ఇందిరా భైరి స్మృతిలో

-ఫణి మాధవి కన్నోజు

(అపరాజిత కవయిత్రి ఇందిరా భైరికి నెచ్చెలి నివాళిగా ఈ వ్యాసాన్ని అందిస్తున్నాం-)

***

         ‘నేను పోయినపుడు వస్త్రానికి బదులు ఓ కాగితాన్ని కప్పండి కవిత రాసుకుంటాను’ అన్న ఇందిర భైరి గారి ‘పోయే ముందుమాట’ కవిత ఎంత మంది షేర్ చేశారో ఎంతగా వైరల్ అయిందో ఈ రోజు వరకూ చూస్తూనే ఉన్నాం.

         ‘నేను పోయాక నా స్మృతిలో ఈ కవిత చక్కర్లు కొడుతుందేమో’ నని నవ్వేసిన సరదా మనిషి. ఇప్పుడు మన మధ్య లేరంటే కలుక్కుమంటుంది. ఆమె సాహిత్య ప్రయాణాన్ని తలచుకోవటమే మనకు మిగిలిన ఆనందం.

         నానోలు, మినీ కవితలు, హైకూలు, అనువాదాలు, కథలు, కవితలు, బాల సాహిత్యం, గజల్స్ ఇన్ని రకాల ప్రక్రియల్లో సాహిత్య వ్యాసంగం సాగించిన అద్భుత ప్రతిభాశాలి – సకల ప్రక్రియల సాహితీ ఝురి – ఇందిరా భైరి

         గజల్ ప్రక్రియలో తెలంగాణాలోనే తొలి మహిళా గజల్ కవిగా చారిత్రక స్థానం ఇందిరా భైరి గారిది.

         ప్రేమ సంభాషణగా పేరున్న గజల్ ప్రక్రియలో లాలిత్య ప్రధానంగా ఉంటూనే ఆశ్చర్యకర రీతిలో విప్లవ భావాలు ఒదిగించిన కవి ఇందిరా భైరి.

//భరతదేశపుచరితపోరుల సాటి సాగిన ఉద్యమం ఇదె
లోకమంతా తెలంగాణా ఘనత చాటిన ఉద్యమం ఇదె
…………….
అక్కచెల్లెలు వేలువందలు భంగపడగా అగ్గిపుట్టెను
అన్నదమ్ముల నెత్తురంతా కత్తి నూరిన ఉద్యమం ఇదె//

//గోండు ప్రజలకండ నిలిచి గుండెలందుకొలువుండే కుమరం భీం
వనవాసుల హక్కులకై జీవితమే అర్పించే కుమరం భీం//

గజల్స్ లో ఇందిరగారు ఎంతటి అభ్యుదయ ఉద్యమ భావాలను మేళవించి రాశారో మచ్చుకు ఇవి చాలు కదా!

***

“త్రిశూలం విసిరినా
తల్వార్ మెరిసినా
నేలకొరిగేది
శాంతి పావురాలే”

“మానవత్వానికి
మానభంగం
పసితనానికి
రక్తస్రావం”

         ప్రత్యేకంగా విశ్లేషణ అవసరం లేని క్లుప్త పదాల్లో అనంత భావం కవి ప్రతిభను పట్టిస్తోంది.

         ముఖపుస్తకం ద్వారా కూడా అత్యధిక ఆదరణ పొందిన ఇందిరగారు మహిళగా, ఉపాధ్యాయురాలిగా విజవంతంగా జీవితాన్ని మలుచుకుంటూ సాహిత్యంలోనూ తనదైన ముద్రవేసుకున్నారు.

         చిన్నతనం నుంచే రచనలు చేస్తున్నా, తన తొమ్మిదవ తరగతిలో “ఉక్కు పిడికిళ్ళు” అనే కవిత వెలుగులోకి వచ్చింది. ‘ఆకలితో ఉండి దొంగతనం చేసిన వాణ్ణి అరెస్ట్ చేస్తారు, పట్టపగలు దోపిడీలు చేసేస్తున్న పెద్ద మనుషుల్ని ఎవరూ పట్టించుకోరు’ అనేది ఆ కవితా వస్తువు. ఇలా ఎక్కువగా సామాజిక అంశాల పైనే తన అక్షరాల్ని ఎక్కుపెడుతుంది ఆమె కలం.

