వెనుతిరగని వెన్నెల(భాగం-45)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒకపక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధిస్తుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది. హైదరాబాదు కు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్లీ ఎదురవుతాడు.

 ***

         దసరా సెలవులు వచ్చేయి. డబ్బులు ప్రధాన సమస్య కావడం వల్ల  ఉద్యోగంలో చేరి, బాబుని తీసుకుని వచ్చేక ఇంటికి మళ్లీ వెళ్లే డబ్బు వెసులుబాటు కలగలేదు తన్మయికి.

         కానీ పీ.హెచ్.డీ లో జాయినయ్యిన మొదటి సంవత్సరం గడిచేలోగా  ప్రీ పీ .హెచ్ డీ పరీక్ష రాయాల్సి ఉంది.  

         అనుకోకుండా దసరా సెలవులు కాగానే వచ్చే మొదటి సోమవారమే పరీక్షకి తారీఖు ఖరారు కావడంతో ఎలాగూ విశాఖపట్నం వెళ్లాల్సి ఉంది కూడా కాబట్టి, తన్మయి బండి కొనే ఆలోచన తాత్కాలికంగా పక్కనబెట్టి ఇంటికి బయలుదేరింది.

         కాలేజీకి మధ్యాహ్నం సెలవు పెట్టి బస్సెక్కి హైదరాబాదుకి చేరుకుంది. రైల్వే స్టేషనుకి చేరుకునే సరికి ఏడు కావచ్చింది. రాత్రి తొమ్మిది గంటల వేళ రైలుకి టిక్కెట్టు కావడంతో  ప్లాట్ ఫారమ్మీద ఉన్న హిగ్గిన్ బాదమ్స్ పుస్తకాల షాపు దగ్గర్లో ఉన్న గట్టు మీద కూచుంది.

         షాపుకి కట్టి ఉన్న తాడు మీద అన్నిటికన్నా చివరన ఉన్న వారపత్రిక తీసి, “చూడొచ్చా?” అంది. 

         రెండో పేజీలో ఉన్న ఫుల్ పేజీ బొమ్మకి సరిపోయేటట్లు ఉన్న కవిత చూడగానే చదవాలనిపించేటట్లు ఉంది.

“ఈ జీవితం కాన్వాసు మీద 

వయసు కుంచె 

అనుభవాల రంగుల్తో 

వేసిన స్మృతి చిత్రాలు 

కాలం నీరు 

ఎంతగా ఒలికినా 

మాసిపోవడం లేదు” 

         “ఎంత బాగా రాసేరు!!” అనుకోకుండా ఉండలేకపోయింది.  

         కవిత రాసిన వారి పేరు కోసం మళ్లీ ఒకసారి పేజీ తిప్పి చూసింది. 

“కిరణ్ ప్రభ”  

         వెనక నుంచి బాబు కొంగు పుచ్చుకుని లాగేడు.

         చిరుకోపంగా “ఏవిటమ్మా?” అంది.

         ఆ పక్కనే నిలబడి తన వైపే చూస్తున్న ప్రభుని చూసి ఆశ్చర్యపోయింది.

         “మీరేవిటి, ఇలా?” అంది.

         “ఊరు వెళ్తున్నారన్న సంగతి మీరు చెప్పక పోతే తెలీదనుకున్నారా?” అంటూ  టిఫిను బాక్సు చేతిలో పెట్టేడు.

         “జీడిపప్పు ఉప్మా. నేనే స్వయంగా చేసేను. రైలెక్కగానే తినండి. అప్పటికి బాగా ఆకలేస్తుంది.” అంటూ

         జేబులో నుంచి ఫైవ్ స్టార్ చాక్లట్టు తీసి బాబు చేతికి ఇవ్వబోయేడు.

         బాబు తన్మయి వైపు తిరిగేడు, “తీసుకోనా, వద్దా” అన్నట్లు.

