తప్పిన ప్రమాదం
-కందేపి రాణి ప్రసాద్
ఆ వీధిలో ఒక పాడుపడిన ఇల్లు ఉన్నది. సగం పడిపోయిన గోడలు, కూలిపోయిన కప్పుతో ఉన్నది. ఒక పిల్లి తన పిల్లల కోసం ఈ ఇంటిని ఎంచుకున్నది. ఆ పాడుపడిన ఇంటిలో పిల్లి నాలుగు పిల్లల్ని పెట్టింది. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ కాపలా కాస్తున్నది. పిల్లల శరీరాలను తల్లి నాకుతూ శుభ్రం చేస్తుంది.
తల్లి పిల్లి తన పిల్లలకు పాలిస్తూ ప్రేమగా తల నిమురుతోంది. ఆ సమయంలో వాటికి లోకజ్ఞానానికి సంబంధించిన విషయాలు చెబుతూ ఉంటుంది. పిల్లల్ని ఎత్తుకు పోయేవాళ్ళ గురించి, మోసాలు చేసేవాళ్ళ గురించి, ఎన్నో విషయాల గురించి చెబుతూ ఉంటుంది . ఏదైనా ఆపద వస్తే ఎలా ఉపాయంగా తప్పించుకోవాలి, అసలు అపాయం రాకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను చక్కగా విడమరిచి చెప్తుంటుంది.
ఒక రోజు తల్లి పిల్లి ఆహారం కోసమై బయటకు వెళ్ళాలనుకుంది. కానీ పిల్లలను వదిలి పెట్టి వెళ్ళడానికి కూడా భయంగా అనిపించింది. కానీ తప్పదు కదా! తల్లి పిల్లి నలుగురు పిల్లల్నీ కూర్చోబెట్టుకొని “చూడండి పిల్లలూ! నేను బయటకు వెళుతున్నాను. నేను వచ్చేదాకా తలుపులు వేసుకుని ఉండాలి. ఎవరైనా వచ్చి పిలిస్తే బయటకు రాకూడదు. కొంత మంది దొంగలు నా గొంతును అనుకరిస్తారు. అయినా సరే బయటకు రాకూడదు ఎన్నో అబద్ధాలు చెబుతారు . వినవద్దు ! అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. సాయంత్రానికి వస్తాను అని తల్లి చెప్పింది.
‘సరేనమ్మా’ అంటూ తలూపాయి. పిల్లి పిల్లుల మేం చాలా జాగ్రత్తగా ఉంటాము బయటకు రానే రాము అంటూ పిల్లిపిల్లలు భయంగా చెప్పాయి. వదల్లేక వదల్లేక తల్లి పిల్లి, పిల్లల్ని వదిలి బయటకు వెళ్ళింది.
తల్లీ పిల్లలు మాట్లాడుకున్న మాటలన్నీ గోడ చాటు నుండి ఒక తోడేలు విన్నది. వీటిని ఎలాగైనా మోసం చేసి తీసుకెళ్ళాలి అనుకున్నది . ఏం చేయాలో ఒక ప్లాను వేసుకున్నది.
తోడేలు సాయంత్రం దాకా ఎదురు చూసింది. అప్పుడు పిల్లి పిల్లలున్న ఇంటికి మెల్లిగా వెళ్ళింది. పిల్లలూ! పిల్లిపిల్లలూ! అంటూ తియ్యని గొంతుతో పిలిచింది.
‘ఎవరు’ అంటూ అడిగాయి పిల్లి పిల్లలు.
“నేను మీ అమ్మ స్నేహితురాలిని. మీ అమ్మ అక్కడ ఆపదలో చిక్కుకున్నది. ఇంటికి రాలేకపోయింది. మిమ్మల్ని తీసుకొని ఆ కొండ దగ్గరున్న మర్రి చెట్టు దగ్గరకు తీసుకు రమ్మన్నది త్వరగా బయల్దేరండీ వెళదాం” అన్నది తోడేలు.