//కేరళ కాదు
మనిషితనం మునిగిపోయిన
బాధలో ఈదులాడుతున్నాను
ప్రకృతి
ప్రకోపిస్తుంది సరే
అది మన చేతిలో లేదు!
చేయందించడానికి
మనసుంటే చాలదా!!//

         సామాజిక సమస్యల పట్ల ఇలా తక్షణం స్పందించ గలగటం ఆమె ప్రత్యేకత.

         తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఇందిరకు శ్రమజీవి అయిన తన తండ్రే స్ఫూర్తి. సింగరేణిలో క్లర్క్ గా పనిచేసే తండ్రికి చదువు పట్ల ప్రేమ. అధిక సంతానం అయినా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా చదువుకోవాలనే ప్రోత్సహించేవారు.

         ఊహ తెలియనంత చిన్నతనం నుంచే తన తండ్రి చదివి వినిపించే పుష్పవిలాప పద్యాలు, పోతన పద్యాలు తన పై అత్యంత ప్రభావం చూపాయనీ అవే సాహితీ ప్రపంచం వైపు అడుగులు పడేలా చేశాయని చెప్పేవారు ఇందిర.

         ఇంటర్మీడియట్ అయ్యాక జరిగిన వివాహంతో పదేళ్ళపాటు సాహిత్యానికి దూరమైన ఇందిర, ఉపాధ్యాయ వృత్తిలో అడుగిడాక మరి వెనుదిరిగి చూడలేదు. 1999లో ‘సాహితీ స్రవంతి’ సభ్యురాలవటంతో పుంజుకున్న ఆమెకు, ఉపాధ్యాయ ఉద్యమ పత్రిక ‘ఐక్య ఉపాధ్యాయ’ మరింత బలాన్నిచ్చింది.

         తెలంగాణా సాహితీ మిత్రులంతా అందించిన సహకారాన్ని, అంతులేని ప్రోత్సాహాన్నీ మర్చిపోలేనన్న ఆమె, తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఉమ్మడి ఖమ్మం నుంచి విభజింపబడిన ఇల్లెందు శాఖకు తెలంగాణ సాహితి సంస్థ బాధ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

మొదటిపుస్తకం:

“అమ్మాయి వంకర టింకరగా
మాట్లాడుతోందా
యాంకర్ అవుతుందేమో” ఆధునికతను అనుసరిస్తున్నాం అనుకునే అమ్మాయిల పై వ్యంగ్యాస్త్రం.

” మందిరమో మసీదో
తర్వాత సంగతి
ముందు మనం
మిగలాలి కదా”

” రామజన్మభూమి రగడ చూసి
రామాయణం రాసినందుకు
పరేషానవుతున్నాడు వాల్మీకి”

బాబ్రీమసీదు సంఘటన నేపథ్యంలో సూటి బాణాలు.

         ఇలాంటి అనేక అక్షరాస్త్రాలు హైకూలు, మినీ కవితలుగా అలవోకగా మలచి 2005 లో తన మొదటి పుస్తకం “అలవోకలు” ప్రచురించారు. ప్రముఖ కవి, ఫేస్బుక్ లో విజయవంతంగా నిర్వహింపబడుతున్న “కవిసంగమం” నిర్వాహకులు కవి యాకూబ్ ఈ పుస్తకానికి పేరు పెట్టారు. ఈ “అలవోకలు” అనేక మంది ప్రముఖుల ప్రశంసలందు కుంది.

*పోలవరం గురించి “జీవన్మరణం” సంకలనంలో, ముదిగొండ సంఘటన పై “భూస్వరాలు” సంకలనంలో, “పరివ్యాప్త” లోనూ 

*నెచ్చెలి ప్రచురణ -గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవితా సంకలనం  (1993-2022) “అపరాజిత” లోనూ 

ఇందిర గారి కవితలు చోటు సంపాదించుకున్నాయి.