         “అయ్యబాబోయ్, ఏం కట్టుదిట్టంగా పెంచుతున్నారో వీణ్ణి.  మీరు పర్మిషను ఇవ్వందే చాక్లెట్టు  కూడా తీసుకునేటట్లు లేడు వీడు.” అని నవ్వి “ఫర్వాలేదు లేవోయ్” తీసుకో అన్నాడు.

         అప్పటికీ బాబు తటపటాయిస్తూ, తన్మయి తల ఊపగానే చటుక్కున అంది పుచ్చుకుని, “థాంక్యూ” అన్నాడు.

         “నిజంగానే, ఎలా తెలిసింది మీకు?” అంది సాలోచనగా.

         “ఇంటికి ఫోను చేసేను. తాయిబా మీరు ఏ బండికి వెళ్తున్నారో పేరు చెప్పింది. ఇందులో అంత దాపరికం ఏవుంది!” అన్నాడు ఆశ్చర్యంగా.

         “ఊహూ..ఏం లేదు. మీరెందుకు ఇలా…ఇబ్బంది” అంటూ బాక్సు వైపు చూస్తూ ఇక మాట్లాడలేనట్లు తల కిందికి వంచుకుంది!

         ఇతనికి తనంటే ఎందుకింత అభిమానం! 

         అదే అడిగింది.

         బదులుగా నవ్వి, “అదిగో రైలు వస్తోందని ఎనౌన్సుమెంటు మొదలైంది. దయచేసి వినండి”  అన్నాడు అనౌన్సరుని మాటల్ని అనుకరిస్తూ.

         తన్మయి వద్దన్నా వినకుండా లగేజీ పట్టుకుని “బెర్తు నంబరు చెప్పండి” అన్నాడు.

         తన్మయి సర్దుకోగానే రైలు దిగుతూ “జాగ్రత్తగా వెళ్లి రండి. ఎదురు చూస్తుంటాను” అన్నాడు.   

         రైలు కదిలేంత వరకూ కిటికీ ఊచల్ని పట్టుకుని నిలబడే ఉన్నాడు.

         “ఉత్తరం వెయ్యడం మర్చిపోకండి” అన్నాడు చివరికి. అతని గొంతులో చెప్పలేని బాధ ధ్వనించింది. 

         అతని మాటలు, బాధ అర్థమవుతున్నా తన హృదయం ఏదో సందేహిస్తూంది. 

         ఒక పట్టాన మానని చేదు గాయలు అంతరాంతరాల్లో సలుపుతున్నాయి.

         అతనికి ఆహ్వానం పలకలేని స్థితి. అలాగని దూరంగా ఉండమని కఠినంగా అతనిని హెచ్చరించలేని  స్థితి.

         తనేవిటో, తన జీవితం ఏవిటో అతనికి ఏం తెలుసని ఇలా వెంటపడుతున్నాడు?

         బండెక్కగానే బాబు “ఆకలి” అనడం మొదలుపెట్టేడు.

         బాక్సు మూత తీయగానే జీడిపప్పు, కరివేపాకు, అల్లం సువాసన గుప్పున కొట్టింది. ఆత్రంగా ముందుకు వంగిన బాబుకి తినిపించి, తనూ తింది.

         అతని మనసులోని ప్రేమంతా కలిపినట్లు ఎంతో రుచిగా ఉందా ఉప్మా.

         అసలు అతనికి ‘రైలెక్కగానే ఆకలేస్తుందని’ ఆలోచన  వచ్చినందుకే అతని పట్ల మనసంతా  కృతజ్ఞతతో నిండి పోయింది.

         తినగానే  నిద్రలోకి జారుకున్నాడు బాబు. 

         ప్రభు గురించి ఆలోచనలు చుట్టుముట్టాయి.

         అతను తమ గురించి ఆలోచిస్తూ  అతని జీవితాన్ని వృథా చేసుకుంటున్నాడు. 