ఏమైంది మా అమ్మకు నువ్వు చెప్పింది నిజమేనా? అంటూ కొద్దిగా భయంగా కొద్దిగా అనుమానంగా ఆడిగాయి పిల్లి పిల్లలు.
ఇందాక పులి పట్టు నుండి మీ అమ్మ తప్పించుకున్నది. ఆ హడావిడిలో కాలు విరిగి నడవలేక పోతున్నది. అందుకే నన్ను పంపించి మిమ్మల్ని తీసుకురమ్మని కోరింది. మనం త్వరగా వెళ్ళాలి అంటూ తొందర పెట్టింది.
అమ్మకు ఆపద అని తెలియగానే పిల్లలకు అమ్మ చెప్పిన జాగ్రత్తలేవీ గుర్తుకు రాలేదు. అమ్మకు ఏమైందో అనే ఆదుర్దా ఎక్కువయింది. ఏడుపు ముఖాలతో నాలుగు పిల్లులూ మాట్లాడుకున్నాయి. మనం త్వరగా వెళదామా అని ఒక పిల్ల అడిగింది. “పాపం అమ్మకు నొప్పి ఎలా ఉన్నదో అని మరో పిల్ల అన్నది. వాటిలో ఒక పిల్ల మాత్రం అనుమానం వ్యక్తం చేసింది. ‘అమ్మ చెప్పినట్లు దొంగేమో? అన్నది.
మిగతా పిల్లలు దాని అనుమానాన్ని కొట్టిపారేశాయి.
నాలుగు పిల్లలూ గబగబా బయటికి వచ్చేశాయి తోడేలు ఆనందంగా నవ్వుకున్నది. ఆ రండి రండి అంటూ తోడేలు ముందుకు దారి తీసింది నాలుగు పిల్లలూ తోడేలు వెనకగా బయల్దేరాయి.
కాస్త దూరంలో ఒక ఆవు పడుకుని ఉన్నది వీళ్ళు రావడం చూస్తున్నది. ఏమిటి ఈ పిల్లలు తోడేలు వెనకగా వెళ్తున్నాయి అని, అనుమానపడింది. ‘ఏంటి తోడేలూ! ఎక్కడికి వెళుతున్నావు ఈ పిల్లి పిల్లలు నీకెలా తెలుసు ” అని అడిగింది.
తోడేలు నసిగింది ఏం చెప్పాలో అకస్మాతగా. గుర్తురాక అదీ! అదీ! అని అంటూ నానుస్తున్నది.
ఎందుకో తోడేలును చూసి ఆవు అనుమానం బలపడింది. నువ్వు, ఈ పిల్లల్ని తీసు కెళ్ళకు నా దగ్గర వదిలి పెట్టు ఎక్కడికి తీసుకు వెళ్ళాలనుకుంటున్నావు? అంటూ గట్టిగా నిలదీసింది.
తోడేలు ఎం చెప్పాలో తెలియక తికమకపడుతోంది.
నువ్వు వెళ్ళిపో వాళ్ళమ్మ వచ్చాక రా. ఇపుడు నేను పంపను ” అంటూ గట్టిగా ఆవు చెప్పింది. తోడేలుకు భయమేసి పరుగు మొదలు పెట్టింది. ఆవు, పిల్లల్ని తనింట్లో కూర్చోబెట్టు కుంది.
కాసేపటికి తల్లిపిల్లి ఇంటి కొచ్చింది. ఆవు విషయమంతా చెప్పింది. తల్లి పిల్లల్ని హత్తుకున్నది. ఎంత ప్రమాదం తప్పింది. అంటూ, ఆవుకు కృతజ్ఞతలు చెప్పింది. మోసగాళ్ళ మాయ మాటలవలలో పడకూడదని పిల్లలకు చెప్పి ఇంటికి తీసుకెళ్ళింది.
*****
నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.