2007 లో తన రెండవ పుస్తకం “అభిమతం” ప్రచురించారు. శక్తివంతమైన అభివ్యక్తితో అభ్యుదయ పంథాలో సాగే కవిత్వం ఈ అభిమతం.

//సమాజ అంగాలకు ఇన్ఫెక్షన్ సోకింది
అది గాంగరిన్ కాకముందే
కలాలను కత్తులూ కత్తెర్లు చేసి
శస్త్రచికిత్స చేద్దాం రండి//

         అంటూ పిలుపునిచ్చిన “అభిమతం” కు ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి శిలాలోలిత గారు, ఆనందాచారి గారు ముందుమాటలు రాశారు.

         ఇలా సాగుతున్న ఇందిర గారి సాహిత్య ప్రయాణం, గజల్ ప్రక్రియ పరిచయంతో ఓ అందమైన మలుపు తిరిగింది.

         సంగీత, సాహిత్య సమ్మిళతమైన సమ్మోహన ప్రక్రియ గజల్ కు ఆకర్షితులై, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారి వద్ద శిక్షణతో నైపుణ్యం సంపాదించారు.

         ప్రేమ, విరహ భావాలకు పేరైన గజల్స్ లోనూ అభ్యదయ భావాలను అద్భుతంగా పలికించారు. ఈ విషయంలో డా|| సి. నారాయణరెడ్డి గారు ఆదర్శం అనేవారు ఇందిర.

//మాటరాని జీవులైన జట్టుకట్టి మసలునేల
సమభావన లేక ఐక్యగీతి నిలిచి ఉంటుందా
నిప్పుకడుగు సూర్యుడినే దాచగలుగు మబ్బులేవి
స్వార్థమనే చెదలు చేర నీతి నిలిచి ఉంటుందా//
గజల్ ద్వారా ఇలా చెప్పగలగటం వినూత్నం.

//పడిలేస్తూ కెరటాలే తీరానికి చేరునే
ఒక అడుగే పయనానికి శ్రీకారం చుడుతుంది//

         “సవ్వడి” గజల్స్ లోని కొన్ని షేర్స్ ఇవి. ఎంత ఆత్మవిశ్వాసం నింపగలవో చెప్పక్కర్లేదు.

         ఇవేకాక తెలుగు గజల్స్ ను ఆంగ్లంలోకి, హిందీ గజల్స్ ను తెలుగులోకి విజయ వంతంగా అనువదించారు.

గజల్స్ ప్రచురణలు:

* 2015 లో “తెలంగాణా గజల్ కావ్యం”

* 2017 లో మూడు పుస్తకాలకు సరిపడే 120 గజల్స్ ను ఒకే పుస్తకంలో పొందుపరచి ప్రచురించిన “సవ్వడి”

అనంతరం..

* “మన కవులు” (గీతికలు) 2019
* “ఘన చరితలు” (గేయకవిత్వం) 2019
* “అక్షింతలు” (మినీ కవితలు)
ప్రచురించారు

కథలు :

* కెనడా వారి “తెలుగు తల్లి” పత్రికలో “ఆఖరి చూపు” కథ
* తెలంగాణ మహిళా ద్వైమాస పత్రిక “మానవి” లో ఒక కథ
* జ్వలిత గారి సంపాదకత్వంలో వెలువడిన “ఖమ్మం కథా సంకలనం” లో కథ ప్రచురితమయ్యాయి.
* జ్వలిత గారి సంపాదకత్వంలో ఇటీవల విడుదలైన ‘గల్పికా తరువు’ వంటి వివిధ సంకలనాలలోనూ ఇందిర గారి రచనలు చోటుచేసుకున్నాయి.

* 2021 లో ప్రచురించిన “వలపోత” కథల సంపుటి ద్వారా కథలు పుస్తకంగా తేవాలన్న ఇందిర గారి కోరిక సాకారం అయింది.