         ఇప్పుడిప్పుడే మొదలు పెట్టిన అతని జీవితంలో అన్నీ సాఫీగా జరగాల్సి ఉంది. ఇంకా ఎంతో వృద్ధిలోకి రావాల్సిన వాడు. 

         లేదు లేదు. ఇదిక్కడితో ఆపాలి. ఇంకా మొదలవుతున్న అతని జీవితంలో నుంచి ఇప్పుడు నిష్క్రమించడమే మంచిది. 

         అదేదో ఇప్పుడే చెప్తేనో?

         ఆలోచన రాగానే పర్సులో నుంచి ఇన్ లాండ్ లెటరు ఒకటి తీసి, రాయడం మొదలు పెట్టింది.

“ప్రభూ!

నా కోసం మీరు శ్రమ పడి తెచ్చిన  ఉప్మా  ఇప్పుడే పూర్తి చేసాం.  

నా జీవితంలో ఇంత రుచికరంగా ఎవరూ వండగా ఇప్పటివరకూ నేను తినలేదు.

మా గురించి ఇంతగా ఆలోచిస్తున్న మీ ఋణం తీర్చుకోవడానికి “ధన్యవాదా”లన్నది చాలా చిన్న మాట. 

కారణాంతరాలేవైనా మీరు బాల్యంలో నన్నెరిగినంత బాగా నేను మిమ్మల్ని గురించి ఎప్పుడూ తెలుసుకోలేదు. 

నా వరకూ  నాకు మీరు ఇప్పుడిప్పుడే పరిచయమైన స్నేహితులే. 

రైలు కదిలేంత వరకూ మీరలా నా కోసం నిలబడడం నాకెందుకో ఇబ్బందికరంగా అనిపించింది. 

ఇలా ఎవరినీ ఇబ్బంది పెట్టడం నాకు బొత్తిగా నచ్చదు.  

నా పట్ల మీకు చిన్నప్పటినించి ఉన్న ఆరాధనని అర్థం చేసుకోగలను.

కానీ నా చుట్టూ తిరుగుతూ మీ సమయాన్ని, జీవితాన్ని వృథా చేసుకోవడాన్ని చూస్తూ ఉరుకోలేను.

అర్థం చేసుకుంటారు కదూ! 

సదా

మీ మంచి కోరే మీ స్నేహితురాలు,

తన్మయి.

         లెటరు మడిచి పర్సులో పెట్టుకున్నాక గానీ మనసు స్థిమిత పడలేదు.

         “పొద్దున్నే ఇంటికి వెళ్లగానే పోస్టు చేసెయ్యాలి.” అనుకుంది.  

         లయబద్ధంగా వినిపిస్తున్న పట్టాల చప్పుడు, పట్టాల మీద ఉయ్యాలలూగుతూన్నట్లు సాగే రైలు ప్రయాణం తనకి చిన్నతనం నించీ చాలా ఇష్టం.

         ఎప్పుడూ ఇలా రైలెక్కగానే అలా తరుముకొచ్చినట్లు వస్తుంది నిద్ర.

         ఇవేళెందుకో నిద్ర పట్టడం లేదు.

         కిటికీ వార బెర్తు కావడం వల్ల చీకట్లో చెట్ల నీడలు వేగంగా కదులుతూ ఆకాశంలో అప్పుడే పొడిచిన అందమైన నెల వంకతో పాటూ పరుగు పందెం వేసుకున్నట్లు పోటీ పడసాగేయి.

         అంతలో మెల్లగా రైలు ఏదో స్టేషనులో ఆగింది. దానితో బాటూ ఆలోచనల వేగమూ తగ్గినట్లైయింది.

         తనలో తను సంభాషించుకోసాగింది. 

         “నన్ను మన్నించు అజ్ఞాత మిత్రమా! నీతో ఎన్నో రోజులయింది సంభాషించి. నీ రూపంలో  ప్రభు కనిపిస్తున్నాడు నాకు. కానీ అది నా భ్రమో, నిజమో తెలియడం లేదు. తెలిసి తెలిసి అతని జీవితాన్ని కష్టాలమయం చెయ్యడం ఇష్టం లేదు. అలాగని చిన్నతనం నించీ ఆరాధిస్తున్న అతన్ని దూరం చేసుకోవడమూ ఇష్టం లేదు. నువ్వే చెప్పు ఏం చెయ్యాలో.”  

