రోషనారా తొక్కుడు బిళ్ళ ఆడుకొంటూ, సరోద్ పైన అన్న గారి స్వరములో తప్పులను గమనించి, తన ఆటను ఆపి అన్న గారితో

“ భయ్యా ! బాబా ( నాన్న గారు ) ఇలా చెప్పలేదు. ఇలా చెప్పేరు “

అని తండ్రి చెప్పిన విధానాన్ని పాడి వినిపించేరు.

అప్పుడే ఇంటికి వచ్చిన ఉస్తాద్ తన కూతురు రోషనారా ఎటువంటి సంగీత శిక్షణ లేకుండానే, కేవలము తన సంగీత పాఠములను విని ఆ స్వర జ్ఞానముతో స్వంత అన్న గారి తప్పులను సరిదిద్దడము ఆశ్చర్యానికి గురిచేసింది.

తండ్రి రాకను గమనించిన రోషనారా బిత్తర పోయేరు.

పరిస్థితులను ఆకళింపు చేసుకున్న ఉస్తాద్ కూతురు రోషనారా భుజము మీద చేయి వేసి నెమ్మదిగా ఇంటి లోపలకి తన శిక్షణ తరగతిలోనికి తీసుకుని వెళ్ళి, తాన్పురా రోషనారా చేతిలో పెట్టి శిష్యురాలిగా స్వీకరించేరు.

శిష్యరికములోని ప్రథమ సోపానమయిన ద్రుపద సంగీతమును సాధన చేయించిన ఉస్తాద్ తరువాత సితార్ ను నేర్పేరు.

సితార్ వాదనలో రోషనారా ఆరి తేరేరనే నమ్మకము కుదిరేక, సితార్ వాదనలో మెళకువలు, సున్నితాంశములను నేర్పి రోషనారాను సితార్ వాదనలో నిష్ణాతురాలిని చేసేరు.

రోషనారా తన తండ్రి వద్ద శిష్యరికము చేస్తున్న నిఖిల్ బెనర్జీ కి సితార్ , బహదూర్ ఖాన్ కు సరోద్ వాదనలో మెళకువలు నేర్పడము గమనించిన ఉస్తాద్ ఒకరోజు రోషనారాను తన శిక్షణ తరగతిలోనికి తీసుకుని వెళ్ళేరు.

“ అమ్మా !

సంగీతము పట్ల నీకున్న అంకిత భావమును గమనించేను. సితార్ వాదనలో నీ నైపుణ్యమును గమనించేను.

ఇప్పుడు, నీవు సితార్ వాదనతో ఆగి పోకుండా, సితార్ కన్న కఠినమైన

సుర్ బహార్ వాద్యమును నేర్చుకోవాలని నా కోరిక.

సుర్ బహార్ వాద్యమును వాయించడానికి, కఠోర పరిశ్రమ , నిశ్చల మనోస్థితి,

దృఢ సంకల్పము కావాలి. ఈ మూడు లక్షణాలూ నీలో ఉన్నాయని నా నమ్మకము. ఇది కాకుండా సంగీతమును ధనార్జనకు సాధనముగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశము నీకు లేదని నా నమ్మకము.

డబ్బు సంపాదించుకోవాలనే దురాశ నీలో అణువంతైన లేదని నాకు నమ్మకము కుదిరింది.

ఈ సంగీత విద్య, అందులోనూ సుర్ బహార్ వాద్య నైపుణ్యము నాకు మా గురుదేవులు అహుగ్రహించి ప్రసాదించిన అపురూపమైన వరము.

ఈ గురుదత్తమైన విద్యను నీకు అందించి మా గురుదేవుల ఋణము తీర్చుకోవాలని ఉంది.

నీవు అంగీకరిస్తే సుర్ బహార్ ను నేర్పుతాను “

ఒక్క క్షణమైనా అలోచించకుండా, రోషనారా గురుదేవులైన తన తండ్రి పాదములకు నమస్కరించి సుర్ బహార్ వాద్యమును తన చేతిలోనికి తీసుకున్నారు.

తన గురుదేవుల ఋణము తీర్చుకునే అవకాశము కల్పించిన శిష్యురాలైన

తన కుమార్తె ఆశీర్వాద పూర్వకముగా తల నిమిరి, సుర్ బహార్ వాద్యమును నేర్పడము ప్రారంభించేరు.

తన తండ్రి వద్ద నాలుగేళ్ళ సంగీత శిక్షణ పూర్తి చేసుకున్న రోషనారా తన మొట్ట

మొదటి సుర్ బహార్ కచేరీనీ మైహర్ మహారాజా బ్రజ్ నాథ్ సింగ్ జూదేవ్ వారి సమయములో చేసేరు.

ఆవిడ ప్రదర్శించిన ప్రతిభ పాటవాలకు, సంగీత విద్యకు సంతోషించిన మహారాజ ఆవిడకు విశాల భూఖండమును బహుమతి గా అందచేసి ఆవిడను గౌరవించేరు.

*****

Please follow and like us:

One thought on “విషాద నిషాదము-1”

Leave a Reply

Your email address will not be published.