* “మరొక ప్రారంభం” ఇటీవల విడుదలైన ఇందిర గారి వచన కవిత్వ సంపుటి.
ప్రక్రియ ఏదైనా, కఠిన నిజాలన్నీ ఈమె రచనల్లో కొలువు తీరతాయి. చదివే మనసులకు చురుక్కున తగుల్తాయి. వ్యంగ్యం, సూటిదనం దట్టించిన తూటాల్లాంటి వాక్యాలు ఈమె కవిత్వంలో కనిపిస్తాయి. సౌమ్యత, తీవ్రత ఏకకాలంలో దర్శనమిస్తాయి.

ఇంకా..

* “మనిషి – మాను” – బాల సాహిత్యం..
* “బాలకాండ” – బాలసాహిత్యం
* “బాలానందం” – బాలసాహిత్యం
* “లేడీస్ స్పెషల్” – కవిత్వం
* “జాతశ్రీ కథలు” – పరిశోధనా గ్రంథం
* పేరు ప్రధానంగా సాగే వినూత్న కవితలు “నామధ్యేయం” – మినీ కవితలు
* “పేరడీ” – అనువాదాలు
* “భారత్” – గేయాలు
ఇవన్నీ ప్రచురణ దశలో ఆగి ఉన్నాయి.

బహుమతులు:

* 1998 లో ఆస్ట్రేలియా “తెలుగు పలుకు” నుంచి “సుఖదుఃఖాలు”అనే కవితకు మొట్టమొదటి బహుమతి పొందారు.
* అది మొదలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక బహుమతులు పొందారు.
* మానస అకాడమీ నుంచి జాతీయ స్థాయిలో గౌరవం వరించింది.
* డిసెంబర్ 18, 2022 న ఖమ్మంలో వురిమళ్ళ ఫౌండేషన్ నుంచి ఉమ్మడి ఖమ్మం సాహిత్య పురస్కారం.. భోగోజు పురుషోత్తం-సముద్రమ్మ స్మారక పురస్కారాన్ని పొందారు.

ఆమె గతంలో స్వయంగా పంచుకున్న మాటల నుంచి..

“కవి స్పందన మీద ఎవరి ఆంక్షలూ ఉండకూడదనేది నా మాట”

ఎవరి శైలి వారికుంటూనే అవతలి వారి ముద్రను గౌరవిద్దాం అనేది వారి అభిప్రాయం.

సాహిత్యం-అనుభూతి :

సాహిత్యం ద్వారా ఏం సాధించగలమంటే ఏం చెప్పను. సాహిత్యం తోడుంది కాబట్టే ఒంటరితనం కానీ, నిరాశా నిస్పృహలు కానీ దరిచేరట్లేదని చెప్పగలను.

యువతకు:

         అన్నీ చూడాలి అవగతం చేసుకోవాలి. మనదైన మార్గం ఎంచుకోవాలి. దాని కోసం విమర్శలొచ్చినా అడ్డంకులొచ్చినా సాగిపోవాలి.

* తెలంగాణా తొలి గజల్ కవయిత్రిగా గుర్తింపు వచ్చింది. అంతేకాక ఆ గుర్తింపుతో తెలంగాణ సాంస్కృతిక శాఖ ప్రోత్సహించి రవీంద్రభారతిలో ఫుల్ టైమ్ కార్యక్రమానికి అవకాశం ఇచ్చారు.

* గజల్స్ పట్ల అమితమైన ప్రేమతో “సదాశివ గజల్ అకాడమీ” సంస్థను స్థాపించే పని తలపెట్టారు. ఆ మధ్య రవీంద్రభారతిలో ఆ సంస్థ లోగోను కూడా తెలంగాణ సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

         ఫిబ్రవరి 19, 2023 న తుదిశ్వాస తీసుకున్న భైరి ఇందిర గారు.. మహిళగా తన ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెల జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దటంలోనూ, ఉపాధ్యాయురాలిగా తన విద్యార్థులకు ఆప్యాయంగా విద్యను పంచటంలోనూ, కవయిత్రి గా సమాజ స్థితిగతులను అక్షరాల్లో ప్రతిబింబించటంలోనూ ఇందిరగారు సాహిత్య ప్రపంచంలో తోటివారికి ఆదర్శంగా నిలిచిపోయారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.