         రైలు మళ్లీ బయలుదేరబోతున్నట్లుంది. 

         “నువ్వే చెప్పు మిత్రమా ఏం చెయ్యాలో” అని కళ్లు మూసుకుంది.

         స్టేషనులో గణగణా గంట మోగింది.

          “సత్యం” అన్నారు ఎవరో.

***

         వనజ ఊర్లో ఉందని తెలియడంతో వెళ్లగానే వాళ్ల ఇంటికి బయలుదేరింది. 

         “చాలా బావుందమ్మా  నీ హడావిడి. రాకరాక వచ్చేవు. ఇలా రాగానే అలా స్నేహితురాలంటూ పరుగెత్తాలా?  వెళ్లే ముందు వెళ్ళొచ్చు.  ఇంతలో తనెక్కడికీ పోదు.” అంది జ్యోతి.

         “వెళ్లనీ, స్నేహితురాళ్ళు ఇద్దరూ  కలిసి చాన్నాళ్లయ్యింది కదా” అన్నాడు భానుమూర్తి.

         ఒకప్పుడు చకచకా పనులన్నీ చక్క బెట్టే తండ్రి ఇప్పుడు లేవదీస్తే గానీ, మడత కుర్చీ లోంచి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు.

         తన్మయికి తప్పిదం తనదే అన్న బాధ చుట్టుముట్టింది.   

         తల్లికి సమాధానం చెప్పకుండా వనజ ఇంటి వైపు నడిచింది.  

         వనజ రెండో కాన్పుకి అమ్మగారింటికి వచ్చింది. పాప చక్రాల లాంటి కళ్లతో అందంగా ఉంది. 

         నడుముకి తువ్వాలు బిగించి కట్టుకుని మెల్లగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న వనజ తన్మయిని చూడగానే ఆత్మీయంగా చేతులు గట్టిగా పట్టుకుంది. 

         “మళ్లీ లక్ష్మీదేవేనమ్మా. మూడో సారైనా కొడుకు పుడతాడో లేదో చూడాలి.” అంది  నిష్టూరంగా వనజ తల్లి మళ్లీ ఆడపిల్ల పుట్టడం వల్ల అన్యాయమేదో జరిగిపోయినట్టు. 

         “చాల్లేమ్మా నీ పిచ్చి మాటలు. నువ్వే అత్తగారిలా తయారయ్యేవు. ఇప్పటికే రెండు సార్లు చచ్చి బతికేను. ఇంకా మూడోసారి కూడానా?” అంది కాస్త గొంతు పెంచి వనజ.

         ఆవిడ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. 

         తన్మయికి ఆశ్చర్యం వేసింది. తనెప్పుడూ తల్లితో అలా చనువుగా, గద్దింపుగా మాట్లాడి ఎరుగదు.

         అదే తన తల్లి అయితే రెండో వాక్యం పూర్తి చెయ్యక ముందే ముక్కు చీది ఏడవడం మొదలెట్టేది. ఇంకాస్త ముందుకెళ్లి వారం పాటు మాట్లాడడం కూడా మానేసేది. 

         వనజతో అదే అంది. 

         “మా అమ్మ అమాయకురాలు. పితృస్వామ్య వ్యవస్థలో బతుకుతున్న సగటు ఆడ మనిషి. అది సరే గానీ, అసలు నేను నీకు గుర్తున్నానా? ఎన్ని ఉత్తరాలు వేసినా జవాబివ్వవు.” అంది చిరు కోపం నటిస్తూ వనజ.

         ఏం చెప్పగలదు వనజకి తన వ్యర్థ చరిత్ర! 

         తన్మయి నిట్టూర్పు విని, “ఏదో సరదాకి అన్నాను. నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే స్నేహితురాలిని ఎలా అవుతాను? అదంతా సరే గానీ నీ సంగతులు చెప్పు.  ఎలా ఉన్నావు? కొత్త ఉద్యోగం, కొత్త ఊరు,  కొత్త జీవితం ఎలా ఉంది?” అంది ఆసక్తిగా. 

         “ఏ బాదర బందీలు  లేకుండా  జీవితం ప్రశాంతంగా  గడుస్తూ ఉంది వనజా!”

         “అంటే మన చిన్నప్పటిలాగా అన్నమాట” అంది వనజ.

         “ఉహూ. ఎంత బాదర బందీలు లేకపోయినా చిన్నప్పటి స్వేచ్ఛ వేరు. ఇప్పటి జీవితం వేరు. బహుశా: చిన్నప్పటి రోజులు మళ్లీ రావేమో” సాలోచనగా అంది చిన్నగా నవ్వుతూ తన్మయి.

         “ఏది ఏమైతేనేం. ఎక్కడా వెనకడుగు వేయకుండా నువ్వు జీవితంలో అనుకున్నవి సాధించావు. నువ్వు  నా స్నేహితురాలివని గర్వంగా చెప్పుకుంటున్నాను  తెలుసా!” అంది వనజ.

         వనజతో మాట్లాడితే వెయ్యేనుగుల బలం వస్తుంది ఎప్పుడూ.

         మాట్లాడుతూ గదిలోని  అద్దాల షోకేసులో గీతాంజలి పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది తన్మయి.

         అది తను వనజకి ఇచ్చిందే. “అబ్బ. ఎంత జాగ్రత్తగా దాచావు వనా!” అంది తన్మయి.

         నిజానికి తనూ అలాగే దాచింది. తమ పెళ్లిళ్లు కుదిరి అత్తవారిళ్లకు వెళ్లిపోయే ముందు ఇద్దరూ గీతాంజలిని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నారు.

         పుస్తకం పేజీలు  తిప్పుతుండగా  కనబడ్డ మొదటి కవితని అన్యాపదేశంగా పైకి చదివింది తన్మయి.

“ప్రభూ!

అనుదినం నీ  సన్నిధిలో ముఖాముఖిగా ముకుళిత హస్తాలతో నీ  సన్నిధిలో నిలుస్తాను

శాంత గంభీర నిర్మల నీలాకాశం క్రింద వినీలిత హృదయంతో నీ సన్నిధిలో నిల్చుంటాను ….”

         ఇక చదవలేక తన్మయి గొంతు గద్గదమవడాన్ని గమనించి చప్పున దగ్గిరికి వచ్చింది వనజ. “నిజంగా అంతా బానే ఉందా?” అంటూ.

         “హఠాత్తుగా ప్రభు ఎందుకు గుర్తొస్తున్నాడు? అతని పట్ల తను ఆకర్షితురాలవు తూందా?! అతన్ని తలుచుకుంటే దూరమవుతున్న బాధ తనకి ఎందుకు కలుగుతోంది?”

         ఏవీ మాట్లాడలేక నిశ్శబ్దంగా తల అడ్డంగా ఊపింది తన్మయి.

         “ఏమో వనా! ఒంటరి జీవితంలో ఎంత వెసులుబాటు ఉందో, అంత బెంగ కూడా ఉంది. లోకమంతా  నిశ్శబ్దంగా నిద్రించే వేళ, వెచ్చని స్పర్శ లేని బాధ. శరీరంతో బాటూ మనసుని వేధించే ప్రేమ రాహిత్యపు బాధ. ఒంట్లో బాలేనప్పుడు దిక్కు తోచని బాధ….” కళ్ల వెంట బొట బొటా  కారుతున్న నీళ్లని కొంగుతో అద్దుకుంటూ, “బాలెంతవి. నాతో బాటూ నిన్ను బాధ పెట్టడం నాకు సబబు కాదు. మళ్లీ వస్తా వనా” అంటూ లేచింది తన్మయి.

         వనజ తన్మయి చెయ్యి పట్టుకుని ఆపి, “ఉండు. ముందు కాసిన్ని మంచి నీళ్లు తాగు. స్థిమితపడు” అంది.

         పాపని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టి, పెరట్లో బాదంచెట్టు కింద ఉన్న గట్టు మీద కూచుంటూ “ఇలారా, ఎవరతను?” అంది చిరునవ్వు నవ్వుతూ వనజ.

         తన్మయి కళ్లలో నీటిపొరతోనే చప్పున నవ్వి చెప్పసాగింది.

         అంతా విని వనజ ఉత్సాహంగా ముందుకు వంగి, “అతను నిన్ను నిజంగానే ఇష్టపడుతున్నాడని అనిపిస్తూంది. అతన్ని నువ్వు ఎందుకు దూరం పెట్టాలి?” అంది.

         తన్మయి ఏం మాట్లాడక పోవడం చూసి “కలిసి జీవించడంలోను, ఒంటరిగా ఉండడంలోను వేటి సమస్యలు వాటికే ఉన్నాయి. కాదనను. నువ్వు ఎలా జీవించాలను కుంటున్నదాని గురించి స్పష్టత తెచ్చుకో. నిన్ను ఏరి కోరి రావడానికి, నీ మీద జాలి చూపించడానికి తేడా ఉంది. ప్రభు నిజాయితీగా నిన్ను ఇష్టపడుతున్నాడని అనిపిస్తూంది. నీకు నచ్చినంత సమయం తీసుకుని నిదానంగా ఆలోచించుకో.” అంది వనజ.

         తిరిగి వస్తున్నంత సేపూ వనజ మాటలే వినిపించసాగేయి తన్మయికి.

         ఇంట్లో రాత్రుళ్లు ఒక్కతే పడుకోవడానికి కూడా తనెంత భయపడుతుందో తనకు తెలుసు.

         తలుపుకి ఉన్న మాములు గొళ్లెం మధ్యలో అట్లకాడ అడ్డం పెట్టి, కుర్చీని తలుపుకి ఎదురుగా జరిపి, కుర్చీ మీద బరువైన బియ్యం డబ్బా పెట్టి……ఎంతగా భయపడుతుందో ప్రతీ రాత్రీ.

         ఒంటరిగా జీవించలేని తనకి తప్పనిసరైన ఒంటరి జీవితంలో ఉలికి పాట్లతో ఎన్ని నిద్ర పట్టని రాత్రుళ్లు  కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుందో తనకే తెలుసు.

         అలాగని కొరివితో తల గోక్కోవడమూ ఇష్టం లేదు.

         ఇంటికి వచ్చే దారిలో ప్రభుకి రాసిన ఉత్తరం పోస్టు డబ్బాలో వేసేసేక మనసు కాస్త స్థిమితపడింది.

***

         దసరా సెలవులు ఇంకా రెండు రోజుల్లో అవుతాయనగా విశాఖపట్నానికి బయలు దేరింది తన్మయి.

         మేరీ ఎప్పటి నుంచో తన దగ్గిర ఉండమని పోరుతూ ఉంది.

         ఇన్నాళ్ళకి తనకి కుదిరింది. పైగా ప్రీ పీ .హెచ్ డీ పరీక్ష కోసం కాస్త స్థిమితంగా చదవాలి.

         సెలవులు లేనందున ఇక్కడి నుంచే సరాసరి హైదరాబాదుకి వెళ్లాల్సి ఉండడంతో బాబుని తీసుకుని వచ్చింది తన్మయి.

         రైల్వే స్టేషనులో దిగగానే తన కోసం స్టేషనుకి ఎవరూ రాని ఒంటరితనం చుట్టు ముట్టింది.

         తన కలల నగరమే తనని కల్లోలం చేసింది అదేం విచిత్రమో!

         సామాన్లతో నాలుగడుగులు వెయ్యగానే మేరీ ఎదురొచ్చింది. “బస్సు లేటయి పోయింది. ఎలా ఉన్నావు తన్మయీ!” అంటూ.

         “అయ్యో. నా కోసం స్టేషనుకి రావాలా? నేనే వస్తానుగా” అంది తన్మయి సంతోషంగా.

         “రైలు దిగగానే మన కోసం ఎవరూ రాకపోతే ఎంత దిగులుగా ఉంటుందో నాకు తెలుసు. పైగా నిన్ను చూసి ఎన్ని రోజులో అయిపోయింది. రాకుండా ఎలా ఉంటాను చెప్పు?” అంది మేరీ బాబుని ఎత్తుకోవడానికి చెయ్యి చాస్తూ.

         బాబు అడ్డంగా తలూపేడు.

         “అమ్మో, వీడు పెద్దాడయిపోయేడు” అంది మేరీ వాడి బుగ్గలు పుణుకుతూ.

         సముద్రతీరం వెంబడి ఆటో వెళ్తుంటే అత్యంత ఆహ్లాదంగా అనిపించసాగింది తన్మయికి.

         మేరీ ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది.

         తన్మయి మనస్సు శరీరం నించి వేరు పడి సాగరతీరం నుంచి కెరటాల్ని చుట్టుకుని, గాలి వాటున రెక్కలల్లార్చుకుని, అలల నురుగు మీద గిరికీలు కొట్టి స్వేచ్ఛగా విహరిస్తున్న విహంగమయ్యింది. 

         రోడ్డు పక్కన అప్పుఘర్ చూపించడానికి బాబు కుదిపేసరికి ఈ లోకంలోకి వచ్చి పడింది.

         ఆటో పక్కనే పరిచితమైన వ్యక్తి బండి మీద చిన్న పాపని, భార్యని ఎక్కించుకుని ముందుకు వెళ్తూ కనిపించేడు.

         “కరుణ కదూ” అంది మేరీ.

         తన్మయి నిర్లిప్తంగా, నిరాసక్తంగా  “అయి ఉండొచ్చు” అంది.

         “పోన్లే, సెటిలయ్యాడన్న మాట పాపం ఒక్క భార్యతో” అంది వెక్కిరిస్తూ మేరీ.

         తన్మయి పొడిగించకుండా “మేరీ, రేపు కైలాసగిరికి వెళ్దామా?” అంది.

         ఎం. వి. పీ కాలనీ మలుపు తిరిగింది ఆటో.

         “అవునూ, స్టేషను నుంచి ఎం. వి. పీ కాలనీ రావడానికి మనం బీచి రోడ్డులో నుంచి ఎందుకొచ్చేం?” అంది తన్మయి.

         దిగి ఆటోకి డబ్బులిస్తున్న మేరీని వారించి, డబ్బులు పైకి తీసి , ” రైలు దిగంగానే నాకు సముద్రాన్ని చూపించాలని అటు నుంచి తీసుకువెళ్ళమని చెప్పావు కదూ” అంది సంతోషంగా తన్మయి.

         మేరీ లాంటి స్నేహితురాలు దొరకడం తన అదృష్టం. తన మనసులోని భావాల్ని చదివినట్లు పనులు చేసి తనని సంతోషపెడుతుంది. 

         అదే చెప్పింది మేరీతో.

         “ఊ.. ఈ  పొగడ్తల మాటకేం గానీ, బాబుని నేను చూసుకుంటా, హాయిగా చదువుకో” అంది మేరీ కాఫీ పెడుతూ.

         “మేరీ లాగా తనని ప్రేమించే వ్యక్తి ప్రభు. అయినా అతన్నించి తను ఎందుకు దూరం కావాలనుకుంటూంది?”

         అతని ఆలోచనలు మళ్లీ చుట్టుముట్టసాగేయి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.